N Kirankumar Reddy
-
ప్రభుత్వ హామీలు బుట్టదాఖలు
కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్న వివిధ శాఖలు నిరాశ్రయులుగా మారుతున్న అంతర్గాం కార్మికులు రామగుండం : ప్రభుత్వాలు మారుతున్నా మండలంలోని అంతర్గాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు లాకౌట్ అరుు ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ కార్మికులకు వీఆర్ఎస్ మాత్రం చెల్లించలేదు. అలాగే సొసైటీకి డిపాజిట్ చేసిన నిధులకు 10 గుంటల నివేశన స్థలాలు కార్మికులకు అప్పగించాల్సి ఉన్నా.. తమ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1966లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బర్మా, కాందీశీకులకు (శరణార్థులు) ఉపాధి నిమిత్తం ప్రతి కార్మికుడిని మిల్లులో షేర్ హోల్డర్‌గా చేర్చుకునేందుకు రూ.7,200 డిపాజిట్ చేసి దశల వారీగా వేతనాల్లో కోత విధించారు. ఇందులో ప్రతి కార్మికుడికీ 10 గుంటల విస్తీర్ణంలో క్వార్టర్ సౌకర్యం కల్పించారు. సుమారు 500 ఎకరాల్లో వెయ్యి క్వార్టర్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఐదు వందల క్వార్టర్లు మాత్రమే నిర్మించారు. 1966లో 96 ఎకరాల్లో వీవింగ్ మిల్లు, 53 ఎకరాల్లో స్పిన్నింగ్ మిల్లును నిర్మించారు. 28 ఏళ్ల క్రితమే మిల్లుల్లో నష్టాలు రావడంతో లాకౌట్ ప్రకటించారు. దీంతో స్పిన్నింగ్ మిల్లు కార్మికులకు వీఆర్ఎస్ కింద ఫైనల్ బిల్లు ఇచ్చినప్పటికీ వీవింగ్ మిల్లు కార్మికులకు మాత్రం ఎలాంటి బకాయిలూ చెల్లించలేదు. మూడేళ్ల క్రితం ఉమ్మడి ప్రభుత్వం హయూంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్ర తి కుటుంబానికీ ఐదు గుంటల స్థలం ఇవ్వాలని ఆదేశాలు జారీచేశా రు. అది ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మిల్లు భూములను విక్రయించేందుకు జేసీ (జాయింట్ కలెక్టర్) స్థాయి అధికారిని లిక్విడేటర్‌గా నియమించినప్పటికీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. శిథిలావస్థలో క్వార్టర్లు 50 ఏళ క్రితం నిర్మించిన క్వార్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో వరద నీరు పైకప్పు నుంచి ఇంట్లోకి రావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మిల్లులు ప్రారంభ సమయంలో తమను షేర్ హోల్డర్లుగా చేర్చుకొని ఇప్పుడు కనీసం తమ క్వార్టర్లకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్నం ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. మా కుటుంబాల్లో పెళ్లీడుకొచ్చిన యువతీ, యువకులకు సంబంధాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అంతర్గాం అని చెప్పగానే వెనుకడగు వేస్తున్నారు. మాకు క్వార్టర్లు ఇచ్చిన అధికారులు.. వాటిపై అధికారం మాత్రం ఇవ్వకపోవడం శోచనీయం. - ఇండిబిల్లి నూకాలమ్మ, స్పిన్నింగ్ మిల్లు బాధితురాలు ఇల్లు సొంతమని చెప్పులేకపోతున్నం నలభై ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం. మాకు పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడ ఉపాధి కరువైనా ఇక్కడినుంచి వెళ్లలేకపోతున్నాం. మా కొడుకులే ఉపాధి నిమిత్తం వేరే చోటికి వెళ్లి రాత్రికి తిరిగి వస్తున్నారు. ఇక్కడి వాతావరణానికి మరోచోటికి వెళ్లలేకపోతున్నాం. - కె.పేరమ్మ, వీవింగ్ మిల్లు బాధితురాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి మిల్లు భూములను ముందుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే లిక్విడేటర్‌కు వాటిని విక్రయించే అధికారం ఉంటుంది. లేదంటే వాటిని విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఇప్పటికీ వీవింగ్ మిల్లు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల ఊసే లేదు. ఉద్యమాలు చేసినా కాందీశీక కార్మిక కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారుు. - జయకుమార్, స్పిన్నింగ్ మిల్లు కార్మికుడు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నారు.. ఇరవై ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా నివాసముంటు న్న భూములకు హక్కుదారులుగా గుర్తించడం లేదు. ప్రతి రాజకీయ పార్టీ మమ్మల్ని ఓటుబ్యాంకుగానే గుర్తిస్తున్నారు తప్పా తమ సమస్యలపై స్పందించే నాయకుడు కరువయ్యాడు. ప్రభుత్వ ఆదేశాలను సైతం అధికారులు అమలుచేయకపోవడం దురదృష్టకరం - ఇండిబిల్లి రవీందర్‌కుమార్, కాందీశీకుల సంఘం ఉపాధ్యక్షుడు -
‘ఆరోగ్య కార్డులు’ అక్కరకు వచ్చేనా?
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యంపై భరోసా లేకుండాపోతోంది. ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల ద్వారా నగదు రహిత చికిత్సలను అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యకార్డులను ఇస్తామని ప్రకటించి వాటిని జారీ చేయించారు. ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో వందల రూపాయలు వెచ్చించి ప్రైవేటు నెట్ సెంటర్ల ద్వారా వివరాలను అప్లోడ్ చేసి ఆరోగ్యకార్డులను తీసుకున్నారు. అయితే అవి గుర్తింపుకార్డులుగానే మిగిలిపోయాయి. అప్పటి ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆరోగ్య కార్డులు పనికి రాకుండా పోగా మెడికల్ రీయింబర్స్‌మెంట్‌నే కొనసాగించాల్సి వచ్చింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామంటూ ఆరోగ్యకార్డులు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్నిచోట్ల ఈ కార్డులను విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటన చేశారు. ఈ కార్డులు కూడా గుర్తింపుకార్డులుగానే ఉండిపోయే పరిస్థితి ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి కార్డులు ఇచ్చేప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి ధరలను నిర్ణయించాల్సి ఉంది. అటువంటి దేమీ చేయకుండా కార్డులు జారీ చేయడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యకార్డులు ద్వారా చికిత్సను అందించలే మని చేతులెత్తేస్తున్నాయి. అయినా ప్రభుత్వ పెద్దల్లో మాత్రం స్పందన కన్పించడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇటువంటి ప్రకటనలు చేసిన తరువాతైనా వారితో చర్చించి ఉంటే సమంజసంగా ఉండేది. అవేమి లేకపోవడం వల్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 30వ తేదీ తరువాత మెడికల్ రీయింబర్స్మెంట్ ఉండదని, డిసెంబరు 1 నుంచి ఆరోగ్యకార్డుల ద్వారానే చికిత్సలు పొందాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కార్డుల ద్వారా ఆరోగ్యసేవలు అందే అనుకూల పరిస్థితులు కన్పించక పోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఈ కార్డుల ద్వారా చికిత్సలు పొందేందుకు రూ. 50 నుంచి రూ.100 వరకు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించడం వల్ల ఒరిగేదేమీ ఉండదని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరికైనా ఉచితంగా వైద్యసేవలు అందిస్తారని, అటువంటప్పుడు తాము ఆరోగ్యకార్డులు పట్టుకు వెళ్లి రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించడం వల్ల ఉపయోగమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 30 లోగా కార్డుల ద్వారా వైద్యసేవలు పొందేందుకు అనుకూల పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపట్టాలని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. పీఆర్సీలోనూ కాలయాపన ధోరణే... ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయడంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన ధోరణిని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలించిన తరువాత గత ప్రభుత్వం ఐఆర్‌ను ప్రకటించింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పీఆర్సీ అమలుపై ఓ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాకాకుండా మరో సబ్ కమిటీని వేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది కాలయాపన చేసేందుకే తప్ప చిత్తశుద్ధితో చేసిన పనికాదని వారంటున్నారు. దీనిపైన కూడా ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల హెచ్చరికలకు తల వంచుతుందో తన ధోరణిని కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఫ్లాప్ షో
సాక్షి, ఏలూరు : అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలను బలవంతగానైనా తరలించి సభల్లో కుర్చీల్ని నింపేవారు. ఇప్పుడు ఆయన వస్తే రోడ్లపై పలకరించేవారే కరువయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం రాత్రి ఏలూరులో నిర్వహించిన రోడ్ షో వెలవెలబోయింది. ఫ్లెక్సీల ఖర్చుకు కూడా ఫలితం దక్కలేదు. సాయంత్రం 6 గంటలకు పెద ఎడ్లగాడి వద్ద జిల్లాలో ప్రవేశించిన కిరణ్ రోడ్‌షో శ్రీపర్రు, మాదేపల్లి, గజ్జెలవారి చెరువు, బిర్లా భవన్ మీదుగా 6.45గంటలకు పాత బస్టాండ్‌కు చేరుకుంది. మూడుచోట్లకిరణ్కుమార్రెడ్డి ప్రసంగించారు. మాదేపల్లి, గజ్జెలవారి చెరువు వద్ద 50 మంది కూడా జనం లేరు. పాత బస్టాండ్ వద్దకు మధ్యాహ్నం నుంచే జనాలను తరలించడం వల్ల వచ్చిన కొంతమంది సాయంత్రం నాలుగు గంటల నుంచి కూర్చున్నారు. ఎంతసేపు ఎదురుచూడాలంటూ స్థానిక నాయకులపై వారు అసహనం వ్యక్తం చేశారు. ఎంత దూరం వచ్చారయ్యా అంటూ కనిపించిన మీడియా ప్రతినిధినల్లా అడిగారు. ఎట్టకేలకు కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చేసరికి ఆ ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. సెంట్రల్ లైటింగ్ వెలగకపోవడంతో బస్సుపై ఉన్న నాయకులు జనాలకు సరిగా కనిపించలేదు. కొందరైతే అక్కడున్న నాయకుల్లో కిరణ్ ఎవరంటూ పక్కవారిని అడిగి తెలుసుకున్నారు. కిరణ్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ, గంటా మోహన్‌రావు(జీఎంఆర్), ఎమ్మార్డీ బలరామ్ ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో నిమిషం మాట్లాడారు. అందరూ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రజల కోసం పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. సమైక్యాంధ్ర పార్టీని ఆదరించాలంటూ పితాని ముక్తసరిగా మాట్లాడి సరిపెట్టారు. కిరణ్ ప్రసంగానికి ప్రజల నుంచి స్పందన లేకపోయింది. కేసీఆర్‌ను విమర్శిస్తున్నప్పుడు ‘ఆయన బాత్రూమ్లో బక్కెట్లోకి వచ్చే నీళ్లా.. నింపుకోగానే కట్టేయడానికి’ అన్నప్పుడు ఇదేం పోలికంటూ జనం గుసగుసలాడుకున్నారు. చంద్రబాబుని, కాంగ్రెస్ పార్టీని కిరణ్ విమర్శించారు. అక్కడి నుంచి పవర్‌పేట గేటు మీదుగా ఆర్ఆర్ పేట నుంచి ఫైర్‌స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్ వరకూ కిరణ్ రోడ్‌షో నిర్వహించారు. రోడ్ షోను ఎక్కడా జనం పట్టించుకోలేదు. తనవైపు చూసిన వారికి అభివాదం చేస్తూ రాత్రి 8 గంటలకు యాత్ర ముగించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడు తెలుగు జాతి కలిసుండాలని నోటితో చెప్పలేని పిరికివాడు చంద్రబాబు అని ఎన్..కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు వెళ్లినప్పుడు తన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పుకున్న చంద్రబాబు.. సీమాంధ్రకు వచ్చినప్పుడు మాత్రం రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారంటూ రెండు నాల్కల ధోరణి అవలంబించారన్నారు. విభజనపై అసెంబ్లీలో 40 రోజులు చర్చ జరి గితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏనాడూ చెప్పలేదన్నారు. రాష్ట్రాన్ని విభజించుకోమని కేంద్రానికి రెండు లేఖలు రాసిన వ్యక్తి చంద్రబాబు అని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 1,800 రోజలు పదవిలో ఉండి ఉద్యోగులకు జీతాలివ్వడం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.40 వేల కోట్లు అప్పు తీసుకువచ్చిన ఆయన పరిపాలనాదక్షుడా అంటూ దుయ్యబట్టారు. నీళ్లు ఆపేస్తానని అంటున్న కేసీఆర్‌కు ఆ శక్తి లేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండి విభజనను అడ్డుకోలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అంటున్నారని, అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును తలుపులు మూసి వారి సహకారంతో పార్లమెంట్లో పాస్ చేస్తారని తమకెలా తెలుస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి, జ్ఞానం ఉంటే విభజన నిర్ణయం తీసుకుని ఉండేవి కాదన్నారు. కిరణ్ వెంట జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పలువురు జిల్లా నేతలు ఉన్నారు. ఏలూరులో పర్యటన ముగించుకుని రాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కిరణ్ హైదరాబాద్ బయలుదేరారు. -
తెలంగాణ ఏర్పాటు తథ్యం
