'రాజాగారికి బాగా అర్థమైనట్లుంది'
దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది... ఈ సినిమా డైలాగ్ గుర్తిందా... నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ నోటి నుంచి గతంలో ఈ డైలాగ్ తరచూగా వినే వాళ్లం. కానీ ఇప్పుడు ఇదే డైలాగ్ కొద్దిగా మార్చి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ నోటి వెంట వినాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని ఇటీవల విజయవాడలో జరిగిన ఆ పార్టీ మేధోమథన సదస్సులో ఆయన పేర్కొనటం విశేషం.
నిజమే రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి శున్య హస్తమైంది. ఇదంతా డిగ్గి రాజాగారి చేతులారా చేసిన పుణ్యకార్యమే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో తెలంగాణలో అట్టుడుకుతుంటే... ఇలా ఎంత కాలం అంటూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు పార్టీ అధిష్టానం చెవిలో ఊది... రాష్ట్ర విజభనకు ఒప్పించారు. విభజనపై సీమాంధ్ర ప్రజలు ఉద్యమం లేవదీసిన.. ఆ ఏముందిలే ఆంధ్రులు ఆరంభశూరులన్న విషయం తెలిసిందేగా... అన్నట్లు వ్యవహరించారు.
ఇవేమీ పట్టించుకోకుండా ఓ చోట పోయినా మరో చోట గెలుస్తామన్న ధీమాతో కూరలో కర్వేపాకులా సీమాంధ్ర ప్రాంతవాసులను పక్కన పెట్టారు. ఇవాళ మీదైతే... రేపు మాది అంటూ సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర వాసులు హస్తం ఒక్కసీటు కూడా గెలుచుకోకుండా మట్టి కరిపించారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తెలంగాణలో కూడా 'కారు' స్పీడ్కు కాంగ్రెస్ కేవలం 21 సీట్లకే పరిమితమైంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు సీమాంధ్ర ప్రజల్లో పార్టీ పస ఎంతుందో తెలుసుకునేందుకు నందిగామ, తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి దరావత్తు వచ్చిందా రాలేదా అని 'యాసిడ్ టెస్ట్' చేసుకుంటుంది.