
సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనం: జైపాల్‌రెడ్డి
పాలమూరు (మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం శిలా శాసనం లాంటిదని, ఎన్ని ఉద్యమాలు పుట్టుకొచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేవని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. తాను ప్రాంతాల పేరుతో ప్రజలను నిందించబోనని, సీమాంధ్ర నాయకుల వైఖరి కారణంగానే తెలంగాణలో సమస్య తలెత్తిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు జాతీయ స్థాయిలో బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, ఇతర పార్టీలు అనుకూలంగా ఉన్నాయన్నారు.
శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక రాష్ట్రం ఏర్పాటు విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సునిశితంగా చర్చలు, సమీక్షలు, పరిశీలనల అనంతరమే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పెద్ద పదవిలో ఉన్న ఒక వ్యక్తి అధిష్టానం ముందు వారు చెప్పిన మాట విని, ఆ తర్వాత ఒక ప్రాంతం వారిని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేయడం తగదంటూ పరోక్షంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని విమర్శించారు. విభజనపై కేంద్రం తన నిర్ణయాన్ని పక్కన పెట్టాలన్న కుతంత్రంతోనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రరాష్ట్రంలో కలిసి ఉండటం కుదరదనే ఉద్దేశంతో.. 2004లోనే టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించినట్లు వెల్లడించారు. అప్పుడే సోనియాగాంధీకి ఈ ప్రాంతంపై అవగాహన కలిగి, అభిమానం ఏర్పడిందని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు 2004లోనే ప్రధాని మన్మోహన్‌సింగ్ చెప్పారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ఫిబ్రవరి 12న తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించారన్నారు. సీమాంధ్రులను అమాంతంగా హైదరాబాద్ వదిలి వెళ్లమని ఎవరూ చెప్పడం లేదంటూ.. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల వరకు ఇక్కడే ఉండేందుకు అవకాశం కల్పించిన విషయం గుర్తు చేశారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్నందునే హైదరాబాద్ తమకు కావాలంటున్నామని చెప్పారు.