ఖలీల్‌వాడి,న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని పీడీఎస్‌యూ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లును తిరస్కరించినందుకు నిరసనగా శనివారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నగర అధ్యక్షుడు అన్వేష్ మాట్లాడుతూ.. తెలంగాణలో పుట్టి పెరిగి, ఇక్కడి నీళ్లు తాగి,గాలి పీలుస్తున్న సీఎం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకు న్నా, కిరణ్‌కుమార్‌రెడ్డి కనీసం స్పందించలేదని మండిపడ్డారు. సీఎంతో పాటు సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలపై వివక్ష చుపుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు సౌందర్య,అరుణ్, విజయ్,కిరణ్,నరేష్,రాజేశ్వర్,కమలకర్,ఉత్తేజ్,చక్రి,రవి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో తలకాయలేని దిష్టిబొమ్మ దహనం కామారెడ్డి : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తలకాయలేని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను శనివారం కామారెడ్డిలో పీడీఎస్‌యూ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ఎన్ ఆజాద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే విషయంలో కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యం, నాన్చుడు ధోరణి వల్ల తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సాగదీసే విధానానికి స్వస్తిపలికి వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ డివిజన్ అద్యక్ష, కార్యదర్శులు ఎల్బీరాజు, క్రాంతికుమార్, నాయకులు సురేశ్, ఓజల్, లావణ్య, మహేశ్, నరేశ్, వెంకటేశ్, సునీత, స్వప్న, దీపిక, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఏఐసీసీ భేటీకి రాలేను! హైకమాండ్‌కు సీఎం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17న ఢిల్లీలో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశానికి హాజరయ్యే విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కోరారు. శాసనసభా నాయకుడిగా ఉంటూ కీలకమైన విభజన బిల్లుపై సభలో చర్చ కొనసాగుతున్న సమయంలో ఢిల్లీ వెళ్లడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఆయన వారికి చెప్పినట్టు సమాచారం. ఏఐసీసీ సమావేశాల కోసం 17న అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని భావించినా ఢిల్లీ పెద్దల సూచనల మేరకు ఆరోజు సభ జరపాలని సీఎం కోరినట్లు తెలిసింది. సీఎం విజ్ఞప్తిపై హైకమాండ్ స్పందనను బట్టి కిరణ్ ఢిల్లీ ప్రయాణం ఆధారపడి ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు. -
సీఎంను పదవి నుంచి తప్పించాలి
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం వెంటనే పదవి నుంచి తప్పించాలని సీపీఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణ సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అంశంపై వైఖరి వెల్లడించకముందు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పిన కిరణ్ తీరా ఇప్పుడు ప్లేటు మార్చి సమైక్య నినాదం వినిపించడం సిగ్గు చేటన్నారు. సమైక్యవాద ముసుగులో సీమాంధ్ర ప్రజలను కూడా సీఎం మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎంకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా స్వచ్ఛందంగా సీఎం పదవికి రాజీనామా చేయడమో, కాంగ్రెస్ నుంచి వైదొలగడమో చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడని దుయ్యబట్టారు. సీమాంధ్రకు రూ.5 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మిన్నకుండి పోవడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అదే ధోరణిని ప్రదర్శిస్తోందని అన్నారు. అసెంబ్లీ నడవకుండా సీమాంధ్ర నేతలు కుట్రలు చేశారని విమర్శించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పి.శేషగిరిరావు, సహాయ కార్యదర్శులు మంతెన మల్లేశ్, తాళ్లపల్లి మల్లయ్య, నాయకులు పుల్లూరి మల్లయ్య పాల్గొన్నారు. అధికారుల మూలంగానే నీటి చౌర్యం మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారుల బాధ్యతారాహిత్యం మూలంగానే బెల్లంపల్లికి వచ్చే గోదావరి జలాలు చౌర్యానికి గురవుతున్నాయని గుండా మల్లేశ్ పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి మున్సిపాలిటీలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సంబంధించి బెల్లంపల్లికి గోదావరి జలాలు సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఇంటెక్వెల్ నిర్మించినట్లు తెలిపారు. కొంతమంది ఒత్తిళ్ల మేరకు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు బెల్లంపల్లికి వచ్చే గోదావరి జలాలను అక్రమంగా మంచిర్యాలకు సరఫరా చేయడానికి అంగీకరించారని ఆరోపించారు. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఇంటెక్వెల్ను పరిశీలిస్తామన్నారు. కాసిపేట ప్రజలకు గోదావరి జలాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ.21 కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నెన్నెల మండలం మత్తడివాగుకు రూ.11 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. తెలంగాణపై చర్చ జరుగకుండా సీఎం కుట్ర : ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భైంసా : అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై చర్చ జరుగకుండా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కుట్ర పన్నారని ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి ఆరోపించారు. ఆదివారం భైంసా పట్టణంలోని కేఎస్ గార్డెన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీఎంకు తెలంగాణ ఏర్పాటు విషయం మింగుడు పడడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాల్సింది పోయి ఇష్టారీతిన వ్యవహారిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కేంద్రం తక్షణమే తెలంగాణ ఏర్పాటు చేసి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
‘ముఖ్యమంత్రికి మతి భ్రమించింది’
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని తన నివాసంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడాలంటే శాసనసభ తీర్మానం అవసరం లేదని, కేవలం సభ అభిప్రాయం మాత్రమే కోరతారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై పూర్తి అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న విషయం స్పీకర్‌గా పనిచేసిన ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. సీల్డ్‌కవర్ ముఖ్యమంత్రి.. అన్నం పెట్టిన పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ బూటకపు మాటలతో సీమాంధ్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. పదవులపై ఆశతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు భాషపై స్పష్టత కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. సంవత్సరం క్రితం మెదక్ జిల్లాలో పర్యటించినప్పుడు హైకమాండ్ నిర్ణయం శిరోధార్యం అన్న ముఖ్యమంత్రి నేడు హైకమాండ్‌కే వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. -
గురువులకు అవమానం!
సీఎం, డిప్యూటీ సీఎం గైర్హాజరు.. మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, హైదరాబాద్: సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గైర్హాజరయ్యారు. హైదరాబాద్‌లోనే ఉన్నా వారు కార్యక్రమానికి రాకపోవడంపై అధ్యాపక సంఘాలు మండిపడ్డాయి. సమాజానికి ఉత్తమ పౌరులను అందించే గురువులను సన్మానించే కార్యక్రమానికే రాకుంటే ఇక వారు ఉండీ ఎందుకని తీవ్రంగా విమర్శించారు. ఇది రాష్ట్రంలోని 4 లక్షల మంది ఉపాధ్యాయులను అవమానపరచడమేనని ఉపాధ్యాయ సంఘాలైన పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నేత లు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, భుజంగరావు, కత్తి నర్సింహారెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేశ్వర్రావు, మధుసూదన్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం వస్తారని నిరీక్షించి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమాన్ని 12 గంటల వరకు ఆపాల్సి వచ్చిందన్నారు. కనీసం సందేశం పంపించే తీరిక కూడా లేదా? అని నిలదీశారు. వివిధ ప్రాంతాల నుంచి ఉదయమే రవీంద్రభారతికి చేరుకున్న ఉత ్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు పడిగాపులు కాశారు. చివరకు కొంత ఆలస్యంగానైనా మంత్రి పార్థసారధి వచ్చాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి పంపిన సందేశాలను సభలో చదివి వినిపించారు. కనీసం ఆ సందేశాలను కూడా పంపించలేని దుస్థితిలో మన ప్రభుత్వ పెద్దలు ఉండటం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు దుయ్యబట్టారు. ప్రత్యేక అతిథిగా మర్రి శశిధర్‌రెడ్డి, సభాధ్యక్షుడిగా దామోదర రాజనర్సింహ, గౌరవ అతిథులుగా మంత్రులు గీతారెడ్డి, పార్థసారథి, శైలజానాథ్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆహ్వానంలో పేర్కొన్నారు. అయితే మంత్రి పార్థసారథి, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు మినహా మిగతా వారెవరూ కార్యక్రమంలో పాల్గొనకపోవటం గమనార్హం. -
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: తెలంగాణకు వ్యతిరేకంగా సాగుతున్న సీమాంధ్ర ఉద్యమానికి సహకరిస్తున్నారన్న ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ మైనార్టీ సెల్ కార్యకర్తలు బుధవారం జడ్పీ సెంటర్లో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అజీం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రం కావాలని సీఎం పట్టుబట్టడం సరికాదన్నారు. హైదారాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా చేయడం ద్వారా అక్కడి ఆస్తిపాస్తులను లూటీ చేసేందుకు పాలకులు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు కళ్ల సిద్ధాంతం వల్లిస్తున్న చంద్రబాబుకు పతనం తప్పదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి షఫీ, ఉపాధ్యక్షుడు ఆసిఫ్, నగర అధ్యక్ష,కార్యదర్శులు షంషుద్దీన్, బాబా, క్రిస్టియన్ విభాగం నాయకులు ప్రసన్న, అలెక్స్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, రాము తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ర్యాలీ బోనకల్: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండుతో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బోనకల్లో పాఠశాల విద్యార్థులు బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఎం.సురేష్, నాయకులు కె.నవీన్‌కుమార్, అశోక్, సలీం, ప్రశాంతి, త్రివేణి పాల్గొన్నారు. -
ఏఈ నుంచి సీఎండీ స్థాయికి
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డులో 35 ఏళ్ల కిందట అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన హనుమంతు యర్రప్ప దొర(హెచ్‌వై దొర) దక్షిణ ప్రాంతం విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ స్థాయికి చేరుకున్నారు. తన సొంత ప్రాంతమైన ఈపీడీసీఎల్ సీఎండీ పోస్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించిన దొరకు అనూహ్య రీతిలో ఎస్పీడీసీఎల్ కుర్చీ దక్కింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోని తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఆ సంస్థలో నేటినుంచి దొర పాలన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బోరుభద్రగ్రామానికి చెందిన ఆయన 1978 డిసెంబరులో సోంపేట ఎపీఎస్‌ఈబీలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగప్రస్థ్ధానం ప్రారంభించారు. 1991లో ఏడీఈగా, 2001లో డీఈగా, 2006లో ఎస్ఈగా, 2007 అక్టోబరులో ఈపీడీసీఎల్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొంది 2008 ఏప్రిల్ 30వ తేదీ ఇదే హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. ఆ మరుసటి రోజే ఈపీడీసీఎల్ ప్రాజెక్టుల డెరైక్టర్‌గా నియమితులయ్యారు. 2009 నవంబరు 5వ తేదీ ఇదే సంస్థలో ఆపరేషన్ డెరైక్టర్‌గా నియమితులై ఇప్పటి దాకా పనిచేస్తున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అహ్మద్‌నదీం బదిలీ కావడంతో ఈ పోస్టు కోసం దొర తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన్ను ఎలాగైనా ఈపీడీసీఎల్ సీఎండీగా చేయాలని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకుడు సీఎం వద్ద పట్టుబట్టారు. అయితే ఈ ప్రయత్నం ఫలించకపోగా ఐఏఎస్ అధికారి శేషగిరి బాబును ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించారు. దీంతో దొరకు ఈసారి కూడా నిరాశే ఎదురయిందనే ప్రచారం జరిగింది. విద్యుత్ పంపిణీ సంస్థలో ఫైనాన్స్ మినహా ఇతర అన్ని విభాగాలకు డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవం, సహచర ఉద్యోగులతో స్నేహ సంబంధాలు కొనసాగించే నైజం, విద్యుత్ సరఫరా నష్టాల తగ్గింపులో లోతైన పరిజ్ఞానం ఉండటంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత జిల్లాలో తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఎస్పీడీసీఎల్కు దొరను సీఎండీగా చేశారు. దీంతో పాటు ఆయనకు ఒకే సారి మూడేళ్ల పదవీ కాలాన్ని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. విద్యుత్ పంపిణీ సంస్థల చరిత్రలో ఏ సీఎండీకి ఈ రకమైన నియామకం జరిగిన దాఖలాలు లేవు. శనివారం మధ్యాహ్నం ఆయన్ను ఎస్పీడీసీఎల్ సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, రాత్రి 7-30 గంటలకు ఇన్చార్జ్ సీఎండీ రమేష్ నుంచి హైదరాబాదులోనే ఆయన నూతన బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. సోమవారం నుంచి ఎస్పీడీసీఎల్లో దొర పాలన ప్రారంభం కానుంది. వినియోగదారుల సత్వరసేవకే ప్రాధాన్యం: దొర ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో వినియోగదారులకు సత్వర సేవలు అందించడమే తన తొలి ప్రాధాన్యమని సీఎండీ హెచ్‌వై దొర చెప్పారు. ఆదివారం సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ డిస్కం పరిధిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా పనిచేస్తానన్నారు. ఎస్పీడీసీఎల్ ఒకప్పుడు ఆదాయంలో ఈపీడీసీఎల్‌తో పోటీ పడిన సంస్థ అనీ, కొన్నేళ్లుగా పరిస్థితిలో కొంత ఇబ్బంది తలెత్తిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తన మీద నమ్మకం ఉంచి అప్పగించిన పెద్ద బాధ్యతను సవాల్‌గా తీసుకుని డిస్కంను ఉత్తమ సంస్థగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషిచేస్తానని ఆయన చెప్పారు. -
ఇద్దరూ అవకాశవాదులే: టీజేఏసీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన విపక్ష నేత చంద్రబాబు.. ఇద్దరూ అవకాశవాదులేనని, దగుల్బాజీలేనని తెలంగాణ జేఏసీ విరుచుకుపడింది. దార్శనికత చూపాల్సిన వీరు రెచ్చగొట్టే ప్రసంగాలతో ఇరు ప్రాంతాల ప్రజల్లో ద్వేషాలు పెంచుతున్నారని ధ్వజమెత్తింది. సీఎంకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని సవాల్ చేసింది. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) ఆధ్వర్యంలో కె.గోవర్ధన్ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ సాధన సభ జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు విఘ్నాలు రాకుండా ఉండాలంటూ జేఏసీ హైదరాబాద్‌లోనే తెలంగాణ శాంతి యజ్ఞాన్ని నిర్వహించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ కార్యక్రమాల్లో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ కోసం సకల జనుల సమ్మె జరిగినప్పుడు నిర్ణయం తన చేతుల్లో లేదని, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పిన కిరణ్ ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. జేఏసీ నేతలు లాలయ్య, నాగేష్ పటేల్ దంపతులు శాంతి యజ్ఞం చేశారు. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ‘ఇక ఎవరితరం కాదు..’ : తెలంగాణను వెనక్కుతిప్పటం ఇక కాంగ్రెస్ కోర్ కమిటీ తరం కూడా కాదని కోదండరాం పేర్కొన్నారు. కిరణ్ ఫాక్షనిస్టని జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో లేని భయాందోళనలు హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు ఎందుకని న్యూడెమోక్రసీ నేత ఎస్.వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సీమాంధ్రలో అహేతుక ఉద్యమం నడుస్తోందని మానవ హక్కుల వేదిక నేత జీవన్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఈ సభలో టీజేఏసీ నేతలు టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, శ్రీనివాసగౌడ్, చంద్రన్న వర్గం నేతలు వి.సంధ్య, ఎన్.బ్రహ్మయ్య, చిట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టాలని, పోలవరం ప్రాజెక్టును ఆపాలని తీర్మానాలు చేశారు. -
కలెక్టర్ సాల్మన్ ఆరోగ్య రాజ్ విశాఖపట్నానికి బదిలీ
సాక్షి, తిరుపతి: జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్య రాజ్ విశాఖపట్నానికి బదిలీ కావడంతో, అధికార పార్టీకి చెందిన నాయకులు పంతం నెగ్గించుకోగలిగారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన సాల్మన్ ఆరోగ్య రాజ్ పట్ల పలువురు కాంగ్రెసు నాయకులు గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. భూముల కేటాయింపుల్లో పట్టు బిగించడంతో, జిల్లాకు చెందిన మంత్రితో సహా, పలువు రు కాంగ్రెసు నేతలు కలెక్టర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే సీఎం కు సన్నిహితుడు కావడంతో ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. రెండు నెలలుగా సాల్మన్ ఆరోగ్యరాజ్ బదిలీపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొంత కాలంగా ఆగినా, బదిలీ ఖాయమని నెల రోజుల క్రితమే ‘సాక్షి’ తెలిపింది. అదే విధంగా సాల్మన్ ఆరోగ్యరాజ్‌ను విశాఖపట్నంకు బదిలీ చేస్తూ బుధవారం ఆదేశాలు అందాయి. సాల్మన్ ఆరోగ్యరాజ్ 2011 ఏప్రిల్‌లో జిల్లా కలెక్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పీలేరు అభివృద్ధిపైనే దృష్టి సారించారు. పీలేరులో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన నిధులన్నీ పీలేరు వైపు మళ్లాయని ప్రతిపక్షపార్టీలు కూడా ఆరోపించాయి. వచ్చిన కొత్తలో భూ కేటాయింపులు చేపట్టినా, ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని అరెస్టు చేసినప్పటి నుంచి అప్రమత్తమయ్యారు. జిల్లాలో సీఎం సోదరుడు కిషోర్కుమార్రె డ్డి మినహా మరొక రాజకీయ నాయకుడి మాట వినడని అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు నీటి సరఫరా ప్రాజెక్టుకు సంబంధించిన పనులను చేపట్టేందుకు ఉత్సాహం చూపించారు. దీనికిగాను రూ.187 కోట్లను ముఖ్యమంత్రి కార్యాలయం కేటాయించినా, ఆ నిధులను సీఎం ఆదేశాల మేరకు పీలేరు అభివృద్ధి కోసమే మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం నియోజకవర్గంలో మార్కెట్ యార్డులు, షాదీ మహల్‌తో పాటు, మార్కెట్ యార్డుల ముందు సీఎం తండ్రి అమరనాథరెడ్డి విగ్రహాల ఏర్పాట్లన్నీ కలెక్టరు హోదాలో దగ్గరుండి చూసుకున్నట్లు అధికార పార్టీ నాయకులే చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం ప్రతిష్టను కాపాడేందుకు అనుకున్న సమయానికి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. నిజానికి ప్రపంచ తెలుగు మహాసభలను వర్షాల కారణంగా వాయిదా వేయాల్సి ఉన్నా, వెటర్నరీ కళాశాల ప్రాంగణానికి మార్చి, సీఎం పరువును నిలబెట్టినట్లు సీఎం అనుచరవర్గం అభినందనలు కూడా తెలియజేసింది. తెలుగు మహాసభలకు అనుకున్న బడ్జెట్టుకన్నా రెండింతల బడ్జెట్టును ఖర్చు చేసి దిగ్విజయంగా ముగించారు. సీఎం సన్నిహితుడు కావడంతోనే ఆయనను గ్రేటర్ విశాఖలాంటి పెద్ద జిల్లాకు బదిలీ చేసినట్లు సమాచారం. -
‘తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర’
ఆర్మూర్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనను పక్కన పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎలా అడ్డుకోవాలో కుట్ర పన్నుతున్నాడని ఆర్మూర్ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ ఆరోపించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్ పట్టణ మున్సిపాలిటీ విద్యుత్ బిల్లులు చెల్లించలేని దుస్థితిలో ఉందన్నారు. ‘సి’ గ్రేడ్ మున్సిపాలిటీ కావడంతో నిధులు రావడం లేదన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, బిల్లులు చెల్లించాలని అధికారులను కోరిన ట్లు చెప్పారు. పట్టణానికి శ్రీరాంసాగర్ నుంచి తాగునీరందించే నీటి పథకం టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 71 లక్షలు ప్రణాళికేతర నిధులు మంజూరయ్యాయ ని, పార్టీలకతీతంగా వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల ప్రకటనలే నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. -
సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్న సీఎం
సాక్షి, న్యూఢిల్లీ : సీమాంధ్ర ఉద్యమానికి బాధ్యుడైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాల ని ఎంపీలు మందా జగన్నాధం, వివేక్ డిమాండ్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టారని, కిరణ్ ప్రాంతీయవాదిగా వ్యవహరిస్తున్నారని ధ్వజ మెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడా రు. జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కిరణ్‌పై మండిపడ్డారు.. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ఆయన తర్వాత ప్రాంతీయవాదిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉపఎన్నికలు చూస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. ఒక్క సీటూ గెలవలేని సీఎం కిరణ్ రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళతారని ప్రశ్నించా రు. విభజనకు సానుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించడం అర్దరహితమన్నారు. ఎంపీ వివేక్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ కుమ్మకై తెలంగాణ అంశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. -
రాష్ట్రపతి పాలన విధించైనా తెలంగాణ
కిరణ్ మొండికేస్తే సీఎంని మార్చి అయినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు టీజేఎఫ్ మీట్ ది ప్రెస్‌లో ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ ‘ప్లాన్ బీ’ని సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ తెలంగాణ వారిపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు అక్రమాస్తులు కాపాడుకునేందుకే సమైక్యవాదం ఉద్యోగులకు, ఉద్యమకారులకు డబ్బులిచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ధిక్కరిస్తే ఆయనను మార్చైనా సరే, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖాయమని లోక్‌సభలో డిప్యుటీ చీఫ్ విప్ మధుయాష్కీగౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘ప్లాన్ బీ’ని సిద్ధం చేసిందని వారు వివరించారు. కిరణ్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, జగన్ తెలంగాణను అడ్డుకోవడానికి తెరవెనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది సమైక్య ఉద్యమం కాదని, కొంతమంది అగ్రవర్ణాల వారి అధికార దాహంతో సాగుతున్నదని ఆరోపించారు. బుధవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువరించిన 70 గంటల వరకు సీమాంధ్రలో ఉద్యమమే లేదని, ఆ తర్వాత కూడా అంతంత మాత్రంగానే సాగినా చివరకు సీఎం కిరణ్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి ఉద్యమకారులను రెచ్చగొట్టారని ఆరోపించారు. తన తండ్రి అమర్నాథ్ రెడ్డి విగ్రహాలను కూల్చకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయించిన ముఖ్యమంత్రి.. రాజీవ్‌గాంధీ, ఇందిరల విగ్రహాలను కూల్చేస్తున్నా మౌనం వహించారని మండిపడ్డారు. సమైక్య ఉద్యమంలో హింస రేగుతున్నా కేసులు కూడా నమోదు చేయలేని దుస్థితిలో సీమాంధ్రలో పోలీసు శాఖ ఉందని, హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం కిరణ్, డీజీపీలు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల అధికారిని డీజీపీగా నియమించడంతోపాటు నాయకత్వ మార్పుపైనా పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు ప్రస్తుత లోక్‌సభ సమావేశాల్లో కాకపోయినా వచ్చే సమావేశాల్లో తప్పనిసరిగా వస్తుందని తెలిపారు. సమైక్య ఉద్యమంలో హైదరాబాద్ గురించే తప్ప మరో అంశమే లేదంటే అది కేవలం కొందరు పెట్టుబడిదారులు చేయిస్తున్నదేననే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. టీడీపీ, బీజేపీ తెరవెనుక చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్నాయని, త్వరలోనే అవి రెండూ కలిసికట్టుగా తిరిగే పరిస్థితి కూడా ఉందన్నారు. సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడులు సరికాదని, ఇలాంటి దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమ సహనాన్ని అసమర్థతగా భావించరాదని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యమకారులకు డబ్బులు ఇచ్చి సమ్మెలు, ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం ఆరా తీయిస్తోందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం నచ్చని కాంగ్రెస్ నేతలు పార్టీ నుంచి బయటకు పోవచ్చని ప్రభాకర్ పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఆంటోనీ కమిటీకి లే దని, సీమాంధ్రుల అపోహలు తీర్చడానికే ఆ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. రేణుకా చౌదరి సీమాంధ్రనేతేనని, ఆమెను తమ సమావేశాలకు పిలవడంపై అభ్యంతరం చెప్పి మరీ ఆపించామని చెప్పారు. తెలంగాణపై ప్రకటనే వచ్చిందని, ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రమాదం అంచులు దాటినట్లు కాదన్నారు. తెలంగాణ వచ్చాక రెండు ప్రాంతాల్లోనూ బడుగు బలహీన వర్గాల వారిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తామని, తాము మాత్రం రేసులో లేమని వివరించారు. ఈ సమావేశంలో టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, నేతలు క్రాంతికుమార్, పీవీ శ్రీనివాస్, పల్లె రవికుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎస్ఐపీసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) సమావేశం గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో సుమారు రూ. 3 వేల కోట్లకుపైగా పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పలు పరిశ్రమలకు రాయితీలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉం దని పరిశ్రమల శాఖ వర్గాలు తెలి పాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద బ్రెజిల్‌కు చెందిన గెర్డావ్ కంపెనీ రూ. 1,500 కోట్లతో ఏర్పా టు చేసే స్టీల్ ప్లాంట్‌తో పాటు రూ. 300 కోట్లతో చిత్తూరులో కోల్గేట్ సంస్థ ఏర్పాటు చేసే యూనిట్‌కు ఇచ్చే రాయితీలపైనా నిర్ణయం తీసుకుంటారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 400 కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, కృష్ణా జిల్లాలో రూ. 160 కోట్లతో టెక్స్టైల్ యూనిట్‌ను విస్తరించనున్న మోహన్ స్పిన్‌టెక్స్‌తో పాటు ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద రూ. 800 కోట్లతో ఐటీసీ విస్తరణ ప్లాంటుకు ఇచ్చే రాయితీలపైన కూడా ఎస్ఐపీసీ చర్చించనుంది. ఈ యూనిట్ల ద్వారా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎస్ఐపీసీ భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరగనుంది. -
క్షేత్రస్థాయికెళ్లి పరిశీలిస్తా: ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై సీఎం కిరణ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమల్లో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఇందిరమ్మ కలలు’ కార్యక్రమం అమలుపై శనివారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయనీ విషయం తెలిపారు. సమావేశంలో మంత్రులు పితాని సత్యనారాయణ, పి.బాలరాజు, డి.మాణిక్యవరప్రసాద్, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వి.భాస్కర్, రేమండ్‌పీటర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, విద్యాసాగర్, ఉదయలక్ష్మి, సోమేశ్‌కుమార్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు మంజూరు చేసిన గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 కల్లా ఎస్సీ, ఎస్టీలకు 3.85 లక్షల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పితాని చెప్పారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. -
నిత్యావసరాల ధరలు నియంత్రించండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి, ఇతర ఉన్నతాధికారులతో నిత్యావసర సరుకుల ధరలు, భారీ వర్షాలు, సీమాంధ్రలో సమ్మె తదితర అంశాలపై సమీక్షించారు. ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీమాంధ్రలో ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో రవాణాపరంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన వాకబు చేశారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అత్యవసర రవాణాకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనెల 14వ తేదీన రాష్ట్ర సగటు వర్షపాతం మూడు మిల్లీమీటర్లు కాగా శుక్రవారం 20.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రికార్డయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 16వ తేదీ వరకూ 398.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 443.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం (11 శాతం అధికంగా) నమోదైందని వారు వివరించారు. నల్లగొండ జిల్లాలో ఈనెల 13 - 15 తేదీల్లో కురిసిన వర్షాలవల్ల 6,375 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. -
ప్రశాంత రాష్ట్రంతోనే అభివృద్ధి: కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రశాంత పరిస్థితుల్లో ఉండే రాష్ట్రమే అభివృద్ధికి బాటలు వేయగలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రగతి ప్రయాణంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో, మత సామరస్యాన్ని కాపాడటంలో రాజీలేకుండా ముందుకు వెళుతున్నామన్నారు. నిజాయితీ, పారదర్శకమైన పాలన ద్వారా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించి, ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, ఏ పథకం అమలు చేసినా పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని చెప్పారు. భగవంతుని దయ వల్ల రాష్ట్రంలో ముందుగానే మంచి వర్షాలు పడినందున ఖరీఫ్ సీజన్లో మంచి పంటలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలాశయాలన్నీ పూర్తిగా నిండాయని, విద్యుత్ పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో ఈ ఏడాది తలసరి ఆదాయం జాతీయసగటు కన్నా ఎక్కువగా నమోదయిందని, జాతీయ స్థాయిలో పేదరికం శాతం 21.9గా ఉంటే మన రాష్ట్రంలో 9.2 శాతానికి తగ్గిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం తెచ్చి ఆయా వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డా బంగారుతల్లి కావాలనే ఉద్దేశంతో బంగారు తల్లి అనే పథకాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు ఈ పథకం కింద 50వేల మందిని నమోదు చేసుకున్నామని చెప్పారు. ఎవరు అధికారంలో ఉన్నా ఈ పథకాన్ని అమలుచేసి తీరాలనే లక్ష్యంతో పథకానికి చట్టబద్ధత కూడా కల్పించామన్నారు. ఇందిరమ్మ బాటలో ఇచ్చిన హామీలలో ఎక్కువ శాతం నెరవేర్చామని, మిగిలినవి త్వరలోనే నెరవేరుస్తామన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.16,500 కోట్లను రుణాలుగా ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానానికి చేరుకుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులు బొత్స సత్యనారాయణ, దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, డీజీపీ దినేశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ శకటానికి మొదటి బహుమతి స్వాతంత్య్రదిన వేడుకల సందర్భంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేవిధంగా ప్రదర్శించిన శకటాల్లో సాంస్కృతిక శాఖకు మొదటి బహుమతి లభించింది. అటవీశాఖ, ఉద్యానశాఖల శకటాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. మహిళ, శిశు సంక్షేమ శాఖ శకటానికి ప్రోత్సాహక బహుమతి లభించింది. పరేడ్‌కు సంబంధించి సాయుధ విభాగంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏపీఎస్పీ 16వ బెటాలియన్, సాధారణ విభాగంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల విద్యార్థులకు మొదటి బహుమతులు లభించాయి. నేషనల్ గ్రీన్ కాప్స్ విద్యార్థులు ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బంది పలువురికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం పతకాలను బహూకరించారు. పాపం.. ఎస్సీ గురుకులాల విద్యార్థులు: వేడుకల సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన 600 మంది విద్యార్థులు ‘భారతీయం’ పేరిట ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమయ్యారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో వర్షం మొదలైంది. అయినప్పటికీ తమ నెలరోజుల సాధనను ప్రదర్శించి సీఎం అభినందనలు పొందాలన్న ఆశతో ఆ చిన్నారులందరూ వర్షంలో తడుస్తూనే ఆయన ప్రసంగాన్ని విన్నారు. సీఎం ప్రసంగం అయిపోగానే చిన్నారులు నృత్య రూపకాన్ని అరగంటపాటు వర్షంలోనే ప్రదర్శించారు. సీతాకోక చిలుకలను తలపించే ఆకర్షణీయమైన దుస్తులు ధరించిన చిన్నారులు చేసిన ఈ ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ సీఎం తన ప్రసంగం ముగియగానే నిష్ర్కమించడంతో చిన్నారుల ఆశలు ఆవిరయ్యాయి. -
ఉద్యోగుల్లో అపోహలు తొలగించండి: సీఎం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో చర్చించి వారిలో అపోహలు, భయాలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని ఆదేశించారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం బుధవారం సమీక్షించారు. సమ్మె వలన ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుమలకు బస్సులను పునరుద్ధరించామని అధికారులు చెప్పారు. వివిధ శాఖల్లో హాజరు, జిల్లాల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. వైద్యసేవలు ఆగకూడదు: సహానీ సమ్మె కారణంగా వైద్య సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ అధికారులను ఆదేశించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు సమ్మెలో ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈనెల 13 నుంచి ఎన్జీవోలు సమ్మెకు పిలుపునిచ్చిన కారణంగా పలు వైద్యాధికారుల కార్యాలయాల్లో ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లగా అంతకు పది రోజులు ముందునుంచే పలువురు ఉద్యోగులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ నుంచి 10వేల మందికి పైగా సమ్మెలోకి వచ్చారు. వీరిలో పారామెడికల్ సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగులు అత్యధికంగా ఉన్నారు. శస్త్రచికిత్సలకు ఆటంకం కాకూడదు బోధనాసుపత్రుల్లో శస్త్రచికిత్సలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అన్ని వైద్య కళాశాలల సూపరింటెండెంట్లకు, ప్రిన్సిపాళ్లకు వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ శాంతారావు ఆదేశించారు. -
విభజనపై సీఎం తీరు ఓట్ల గేమ్‌లో భాగమే: బైరెడ్డి రాజశేఖరరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు, చేతలన్నీ ఓట్ల గేమ్‌లో భాగమని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధినేత బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయాన్ని ప్రకటించిన తొమ్మిది రోజులకు బయటకు వచ్చిన సీఎం సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందని మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 8న సీఎం విలేకరుల సమావేశం పెట్టినరోజే సీమకు పెద్దఎత్తున అన్యాయం చేసే జీవో నంబరు 72ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగిషన్ స్కీం కింద 70 టీఎంసీల నీటిని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు తరలించేందుకు సర్వే చేయాలన్నది ఆ జీవో సారాంశమన్నారు. ఈ పథకం వల్ల సీమ ఎడారి అవుతుందని, ఎవరి జాగీరని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు.సీమాంధ్ర నేతలు ఆందోళనలను చేస్తుంటే గవర్నర్‌ను కలిసేందుకు వారి సతీమణులు వెళ్లడం వింతగా ఉందన్నారు. -
విభజన ‘బాధ్యత’ మీదే : కిరణ్‌కు దిగ్విజయ్ సింగ్ హితబోధ
రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తిచేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిపైనే ఉంచింది. ఈ మేరకు ఆయనకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో పార్టీ గీత దాటవద్దని కూడా ముఖ్యమంత్రికి సున్నితమైన హెచ్చరిక జారీ చేసింది. విభజనకు సంబంధించి సీఎం ఇటీవల విలేకరుల సమావేశంలో వ్యక్తంచేసిన అంశాలపై అదిష్టానానికి పలు ఫిర్యాదులు అందటంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఇటీవల సీఎం కిరణ్‌తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన మాటగా చెప్పమన్నారని దిగ్విజయ్ ఈ సందర్భంగా సీఎంకు స్పష్టం చేసినట్లు అత్యున్నత స్థాయి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం సందేహాలు వ్యక్తం చేసిన సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను పార్టీ కోర్ కమిటీకి ఇప్పటికే తెలియజేసినందున మళ్లీ కొత్తగా అవే అంశాలను బహిరంగంగా వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని.. ఆ అంశాలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తుందని దిగ్విజయ్ పేర్కొన్నట్లు సమాచారం. సాగునీరు, విద్యుత్, ఉద్యోగుల అంశాలు తేలకుండా విభజన జరగటానికి వీల్లేదని కిరణ్ పేర్కొనటంపై ఇప్పటికే అధినేత్రికి పలు ఫిర్యాదులు అందాయని దిగ్విజయ్ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అదిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, పార్టీ గీత దాటవద్దని, విభజన ప్రక్రియ సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత సీఎందేనని ఆయన స్పష్టంచేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. సాధారణ పరిపాలన విషయాలపై దృష్టి సారించాలని, పాలనను స్తంభింపచేయరాదని కూడా దిగ్విజయ్ ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిపాయి. 13 రోజుల తర్వాత సచివాలయానికి సీఎం ఇదిలావుంటే.. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సచివాలయానికి రాకుండా కేవలం క్యాంపు కార్యాలయానికే పరిమితమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సచివాలయానికి వచ్చారు. దిగ్విజయ్ సూచనలు, నిర్దేశాల నేపథ్యంలో సీఎం 13 రోజుల అనంతరం సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు సచివాలయానికి వచ్చి 3.30 గంటల వరకూ అక్కడే ఉన్నారు. మంగళవారం నుంచి వివిధ కార్యక్రమాల అమలు తీరుపై సీఎం సమీక్షలు నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
విభజనకు సీమాంధ్రులు సోదరభావంతో సహకరించాలి: కోదండరాం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, విభజనకు సీమాంధ్రులు సోదరభావంతో సహకరించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సోమవారం తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం సదస్సులో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నిరసన ప్రదర్శనలు సాగిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడి తెచ్చేలా తమ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సీమాంధ్ర నేతలు ప్రసంగించడం సరికాదన్నారు. తెలంగాణ వస్తే పాలస్తీనా పాకిస్థాన్ అవుతుందని అంటున్న నేతలు ఇక అటువంటి పాలస్తీనా పాకిస్తాన్లో వారు ఎలా కలిసుంటారని ప్రశ్నించారు. ఆంధ్రావారు ఆఖరి సమయంలో తెలంగాణ బిల్లుపై సంతకం పెట్టే రాష్ట్రపతి పెన్ను లో కూడా ఇంకు లేకుండా చేస్తారని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమాలతో ఈ ప్రాంత ప్రజలే నష్టపోలేదని, రెండు ప్రాంతాలవారూ నష్టపోయారన్నారు. సీమాంధ్ర ఉద్యమాల వల్ల ఒరిగేదేమీ లేదని, అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారమే జరపాలని, లేకుంటే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మాట్లాడుతూ సమ్మెకు పిలుపునిచ్చిన వారి పేర్ల జాబితాను తయారు చేస్తామని, వారంతా ఆంధ్రాకు వెళ్లిపోయి పని చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 610ని వీరంతా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. సదస్సుకు తెలంగాణ విశ్రాంతఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షత వహించగా టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, తెలంగాణ నేతలు శ్రీధర్ దేశ్‌పాండే, రూపని లోకనాథం, లక్ష్మయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ది నీచమైన ఎత్తుగడ: అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేకవాదా? లేదా తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకున్నారా? అనేది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు వైఎస్ బీజం వేశారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా మరి కొందరు నేతలు, వైఎస్ కల సాకారం అవుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని మండిపడ్డారు. ఇటు రాష్ట్ర నేతలు, అటు అధిష్టావర్గం ప్రతినిధులు నీచమైన రాజకీయ ఎత్తుగడతోనే వైఎస్‌పై ఇలా బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాకుండా వైఎస్ అడ్డంగా ఉన్నారని అసెంబ్లీలోనూ, బయటా కొందరు కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నాయకులు గతంలో వ్యాఖ్యలు చేసిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. వైఎస్ స్వయంగా తెలంగాణ ఫోరం పేరుతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సోనియాగాంధీకి లేఖ ఇప్పించారని కొందరు చేసిన ఆరోపణలపై ఆయన అభ్యంతరం తెలిపారు. చేవెళ్ల నుంచి వైఎస్ ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించినప్పుడు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలని సాక్షాత్తూ తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ జి.చిన్నారెడ్డి లేఖ రాశారని, అలాగే తెలంగాణలో పర్యటించేటప్పుడు సమైక్యవాది వైఎస్ గోబ్యాక్ అనే నినాదాలు కూడా చేశారని, అందుకు వైఎస్ వెంట పాదయాత్రలో ఉన్న తానే సాక్షినని వివరించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నందువల్లనే ఇప్పుడు వైఎస్‌ను తెరపైకి తెచ్చి ఆయనే తెలంగాణ ఏర్పాటుకు కారణమవుతున్నారని చెబుతూ దాన్ని జగన్‌పై రుద్దాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. వైఎస్ ఉన్నప్పుడు 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేసి ఆ తరువాత తెలంగాణ అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్నట్లు చేర్చారని, టీఆర్ఎస్తో పొత్తుకు కూడా అప్పట్లో దీన్నే ప్రాతిపదికగా తీసుకున్నారని అప్పటి ఆ పార్టీ నేత నరేంద్ర కూడా దీనిపై సంతకం చేశారని అంబటి వెల్లడించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానవర్గం రెండో ఎస్సార్సీని వేయడంగానీ, విసృ్తత స్థాయిలో సంప్రదింపులు జరపడం గానీ చేయలేదన్నారు. ఇన్నాళ్లు అధిష్టానం ఏమీ చేయకుండా తీరా ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం విభజించి ఆ నె పాన్ని వైఎస్‌పై తోసే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తమ పదవులకు రాజీనామాలు చేసిన తర్వాత దిగ్విజయ్‌సింగ్... తెలంగాణ ఏర్పాటు వైఎస్ కల అని చెప్పడం తెలుగు ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడమేనన్నారు. బాబూ.. అధికార దాహ యాత్ర చేస్తారా? తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, గద్దె దించి ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు ఇప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఇది చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదని అంబటి అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో యాత్ర ప్రారంభానికి ముందుగా బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం వెలువడ్డాక తెలుగు జాతి రెండుగా చీలినా ఐక్యంగా ఉండాలని బాబు చెప్పారనీ, అదెలా సాధ్యమో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త రాజధాని కట్టుకోవడానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని బాబు అడిగి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని మంట కలిపింది చాలక.. ఇంకా ఎందుకు యాత్ర చేయాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖనే అధిష్టానం కత్తిగా చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందన్నారు. విభజన విషయంలో బాబు చేసిన చర్చలుగానీ, ఇచ్చిన లేఖలను గానీ చూస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఆయనేననేది తేటతెల్లమవుతుందని అంబటి దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి చేసేది అధికార దాహ యాత్రే అవుతుంది తప్ప ఆత్మగౌరవ యాత్ర ఎంత మాత్రం కాజాలదని అన్నారు. వైఎస్ తెలంగాణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా.. రాష్ట్రంలోని ముస్లిం సోదరుల భయాందోళనలను నివృత్తి చేయాలని, అలాగే అందరిదీ అయిన హైదరాబాద్ భవితవ్యాన్ని తేల్చాలని, ఇందులోని భాగస్వాములందరితో చర్చించి వారిని ఒప్పించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పారని అంబటి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా నాడు వైఎస్ చెప్పిన దాన్నే తెలంగాణ విషయంలో తన విధానంగా చేసుకుందని, హోంమంత్రి షిండేకు ఇచ్చిన లేఖలో ఇదే చెప్పామని ఆయన వివరించారు. ఇలాంటి అడ్డగోలు విభజనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందే తప్ప తెలంగాణకు ప్రతికూలం కాదన్నారు. -
ఆ ముగ్గురూ.. ద్రోహులే
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదుల నిరసన కొనసాగుతోంది. ఆయనతోపాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ప్రధానికి లేఖ రాయడంపై... తెలంగాణపై విషం కక్కుతున్నారంటూ ఎంపీ లగడపాటిపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నారుు. ఈ ముగ్గురు సీమాంధ్ర నాయకులు తెలంగాణ ద్రోహులనే నినాదాలతో ఓరుగల్లు మార్మోగింది. టీజేఏసీ పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా శనివారం ఆ ముగ్గురి దిష్టిబొమ్మలను దహనం చేశారు. జేఏసీ, టీఆర్ఎస్, విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగారుు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్‌లో ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఉచిత వైద్యశిబిరం నిర్వహించి రోగులకు వైద్యం అందజేశారు. సంస్థ నిర్వాహకులు పరికిపండ్ల అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నర్మెట మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాప్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని జేఏసీ కన్వీనర్ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లి మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఘనపురం మండలం కరకపల్లిలోని ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం నిరసనకారులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. లింగాలఘనపురం, వెంకటాపూర్, తాడ్వాయి, ఏటూర్‌నాగారం, మంగపేట మండల కేంద్రా ల్లో సీఎం కిరణ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇప్పటికైనా సీఎం తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతానికి పక్షపాతిగా వ్యవహరిస్తున్నందున రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరిపెడలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సీఎం డౌన్‌డౌన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం ధ్వనించింది. వుుఖ్యవుంత్రిని వెంటనే బర్తరఫ్ చేయూలనే డిమాండ్‌తో నర్సంపేటలో టీబీఎస్ఎఫ్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. హన్మకొండ బస్టాండ్ సమీపంలో టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను ద హనం చేశారు. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని టీ ఎస్‌జేఏసీ కన్వీనర్ బొల్లపల్లి కిషన్ డిమాండ్ చేశారు. తెలంగాణపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారంటూ మహబూబాబాద్, నర్సింహులపేటలో తెలంగాణవాదులు నిరసన తెలిపారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు.పద్ధతి మార్చుకోకుంటే తెలంగాణలో టీడీపీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. -
బాబును నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు: కడియం
హైదరాబాద్: టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని ఆయన చెప్పారు. తెలంగాణ టీడీపీ నాయకులు ఇప్పటికైనా చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకోవాలన్నారు. ఇటు తెలంగాణ ప్రజలు, అటు సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు విశ్వసనీయతలేని నాయకుడు అని కడియం శ్రీహరి విమర్శించారు. కాగా, తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించిన నాటినుంచి సీమాంధ్ర ప్రాంతాలలో అందోళన వాతావారణం నెలకొంది. రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై నిర్ణయం వెలువబడిన నేపథ్యంలో దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణవాదులు చేసినా ఉద్యమాలతో కేంద్రం దిగివచ్చింది. దీంతో గత నెల జూలై 30న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అంతేకాకుండా హైదరాబాద్ ను పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
తెలంగాణ బిల్లు పెట్టకుంటే 22 నుంచి సింగరేణి సమ్మె
టీబీజీకెఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య గోదావరిఖని,న్యూస్‌లైన్: పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, లేనిపక్షంలో ఈ నెల 22 నుంచి సింగరేణి సంస్థలో సమ్మె చేపడతామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టని పక్షంలో సమ్మెను విజయవంతం చేసేందుకు మిగిలిన కార్మిక సంఘాలు కలిసిరావాలని కోరుతూ సంఘాలకు లేఖలు రాస్తున్నామని చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు కుట్ర పన్నుతున్నారని, వాటిని కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే పరిమితమై మాట్లాడడం శోచనీయమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో సీఎంను గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం కిరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, న్యూస్‌లైన్ : సీడబ్ల్యూసీ సమావేశం సమయంలో తెలంగాణపై కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించి ఆనక సమైక్యవాదినని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్‌రెడ్డి, సీహెచ్ ఉపేంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రకటన వచ్చిన అనంతరం ఏడు రోజులు చీకటి గదుల్లో కూర్చు న్న సీఎం కుట్రలు పన్ని సమైక్యవాద కృత్రిమ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. విలేకరుల సమావేశంలో చెప్పిన సమస్యలన్నీ ఆయనకు గతంలో తెలియ దా? అని వారు ప్రశ్నించారు. సోనియా భిక్షతో సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఆమె ఇచ్చిన మాటనే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన సీఎం ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. -
సీఎంను బర్తరఫ్ చేయాలి
10, 11, 12న నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు: కోదండరాం సాక్షి, హైదరాబాద్: ఒక ప్రాంతానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కు రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని, వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం డిమాండ్ చేశారు. జేఏసీ కో చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, మాదు సత్యం తదితరులతో కలిసి హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ధిక్కరించే విధంగా మాట్లాడిన కిరణ్ వెంటనే రాజీనామా చేయాలని, లేకుంటే అధిష్టానమే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని కోరారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో దిష్టిబొమ్మలను దహనం చేయాలని, తెలంగాణవ్యాప్తంగా నిరసనలను చేపట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు. -
సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనం: జైపాల్‌రెడ్డి
పాలమూరు (మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం శిలా శాసనం లాంటిదని, ఎన్ని ఉద్యమాలు పుట్టుకొచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేవని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. తాను ప్రాంతాల పేరుతో ప్రజలను నిందించబోనని, సీమాంధ్ర నాయకుల వైఖరి కారణంగానే తెలంగాణలో సమస్య తలెత్తిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు జాతీయ స్థాయిలో బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, ఇతర పార్టీలు అనుకూలంగా ఉన్నాయన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక రాష్ట్రం ఏర్పాటు విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సునిశితంగా చర్చలు, సమీక్షలు, పరిశీలనల అనంతరమే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పెద్ద పదవిలో ఉన్న ఒక వ్యక్తి అధిష్టానం ముందు వారు చెప్పిన మాట విని, ఆ తర్వాత ఒక ప్రాంతం వారిని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేయడం తగదంటూ పరోక్షంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని విమర్శించారు. విభజనపై కేంద్రం తన నిర్ణయాన్ని పక్కన పెట్టాలన్న కుతంత్రంతోనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రరాష్ట్రంలో కలిసి ఉండటం కుదరదనే ఉద్దేశంతో.. 2004లోనే టీఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించినట్లు వెల్లడించారు. అప్పుడే సోనియాగాంధీకి ఈ ప్రాంతంపై అవగాహన కలిగి, అభిమానం ఏర్పడిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు 2004లోనే ప్రధాని మన్మోహన్సింగ్ చెప్పారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ఫిబ్రవరి 12న తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించారన్నారు. సీమాంధ్రులను అమాంతంగా హైదరాబాద్ వదిలి వెళ్లమని ఎవరూ చెప్పడం లేదంటూ.. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల వరకు ఇక్కడే ఉండేందుకు అవకాశం కల్పించిన విషయం గుర్తు చేశారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్నందునే హైదరాబాద్ తమకు కావాలంటున్నామని చెప్పారు. -
ధర్మాన సహా ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా
సీఎంకు లేఖల సమర్పణ సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ రాజీనామా పత్రాలను ఆయనకు అందజేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామా చేశామని స్పష్టంచేశారు. తాము కూడా ప్రజల వెంటే నడుస్తామని ప్రకటించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని, అలా కాని పక్షంలో తమ రాజీనామా పత్రాలను శాసనసభాపతికి పంపించాలని వారు సీఎంను కోరారు. దర్మానతో పాటు జుట్టు జగన్నాయకులు, కొర్ల భారతి, మీసాల నీలకంఠంనాయుడు, బొడ్డేపల్లి సత్యవతి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ విశ్వప్రసాద్ కూడా మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ధర్మాన తదితరులు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్ష మేరకు నడచుకుంటామని ముఖ్యమంత్రికి స్పష్టం చేశామన్నారు. రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలపై సీఎం కిరణ్ లేవనెత్తిన సందేహాలు వాస్తవమేనని, ఆయన వాదనను తాము సమర్థిస్తున్నామని చెప్పారు. విభజన అంశంపై అసెంబ్లీలో కానీ లేదా ఏ వేదికపైనైనా చర్చ జరిగితే సమైక్యాంధ్రప్రదేశ్ వాదనను గట్టిగా వినిపిస్తామని చెప్పారు. -
కుట్రదారు కావొద్దు : డిప్యూటీ సీఎం దామోదర
సీఎం కిరణ్‌పై డిప్యూటీ సీఎం దామోదర మండిపాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. హైకమాండ్‌ను ధిక్కరించిన వారిని చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలతోపాటు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ సీఎం, పీసీసీ చీఫ్ చేసిన సంతకాలపై హైకమాండ్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సైన్యాన్ని నడిపించే కమాండర్... కుట్రదారుడు కాకూడదని, ఒకవేళ కుట్రదారుడైతే సైన్యం ముందుకు సాగదంటూ సీఎంను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. డిసెంబర్ నాటికి రెండు రాష్ట్రాల ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. విభజన కోసం ఐదున్నర దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ప్రజలు మాత్రమే కారకులు తప్ప వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు కానేకాదన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం తెలంగాణ ఉద్యమ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రి ప్రసాద్‌కుమార్, ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి క్రాంతి, శైలేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో రెండు గంటలకుపైగా దామోదర ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మా అస్తిత్వం, స్వయం పాలన కోసమే.. తెలంగాణలో అడుగడుగునా ఉల్లంఘనలే జరిగాయి. అందుకే మా తెలంగాణ మాకు కావాలే అని కోరుతున్నాం. తెలంగాణ అసమానతల కోసం కాదు. మా అస్తిత్వం, ఆత్మగౌరవం, స్వయం పాలనకు సంబంధించిన ఉద్యమం. మేం అడుగుతోంది కొత్త రాష్ట్రం కాదు. పాత తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ కంటే 18 రాష్ట్రాలు చిన్నవిగా ఉన్నాయి. ఆనాడు ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేస్తే జై ఆంధ్రా ఉద్యమం పేరిట కొత్త రాష్ట్రం కావాలని ఉద్యమించారు. వాళ్లే నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు సమైక్య రాష్ట్రం కావాలంటున్నారు? మీకెందుకు సమైక్య రాష్ట్రం? హైదరాబాద్‌లోని మీ ఆస్తులను, వ్యాపారాలను కాపాడుకోవడానికా? సీమాంధ్రుల అంగీకారంతోనే తెలంగాణ 1999 నుంచి తెలంగాణ కావాలని కాంగ్రెస్ కోరుతోంది. అప్పట్లో 41 మంది ఎమ్మెల్యేలు సోనియాగాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు. 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో మూడు ప్రాంతాల నాయకుల అంగీకారంతో ‘తెలంగాణ’ అంశాన్ని పొందుపరిచాం. ఆ మేనిఫెస్టోకు ఏఐసీసీ ఆమోదం కూడా తెలిపింది. ఈ చారిత్రక నేపథ్యం, పార్టీ మేనిఫెస్టో, ఆ తర్వాత యూపీఏ ఎజెండా, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపర్చిన కారణంగానే తెలంగాణ ఇవ్వాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. సీఎం, పీసీసీ చీఫ్ సహా అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. అంతేతప్ప ఎవరిని అడిగి తెలంగాణ ఇచ్చారంటే ఎలా? సమస్యలకు సృష్టికర్తలెవరు? రాష్ట్రం విడిపోతే ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు. అసలు ఈ సమస్యలన్నింటికీ కారకులెవరు? 56 ఏళ్ల సమైక్య పాలనలో 44 ఏళ్లు సీమాంధ్రులే పాలించారు కదా! 12 ఏళ్లు మాత్రమే తెలంగాణ వాళ్లు పాలించారు. ఈరోజు నదీ జలాల వివాదం, విద్యుత్ సంక్షోభం, హైదరాబాద్ నగర ఇబ్బందులని అంటున్నారు? ఇన్నాళ్లూ పాలించింది మీరే కదా! హైకమాండ్‌ను ధిక్కరిస్తే చరిత్ర క్షమించదు హెకమాండ్‌ను ధిక్కరించినట్లు వ్యవహరించే వాళ్లను చరిత్ర క్షమించబోదు. కొందరు (సీఎంను ఉద్దేశించి) అన్నీ తానే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పార్టీని ఎవరు ధిక్కరించినా వారికి వ్యతిరేకంగా, పార్టీకి అండగా తెలంగాణ నాయకులమంతా నిలబడతాం. హైకమాండ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కిరణ్ సీఎంగా కొనసాగాలో వద్దో ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న కుటుంబాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారంతా హైదరాబాదీలే. వాళ్లను ఇక్కడ్నుంచి పొమ్మనే హక్కు ఎవరికీ లేదు. తెలంగాణలో నివసిస్తున్న వారెవరూ సెటిలర్లు కారు. అంతా హైదరాబాదీలే. వారికి భద్రత కల్పిస్తాం, తోడుగా ఉంటాం. సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే ఆంటోనీ కమిటీకి నివేదిస్తే త్వరలోనే నివృత్తి చేస్తుంది. విడిపోతే సమస్యలు నిజమే రాష్ట్రం విడిపోతే తెలంగాణలో నీరు, విద్యుత్ సమస్యలు వస్తాయనేది నిజమే. 1,500 నుంచి 2వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఇప్పటికే ఉంది. ఎత్తిపోతల పథకాలు వస్తే మరింత కొరత వస్తుంది. మరి దీనికి కారకులు మీరు (సీమాంధ్ర పాలకులు, కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి) కాదా? గోదావరి, కృష్ణా నీటిని వాడుకోవాలంటే కచ్చితంగా చాలా విద్యుత్ అవసరం. ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టు అయినా సరే.. ఈనాటి వరకు తెలంగాణకు విద్యుత్ అవసరమనే విషయాన్ని ఎందుకు ఆలోచించలేదు? దీన్ని ఏమనుకోవాలి? కృష్ణా, గోదావరిపై 40 వేల కోట్లు వెచ్చిస్తే 6 వేలకు పైగా మెగావాట్లు విద్యుత్ అవసరం అవుతుందనే సంగతి మాకు తెలుసు. టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరడంలో తప్పులేదు. ఎవరు ఇష్టం ఉంటే ఏ పార్టీలోనైనా చేరే అవకాశముంది. నేను సోనియాగాంధీ దయతో డిప్యూటీ సీఎం అయ్యాను. ఆమె ఏ బాధ్యతలు అప్పగించినా కార్యకర్తగా శిరసావహిస్తా. -
అన్నీ పచ్చి అబద్ధాలే: కేసీఆర్
కిరణ్‌కుమార్‌రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదు ముఖ్యమంత్రిపై కేసీఆర్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజన విషయంలో పూర్తిగా అసత్యాలు, పసలేని, పనికిరాని మాటలు మాట్లాడారని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. ఒక ప్రాంతానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉండే హక్కు లేదన్నారు. ఇక్కడే పుట్టామని, ఇక్కడే పెరిగామని చెప్పుకుంటున్న సీఎంను హైదరాబాద్ నుండి ఎవరూ వెళ్లమనడం లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆయన ఇక్కడే ఉండి కర్రీ పాయింట్, ఇడ్లీ సెంటర్ పెట్టుకోవచ్చునని ఎద్దేవా చేశారు. కొత్త రాష్ట్రంలో రాజధాని ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం అంటే, తెలంగాణ మానవత్వంతో ఒప్పుకుంటోందని చెప్పారు. సీఎం ప్రస్తావించిన అంశాల కు సంబంధించిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలంటూ అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. మరి మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు అంబేద్కర్ చెప్పిన మాటలు సీమాంధ్రులకు వర్తించవా? ముంబైలో ఎన్ని రోజులున్నా గుజరాత్ వాళ్లు కిరాయిదారులే అని అంబేద్కర్ చెప్పిన మాటలు ఎందుకు మర్చిపోయారు? ఉద్యమాలతో రాష్ట్రం ఏర్పాటు కాదంటున్న ముఖ్యమంత్రికి పొట్టిశ్రీరాములు చేసిన పోరాటం, త్యాగం ఎందుకు గుర్తుకు రావట్లేదు? పొట్టి శ్రీరాములు పోరాడకుంటే ఆంధ్రావాళ్లంతా ఇంకా తమిళనాడులోనే ఉండేవారు. యూపీఏ ప్రభుత్వం ఒప్పుకోలేదని, ప్రధాని మన్మోహన్సింగ్ భాగస్వామి కాలేదని కిరణ్ సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. 2009 డిసెంబర్లో కేంద్రం చేసిన ప్రకటన, అంతకుముందు టీఆర్ఎస్తో పొత్తు సంగతి గుర్తులేదా? శ్రీకృష్ణ కమిటీ 23 జిల్లాలు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విడిపోతే ఆంధ్రాకు నష్టం వస్తదని చెప్తాడు తప్ప కలిసి ఉంటే తెలంగాణకు వచ్చే లాభం ఏమిటో ఎందుకు చెప్పలేదు. సమైక్య రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లనే 57 ఏళ్లుగా ఏటా వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా 14 టీఎంసీలతో చిన్న చిన్న కుంటల్లాంటి రిజర్వాయర్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామంటే ఎలా నమ్ముతాం. నదీ జలాల పంపిణీ పెద్ద సమస్య కాదు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు దేశంలో అంతర్భాగమే. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైతే మిగిలిన 28 రాష్ట్రాలకు ఏ నియమాలు వర్తిస్తాయో తెలంగాణకూ అవే వర్తిస్తాయి. జల పంపిణీలు ఎలా ఉన్నాయో తెలంగాణకు అలాగే పంపిణీ అవుతాయి. రోజూ కొట్లాడే పాకిస్థాన్‌తో 5 నదులను పంచుకుంటున్నాం. చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌తోనూ 5 నదులు పంచుకుంటున్నాం. రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకం సాధ్యం కాదా? 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన జీఓ 36 ద్వారా 24 వేల మంది తెలంగాణేతర ఉద్యోగులు, 610 జీఓ ద్వారా 58,956 మంది తెలంగాణేతర ఉద్యోగులు ఉన్నట్టుగా వెల్లడైంది. సకల జనుల సమ్మె సమయంలోనూ 83 శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారని చెప్పడాన్ని బట్టే వారు ఎక్కడివారో స్పష్టమై పోతోంది. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. హైదరాబాద్‌లో 50 వేలమంది సీమాంధ్ర లాయర్లు ఉన్నట్టు చెప్పడం కూడా పచ్చి అబద్ధం. రాష్ట్రం మొత్తం మీద అడ్వొకేట్ల సంఖ్య 75 వేలు. వీరిలో 40 వేల మంది సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో 10-15 వేల మంది మాత్రమే అడ్వొకేట్లు ఉంటే సీమాంధ్రవారు కేవలం 3-4 వేల మంది ఉంటారు. నిజాం హయాంలోనే 1919లో తెలంగాణలో ఆరుగురు జడ్జీలతో హైకోర్టు ఏర్పాటైంది. ఆంధ్రా రాష్ట్రానికి 1954లో హైకోర్టు ఏర్పాటైంది. సీఎం స్థాయిలో ఇంత పచ్చి అబద్ధాలు దారుణంగా మాట్లాడుతుంటే ఆయన దగ్గర పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు. తెలంగాణలో అంధకారం పెద్ద జోక్ తెలంగాణకు విద్యుత్ లేక అంధకారం ఏర్పడుతుందని కిరణ్ అనడం పెద్ద జోక్. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొద్దికాలం విద్యుత్‌కు ఇబ్బంది ఉన్నా ఐదేండ్లలోపే విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది. తెలంగాణకు 4,825 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యముంది. ఆదిలాబాద్, భూపాలపల్లి విద్యుత్ కేంద్రాలు ప్రారంభమైతే లోటు చాలా తక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు బొగ్గు పంపకుండా కేంద్రాన్ని కోరతాం. సింగరేణి ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుని పారిశ్రామిక అభివృద్ధికి కూడా బాటలు వేసుకుంటాం. ఆంధ్రా ప్రాంతానికి 7,400 మెగావాట్లు అవసరముంటే 10,609 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. అక్కడినుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా కొంతకాలం కరెంటును కొంటాం. అసలు బొగ్గు ఉన్న ప్రదేశాల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు పెట్టకుండా రాయలసీమలోనో, విజయవాడలోనో ఎలా పెడతారు? విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో స్నేహపూర్వకంగా ఉండరా? ఇదేనా తెలుగుజాతి ప్రేమ? హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయింది. ఏమైనా సమస్యలుంటే చెప్పుకోవడానికి ఆంటోనీ కమిటీ ఉంది. వైషమ్యాలు, విద్వేషాలు లేకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటే ఇరు ప్రాంతాల వారికి మంచిది.’ -
రగిలిన తెలంగాణ
రాష్ట్ర విభజన ప్రకటనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. సీఎం తెలంగాణ వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు, సీఎం తీరును నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా కిరణ్ వ్యవహరిస్తున్నారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యూస్‌లైన్ నెట్వర్క :వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో టీఆర్ఎస్ యువజన విభాగం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మకు చెప్పులు వేసి హైమాస్ట్ లైట్ స్తంభానికి ఉరివేశారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కురవి, నర్సింహులపేట, పాలకుర్తి, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, పరకాల, గీసుగొండ, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు మండల కేంద్రాల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. ఈ ఆందోళనల్లో టీఆర్ఎస్, కేయూ జేఏసీ, టీజేఏసీ, బీసీ జేఏసీ, టీఎస్‌జేఏసీ, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రెండు ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, చెన్నూరు, నిర్మల్, ఉట్నూర్, కడెం, జన్నా రం, బోథ్, ఇచ్చోడ, దండెపెల్లి, లక్సెట్టిపేట మండలాల్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగురామన్న, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి పాల్గొన్నారు. మందమర్రిలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామగిరిలో టీజేఎస్ఎఫ్, బీడీఎస్ఎఫ్ ఆధ్యర్యంలో సీఎం దిష్టిబొమ్మకు నిప్పుపెట్టారు. కనగల్ మండలంలోని రేగట్టే గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి అనంతరం దహనం చేశారు. నిజామాబాద్ నగరంలో టీఆర్ఎస్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద నాయకులు, కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మకు ఉరివేసి ఊరేగింపు నిర్వహించారు. వేల్పూర్, కామారెడ్డి , నిజామాబాద్ మండలంలోని ధర్మారం(బి)లో, ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మలను కార్యకర్తలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో సీఎం దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు భగ్గుమన్నారు. సీఎం మాటల్లో సీమాంధ్ర ఆధిపత్య ధోరణి కనిపిస్తుందని మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు మదు కాగుల పేర్కొన్నారు. సీఎం తన క్యాంపు ఆఫీసు నుంచే సీమాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారిని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సీమాంధ్ర ప్రాంత ఉద్యమానికి వత్తాసు పలుకుతున్నాడని ఆయనను బర్తరఫ్ చేయాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవ్ డిమాండ్ చేశారు. సీఎం ప్రాంతీయవాదిలా మాట్లాడుతూ అనవసర రాద్దాంతం చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. సీఎంను డిస్మిస్ చేయాలని బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో తెలంగాణ పీఆర్టీయూ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఎదురుగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సదాశివపేట, మెదక్ బస్టాండుల ఎదుట, నంగనూరు మండలం రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద, జోగిపేటలో, అంథోల్ మండలం ఎర్రారం గ్రామంలో, నాందేడ్-అకోలా రహదారిపై గజ్వేల్, వెల్దుర్తిలో, జహీరాబాద్‌లో జేఏసీ నాయకులు సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీఆర్ఎస్, జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోపగాని శ ంకర్రావు, తిప్పన సైదులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, కొత్తగూడెం రుద్రంపూర్‌లో జేఏసీ నాయకులు, పాల్వంచ తెలంగాణ నగర్లో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇల్లెందు పట్టణంలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మధిర నియోజకవర్గం ముదిగొండలో టీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణపై సీఎం వ్యాఖ్యలను రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణవాదులు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఉద్యమకారులను రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలంగాణ జేఏసీ జిల్లా తూర్పు విభాగం కన్వీనర్ సంజీవరావు ధ్వజమెత్తారు. -
సీఎం కిరణ్ వ్యాఖ్యలు దురదృష్టకరం: సుజయకృష్ణ రంగారావు
విజయనగరం: తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. సీమాంధ్ర ప్రాంతాల్లో నిరసనలు, ధర్మాలు, ర్యాలీలతో సమైక్య పోరు రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలంగాణ విభజనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమంటూ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు దురదృషకరమని వైఎస్ఆర్సీపీ నేత సుజయకృష్ణ రంగారావు చెప్పారు. ప్రజాందోళనకు భయపడి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారని ఆయన దుయ్యపట్టారు. మన మధ్యలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని సుజయకృష్ణ రంగారావు చెప్పారు. ఈ విభజనకు ప్రధాన ప్రతిపక్ష నేతే కారణమన్నారు. చిత్తశుద్ది ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు స్పీకర్‌కు సమర్పించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీని ప్రజల నుంచి దూరం చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే వైఎస్‌పై ఆరోపణలని చెప్పారు. ఆంటోని కమిటీ సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి ఏర్పాటు చేసిన కంటి తుడుపు చర్య మాత్రమేనని సుజయకృష్ణ రంగారావు పేర్కొన్నారు. -
రాజకీయ లభ్దికోసమే సీఎం వివరం:మైసూరా
-
ముఖ్యమంత్రివన్నీ అసత్యాలే: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలు, అభూత కల్పనలేనని టీఆర్ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవాలకు సంబంధించిన అన్ని వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రజల ముందుంచుతానని పేర్కొన్నారు. -
నాడు నోరెత్తలేదేం? : మైసూరారెడ్డి
ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన మైసూరారెడ్డి సీడబ్ల్యూసీ ముందు సమస్యలన్నింటినీ వివరించారా? మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా? మీ మాటల్ని ఖాతరు చేయకపోతే మీరెందుకు రాజీనామా చేయలేదు? రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటిపంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయంటున్నారు ఈ సమస్యలన్నీ కొద్దిరోజులుగా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ చెబుతున్నవే విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది? ఇతర పార్టీలవి దొంగనాటకాలంటున్నారు... అసలు మీ నాటకమేమిటి? రాష్ట్రాన్ని విభజిస్తే చాలా ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయి.. రాష్ట్ర విభజన నెపాన్ని వైఎస్‌పై నెట్టడం తగదు రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయని మీకు తెలుసుకదా? మీరు చెప్పినా అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా?.. అయితే మీరెందుకు రాజీనామా చేయలేదు? విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది? రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్ సమస్యలు, ఉద్యోగులు, తదితర అంశాలపై సమస్యలున్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి సీడబ్ల్యూసీ ముందు నోరెందుకు ఎత్తలేదని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం రాత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశానంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అన్ని విషయాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలేమిటో తెలిసే ఉంటుంది. విభజన ప్రకటనకు ముందు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మీరూ పాల్గొన్నారు. అప్పుడు ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావించారా? మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా? అలా చేసుంటే మీరు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుండాల్సింది. కానీ అలా చేయకుండా విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది?’’ అని నిలదీశారు. ఇతర పార్టీలవి దొంగ నాటకాలంటున్న కిరణ్... ఆయన ఆడుతున్న నాటకమేదో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది తాను మంచివాడినని చెప్పుకోవడం కోసమో లేదా ప్రజల ఆగ్రహావేశాలనుంచి పార్టీని కాపాడేందుకో సీఎం కిరణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికే ఆ కమిటీ.. ఆంటోనీ నేతృత్వంలో వేసిన హైలెవెల్ కమిటీకి సమస్యలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి సూచించడాన్ని మైసూరా తప్పుబట్టారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ అత్యున్నత కమిటీ. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సబ్ కమిటీ ఎలా సవరించగలుగుతుంది. యజమాని చేసిన నిర్ణయంపై గుమాస్తా పంచాయతీ చేయగలడా? ఒక పార్టీ వేసుకున్న కమిటీకి మిగతా పార్టీలు అభిప్రాయాలెందుకు చెప్తాయి? ఒకవేళ చెప్పినా చెవికెక్కుతుందా? ఎవరెన్ని చెప్పినా ఆఖరికి వారి అధినేత్రి సోనియా చెప్పిన విషయాలనే రిపోర్టులో పొందుపరుస్తారు’’ అని విమర్శించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య లక్ష్మణరేఖ ఉంటుంది. దాన్ని విస్మరించినట్లు కాంగ్రెస్‌పార్టీ ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. చట్టబద్ధంగా నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికనే తుంగలో తొక్కేసిన వారు ఎలాంటి అధికారాలు లేని ఆంటోనీ కమిటీ సూచనలను పాటిస్తారని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీని నియమిస్తేనే అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు వినిపిస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యనెలా పరిష్కరిస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ చాలాకాలంగా ప్రశ్నిస్తోందని మైసూరా గుర్తుచేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కావేరీ, ఆల్మట్టి జల వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కావడంలేదు. ఈ సమస్యను హైపవర్ కమిటీ ఎలా పరిష్కరిస్తుందని నిలదీశారు. కాంగ్రెస్‌కు పది తలలుంటాయి... కాంగ్రెస్ పార్టీ పది తలల రావణాసురుడులాంటిదని, అందులో ఒక్కో తల ఒక్కొక్క మాట చెబుతోందని మైసూరా ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ తన వైఖరి చెప్పకుండా రాజకీయ దుష్టచింతనతో ప్రవర్తించింది. హోంమంత్రి షిండేతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా రెండు ప్రాంతాల ప్రతినిధులు రెండు రకాలు చెప్పారు. పార్టీ వాదన చెప్పాలని తాము నిలదీస్తే... అధిష్టానం చెప్పేదే అంతిమ నిర్ణయమని షిండే చెప్పారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే సీడబ్ల్యూసీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. దాన్ని చల్లార్చేందుకే కమిటీలంటూ నాటకాలాడుతోంది. తాజాగా సీఎం కిరణ్ మాట్లాడుతూ... విభజన పార్టీకే పరిమితం తప్ప, కేంద్రం నిర్ణయం కాదంటూ ఇరుప్రాంతాల్లో సమస్యను మరింత జఠిలం చేశారు. వారి వాలకం చూస్తుంటే ఎలాంటి నిర్ణయమైనా ముందు, వెన క్కి తీసుకునే సౌలభ్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఓట్లు, సీట్ల కోసమే ఎన్నికల ముందు ఎత్తులు వేస్తున్నారు’’ అని మైసూరా విమర్శించారు. ఇది రాజకీయ లబ్ధికోసం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారని తెలిపారు. మాది ఒకే మాట... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉందని మైసూరా చెప్పారు. ప్లీనరీ నుంచి షిండే ఏర్పాటు చేసిన అఖిలపక్షం వరకు ఒకే మాట చెప్పామని, ఒక తండ్రిలా సమస్యను పరిష్కరించాలని కోరామని వివరించారు. అవేవీ చేయకుండా ఇతరులపై బురద చల్లడం సరైంది కాదన్నారు. నీటి పంపకాలు, రాజధాని, ఉద్యోగులు తదితర అంశాలపై తాము వారం రోజులుగా అనునిత్యం మీడియా సమావేశంలో చెబుతున్న వాటినే సీఎం ప్రస్తావించారని చెప్పారు. రాష్ట్ర విభజన నెపాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై నెట్టడాన్ని మైసూరా తప్పుపట్టారు. ‘‘ఆనాడు ఎమ్మెల్యేలందరూ వెళ్లి సోనియాగాంధీని కలిసినప్పుడు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. రెండోఎస్సార్సీ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. అప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి అదే తీర్మానాన్ని అందజేసింది తప్ప అంతకుమించి మరేమీ జరగలేదు’’ అని మైసూరారెడ్డి వివరించారు. -
రాహుల్‌గాంధీ బృందంలోకి సీనియర్ ఐఏఎస్ కొప్పులరాజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కొప్పులరాజు రాజకీయ తీర్థం పుచ్చుకోనున్నారు. రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం ఇంకా మూడేళ్ల సర్వీసును కూడా ఆయన వదులుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు పెట్టుకోగా.. రాష్ట్రప్రభుత్వం ఆగమేఘాలపై అనుమతి కూడా ఇస్తోంది. రాజు స్వచ్ఛంద పదవీ విరమణకు చెందిన ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సంతకం చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి పదవీ విరమణ అమల్లోకి వచ్చేలా సీఎం ఆమోదముద్ర వేశారు. త్వరలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర కేడర్ 1981 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజు ప్రస్తుతం వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతకుముందు రాజు.. సోనియాగాంధీ అధ్యక్షతనగల జాతీయ సలహామండలి సంయుక్త కార్యదర్శిగా ఢిల్లీలో పనిచేశారు. రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో ఆయన పనిచేశారు. సాగునీటి శాఖ కార్యదర్శిగా, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా, రోశయ్య హయాంలో సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. జాతీయ సలహా మండలిలో పనిచేస్తున్న సమయంలో రాహుల్‌గాంధీకి సన్నిహితంగా రాజు మెలిగేవారు. రాజు పనితీరు నచ్చడంతో రాహుల్‌గాంధీ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. -
‘సమైక్య’ ఆందోళనలపై అధిష్టానం ఆరా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం, కేంద్రం చర్యలతో రాష్ట్రంలో ఏర్పడ్డ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయిస్తోంది. సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనలు, ఉద్యమాలు, వాటి తీవ్రతను ప్రత్యేక దూతల ద్వారా అంచనా వేయిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తిరునావుక్కరసు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నేతలతో చర్చించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో ఆయన భేటీ అయ్యారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో మంత్రులు తోట నరసింహం, పార్థసారథి, బాలరాజు తదితరులు తిరునావుక్కరసుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తెలంగాణపై హడావుడిగా ఏకపక్ష ప్రకటన చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. ఉద్యమం వెనుక రాజకీయశక్తులు ఉన్నట్లుగా తాము భావించడంలేదని, ప్రజల నుంచి అప్పటికప్పుడు స్వచ్ఛందంగా ఈ నిర్ణయంపై అసంతృప్తి పెల్లుబుకుతోందని చెప్పారు. పైగా దాదాపు 60 ఏళ్లపాటు రాష్ట్రానికి రాజధానిగా ఉన్నందున హైదరాబాద్‌తో సీమాంధ్రలోని ప్రతి ఒక్క కుటుంబానికి భావోద్వేగ అనుబంధం ఏర్పడి ఉందని, రాష్ట్ర విభజనను వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. దీనిపై మూడు ప్రాంతాల్లో తలెత్తే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికొక శాశ్వత పరిష్కారాన్ని చూపాల్సి ఉంటుందని వివరించారు. అయితే దీనిపై పార్టీ, కేంద్రప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర ్చలు చేసిందని, రాష్ట్రంలోని దాదాపు అన్ని పక్షాల నేతలు అంగీకరించినందునే నిర్ణయం తీసుకుందని తిరునావుక్కరసు చెప్పారు. సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఏకగ్రీవంగా విభజన నిర్ణయానికి ఆమోదముద్ర వేసి ప్రకటించిన తరుణంలో వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదన్నదే అధిష్టానం అభిప్రాయమని తిరునావుక్కరసు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ ఏర్పాటు చేసిన ఏకే అంటోనీ కమిటీ ముందు వినిపించాలని సూచించారు. ఇదేసమయంలో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలతో హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భద్రతపై సందేహాలు ఏర్పడుతున్నాయని, ఏమాత్రం అవకాశమున్నా నిర్ణయంపై పునఃపరిశీలించాలని నేతలు కోరారు. ప్రభుత్వం తన కార్యక్రమాలను ముమ్మరం చేసి, ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి దూసుకుపోతోందని, ప్రజల నుంచి కూడా ఆదరణ లభిస్తోందని, ఇందుకు ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు అత్యధిక సంఖ్యలో గెలవడమే రుజువని మంత్రి బాలరాజు తిరునావుక్కరసుకు వివరించారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాలు విద్య, వైద్యం తదితర అంశాల్లో బాగా వెనుకబడి ఉన్నాయని, విభజనతో మరింత అధ్వానమవుతాయని తెలిపారు. నేను సమైక్యవాదినే : బాలరాజు తాను సమైక్యవాదినేనని, అయితే పార్టీ కార్యకర్తగా అన్ని ప్రాంతాలకు సరైన న్యాయం జరిగేలా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని నమ్ముతున్నానని మంత్రి బాలరాజు పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో చేసిన తీర్మానాన్ని మన్నించి కేంద్రం, పార్టీ అధిష్టానం పునఃపరిశీలించాలని కోరామన్నారు. తెలంగాణకు అనుకూలమని ఇతర పార్టీలు లేఖలు ఇచ్చి, ఇప్పుడు కేంద్రంపై, కాంగ్రెస్‌పై నిందలు మోపడం సరికాద న్నారు. టీడీపీ నేత చంద్రబాబు తెలంగాణకు ఓకే అని చెప్పి పార్లమెంటులో ఎంపీలతో ఆందోళనలు చేయించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఏదైనా నిర్ణయం తీసుకోమని చెప్పి కాంగ్రెస్‌ను నిందించడం దారుణమన్నారు. -
రాష్ట్రం రగిలిపోతుంటే నోరెత్తరేం ? : శోభా నాగిరెడ్డి
కిరణ్, చంద్రబాబులపై శోభా నాగిరెడ్డి ధ్వజం బాధ్యతను మరచి మొహం చాటేస్తున్నారు నోరెత్తితే సీటు లాగేస్తారని కిరణ్‌కు భయం కేసులు రాకుండా ఉండేందుకే బాబు మౌనం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన కేంద్ర మంత్రులు సెంటిమెంట్ ఒక ప్రాంతానికే పరిమితం కాదు తెలుగువారి భవిష్యత్తు ఆంటోనీ, దిగ్గీల చేతిలోనా? ఇదేమీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదు జగన్‌ను అభిమానిస్తున్నారని చిచ్చు పెట్టారు కేసీఆర్ విద్వేష ప్రసంగాలు హరీశ్‌కు గుర్తు రాలేదా? సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతం ఉద్యమాలతో రగిలిపోతున్నా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు మాత్రం ప్రజలకు ముఖం చాటేశారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ ఇద్దరూ ‘కనబడుటలేదు’ అని ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కిరణ్, బాబు వైఖరిపై మండిపడ్డారు. ‘‘సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే... ఆ ప్రాంతానికే చెందిన కిరణ్, బాబు ప్రజల ముందుకు వచ్చి వారిని సమాధానపర్చకుండా అజ్ఞాతం (అండర్‌గ్రౌండ్)లోకి వెళ్లి పోయారు. నోరెత్తి మాట్లాడితే ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తొలగిస్తారని కిరణ్ భయపడుతున్నారు. తనపై కేసులు రాకుండా చూసుకునేందుకు, ఆస్తులు కాపాడుకునేందుకే బాబు కిమ్మనడం లేదు. సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నా వీరు పట్టించుకోవడం లేదు’’ అని దుయ్యబట్టారు. ప్రతి చిన్న విషయానికి వేలు చూపుతూ, ఎదుటివారిని బెదిరించే విధంగా ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడే చంద్రబాబు ఇంత పెద్ద సమస్య రాష్ట్రంలో రగులుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఆవేశం ఏమైంది? వేలెత్తి ఎందుకు మాట్లాడ్డంలేదని శోభ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించి పోలవరంకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించినప్పుడు, రాయలసీమ ప్రాంతానికి ఏమిచ్చారని బాబు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఇవన్నీ ఆ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇక సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తమ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా బొమ్మల్లాగా కూర్చున్నారని దుయ్యబట్టారు. మరో ఆరు నెలలు మాత్రమే ఉండే పదవుల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. సమైక్యంగా ఉంచాలన్న వాంఛ ప్రజల్లో ఇంత బలీయంగా ఉంటుందని విభజన నిర్ణయం వెలువడిన తరువాతనే తమకు తెలిసిందని పళ్లంరాజు చెప్పడం దారుణమన్నారు. ‘‘సెంటిమెంట్ ఒక ప్రాంతానికే పరిమితమనుకున్నారా... మరో ప్రాంతంలో ఉండదనుకున్నారా? మంత్రి పదవి పోతుందనే భయంవల్ల మీకు సెంటిమెంట్ లేకపోవచ్చు, కానీ సామాన్య ప్రజలకు మనోభావాలు బలీయంగా ఉంటాయి’’ అని చెప్పారు. పార్లమెంట్లో కాంగ్రెస్, టీడీపీ ఎంపీలది డ్రామా కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న హడావుడిని ఒక డ్రామా అని శోభా నాగిరెడ్డి అభివర్ణించారు. సీమాంధ్రులకు అన్యాయం చేస్తూ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఉద్యమాలంటూ డ్రామాలు చేయడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయం వెలువడిన రెండోరోజే 4, 5 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మరో రాజధాని నిర్మించుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారని, మళ్లీ ఆ పార్టీకి చెందిన ఎంపీలే పార్లమెంటులో నిరసన డ్రామా చేస్తున్నారని విమర్శించారు. వీరంతా ఇపుడు డ్రామాలు చేసే కంటే విభజన ప్రకటన వెలువడటానికి ముందే రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు కదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమతో చర్చించడానికి ఏకే ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్‌లతో ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రులు చెబుతుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. 12 కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది వీళ్లిద్దరా? వాళ్లెవరు... మనపై నిర్ణయం తీసుకోవడానికి? ఇదేమీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదని, కోట్లమంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని చెప్పారు. సమన్యాయం చేయకుండా రాష్ట్ర విభజన చేస్తామనడం సరికాదన్నారు. రాష్ట్రంలో నదీజలాలతో పాటుగా ఉన్న అనేక జటిలమైన సమస్యలను పట్టించుకోకుండా కేవలం 15, 16 లోక్‌సభ స్థానాల కోసం, రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ ఈ విభజన నిర్ణయం తీసుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. రాహుల్‌ని ప్రధాని చేయడంకోసమే విభజన: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత మూడు ప్రాంతాల ప్రజలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఆదరిస్తున్నారన్న నిజాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయిందని, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వైఎస్‌పై ఉన్న అభిమానాన్ని జగన్‌పై చూపిస్తున్నారనే కోపంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం కోసం రెండు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టిందని చెప్పారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో ఏమీ జరక్కుండా రక్షణ కల్పిస్తామని కొందరు తెలంగాణ మంత్రులు చెప్పడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ‘‘మీరెవరు మాకు రక్షణ కల్పించడానికి? మిమ్మల్ని సీమాంధ్రులేమైనా అడుక్కున్నారా రక్షణ కల్పించమని? మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం సీమాంధ్రులకు లేదు. ఇక్కడ మీకు ఎంత హక్కు ఉందో మాకూ అంతే హక్కుంది. మా హక్కును పోరాడి సాధిస్తాం’’ అని స్పష్టంచేశారు. సీమాంధ్రను అభివృద్ధి చేస్తామని ఢిల్లీ నేతలు చెబుతున్నారని, కొత్తగా ఏర్పడిన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిందేనని ఆక్షేపించారు. రాజకీయ లబ్ధికోసం రాష్ట్రంలో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. షర్మిల ఇచ్ఛాపురం సభలో మాట్లాడిన మాటలను తప్పుపడుతున్న టీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు అంతకుముందు కేసీఆర్ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాలు గుర్తుకు రాలేదా? అని శోభ ప్రశ్నించారు. ‘‘సీమాంధ్రులను అవమానిస్తూ కేసీఆర్ ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఎవరికి తల్లి అని తెలుగుతల్లిని కూడా కించపరిచింది మరిచారా? జాగో, భాగో అని మాట్లాడలేదా? మీ మాటల్లో తప్పు లేదు కానీ, షర్మిల మాట్లాడితేనే తప్పుగా కనిపించిందా?’’ అని నిలదీశారు. తెలంగాణ రాకముందే ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగానే షర్మిల ప్రజలకు భరోసాగా అలా మాట్లాడారు తప్ప ఇతర ఉద్దేశాలు ఏమీ లేవని ఆమె వివరించారు. -
ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళతా: సీఎం కిరణ్
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు సీఎం హామీ సాక్షి, హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధి బృందాన్ని తన నేతృత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ నేతృత్వంలో డి.మురళీమోహన్, వెంకటసుబ్బయ్య, కృష్ణయ్య, ఏడుకొండలు, రవీందర్, బెన్సన్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. ఉద్యోగుల అంశాన్ని కనీసం పరిగణనలోనికి కూడా తీసుకోకపోవడం వల్లే తమకు బాధ కలిగిందని ఉద్యోగులు ఆయనకు వివరించారు. తమ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, తమ బాధను, సీమాంధ్రుల వాణిని ఢిల్లీ పెద్దలకు వివరిస్తామని కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఢిల్లీకి వెళ్లే ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించడానికీ సమ్మతించారు. త్వరలో తేదీ నిర్ణయించి తెలియజేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.