న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సమైక్య సెగ తీవ్రరూపం దాల్చుతోంది.తెలంగాణపై అధిష్టానం తీసుకున్ననిర్ణయాన్నివ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు కదం తొక్కారు.ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలోని ఏపీభవన్ కు అతి సమీపంలోనే సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ ను 'కాపాడండి..కాపాడండి' అంటూ గురువారం సాయంత్రం కొవ్వొత్తులతో వినూత్న శైలిలో ధర్నా చేపట్టారు.
పోలీసులు వీరిని అడ్డుకోవడానికి యత్నించడంతో సీమాంధ్ర ఉద్యోగులు వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దాడులకు దిగుతున్నారని వారు తెలిపారు. సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆలస్యమయ్యే కొద్దీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా రాజీనామాలు చేసి రాజకీయాలకతీతంగా ఉద్యమంలోకి రావాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. తమ ప్రసంగాలపై అభ్యంతరాలుంటే చర్చకు సిద్ధమని ప్రకటించారు.