ఊపిరి పోస్తారా... తీస్తారా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే హవా. 'తెలంగాణలో దాదాపు అన్నీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు 'హస్తగతం' ఇది ముమ్మాటికి తథ్యం' అంటూ ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రాష్ట్ర విభజనకు ముందు హస్తినకు క్యూ కట్టి పార్టీ అధిష్టానం పెద్దల చెవి వద్ద చేరి జోరీగలా ఊదిపెట్టారు.
దాంతో రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రలో పోయినా... తెలంగాణలో పార్టీకి అదృష్టం పండిపోతుందని అధిష్టానం కూడా భావించింది. అదికాక విభజన తర్వాత పార్టీని హస్తంలో ఐక్యం చేస్తానని గులాబీ బాస్ చెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, అధిష్టానం పెద్దలు సైసై సయ్యారే అన్నారు. అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జరాసంధుడిలా చీల్చింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఆ వెంటనే ఫలితాలూ వచ్చాయి. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్కు .. రాష్ట్రంలో 21 ఎమ్మెల్యే సీట్లు ... రెండంటే రెండే ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంటే... ఇవే ఎన్నికల్లో గులాబీ రంగు కారు మాత్రం భలే షికారు చేసింది.
దాంతో హస్తంతో చెయ్యి కలిపేది లేదని గులాబీ బాస్ ప్లేట్ ఫిరాయించి... రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా గులాబీ బాస్ చేపట్టిన 'అపరేషన్ ఆకర్ష్'తో హస్తం పార్టీ నేతలు వరుసగా కారు ఎక్కేస్తున్నారు. కారు దెబ్బకు హస్తం ఢీలా పడి పోయింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పార్టీని నడిపించాల్సిన పీసీసీ అధ్యక్షుడుపై సీనియర్ స్థాయి నుంచి బూత్ స్థాయి నేతల వరకు అందరికీ తీవ్ర అసంతృప్తి నెలకొంది.
దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయూషు లెక్కన తయారైంది. హస్తం పార్టీ పరిస్థితి అంపశయ్యపైకి చేరింది. దీంతో తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం నడుం బిగించింది. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా అయిదు రోజుల క్రితం హైదరాబాద్లో పార్టీ నేతలతో అధిష్టానం పెద్దలు సమీక్షా జరిపారు.
ఈ సందర్భంగా ఎంపీ, మాజీ ఎంపీల మధ్య వాగ్వివాదం... మరో ఎంపీ అలిగి వెళ్లిపోవడం... ఈ సమావేశానికి సీనియర్ నాయకులు రాలేదని అసంతృప్తితో రగిలిపోయారు... వీరందరిని అధిష్టానం పెద్దలు బుజ్జగించినా.... మీతో మాకు లెక్కేంటి అన్నట్లు వీరంతా వ్యవహరించారు. ఇక రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల భూముల వ్యవహారంపై అధికార టీఆర్ఎస్ అసెంబ్లీలో ఎండగట్టింది. ఆ విషయంలో అధికార పార్టీని నిలవరించేలా తెలంగాణ సీఎల్పీ నేత వ్యవహారించలేదు.
సరికదా ఆ అంశంపై స్పందించేందుకు ప్రయత్నించిన పలువురు సభ్యులను సదరు నేత వారించినట్లు సమాచారం. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ... ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహారిస్తుంది. ఆ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకురాగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే అంపశయ్యపైకి చేరిన పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు అధిష్టానం చర్యలు చేపడుతున్న తరుణంలో రాష్ట్రంలో నాయకులు ఇలా వ్యవహరించడంతో పార్టీకీ ఊపిరి పోస్తారా లేక ఉన్నది తీస్తారా అన్నది అధిష్టానం పెద్దలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.