సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు, చేతలన్నీ ఓట్ల గేమ్‌లో భాగమని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధినేత బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయాన్ని ప్రకటించిన తొమ్మిది రోజులకు బయటకు వచ్చిన సీఎం సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందని మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 8న సీఎం విలేకరుల సమావేశం పెట్టినరోజే సీమకు పెద్దఎత్తున అన్యాయం చేసే జీవో నంబరు 72ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగిషన్ స్కీం కింద 70 టీఎంసీల నీటిని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు తరలించేందుకు సర్వే చేయాలన్నది ఆ జీవో సారాంశమన్నారు. ఈ పథకం వల్ల సీమ ఎడారి అవుతుందని, ఎవరి జాగీరని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు.సీమాంధ్ర నేతలు ఆందోళనలను చేస్తుంటే గవర్నర్‌ను కలిసేందుకు వారి సతీమణులు వెళ్లడం వింతగా ఉందన్నారు.