ముప్పు వీడినా..తప్పని తిప్పలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తుపాను పెను ముప్పు కలిగించకుండానే నిష్ర్కమించిందని సంతోషపడాలో, కొన్నిచోట్ల జరిగిన నష్టాన్ని చూసి వాపోవాలో తెలియని సందిగ్ధం జిల్లావాసులకు ఎదురవుతోంది. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారుల ఉపాధికి ఆటంకంగా, వారి ఆవాసాలకు అపాయంగా పరిణమించిన హుదూద్.. అక్కడి అరటి, వరి పంటలనూ తీవ్రంగా దెబ్బ తీసింది. విశాఖ సరిహద్దున ఉన్న తుని నియోజకవర్గం రెండు రోజులుగా గాఢాంధకారంలో ఉంది. తుని, తొండంగి మండలాల్లో పలు గ్రామాల్లో చెట్లు పడిపోవడంతో ఎక్కడికక్కడ విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో గుక్కెడునీరు కూడా దొరకని దయనీయ పరిస్థితి ఆ నియోజకవర్గంలో నెలకొంది.
తుని వాసులకు రోజుకు 25 లక్షల లీటర్లు మంచినీరు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 10 వేల లీటర్లు కూడా సరఫరా చేయలేక మున్సిపాలిటీ చేతులెత్తేసింది. సుమారు 11 వేల కుటుంబాలు గుక్కెడునీటి కోసం ఇబ్బందిపడుతున్నాయి. పట్టణంతో పాటు తుని రూరల్, తొండంగి, కోటనందూరు మండలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గంటకు అపార్టుమెంట్‌కు రూ.2000, చిన్న భవనాలకు రూ.500 వంతున నివాసితులే ఖర్చు పెట్టుకుని జనరేటర్‌లను మోటార్లకు బిగించుకుని మంచి నీరు తోడించుకుంటున్నారు. ఈ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలో కూడా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను సోమవారం నాటికి కూడా పునరుద్ధరించలేదు. జగ్గంపేట మండలం మల్లిశాల ఎలక్ట్రికల్ ఫీడర్ పరిధిలోని జె.కొత్తూరు, రాజపూడి, వెంగాయమ్మపురం, సీతారామపురం, మన్యంవారిపాలెం తదితర గ్రామాలు కటిక చీకట్లో ఉన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాను సోమవారం మధ్యాహ్నానికి పునరుద్ధరించగలిగారు.
దిగాలు పడ్డ అరటి, వరి రైతులు
ఈదురుగాలులకు ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో అరటి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. ఏలేశ్వరం మండలం లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం, తొండంగి మండలం శృంగవృక్షం, కొత్తపల్లి, తుని రూరల్ మండలం తేటగుంట, కోటనందూరు మండలం కె.ఇ.చిన్నయ్యపాలెం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, రంగంపేట మండలాల్లో అరటితోటలు ధ్వంసమయ్యాయి. గెలలు కోతకు వచ్చే దశలో ఉన్న తోటలు కాస్తా ఆదివారం మధ్యాహ్నం వీచిన ఈదురుగాలులకు నిట్టనిలువునా విరిగిపోవడంతో రైతులు కుదేలయ్యారు. శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో వరి చేలు నేలకొరిగాయి. పంట పొట్ట దశకు కూడా చేరని వేళ బలమైన ఈదురుగాలులతో వరిచేలు పడిపోవడంతో దిగుబడి బాగా పడిపోయే ముప్పుంది. తూర్పు, మధ్య డెల్టాలలో సైతం వరి చేలు ఈదురుగాలులకు పడిపోయాయి. అసలే రుణమాఫీ గందరగోళంతో కొత్త రుణాలందక, అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులు చేసిన రైతులను..ఇప్పుడు కలిగిన నష్టం కలవరపరుస్తోంది.
మత్స్యకారుల ఉపాధి ఊసెత్తని అధికారులు
తీరప్రాంత మండలాల్లో రవాణా వ్యవస్థను సోమవారం నాటికి కూడా పునరుద్ధరించ లేదు. ఛిద్రమైన ఉప్పాడ బీచ్ రోడ్డును మొత్తం కొత్తగా నిర్మించాల్సిందే. ఇందుకు ఎంత తక్కువగా లెక్కేసినా రూ.10 కోట్లు అవుతుందని, యుద్ధప్రాతిపదికన పని చేసినా కనీసం పది రోజులు పడుతుందని అంచనా. ఈ రోడ్డు ధ్వంసంతో కాకినాడ-తుని మధ్య వాహనాల రాకపోకల్ని పిఠాపురం నుంచి మళ్లించారు. ఫలితంగా 20 కిలోమీటర్ల దూరం పెరుగుతోంది. సముద్రంలోకి వెళ్లవద్దన్న హెచ్చరికలతో గత నాలుగు రోజులుగా తుని, తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాట్రేనికోన, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో దాదాపు వంద గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేట మానుకున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించడం మినహా తక్షణ సాయం అందించలేదని వారు ఆవేదన చెందుతున్నారు. మంగళవారం కూడా వేటకు వెళ్లొద్దంటున్న అధికారులు తమ ఉపాధి ఊసెత్తడం లేదని వాపోతున్నారు.