విభేదాలను వాడుకోడానికే కిరణ్ కొత్త పార్టీ: బొత్స | kiran kumar reddy wants to encash differences in people, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

విభేదాలను వాడుకోడానికే కిరణ్ కొత్త పార్టీ: బొత్స

Published Sat, Mar 1 2014 3:47 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

విభేదాలను వాడుకోడానికే కిరణ్ కొత్త పార్టీ: బొత్స - Sakshi

విభేదాలను వాడుకోడానికే కిరణ్ కొత్త పార్టీ: బొత్స

విభజన అనంతరం రెండు రాష్ట్రాల పీసీసీల విషయాన్ని అధిష్ఠానం రెండు రోజుల్లో తేలుస్తుందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు. రెండు రాష్ట్రాలకు వేరువేరు పీసీసీలా, రెండు ప్రాంతీయ కమిటీలా లేక ఒక్క పీసీసీ కిందే రెండు పీసీలల అనే విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీయేనని, అయితే తెలంగాణ వచ్చింది కాబట్టి అది కాంగ్రెస్‌లో విలీనమవుతుందా, లేక రాజకీయ పార్టీగా కొనసాగుతుందా అనే విషయాన్ని టీఆర్‌ఎస్ పెద్దలే చెప్పాలని అన్నారు. విలీనం అంశం హైకమాండ్‌ పరిధిలోనిదని, దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు  చేయలేనని తెలిపారు.

జైరామ్‌ రమేష్‌ టీఆర్‌ఎస్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాని కేసీఆర్‌ మాత్రం జైరామ్ రమేష్ ను కించపరిచేలా మాట్లాడడం సరికాదని బొత్స అన్నారు. ఎన్నికల ముందు రాజకీయ వలసలు సహజమేనని, అయితే కాంగ్రెస్‌ నుంచి వలసలను ప్రోత్సహిస్తూ  టీడీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం సీమాంధ్రకు ఇచ్చిన ప్యాకేజీని ప్రజల్లోకి తీసుకెళ్లి విభజన వల్ల సీమాంధ్రకు మేలే జరిగిందని చెబుతామన్నారు. ప్రజల్లో ఉన్న తాత్కాలిక విభేదాలను రాజకీయాల్లో వాడుకునేందుకు కిరణ్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నట్లు బొత్స ఆరోపించారు.

ఇక సీమాంధ్రలోని నాలుగు జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు కొత్త ఇంచార్జులను నియమించినట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. పశ్చిమగోదావరికి ఎం.వెంకటేశ్వరరావు (రత్నం), నెల్లూరుకు ధనుంజయరెడ్డి, చిత్తూరుకు వేణుగోపాలరెడ్డి, అనంతపురానికి మాజీ ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డిలను నియమించామన్నారు. ఈనెల 5వ తేదీ ఉదయం11 గంటలకు గాంధీభవన్‌లో సీమాంధ్ర డీసీసీ, సీసీసీ అధ్యక్షులు ఆప్రాంత బేరర్లతో సమావేశం ఉంటుందని, ఆ సందర్భంగా సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో సమాలోచన చేయనున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement