రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని చేస్తున్న ప్రయత్నాలకు పార్టీ అధిష్టానం నుంచి స్పందన కరవ వుతున్న నేపథ్యంలో.. ఆ నినాదాన్ని ఇక పక్కకునెట్టి.. విభజన వల్ల సీమాంధ్రకు జరిగే అన్యాయాలను అధిష్టానం ముందు పెట్టి.. వాటికి పరిష్కారాలు కోరటంతో పాటు భారీ ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో సమానంగా సీమాంధ్రలో రాజధానిని ఏర్పాటు చేసుకోవటానికి రూ. ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరాలని భావిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటుపై వెనక్కు వెళ్లేది లేదని, ఇప్పటికే ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంటులో కేంద్రం ప్రకటించటంతో పాటు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా స్పష్టంచేయటంతో సీమాంధ్ర నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చల్లో పడ్డారు. అటు ఢిల్లీ కేంద్రంగా ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇటు హైదరాబాద్‌లో రాష్ట్ర సీమాంధ్ర మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు మంతనాలు సాగిస్తున్నారు. ఢిల్లీలో చిరంజీవి నివాసంలో పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సీఎల్పీ కార్యాలయంలో మంత్రి శైలజానాధ్, సీనియర్ నేతలు గాదె వెంకటరెడ్డి, పాలడుగు వెంకటరావు, విప్ రుద్రరాజు పద్మరాజులు భేటీ అయ్యారు.
ఉద్యమం నేపథ్యంలో పార్టీని కాదని ప్రజల్లోకి వెళ్లాలని ముందు భావించినప్పటికీ.. కాంగ్రెస్ నేతలుగా ప్రజలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని ఇప్పటివరకు ఆందోళనతో ఉన్నారు. కొత్తగా పార్టీ పెట్టాలన్న ఆలోచనలు కొంతమంది నేతలు సాగిస్తున్నా అది ఎంతవరకు సఫలీకృతమవుతుందన్న అనుమానాలూ ఉన్నాయి. పైగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నుంచి వచ్చి పార్టీ పెట్టినా ప్రజలు విశ్వసించరన్న భావనతో ఉన్నారు.
కేంద్రం తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నందున.. సమైక్య రాష్ట్రం, హైదరాబాద్ సంగతి మినహాయించి మరేదైనా సమస్యలపై సీమాంధ్ర నేతలు ప్రస్తావించవచ్చని, వాటిని పరిష్కరించటానికి కేంద్రం ముందుకువస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టంగా చెప్పేశారు. ఆ కోణంలోనే పార్టీ తరఫున ఆంటోనీ నేతృత్వంలో కమిటీని వేయటంతో పాటు.. కేంద్రం నుంచి ప్రభుత్వ కమిటీని కూడా ఏర్పాటు చేయిస్తామని శనివారం ప్రకటించారు.
పార్టీ అధినేత్రి ఈ విషయంలో వెనక్కుతగ్గే పరిస్థితి లేదని స్పష్టమైందని.. సమైక్యం గురించి ఇక ఎంత మాట్లాడినా లాభం ఉండదు కనుక తదుపరి అంశాలు, సమస్యలపై దృష్టి పెట్టడం మంచిదన్న భావనకు సీమాంధ్ర నేతలు వచ్చారు. ముఖ్యంగా విభజన కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తే ముఖ్యమైన సమస్యలన్నిటినీ ఆంటోనీ కమిటీ, కేంద్రం ప్రభుత్వ కమిటీ ముందుంచి పరిష్కారాన్ని కోరాలని యోచిస్తున్నారు. సమస్యలకు స్పష్టమైన పరిష్కారం, రాజ్యాంగపరమైన రక్షణ చూపించి విభజనపై ముందుకెళ్లాలని నివేదించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన అంశాలతో ఒక నోట్‌ను కూడా వీరు రూపొందించినట్లు సమాచారం.
హైదరాబాద్ రెవెన్యూలో వాటా ఇవ్వాలి...
ఈ నోట్‌లో హైదరాబాద్‌ను కనీసం పదేళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి. కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్లు ఇవ్వాలి. స్టేక్ హోల్డర్లు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరపాలి. హైదరాబాద్‌లో ఉన్న విద్య, వైద్య సంస్థలతో సమానమైన సంస్థలను సీమాంధ్రలో ఏర్పాటుచేయాలి.
కొత్త రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి పరచాలి. హైదరాబాద్ రెవెన్యూలో సీమాంధ్రకు వాటా కేటాయించాలి. కృష్ణా, గోదావరి బేసిన్ నుంచి ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను సీమాంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యతనిచ్చి సరఫరాచేయాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున ఇందుకు సంబంధించిన చర్యలు వేగవంతం చేయాలి. రాయలసీమకు నికర జలాలు కేటాయించాలి. నాలుగు జిల్లాలకు తాగునీరివ్వాలి. విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపునివ్వాలి.. వంటి అంశాలను చేర్చినట్లు తెలిసింది.
‘సమైక్యాంధ్ర’ని పక్కనపెట్టేద్దాం!
Published Sun, Aug 25 2013 3:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement