Seemandhra ministers
-
సీమాంద్ర కేంద్ర మంత్రులు మోసం చేశారు
-
లూటీకే యూటీ అంటున్నారు : శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: లూటీ చేసేందుకే సీమాంధ్రులు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే యుద్ధమే అని హెచ్చరించారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ గజిటెడ్ భవన్లో సకలజనభేరి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు కండ కావరంతో, కళ్తు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఎంతో సహనంతో ఉన్నామని, హైదరాబాద్ లో సమావేశం పెట్టినా ఓర్చుకున్నామని చెప్పారు. కానీ అధర్మం, అసత్యం పునాదుల మీద తెలంగాణ ఉద్యమం ఉందంటూ మాట్లాడితే సహించేది లేదన్నారు. అసత్యపు పునాదుల మీద తెలంగాణ ఉద్యమం నడిస్తే 50ఏళ్లకు పైబడి ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. ‘50 రోజుల క్రితం వరకు ప్రజలకు ఎవరో కూడా తెలియని నీవా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేది..’ అంటూ ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడిపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. ‘ఇంటర్ వరకు చదివి మధ్యలోనే చదువు ఆపేసిన నీవు చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడొద్దు..’ అని అన్నారు. బానిస బతుకులంటూ అవమానపరిచే విధంగా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. తాము అనుకుంటే హైదరాబాద్‌లో ఏఒక్క సీమాంధ్రుడూ ఉండలేడని హెచ్చరిం చారు. హైదరాబాద్‌ను యూటీ చేసినా కామన్ క్యాపిటల్ చేసినా ఇంకా కలిసి ఉండే ప్రసక్తే లేదన్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని హితవు పలికారు. అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. -
జానా, పొంగులేటితో సీమాంధ్ర మంత్రుల భేటీ
రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం కోసం తెలంగాణ నేతలతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల చర్చలు జరిపారు. సీఎల్పీలో మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని సీమాంధ్ర మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు కలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ ప్రకటన, తదనంతరం తలెత్తిన పరిస్థితులపై ఇరు ప్రాంతాలు నాయకులు చర్చలు జిరిపినట్టు తెలిసింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని హైకమాండ్‌ను ఆ ప్రాంత నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయాల్సిందేనని ఆ ప్రాంత ఉద్యోగులు పునరుద్ఘాటించారు. ‘రాజీనామాలు చేయాలంటూ ప్రజలు మమ్మల్ని ఒత్తిడి చేయలేదు’ అంటూ వారు చేసిన ప్రకటనను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఖండించింది. ఎంపీల రాజీనామా డిమాండ్‌తోనే ఉద్యోగులు ఉద్యమం ప్రారంభించారని, అదే డిమాండ్‌తో సమ్మెకు దిగారని గుర్తు చేసింది. జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు అధ్యక్షతన అన్ని ఉద్యోగ, కార్మిక, పౌర సంఘాలు సోమవారం సమావేశమయ్యాయి. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీనామాలు చేయాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి లేదని సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ధైర్యముంటే ఇదే విషయాన్ని వారి వారి నియోజకవర్గాల్లో సభలు పెట్టి చెప్పాలని సవాలు విసిరారు. తర్వాత ప్రజలే వారి సంగతి చూస్తారన్నారు. రాజీనామాలు చేయకుండా, ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధ’మంటూ మాటలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయడానికి వారంతా అసెంబ్లీలో ఉండాలన్నారు. తీర్మానం వీగిపోయాక రాజీనామాలు చేసినా, సభను రద్దు చేసినా అభ్యంతరం లేదన్నారు. పార్టీలు విప్ జారీ చేసినా విభజన తీర్మానంపై ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని ఎమ్మెల్యేలను కోరారు. సమైక్య రాష్ట్రాన్ని కోరే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా తీర్మానాన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామన్నారు. విద్యార్థులు, చిన్న పిల్లలను ఉద్యమంలోకి తీసుకురావద్దనే అభిప్రాయముందని, దీనిపై జేఏసీ చర్చిస్తోందని చెప్పారు. జేఏసీ నాయకత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తిని విలేకరులు ప్రస్తావించగా ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజమన్నారు. ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుండటం నిజమేనన్నారు. అందుకే వాటిని రెండు రోజులు నిలిపేస్తున్నామని, తర్వాత వారు కూడా ఉద్యమంలోకి వచ్చి సాధారణ చార్జీలు వసూలు చేసే అవకాశముందని తెలిపారు. మరోసారి ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలిసే యోచన ఉందన్నారు. ఉద్యమంలో చేపట్టే రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణకు కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పాటు పౌర సంఘాలకూ కమిటీలో చోటు కల్పిస్తామన్నారు. కమిటీ కార్యవర్గాన్ని ఈ నెల 20న విజయవాడ సభలో ప్రకటిస్తామన్నారు. 23న హిందూపురంలో, 29న కర్నూలులో సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగుల జేఏసీ యథాతథంగా కొనసాగుతుందన్నారు. -
ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ
సాక్షి నెట్వర్క్ : లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు సమైక్య దెబ్బ తగిలింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీమాంధ్రలో ‘తెలుగుతేజం’ పేరుతో పర్యటన ప్రారంభించిన జేపీకి తొలిరోజే సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ‘ఆందోళనలు, ధర్నాలతో రాష్ట్రం వెనుకబడిపోతుంది. రాష్ట్రం విభజన జరిగినా, జరగకపోయినా... మన ప్రాంతం, ప్రజల గురించి ఆలోచించకుండా ఆందోళనలు చేయడం వల్ల నష్టం మనకే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమైక్య వాదులను రెచ్చగొట్టాయి. విభజన అనివార్యమైతే రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని చేసిన సూచన కూడా ఆందోళన కారులకు రుచించలేదు. దీంతో దాదాపు రోజంతా ఆయన బస చేసిన రాష్ట్ర అతిథిగృహం వద్ద ఆందోళన నిర్వహించి రాత్రి వరకు ఆయనను దాదాపుగా నిర్బంధించినంత పని చేశారు. ఉదయం 9 గంటలకు కర్నూలుకు వచ్చిన జేపీ ఓ ప్రైవేట్ పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులపై ఆయన తనదైన శైలిలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ముఖం బాగోలేదని ముక్కు కోసుకుంటామా? రాష్ట్ర విభజన జరిగిందని సమ్మెలు చేస్తూ, విద్యార్థులను రోడ్లపైకి తేవడం, స్కూళ్లు, కళాశాలలు మూసేయడం, విద్యుత్ సమ్మె నిర్వహించడం వల్ల నష్టం మనకే. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీ ఆజ్యం పోస్తే కేంద్రం నిర్ణయం తీసుకుంది. విభజన జరిగితే ప్రత్యేక ప్యాకేజీతో రాయలసీమను కోరతాం.’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కూడా ఇదే తరహాలో మాట్లాడటంతో సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. మైకులు, సౌండ్‌బాక్సులు లాగేసి జేపీ డౌన్‌డౌన్ నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బంద్‌లు, సమ్మెలు చేయడం మూర్ఖత్వం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో పాటు కర్నూలు జనం ఆగ్రహానికి గురయ్యారు. ఉద్యోగులు జేపీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఆయన తాను బస చేసిన స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లిపోయారు. ఉద్యమకారులు అక్కడకు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఉద్యమకారులు తమదే నైతిక విజయం అంటూ వెళ్లిపోవడంతో జేపీ అనంతపురానికి బయలుదేరి వెళ్లారు. కాగా, సాయంత్రం 3 గంటల సమయంలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో ‘రాష్ట్ర విభజన- సమస్యల పరిష్కారం’ పేరుతో నిర్వహించదలచిన రౌండ్ టేబుల్ సమావేశం ఉద్యమకారుల ఆందోళనలతో రద్దయింది. ఉదయం నుంచి జరిగిన సంఘటనలతో కశాశాల యాజమాన్యమే సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజకీయ పార్టీల వికృత క్రీడ ఇది: జేపీ తమ పార్టీ నుంచి తనను ఒక్కరినే గెలిపించారని, 30 సీట్లు ఇచ్చి ఉంటే చరిత్ర మార్చేవాడినని జేపీ అన్నారు. 2004 వరకు రాష్ట్రంలో 5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్, టీడీపీలు రెచ్చగొట్టాయని జేపీ ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసం 2004లో కాంగ్రెస్, 2009లో తెలుగుదేశం టీ ఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ వాదాన్ని బలోపేతం చేశాయని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం కూడా ఓట్లు, సీట్ల కోసమే రాక్షస రాజకీయ క్రీడ ఆడుతోందన్నారు. ఎమ్మెల్సీల వాహనాలను అడ్డుకున్న ఉద్యోగ జేఏసీ చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రవుణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి వాహనాలను ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయుకులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలు వూట్లాడుతూ తామూ సమైక్యాంధ్ర వుద్దతుదారులమేనని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నావున్నారు. చిరంజీవిని ఘెరావ్ చేసిన ‘విశాలాంధ్ర’ కార్యకర్తలు మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమం చేస్తున్న కోట్లాది మంది సామాన్య తెలుగు ప్రజలతో నడవాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు శనివారం కేంద్ర మంత్రి చిరంజీవిని ఘెరావ్ చేశారు. ఆయన ఇంటిని ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసం వద్ద, బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ సముదాయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర సమైక్యతను కాపాడాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు చిరంజీవి ఇంటి వద్ద బైఠాయించారు. ఆ సమయంలో ఇంట్లోలేని చిరంజీవి విషయం తెలుసుకుని విశాలాంధ్ర నేతలకు ఫోన్ చేశారు. తాను మినిస్టర్ క్వార్టర్స్‌కు వస్తున్నానని, అక్కడ కలవాల్సిందిగా సూచించారు. దీంతో కార్యకర్తలంతా అక్కడకు చేరుకున్నారు. మార్గమధ్యంలో కారు ఆపి వారి వద్దకు వచ్చిన చిరంజీవిని ఘెరావ్ చేస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను మాట్లాడతానని చిరంజీవి ఎంత కోరినా వినిపించుకోలేదు. రాజీనామా చేసి తమతో మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. తాను రాజీనామా చేస్తే తెలంగాణ ఆగిపోతుందనుకుంటే ఇక్కడికిక్కడే రాజీనామా చేసి మీ చేతికి ఇస్తానంటూ ఆయన ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. డ్రామాలు కట్టిపెట్టాలంటూ నిలదీశారు. సమైక్య ఉద్యమానికి సానుభూతి అవసరం లేదని, మీ పదవీ త్యాగం కావాలంటూ నినాదాలు చేశారు. చేయని పక్షంలో రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన పత్రం అందజేశారు. దీంతో చిరంజీవి అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. మంత్రి శత్రుచర్లకూ... అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో జేఏసీ, ఏపీ ఎన్జీఓ ప్రతినిధులు ఆయన్ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి, ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే ఓడించేందుకు ఓటు ఉండాలని, ఉద్యమకారులు కొంత సమన్వయం పాటించాలన్నారు. సీఎం కిరణ్ సమైక్యానికే కట్టుబడి ఉన్నారని,తాను కూడా అదే నినాదానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అంతకు ముందు బొబ్బిలిలో కూడా సమైక్యవాదులు మంత్రిని అడ్డుకున్నారు. రాయపాటికీ సమైక్య వేడి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎంపీ రాయపాటి సాంబశివరావు వస్తున్నారని తెలుసుకున్న సమైక్మవాదులు వారిని అడ్డుకునేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే ఎంపీ రాయపాటి ఒక్కరే వచ్చారు. ముందుగానే సమాచారం అందుకున్న రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి వందగజాల దూరంలోనే ఆందోళనకారులను అడ్డుకుని వెనక్కు పంపించగా రాయపాటి రిబ్బన్ కత్తిరించి పోలీస్ బందోబస్తు మధ్యవెళ్లిపోయారు. అటు తరువాత సాయంత్రం ఎవరూలేని సమయంలో వచ్చిన మంత్రి డొక్కా గుట్టుచప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు. -
సీమాంధ్రులకు అండగా ఉంటాం!
సచివాలయ ఉద్యోగులకు బీజేపీ హామీ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తో సీమాంధ్ర ప్రాంతానికి సరైన న్యాయం జరిగేలా ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అగ్రనేతలు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం పార్లమెంటులోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలను ఉద్యోగులువిడివిడిగా కలిశారు. విభజనతో ఉద్యోగులు, విద్యార్థులు, నీటి పంపకాలు, హైదరాబాద్, విద్యుత్ పంపిణీ విషయంలో తలెత్తే అంశాలను వివరిస్తూ వారికి నివేదిక అందజేశారు. నేతలు స్పందిస్తూ.. సీమాంధ్రల ఆందోళనను అర్థం చేసుకున్నామని, పార్లమెంట్లో బిల్లు సమయంలో వారి సమస్యలను ప్రస్తావిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు సచివాలయ సమైక్యాంధ్ర ఉద్యోగుల జేఏసీ నేతలు కేంద్ర మంత్రులు పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జె.డి.శీలం, టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు కొందరిని వేర్వేరుగా కలిశారు. విభజన జరిగితే తలెత్తే సమస్యలను ఏకరువు పెడుతూ ఓ నివేదికను అందజేశారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత కేంద్ర ప్రభుత్వానికి తెలియాలంటే పదవులకు రాజీనామాలు చేయాలని పురందేశ్వరి, కోట్లను గట్టిగా కోరగా.. మంత్రులు స్పందిస్తూ విభజన ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడిందని, ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తే రాజీనామాలపై కఠిన నిర్ణయం తీసుకునేందుకు వెనకాడబోమని పేర్కొన్నట్లు తెలిసింది. -
‘సమైక్యాంధ్ర’ని పక్కనపెట్టేద్దాం!
రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని చేస్తున్న ప్రయత్నాలకు పార్టీ అధిష్టానం నుంచి స్పందన కరవ వుతున్న నేపథ్యంలో.. ఆ నినాదాన్ని ఇక పక్కకునెట్టి.. విభజన వల్ల సీమాంధ్రకు జరిగే అన్యాయాలను అధిష్టానం ముందు పెట్టి.. వాటికి పరిష్కారాలు కోరటంతో పాటు భారీ ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో సమానంగా సీమాంధ్రలో రాజధానిని ఏర్పాటు చేసుకోవటానికి రూ. ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరాలని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై వెనక్కు వెళ్లేది లేదని, ఇప్పటికే ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంటులో కేంద్రం ప్రకటించటంతో పాటు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా స్పష్టంచేయటంతో సీమాంధ్ర నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చల్లో పడ్డారు. అటు ఢిల్లీ కేంద్రంగా ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇటు హైదరాబాద్‌లో రాష్ట్ర సీమాంధ్ర మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు మంతనాలు సాగిస్తున్నారు. ఢిల్లీలో చిరంజీవి నివాసంలో పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సీఎల్పీ కార్యాలయంలో మంత్రి శైలజానాధ్, సీనియర్ నేతలు గాదె వెంకటరెడ్డి, పాలడుగు వెంకటరావు, విప్ రుద్రరాజు పద్మరాజులు భేటీ అయ్యారు. ఉద్యమం నేపథ్యంలో పార్టీని కాదని ప్రజల్లోకి వెళ్లాలని ముందు భావించినప్పటికీ.. కాంగ్రెస్ నేతలుగా ప్రజలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని ఇప్పటివరకు ఆందోళనతో ఉన్నారు. కొత్తగా పార్టీ పెట్టాలన్న ఆలోచనలు కొంతమంది నేతలు సాగిస్తున్నా అది ఎంతవరకు సఫలీకృతమవుతుందన్న అనుమానాలూ ఉన్నాయి. పైగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నుంచి వచ్చి పార్టీ పెట్టినా ప్రజలు విశ్వసించరన్న భావనతో ఉన్నారు. కేంద్రం తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నందున.. సమైక్య రాష్ట్రం, హైదరాబాద్ సంగతి మినహాయించి మరేదైనా సమస్యలపై సీమాంధ్ర నేతలు ప్రస్తావించవచ్చని, వాటిని పరిష్కరించటానికి కేంద్రం ముందుకువస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టంగా చెప్పేశారు. ఆ కోణంలోనే పార్టీ తరఫున ఆంటోనీ నేతృత్వంలో కమిటీని వేయటంతో పాటు.. కేంద్రం నుంచి ప్రభుత్వ కమిటీని కూడా ఏర్పాటు చేయిస్తామని శనివారం ప్రకటించారు. పార్టీ అధినేత్రి ఈ విషయంలో వెనక్కుతగ్గే పరిస్థితి లేదని స్పష్టమైందని.. సమైక్యం గురించి ఇక ఎంత మాట్లాడినా లాభం ఉండదు కనుక తదుపరి అంశాలు, సమస్యలపై దృష్టి పెట్టడం మంచిదన్న భావనకు సీమాంధ్ర నేతలు వచ్చారు. ముఖ్యంగా విభజన కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తే ముఖ్యమైన సమస్యలన్నిటినీ ఆంటోనీ కమిటీ, కేంద్రం ప్రభుత్వ కమిటీ ముందుంచి పరిష్కారాన్ని కోరాలని యోచిస్తున్నారు. సమస్యలకు స్పష్టమైన పరిష్కారం, రాజ్యాంగపరమైన రక్షణ చూపించి విభజనపై ముందుకెళ్లాలని నివేదించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన అంశాలతో ఒక నోట్‌ను కూడా వీరు రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్ రెవెన్యూలో వాటా ఇవ్వాలి... ఈ నోట్లో హైదరాబాద్‌ను కనీసం పదేళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి. కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్లు ఇవ్వాలి. స్టేక్ హోల్డర్లు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరపాలి. హైదరాబాద్‌లో ఉన్న విద్య, వైద్య సంస్థలతో సమానమైన సంస్థలను సీమాంధ్రలో ఏర్పాటుచేయాలి. కొత్త రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి పరచాలి. హైదరాబాద్ రెవెన్యూలో సీమాంధ్రకు వాటా కేటాయించాలి. కృష్ణా, గోదావరి బేసిన్ నుంచి ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను సీమాంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యతనిచ్చి సరఫరాచేయాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున ఇందుకు సంబంధించిన చర్యలు వేగవంతం చేయాలి. రాయలసీమకు నికర జలాలు కేటాయించాలి. నాలుగు జిల్లాలకు తాగునీరివ్వాలి. విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపునివ్వాలి.. వంటి అంశాలను చేర్చినట్లు తెలిసింది. -
సమైక్య సెగతో టెట్ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో సెప్టెంబర్ 1న టెట్‌ను నిర్వహించలేమంటూ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు చేతులెత్తేయడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం విద్యాశాఖ ప్రభుత్వానికి ఫైలు పంపించింది. ఇప్పటికే ఆందోళన ప్రభావం జిల్లాల్లో స్కూళ్లపై ఉండగా, ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు కూడా సమ్మెకు దిగుతుండటంతో అధికారులు టెట్ వాయిదావైపే మొగ్గుచూపుతున్నారు. ఇన్విజిలేటర్లుగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయులు లేకుండా పరీక్ష నిర్వహణ అసాధ్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా మినహా మరే ప్రత్యామ్నాయం లేదని డీఈఓలు నిస్సహాయత వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు కూడా టెట్‌ను వాయిదా వేసేందుకే సిద్ధమయ్యారు. దీంతో ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 4.47 లక్షల మంది అభ్యర్థులు మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పేలా లేదు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే వాయిదాకు సంబంధించి విద్యాశాఖ అధికారికంగా ప్రకటన వెలువరిస్తుంది. -
విచ్ఛిన్నానికే రెచ్చగొట్టుడు: ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలన్నీ తెలంగాణ ఏర్పాటును విచ్ఛిన్నం చేసే కుట్రలేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జేఏసీ ‘సద్భావనాదీక్షలు’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన రాజకీయపార్టీలన్నీ ఇప్పుడు మాటమారుస్తున్నాయని విమర్శించారు. విభజనపై నిర్ణయం వెలువడిన తరువాత సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. విభజనకు సహకరించి, శాంతిని కాపాడాలని కోరుతూ సద్భావనా దీక్షలు చేపడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ వదిలి పోవాల్సి వస్తుం దని, ఆంధ్రాకు నీళ్లు రావని తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ఇరుప్రాంతాల మధ్య స్వచ్ఛతను చెడగొడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు మరింత సంయమనం పాటించి శాంతిని కాపాడాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోదండరాం ప్రవేశపెట్టిన పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే ఇవ్వాలని, ప్రత్యేక రాష్ట్రానికి హైదరాబాద్‌నే రాజధానిగా ఉంచాలని, పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును వెంటనే ఆమోదించాలనే మూడు తీర్మానాలను దీక్షకు హాజరైన వారు ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. వీటిని కేంద్రప్రభుత్వానికి పంపుతామని కోదండరాం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ హైదరాబాద్ లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిదేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ భౌగోళికంగా ఏర్పాటయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే, తారకరామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాకముందే కిరణ్‌కుమార్‌రెడ్డికి హోటళ్ల వ్యాపారం ఉందని, ఆయన తెలంగాణలో కర్రీస్ పాయింట్ పెట్టుకుంటే అభ్యంతరం లేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిటని ప్రశ్నించారు. చంద్రశేఖరరావు తనకు తెలిసిన వ్యవసాయం చేసుకుంటున్నారని, చంద్రబాబు పాలు, పెరుగు అమ్ముకుంటున్నాడని చెప్పారు. ఎవరికి ఎందులో అనుభవం ఉంటే ఆ పని చేసుకోవడంలో తప్పులేదని చెప్పారు. ప్రజల ఆమోదం లేకుండా సీల్డ్కవర్లో సీఎం అయిన కిరణ్ వారి నెత్తిపై కూర్చుని సవారీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బహిరంగ చర్చకు రావాలంటూ కేసీఆర్ సవాల్ చేస్తే పారిపోయిన అసమర్థుడు, దద్దమ్మ కిరణ్‌కుమార్‌రెడ్డి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆంధ్రాను ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకుని హైదరాబాద్‌ను మాత్రం జాయింట్ అకౌంట్లో వేయాలంటున్నారు ఇదెక్కడి న్యాయమంటూ బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌పై కన్నేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు, నాయకులే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పోలీస్ వ్యవస్థ రాష్ట్రానికి సంబంధించిన అంశమని, హైదరాబాద్‌లో భద్రంగా ఉన్న సీమాంధ్రులు అభద్రత గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులతో చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. న్యూడెమోక్రసీ నేతలు పి.సూర్యం, కె.గోవర్దన్, జేఏసీ నేతలు దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, జైఆంధ్రా జేఏసీ ఛైర్మన్ ఎల్. జయబాబు ప్రసంగించారు. -
లేని భయాలను సృష్టిస్తున్నారు : టీ కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు లేవనెత్తుతున్న భయాందోళనలను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఆంటోని కమిటీతో పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్క సెటిలర్ రక్షణకు తాము పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కొందరు సీమాంధ్ర నేతలు రాజకీయ ప్రయోజనం కోసం కావాలనే విద్యార్థులు, ఉద్యోగులను రెచ్చగొట్టి.. వారిలో లేని భయాలను సృష్టించి ఆందోళనలకు ఉసిగొల్పుతున్నారని ఎంపీలు ఆరోపించారు. భద్రత విషయంలో అంతగా ఆందోళన ఉంటే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల అంశాన్ని కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ కిందకు తెచ్చినా తమకు ఆమోదయోగ్యమేనని ఎంపీలు పేర్కొన్నట్లు సమాచారం. అలాగే నదీ జలాల అంశంపైనా ఎవరికీ ఆందోళన అక్కర్లేదని వారు చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు జరిగాయని, కాబట్టి విభజన జరిగినా ఎలాంటి సమస్య రాదని, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ట్రిబ్యునళ్లు ఉన్నాయని అభిప్రాయపడినట్లు చెప్తున్నారు. విభజనపై అభ్యంతరాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ వరుసగా బుధవారం రెండో రోజు వార్ రూమ్‌లో సమావేశమయింది. ఈ సమావేశానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలను ఆహ్వానించగా.. తమకు సమయం కావాలని వారు కోరారు. దీంతో తెలంగాణ ప్రాంత ఎంపీలను కమిటీ ఆహ్వానించింది. అప్పటికప్పుడు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఇంట్లో సమావేశమైన టీ- కాంగ్రెస్ ఎంపీలు ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై చర్చించుకుని కమిటీ ముందుకు వెళ్లారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్వాగతించగా.. సొంత పార్టీ నేతలైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యతిరేకించటం సహేతుకం కాదని ఎంపీలు కమిటీ వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయటానికి వీలైనంత త్వరగా తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని వారు కోరినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే శీతాకాల సమావేశాల్లోగా తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నేతలంతా కోరగా.. అందుకు కమిటీ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు చెప్తున్నారు. తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే ప్రయత్నం జరుగుతోందని, ఈ సమయంలో ఒకరి భావోద్వేగాలు మరొకరు కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఎంపీలకు ఆంటోనీ కమిటీ చెప్పి పంపినట్లు సమాచారం. రేణుక వస్తే వెళ్లిపోతాం: కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి కూడా ఆంటోనీ కమిటీతో తెలంగాణ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు రావటంతో కొందరు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఇటీవల సీమాంధ్ర నేతల సమావేశానికి సైతం హాజరయ్యారని, ఆమె పాల్గొంటే తామంతా అక్కడినుంచి వెళ్లిపోతామన్నారు. దీంతో రేణుకాచౌదరి సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. బుధవారం తెలంగాణ ప్రాంత నేతలతో చర్చలు ముగిశాయని, గురువారం సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలతో కమిటీ చర్చలు ఉంటాయని దిగ్విజయ్‌సింగ్ విలేకరులకు తెలిపారు. సీమాంధ్ర ఎంపీల మంతనాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంటోనీ కమిటీ ముందు ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు సమాలోచనలు జరిపారు. ఎంపీ హర్షకుమార్ నివాసంలో బుధవారం ఉదయం జరిగిన అల్పాహార భేటీకి కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ, సాయిప్రతాప్ హాజరయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అతి ముఖ్యమైన ఆహార భద్రత బిల్లును అడ్డుకుంటే పార్టీలో అసలుకే మోసం వస్తుందని భావించిన నేతలు బిల్లును అడ్డుకునే వ్యూహంపై వెనకడుగు వేశారు. విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, పౌర సమాజ వ్యక్తుల నుంచి విజ్ఞప్తులు తీసుకునేలా ఆంటోనీ కమిటీని హైదరాబాద్‌కుగానీ లేదా సీమాంధ్రలోని మరేదైనా జిల్లాకుగానీ ప్రత్యేకంగా ఆహ్వానించాలని భేటీలో నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
విభజనపై సీఎం తీరు ఓట్ల గేమ్‌లో భాగమే: బైరెడ్డి రాజశేఖరరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు, చేతలన్నీ ఓట్ల గేమ్‌లో భాగమని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధినేత బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయాన్ని ప్రకటించిన తొమ్మిది రోజులకు బయటకు వచ్చిన సీఎం సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందని మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 8న సీఎం విలేకరుల సమావేశం పెట్టినరోజే సీమకు పెద్దఎత్తున అన్యాయం చేసే జీవో నంబరు 72ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగిషన్ స్కీం కింద 70 టీఎంసీల నీటిని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు తరలించేందుకు సర్వే చేయాలన్నది ఆ జీవో సారాంశమన్నారు. ఈ పథకం వల్ల సీమ ఎడారి అవుతుందని, ఎవరి జాగీరని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు.సీమాంధ్ర నేతలు ఆందోళనలను చేస్తుంటే గవర్నర్‌ను కలిసేందుకు వారి సతీమణులు వెళ్లడం వింతగా ఉందన్నారు. -
సమ్మెపై వెనక్కి తగ్గం
సాక్షి, హైదరాబాద్: సమ్మె నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన విజ్ఞప్తిని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కూడిన ఉపసంఘం సోమవారం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బృందంతో సమావేశమైంది. ఉపసంఘంలో సభ్యుడైన కొండ్రు మురళి సమావేశానికి హాజరుకాలేదు. ఈ భేటీ వివరాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వేర్వేరుగా విలేకరులకు వెల్లడించారు. వారు చెప్పిన వివరాల మేరకు సమావేశంలో ఏం జరిగిందంటే.. మంత్రులు: సమ్మె వల్ల పౌర సేవలకు విఘాతం కలుగుతుంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. సమ్మె నిర్ణయం విషయంలో పునరాలోచన చేయండి. ఉద్యోగులు: ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదు. దాదాపు 70 సంఘాలు సమావేశమై.. విభజనకు వ్యతిరేకంగా సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేం. ఈరోజు(సోమవారం) అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుంది. మంత్రులు: డిమాండ్ల సాధనలో చివరి అస్త్రంగానే నిరవధిక సమ్మెను వాడాలి. కానీ మీరు ముందునుంచే నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం. ఉద్యోగులు: ఉద్యోగుల సర్వీసు, జీత భత్యాలకు సంబంధించిన అంశాల్లో మీరు చెప్పిన విధానం అనుసరించాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి నిరవధిక సమ్మె మినహా మాకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. మంత్రులు: విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్రం ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీని నివేదిక సమర్పించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. నివేదిక ఇచ్చిన తర్వాత కమిటీ స్పందన తెలుసుకొనే వరకు సమ్మెను వాయిదా వేయండి. ఉద్యోగులు: అది పార్టీ కమిటీ. ఆంటోనీ కమిటీ పరిధి, అధికారం, దానికున్న చట్టబద్ధత ఏమిటో ఇప్పటి వరకు తెలియదు. ఈ విషయాల్లో స్పష్టత వచ్చిన తర్వాత నివేదిక ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటాం. కమిటీకి నివేదిక ఇచ్చే పేరిట సమ్మెను వాయిదా వేయలేం. మంత్రులు: కమిటీలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎంపీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. వారంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలిగినవారు. విభజన ప్రక్రియలోనూ వారి మాటకు విలువ ఉంటుంది. అనుమానాలు అక్కర్లేదు. నివేదిక ఇవ్వండి. ఉద్యోగులు: కమిటీ విధివిధానాలు, చట్టబద్ధత గురించి స్పష్టత వచ్చిన తర్వాత ఆ విషయం చర్చించుకుందాం. మంత్రులు: మీ ఉద్యోగాలకు, మీ భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగులు: హైదరాబాద్‌లోని శాఖాధిపతుల కార్యాలయాల్లో గేట్ మీటింగ్స్ పెట్టుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. కార్యాలయాల్లో పెద్ద సంఖ్యలో బలగాలు మోహరించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేసుకొనే హక్కు కూడా మాకు లేదా? విభజన తర్వాత మా భద్రత గురించి మాట్లాడుతున్నారు.. ఇప్పుడే నిరసన వ్యక్తం చేయలేని పరిస్థితులు ఉంటే అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మంత్రులు: మీరు నిరసన ప్రదర్శనలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగులు: హామీని నిలబెట్టుకోండి. మంత్రులు: ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కరించుకోగలం. మంత్రివర్గ ఉపసంఘం తలుపులు తెరిచే ఉంటాయి. ఉద్యోగులు: అలాగే సర్. -
రాజీనామా చేయనిదే రానిచ్చేది లేదు.. సచివాలయంలో మంత్రుల ఘెరావ్
కళ్లు, చెవులకు గంతలు కట్టుకుని ఉద్యోగుల నిరసన మంత్రివర్గ ఉపసంఘం భేటీ వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం మంత్రులు ఆనం, రఘువీరా, పితానిలను అడ్డుకున్న వైనం రాజీనామాలు చేయాలని డిమాండ్ నచ్చజెప్పేందుకు ఆనం యత్నం.. ‘మీ మాటలు నమ్మం’ అంటూ నినదించిన ఉద్యోగులు సీఎం రాజీనామా చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు పోలీసుల భద్రతా వలయంలో కార్లలో వెళ్లిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనతో సోమవారం రాష్ట్ర సచివాలయం హోరెత్తింది. నినాదాలు, నిరసన ప్రదర్శనలతో మంత్రాలయం దద్దరిల్లింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వాహనాలకు సీమాంధ్ర ఉద్యోగులు అడ్డుపడ్డారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డిలను ఘెరావ్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరంనేతృత్వంలో సాగుతున్న ఆందోళన ఉధృతరూపం దాల్చింది. ఉద్యోగులు నిరవధికంగా విధులు బహిష్కరించి సహాయ నిరాకరణ ప్రకటించారు. యూపీఏ సర్కారుది గుడ్డి నిర్ణయమని విమర్శిస్తూ వందలాది మంది ఉద్యోగులు సోమవారం కళ్లు, చెవులకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సచివాలయ ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వాహనాలను అడ్డుకున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తరవాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా సోమవారం సచివాలయానికి వచ్చారు. అదే సమయంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ముఖ్యమంత్రి వెంటనే పదవికి రాజీనామా చేయాలని నినదించారు. హెచ్ బ్లాక్‌లోకి దూసుకెళ్లే యత్నం... ఉద్యోగుల సమస్యలపై హెచ్ బ్లాక్‌లోని ఉపముఖ్యమంత్రి రాజనరసింహ చాంబర్లో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుండగా ఉద్యోగులు అక్కడికి చేరుకుని మంత్రులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. హెచ్ బ్లాక్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసి, ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని, లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. లక్షలాది మంది యువతీయువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు సమైక్యాంధ్ర కోసం తీవ్ర ఉద్యమం సాగిస్తుంటే సీమాంధ్ర మంత్రులు పదవులు పట్టుకుని వేలాడటం సిగ్గుచేటని నినదించారు. సబ్ కమిటీ చర్చలు ముగిశాక బయటకి వస్తున్న సీమాంధ్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణలను హెచ్ బ్లాక్ ద్వారం వద్ద అడ్డుకుని రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులపై ఆగ్రహం ప్రదర్శించారు. రాజీనామాలు చేయకుండా సచివాలయంలోనికి రావద్దన్నారు. మీ మాటలు ఇక నమ్మం... ఆనం రామనారాయణరెడ్డి ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ‘‘మీ మాటలు ఇక వినం. నమ్మం’’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉద్యోగుల సమస్యలపైనే చర్చిస్తున్నామని, రాజీనామాలు చేస్తే చట్టసభల్లో సీమాంధ్ర గొంతు వినిపించే వారు కరువవుతారని ఆనం నచ్చజెప్పేందుకు ప్రయత్నించబోయినా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. మాటలు కాదు చేతలు కావాలని, 2009 డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయటంతోనే యూపీఏ ప్రభుత్వం వెనక్కితగ్గిందని, ఇప్పుడు కూడా రాజీనామాలు చేస్తేనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇంతలో మంత్రులు తమ వాహనాల వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పేవరకూ కదలనివ్వబోమని ఉద్యోగులు భీష్మించారు. పోలీసులు జోక్యం చేసుకుని మంత్రులకు రక్షణగా నిలవటంతో ఉద్యోగుల ముందుకు దూసుకువచ్చారు. దీంతో కాసేపు తోపులాట జరిగింది. చివరికి పోలీసు రక్షణలో మంత్రులు వాహనాల్లోకి ఎక్కారు. సీమాంధ్ర మంత్రులెవరైనా మళ్లీ సచివాలయంలో అడుగుపెడితే ఇలాగే అడ్డుకుని తీరుతామని ఉద్యోగులు స్పష్టంచేశారు. ఆందోళనలో సీమాంధ్ర ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సీమాంధ్ర వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం
సాక్షి; హైదరాబాద్: హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగుల ప్రయోజనాలకు ఏ చిన్న నష్టం వాటిల్లినా సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత నేతలు హెచ్చరించారు. ఉద్యోగుల రక్షణ, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతామన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయంలో ఆందోళన కొనసాగిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను మంగళవారం పార్టీ నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులకు అండగా ఉంటామని, వారి ఉద్యమానికి తమవంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా ఏ ఒక్క వర్గంతోనూ చర్చించకుండా ఏకపక్షంగా తెలంగాణ నిర్ణయం ప్రకటించారని మేకపాటి వ్యాఖ్యానించారు. ‘ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ మాయావతి నేతృత్వంలోని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు నెగ్గి దాన్ని కేంద్రానికి ప్రతిపాదించినా ఇంతవరకూ పట్టించుకోలేదు. కానీ ఎవరూ కోరని ఆంధ్రప్రదేశ్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేయదలచారు. ఇది కాంగ్రెస్ రాజకీయ కుట్ర. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యల వంటి వాటిపై కనీస స్పష్టత ఇవ్వకుండా రాష్ట్ర విభజన ప్రకటించడం దుర్మార్గం. రాష్ట్ర రాజధానిని తెలంగాణకు ఇస్తే సీమాంధ్రలో సచివాలయం చెట్టు కింద, అసెంబ్లీని గుడిసెలో ఏర్పాటు చేసుకోవాలా? రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేయదలచడం దారుణం’ అని అన్నారు. రాష్ట్రాలను విడదీస్తూ పోతే దేశానికి రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల మీద ఈగ వాలినా సహించబోమని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగుల మేలు కోరి అందరికంటే ముందుగా పదవులకు రాజీనామాలు చేసింది తామేనని గుర్తుచేశారు. రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఒకప్పటి ఉద్యోగిగా వారి ఆందోళన తనకు తెలుసని, ఉద్యోగుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేసులు పెట్టాలి: సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ వదిలిపోవాలని కొందరు పేర్కొనడం చాలా బాధ కలిగించిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ‘ఒకరు రాయల తెలంగాణ అంటున్నారు. మరొకరు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమంటున్నారు. ఇంకొకాయన ఆంధ్ర రాజధానికి లక్షల కోట్లిమ్మంటున్నాడు. ఇవన్నీ వృథా. సమైక్యాంధ్రప్రదేశే మా ధ్యేయం’ అని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రభుత్వం సుమోటో కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎలాంటి ఆపద వచ్చినా ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలంటూ తన ఫోన్ నంబరును అందజేశారు. రాష్ట్రం అడుగుతోంది తెలంగాణ వారైతే కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు కొత్త రాష్ట్రమిస్తోందని తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. అడిగినవారికి ఇవ్వకుండా అడగని వారికి అన్నీ ఇచ్చి వెళ్లిపోమంటున్నారని, ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ‘1956 తరవాత రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను ఎంచుకుని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. నగర నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చెమట బిందువులున్నాయి. గతంలో మద్రాసు, కర్నూలును వదులుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా పోగొట్టుకుంటే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు’ అని అన్నారు. విదేశీ శక్తుల వల్ల దేశానికి ముప్పుందని చెప్పిన ఇందిరాగాంధీ.. ఇంట్లోని విదేశీయురాలు సోనియాగాంధీని పసిగట్టలేక పోయిందని ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బైఠాయించిన ఉద్యోగులు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ ఆందోళనను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా విధులను బహిష్కరించి రోడ్లపై బైఠాయించారు. సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. యూపీఏ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సీమాంధ్ర ఉద్యోగుల ఉద్యోగ భద్రత, రక్షణపై కేంద్రం భరోసా కల్పించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ చెప్పారు. -
గత 2 రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాం: ఎంపీ హర్షకుమార్
న్యూఢిల్లీ: రాష్ట్రవిభజనపై నిరసనగా సీమాంధ్రలో పెద్దఎత్తునా ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర మంత్రులు కూడా పార్లమెంటును విభజన సెగతో కాకపుట్టించారు. గత రెండు రోజులుగా పార్లమెంట్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర మంత్రులు సమైక్యా నినాదాలతో పార్లమెంట్లో హొరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై తాము రెండు రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించామన్నారు. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయమై రేపు కూడా సమావేశమవుతామని హర్షకుమార్ తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా ఉన్న విషయాన్ని అధిష్టానం గుర్తించిందన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు కలిసి ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అవసరమైనప్పుడు మంత్రులు కూడా సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొంటారని హర్షకుమార్ చెప్పారు. -
ఢిల్లీ వెళ్లనున్న సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్ : సీమాంధ్రలో విభజన సెగ ఉధృతం అవుతుండటంతో సీమాంధ్ర నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు హస్తినకు పయనం అవుతున్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలతో కలిసి వారు అధిష్టానం పెద్దలను కలవనున్నారు. ఇప్పటికే సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. మరోవైపు రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో సమావేశమవుతున్నారు. కాసేపట్లో సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, లేదంటే మూడుముక్కలు చేయాలని, విభజన అనివార్యమైతే కర్నూలుజిల్లాను తెలంగాణలో కలపాలని వీరు అధిష్టానాన్ని కోరనున్నారు. కాగా విభజన.. సమైక్య నినాదాలతో ఒకవైపు రాష్ట్రం అట్టుడుకుతుండగా కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో పంపకాలకు అవసరమైన వివరాలు పంపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర అధికారులను ఇప్పటికే ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న నీటి పథకాలతోపాటు, పూర్తిగా సీమాంధ్రలో, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులతోపాటు, రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ప్రాజెక్టుల వివరాలు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, వాటికి కావాల్సిన నిధులు, పూర్తి చేస్తే రెండు రాష్ట్రాలకు ఒనగూరే ప్రయోజనాలు వంటి అంశాలపై కూడా నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. -
విభజన వద్దు: సమస్త వృత్తుల చైతన్యనాదం.. పల్లెల్లోనూ పల్లవించిన నినాదం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోనివ్వమంటూ సీమాంధ్రలో రగిలిన ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వరుసగా ఆరో రోజు సోమవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు, రాజకీయపార్టీల నేతలు, మేధావులు, వివిధవర్గాల ప్రజలే కాదు.. సామాన్యజనం కూడా రోడ్లపైకి వస్తున్నారు. పిల్లా, పెద్దా, ముసలి, ముతక బేధం లేకుండా వ్యక్తిగతంగా కుటుంబాలు సైతం నిరసనదీక్షలకు దిగుతున్నాయి. రాష్ట్రం సమైక్యంగా లేకుంటే తమకు భవితవ్యమే లేదనే ఆందోళనతో అన్ని కులాలు, వృత్తుల వారు స్వచ్ఛందంగా ఆందోళనలు చేపడుతున్నారు. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామీణప్రాంతాల నుంచి ఉద్యమం ఇప్పుడు మూరుమూల పల్లెలకు సైతం విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించని ఆ పార్టీ నేతల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులతీరుపై సమైక్యవాదులు, సామాన్యప్రజానీకమే కాదు స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు చేపట్టిన రిలే దీక్షల శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన మంత్రి అహ్మదుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. దీక్షా శిబిరం వద్దకు రావద్దని చెప్పడంతో మంత్రి, సమైక్యవాదుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో సమైక్యవాదులు మంత్రిపై దాడికి యత్నించడంతోపాటు చెప్పులు విసిరారు. దీంతో ఆయన అతికష్టంపై పోలీసు రక్షణలో దీక్షా శిబిరం వద్దకు రాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. చిరంజీవి, కావూరి, బొత్స డబ్బుకు అమ్ముడుపోయి మాకంటే హీనంగా మారారని ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో హిజ్రాలు దుమ్మెత్తిపోశారు. మంత్రి పదవి కోసం కావూరి కక్కుర్తి పడి రాష్ట్రం ముక్కలవుతున్నా చేతకానివాడిలా ఉండిపోయారని ఆయన ఇంటిని ముట్టడించిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెదబొడ్డేపల్లిలో సోమవారం ఉదయం మంత్రి బాలరాజు కాన్వాయ్‌ను ఉపాధ్యాయులు అడ్డగించి మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కోపోద్రిక్తుడైన మంత్రి వారిపై చెయ్యెత్తి దాడి చేసేంత పని చేశారు. పరిస్థితి వేడెక్కడంతో పోలీసులు ఆయనను బతిమాలి అక్కడ నుంచి పంపించేశారు. విశాఖలో తన వాహనాన్ని అడ్డగించిన నిరసనకారులపై గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పక్కనే ఉన్న సీఐ సత్యనారాయణతో ‘నీ గన్ ఇవ్వు..ఒక్కొక్కరినీ కాల్చేస్తా’నంటూ ఆవేశంతో ఊగిపోయూరు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన మంత్రి తోట నరసింహం సరైన సమయంలో తాను రాజీనామా చేస్తానన్నారు. టీడీపీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఆ పార్టీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని న్యాయవాదులు అడ్డుకున్నారు. విజయనగరం పట్టణంలో చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అన్నిచోట్లా మున్సిపల్ ఉద్యోగుల సమ్మె సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ పిలుపుమేరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ అధికారులు, సిబ్బంది 72గంటల సమ్మెలో భాగంగా సోమవారం విధులను బహిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీలో వైద్యసేవలను నిలుపుచేసి డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. క్వారీ ఏరియాలో గుడాల ప్రసాద్ అనే యువకుడు భార్య, ఇద్దరు పిల్లలతో పాటు 24 గంటల దీక్ష ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన భారీ బహిరంగసభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హాజరై ఉద్యమానికి ఊతమిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో రైల్ రోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్ ఆండ్ బీ ఈఈ లక్ష్మీనారాయణరెడ్డికి సన్మానం చేశారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్లో యాచకులు నిరసన ప్రదర్శన, మానవహారం చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూయించారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నేతృత్వంలో జరిగిన ధర్నాలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, సెంట్రల్ కన్వీనర్ పి. గౌతంరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని పొలిటికల్ జేఏసీ తరపున మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. విజయనగరం శివారు ప్రాంతంలో మజ్జిపేట కాలనీ వద్ద విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న దుర్గ్ పాసింజర్ రైలును ఆందోళనకారులు అరగంటపాటు అడ్డుకున్నారు. బొబ్బిలిలో రైల్‌రోకో నిర్వహించారు. హిందూపురం మెప్మా పీఓ విజయభాస్కర్ రాజీనామా అనంతపురం జిల్లా హిందూపురం మునిసిపాలిటీలో మెప్మా ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న విజయభాస్కర్ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు అనంతపురం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, డీఆర్వో హేమసాగర్ మద్దతు తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గుండా రవికుమార్ అనే వికలాంగుడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. తెలంగాణ ఉద్యోగుల ‘సమైక్యాంధ్ర’ నినాదాలు చిత్తూరు జిల్లా పీలేరులో తెలంగాణ ప్రాంత అధికారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయడంతో వారికి స్థానిక ఉద్యోగులు సన్మానం చేశారు. ఐదురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఆయన సతీమణి లావణ్య ప్రకటించారు. చిత్తూరులోని మత్య్సశాఖ కార్యాలయంలో రెండు ప్రభుత్వ వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో రెండున్నర గంటలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. విశాఖ జిల్లా ఏజెన్సీలో వైఎస్సార్ సీపీ సహా వర్తక, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలు మూయించారు. మన్యంలోని టూరిస్టు ప్రదేశాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. మ్యూజియం, పద్మావతి గార్డెన్, బొర్రా గుహలు మూతపడ్డాయి. నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు. కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పాల్గొన్న నిరసన కార్యక్రమంలో గోపి అనే యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విభజన వార్తలతో కలత ఒకరి ఆత్మహత్య, నలుగురు గుండెపోటుతో మృతి సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన వార్తలను తట్టుకోలేక సోమవారం వేర్వేరు ప్రాంతాలలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన కొవ్వూరి రాంబాబు (50), కామవరపుకోట మండలం వీరంపాలెంకు చెందిన బొమ్మగంటి సత్యనారాయణ (63) విభజన వార్తలపై తీవ్ర కలత చెందారు. దీంతో వారు నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుమడాం గ్రామానికి చెందిన పొడమచ్చిలి బంగారి(51) టీవీలో విభజన వార్తలు చూస్తుండగా ఉద్వేగానికి గురై గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందారు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన వడ్డే కొల్లప్ప (60), అనంతపురం నగరానికి చెందిన శివశంకరరావు(42) గుండెపోటుతో మృతి చెందారు. కాగా, నిడదవోలు మండలం ఉనకరమిల్లిలో రవికుమార్ (35) మూడు రోజులుగా సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నాడు. రాష్ట్ర విభజన ఖాయమనే వార్తల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు కుటుంబానికి చెవిరెడ్డి సాయం సమైక్యాంధ్ర కోసం ఆత్మాహుతి చేసుకున్న చిత్తూరు జిల్లా పాకాల మండలం కూనపల్లెకు చెందిన ఆంజనేయులు(48) కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన ఆయన రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఎవరూ బలిదానాలకు పాల్పడవద్దని కోరారు. -
ఎవరేం చేసినా తెలంగాణ ఆగదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆగబోదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈసారి నిర్ణయం ఏమాత్రం ఆగినా, పక్కకు పెట్టినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‘‘తెలంగాణ ఏర్పాటు 60 ఏళ్ల చారిత్రక పరిణామం. అనేక ఉద్యమాలు, కమిటీలు, సంప్రదింపులు పూర్తయ్యాకనే రెండు ప్రాంతాల అభివృద్ధి, తెలుగు ప్రజల భవిష్యత్తును కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నీరు, జలం, ఉపాధి, ఉద్యోగ విషయాలపై చర్చలతో పరిష్కరించుకోవచ్చు. విద్వేషాలు, విధ్వంసాలు ఆపాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణను సమర్థించి సీమాంధ్ర ప్రజలను ఒప్పించాలి. మళ్లీ తిరిగి ఈ నిర్ణయం పునఃపరిశీలించడం అసాధ్యం’’ అని జానారెడ్డి వివరించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సోమవారం ఇక్కడ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులే కాకుండా ప్రతి ఒక్కరూ తెలంగాణవారేనని, ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవనం సాగించవచ్చని చెప్పారు. వారికి రాజ్యాంగం, చట్టపరమైన రక్షణలుంటాయన్నారు. వారికి రక్షణ కల్పించే బాధ్యత తనదని, అలా చేయలేనప్పుడు రాజకీయాల నుంచే తప్పుకుంటానని చెప్పారు. రాజ్యాంగం, చట్టం ప్రకారమే ఉద్యోగుల మార్పిడి ప్రక్రియ జరుగుతుందని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టంచేశారు. 610 జీఓ ప్రకారం అదనంగా ఉన్నవారు మాత్రమే ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేస్తారని చెప్పారు. సీమాంధ్రుల్లో, ఉద్యోగుల్లో ఉన్న అపోహలు, సమస్యలపై చర్చించుకొని పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. అభివృద్ధిని జిల్లాలకు విస్తరిస్తాం హైదరాబాద్‌ను అన్నిరంగాలకు హబ్‌గా మారుస్తామని, అభివృద్ధిని జిల్లాలకు విస్తరిస్తామని, అన్ని జిల్లా కేంద్రాలను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి పరుస్తామని జానారెడ్డి చెప్పారు. పరిపాలనా సౌలభ్యంకోసం జిల్లాలను మరింత చిన్నవిగా విభజిస్తామన్నారు. ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్‌మెంటుతో సహా ఇపుడున్న పథకాలను యథాతథంగా అమలుచేస్తామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో అత్యంత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య ఉండనే ఉండదన్నారు. తెలంగాణకు రెండు వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, దాన్ని రెండేళ్లలోగా అధిగమిస్తామని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసంతకం దానిపైనే పెడతామని హామీనిచ్చారు. ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. రెచ్చగొట్టే విధంగా కాకుండా మీడియా సంయమనం పాటించాలన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక దాన్ని అమలు చేయాల్సిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న సీమాంధ్ర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వినతిపత్రంలో సంతకాలు చేయడం సరికాదని తప్పుబట్టారు. తెలంగాణకు తొలి సీఎంగా దళితులే ఉంటారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ... సీఎంగా ఎవరుండాలన్న దానిపై ఇప్పుడు చర్చ అప్రస్తుతమన్నారు. ‘‘బిల్లు పాసవ్వలేదు. రాష్ట్రం ఏర్పాటూ కాలేదు. సీఎం ఎవరంటూ చర్చ హాస్యాస్పదం. ఏ పార్టీ విధానం వారికుంటుంది. మా పార్టీ అధిష్టానం సలహాలు, సభ్యుల అభీష్టం మేరకు సీఎం ఎంపిక అవుతారు. ఆ విషయంలో నాకెలాంటి భ్రమలు లేవు’’ అని వివరించారు. హైలెవెల్ కమిటీ సామరస్యానికే... హైలెవెల్ కమిటీ ఏర్పాటు కేవలం ఇరు ప్రాంతాల మధ్య సామరస్యపూర్వక వాతావరణానికేనని, దీనివల్ల తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందనుకోవడం లేదని చెప్పారు. రాయల తెలంగాణ అంశం తెరపైకి వస్తే అప్పడు స్పందిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనే అవుతున్నందున ప్రత్యేక పీసీసీ ఇప్పుడు అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ విలీనమైతే తాను సంతోషిస్తానని, అయితే ఆ ప్రక్రియ గురించి తమ పార్టీ అధిష్టానం చర్చిస్తుందని తెలిపారు. సీమాంధ్రలో పరిస్థితులు ప్రశాంతంగా ఉండేందుకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఆ ప్రాంత నేతలతో చర్చించాలని జానారెడ్డి సూచించారు. సీమాంధ్రలో హింసాత్మక ఘటనల వెనుక అధికారంలో ఉన్న వారి హస్తమున్నట్లు వస్తున్న ఆరోపణలపై అధిష్టానం విచారించి చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయ్యేలా కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు సాగించాలన్నారు. ఫోరం ప్రతినిధులు క్రాంతికుమార్, శైలేష్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్, రమణ, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు’
ఢిల్లీ: మంత్రులు రాజీనామాలతో సమస్యకు పరిష్కారం లభించదని కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేస్తే ఇక్కడ పనిచేసే వాళ్లు ఎవరని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలను బ్యాలెన్సుడుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని జేడీ శీలం తెలిపారు. రైతులు, హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణపై ప్రస్తుతం తాము దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఓ దశలో సీమాంధ్ర నేతలు రాజీనామాల బెదిరింపులపై ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. సమస్యలు వీధుల్లో పరిష్కారం కావని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర నేతలు లేవనెత్తిన అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ సలహాదారు దిగ్విజయ్ సింగ్‌లను కలిసి వివరిస్తానని ఆయన తెలిపారు.