సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే పీసీసీ నివేదిక! | PCC to give report according to cwc resolution! | Sakshi
Sakshi News home page

సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే పీసీసీ నివేదిక!

Published Tue, Nov 5 2013 3:57 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

PCC to give report according to cwc resolution!

విభజనను అంగీకరిస్తూనే సీమాంధ్ర, తెలంగాణ సమస్యలను ప్రస్తావించనున్న పీసీసీ చీఫ్
 సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గ బృందానికి(జీవోఎం) సమర్పించే నివేదికలో ఏయే అంశాలను పొందుపర్చాలనే దానిపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే అంశాన్ని ఆ నివేదికలో చేర్చాలని సీమాంధ్ర నేతలు చెబుతుండగా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ జీవోఎంకు ఇచ్చే నివేదికలో సమైక్య ఊసే ప్రస్తావించొద్దని తెలంగాణ నేతలు పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బొత్స రూపొందించే నివేదిక ఆసక్తికరంగా మారింది. పీసీసీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలను కూడా నివేదికలో పొందుపర్చాలని బొత్స భావిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ అదే కాంగ్రెస్ నిర్ణయమని చెప్పడంతోపాటు విభజనవల్ల తలెత్తే సమస్యల పరిష్కారానికి కేంద్రం కృషి చేయాలని కోరనున్నట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సోమవారం సమావేశమైన అనంతరం బొత్స ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు.
 
 నేడు ఢిల్లీ వెళ్లనున్న బొత్స!
 పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు. ఢిల్లీ పెద్దలను కలిసి ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలను వివరించడంతోపాటు వారి సూచనలకు అనుగుణంగా నివేదికను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. నెల రోజులుగా తలెత్తిన పరిణామాలపై హైకమాండ్ పెద్దలకు వివరించనున్నారు.
 
 జైపూర్ సదస్సులోనే విభజన గురించి చెప్పారు
 రాష్ట్ర విభజన వ్యవహారంపై దాదాపు ఏడాది ముందుగానే పార్టీ అధిష్టానం పెద్దలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, తనకు సమాచారమిచ్చారని పీసీసీ అధ్యక్షుడు బొత్స వెల్లడించారు. రాయలసీమకు చెందిన సీనియర్ నేతలు కొందరు ఆదివారం రాత్రి బొత్సను కలిశారు. రాష్ట్ర విభజన చేస్తున్నట్లుగా  జైపూర్‌లో  నిర్వహించిన ఏఐసీసీ చింతన్ శిబిర్ సమయంలోనే తమకు స్పష్టంగా చెప్పారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement