ఎన్నికలలో! | Pre election heat In Greter Hyderabad | Sakshi
Sakshi News home page

ఎన్నికలలో!

Published Thu, Aug 23 2018 9:13 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Pre election heat In Greter Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికల ఏర్పాట్ల నేపథ్యంలో మహానగర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆయా పార్టీలు తమ శ్రేణులకు సంకేతాలు ఇచ్చాయి. గడచిన సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి, పటాన్‌చెరు శాసనసభ నియోజక వర్గాల్లోనే విజయం సాధించిన టీఆర్‌ఎస్‌... ఈసారి మెజారిటీ స్థానాల్లో విజయం కోసం పకడ్బందీగా ప్లాన్‌ వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఈసారి టీడీపీతో పొత్తుకు వెళ్లే అవకాశమున్నట్టు ఇప్పటికే ముఖ్య నాయకులకు లీక్‌ ఇవ్వడంతో వారంతా కూడికలు తీసివేతల్లో నిమగ్నమయ్యారు. ఎంఐఎం, బీజేపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ జనసమితి తదితర పార్టీలు సైతం ముందస్తు ఎన్నికలకు తమతమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.  

టీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో 10 మంది    
శాసనసభ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రకటించే తొలి జాబితాలో నగరం నుంచి పది మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ముగ్గురు సిట్టింగ్‌ల స్థానాలతో పాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో సగం మందిని అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా స్థానాల్లో పార్టీలోని సెకండ్స్‌కు ఛాన్స్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజా లెక్కల ప్రకారం..ఒకవేళ కాంగ్రెస్‌– టీడీపీలు ఎన్నికల పొత్తుకు వెళితే రంగారెడ్డి జిల్లాలో ఒకరు, హైదరాబాద్‌ జిల్లాలో మరో ఎమ్మెల్యే తిరిగి టీడీపీలోకి వెళ్లే ఛాన్స్‌ ఉండొచ్చని టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. దీంతోపాటు సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ను ఈ పర్యాయం లోక్‌సభకు పంపాలా లేక మళ్లీ శాసనసభకు పోటీ చేయించాలా అన్నదానిపైనా ఇంకా క్లారిటీ లేనట్టు తెలిసింది. ఒకవేళ ప్రస్తుత సిట్టింగ్‌లకు అవే స్థానాలు ఇవ్వలేకపోతే వారి స్థానాల్లో ఎవరైతే బెటర్‌ అన్న అంశంపై కూడా పార్టీ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ను గోషామహల్‌కు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎల్బీనగర్‌కు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో ఏదైనా ఒకచోట ఎంపీ మల్లారెడ్డి సమీప బంధువు మర్రి రాజశేఖరరెడ్డిని కూడా బరిలోకి దించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. 

కాంగ్రెస్‌లోనూ మొదలైన కసరత్తు  
ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సైతం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో నగరంలో విస్తృత సమావేశాలు ఏర్పాటుతో పాటు అభ్యర్థుల ఎంపికపైనా దృష్టి సారించింది. ఈసారి యువకులకు, మహిళలకు సైతం సముచిత స్థానం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎల్బీనగర్, ఉప్పల్, మహేశ్వరం, గోషామహల్, కుత్బుల్లాపూర్‌ స్థానాల్లో పాతవారికే టికెట్లు కట్టబెట్టే ఛాన్స్‌ అధికంగా ఉంది. ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, మల్కాజిగిరిలో కొత్త ఫేస్‌లను తెర మీదికి తెచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రత్యేక సర్వే నిర్వహించి.. చివరి వారంలో మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే యోచనలో పీసీసీ ఉన్నట్లు తెలిసింది. 

బీజేపీలోనూఇన్‌చార్జుల సందడి  
భారతీయ జనతా పార్టీ సైతం పార్లమెంట్‌ ఇన్‌చార్జుల నియామకాలతోనే శాసనభ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితిని చక్కబెట్టనుంది. ముందస్తు ఎన్నికలొస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే ఆయా స్థానాలిచ్చి, మిగిలిన చోట బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైతం నగరంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దింపే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది. గడిచిన ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు భారీ ఓట్లను రాబట్టుకున్న నేపథ్యంలో.. మరోసారి పోటీకి సిద్ధమవుతోంది. ఎంఐఎం హైదరాబాద్‌ లోక్‌సభలోని ఏడు శాసనసభ స్థానాలతో పాటు రాజేంద్రనగర్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్‌ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపే ఛాన్స్‌ కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement