
సాక్షి, హైదరాబాద్ : ఉత్తమకుమార్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఆశావాహుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు టీపీసీసీ రేసులో ఉన్నామంటూ ఫీలర్లు వదిలిన విషయం తెలిసిందే. పలువురు బాహాటంగా, మరికొందరు తాము ఆ పదవికి అర్హులే అంటూ పరోక్షంగా చెబుతున్నారు. తాజాగా ఆ రేసులో అంజనీ కుమార్ యాదవ్ కూడా చేరారు. రెండుసార్లు ఎంపీగా పని చేసిన తాను పీసీసీ అధ్యక్ష పదవికి అర్హుడేనని తెలిపారు. తనకు పీసీసీ అధ్యక్షుడుగా ప్రమోషన్ కావాలని, అందుకే హైదరాబాద్ అధ్యక్షుడుగా రాజీనామా చేశానని తెలిపారు. హైదరాబాద్ సిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయాన్ని అంజనీ కుమార్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని కాదు. హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే అధ్యక్షుడిని. సీట్ల కేటాయింపులో నా ప్రమేయం లేదు. ప్రతీ నియోజకవర్గానికి పెద్ద లీడర్లు ఉన్నారు. (టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు..)
అంబర్ పేటలో వీ హనుమంతరావు, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్థన్ రెడ్డి, సనత్ నగర్‌లో మర్రి శశిధర్ రెడ్డి.. ఇలా అందరూ పెద్ద నేతలే ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల సీట్ల కేటాయింపులో నా పాత్ర సికింద్రాబాద్, ముషీరాబాద్ తప్ప ఎక్కడ లేదు. నా రాజకీయ జీవితం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. బీజేపీ లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లను. గ్రేటర్‌లో ఓటమి అపనింద పడటం ఇష్టం లేదు.’ అని తెలిపారు. (కోమటిరెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఉత్తమ్)
ఇక ఇప్పటికే తెలంగాణ పీసీసీ రేసులో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. తనకు పగ్గాలు అప్పగిస్తే పార్టీని గాడిలో పెడతానంటూ ఆయన తన మనసులో మాటను వెల్లడించారు. మరోవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందుకు రాష్ట్ర పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్‌లో మకాం వేశారు. కోర్‌కమిటీ సభ్యులతో కలసి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక గురించి అభిప్రాయ సేకరణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment