తెలంగాణలో పనిచేసేందుకు.. ఆప్షన్స్‌కు ఒప్పుకోం
తెలంగాణ సమాచార ఉద్యోగుల సంఘం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన ఉద్యోగులకు తెలంగాణలో పనిచేసేందుకు ఆప్షన్స్ ఇస్తే ఒప్పుకోమని సమాచార పౌరసంబంధాల శాఖ ఉద్యోగులు అన్నారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ప్రధాన కార్యాలయంలో తెలంగాణ సమాచార ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు సీతారామిరెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఆరుసూత్రాల పథకం అమల్లో ఉన్నందున జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తరహాలోనే ఆప్షన్స్ ఇచ్చి ఉద్యోగులను విభజిస్తామని కమల్ నాథన్ కమిటీ చెప్పడం కుదరదని ఆయన అన్నారు.
అలా ఆప్షన్స్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఫలితం ఉండదని అన్నారు. స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా మాత్రమే విడదీయాలని, సర్వీస్ ఆధారంగా చేయకూడదని అన్నారు. ఆప్షన్స్ కేవలం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు మాత్రమే ఉన్నాయని, మిగతా వారికి లేవని, ఒకవేళ అలా ఆప్షన్స్ ఇస్తే తిరిగి ఉద్యమించాల్సి వస్తుందని అన్నారు. సమావేశానికి తెలంగాణ జిల్లాల నుంచి పలువురు సమాచార పౌరసంబంధాల శాఖ ఉద్యోగులు వచ్చారు.