ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయాల్సిందేనని ఆ ప్రాంత ఉద్యోగులు పునరుద్ఘాటించారు. ‘రాజీనామాలు చేయాలంటూ ప్రజలు మమ్మల్ని ఒత్తిడి చేయలేదు’ అంటూ వారు చేసిన ప్రకటనను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఖండించింది. ఎంపీల రాజీనామా డిమాండ్‌తోనే ఉద్యోగులు ఉద్యమం ప్రారంభించారని, అదే డిమాండ్‌తో సమ్మెకు దిగారని గుర్తు చేసింది. జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు అధ్యక్షతన అన్ని ఉద్యోగ, కార్మిక, పౌర సంఘాలు సోమవారం సమావేశమయ్యాయి.
తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీనామాలు చేయాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి లేదని సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ధైర్యముంటే ఇదే విషయాన్ని వారి వారి నియోజకవర్గాల్లో సభలు పెట్టి చెప్పాలని సవాలు విసిరారు. తర్వాత ప్రజలే వారి సంగతి చూస్తారన్నారు. రాజీనామాలు చేయకుండా, ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధ’మంటూ మాటలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయడానికి వారంతా అసెంబ్లీలో ఉండాలన్నారు. తీర్మానం వీగిపోయాక రాజీనామాలు చేసినా, సభను రద్దు చేసినా అభ్యంతరం లేదన్నారు. పార్టీలు విప్ జారీ చేసినా విభజన తీర్మానంపై ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని ఎమ్మెల్యేలను కోరారు.
సమైక్య రాష్ట్రాన్ని కోరే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా తీర్మానాన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామన్నారు. విద్యార్థులు, చిన్న పిల్లలను ఉద్యమంలోకి తీసుకురావద్దనే అభిప్రాయముందని, దీనిపై జేఏసీ చర్చిస్తోందని చెప్పారు. జేఏసీ నాయకత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తిని విలేకరులు ప్రస్తావించగా ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజమన్నారు. ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుండటం నిజమేనన్నారు. అందుకే వాటిని రెండు రోజులు నిలిపేస్తున్నామని, తర్వాత వారు కూడా ఉద్యమంలోకి వచ్చి సాధారణ చార్జీలు వసూలు చేసే అవకాశముందని తెలిపారు. మరోసారి ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలిసే యోచన ఉందన్నారు. ఉద్యమంలో చేపట్టే రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణకు కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పాటు పౌర సంఘాలకూ కమిటీలో చోటు కల్పిస్తామన్నారు. కమిటీ కార్యవర్గాన్ని ఈ నెల 20న విజయవాడ సభలో ప్రకటిస్తామన్నారు. 23న హిందూపురంలో, 29న కర్నూలులో సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగుల జేఏసీ యథాతథంగా కొనసాగుతుందన్నారు.