కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ విభజన చట్టం హామీలను గాలికొదిలేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఒడిసిపోయిన సబ్జెక్ట్ అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికలంటూ..ప్రగతి నివేదన సభలంటూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని తూర్పార బట్టారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఈ సారైనా మోదీతో విభజన హామీలను ప్రస్తావించాలని కోరారు.
ఇంకా మాట్లాడుతూ..‘ ముస్లిం, గిరజనుల రిజ్వేషన్ల అంశం ఎటు పోయింది. లెజిస్లేచరీ వ్యవస్థను కించపరిచేలా ప్రవర్తించడం సరికాదు. ప్రతి ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకోవడం సరికాదు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలిపోయాయి..పట్టించుకునే నాథుడే లేడు. ప్రగతి నివేదనలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితిపైనా నివేదికలో ప్రస్తావించాలి. రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు, భూ ఆక్రమణలపైన సభలో జవాబు చెప్పాలి. గ్రామ పారిశుద్ధ్య కార్మికులపై సర్కార్ వ్యవహరిస్తోన్న తీరు సరిగా లేద’ ని వ్యాఖ్యానించారు.
అవినీతిని అరికట్టడానికి సీఎం కార్యాలయం ఇచ్చిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి..ఎన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారని పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్ తాను ఇచ్చిన హామీల అమలుపై చూసీ చూసీ జనం కళ్లు కాయలు కాస్తున్న తరుణంలోనే కంటి వెలుగు స్కీం పెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స్వంతంగానే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని, ఇప్పుడే పొత్తులపై మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేరళ వరద బాధితులకు లక్ష రూపాయల విరాళాన్ని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్‌ను రాజీవ్ గాంధీ నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment