పెద్దవాళ్లమనిపించుకోడానికే విమర్శలు: కన్నా
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పదవులన్నీ అనుభవించి చివర్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, పార్టీకి రాజీనామా చేయడం కిరణ్‌కుమార్‌రెడ్డికి తగదని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. మూడేళ్లకు పైగా సీఎం పదవిలో సంతోషంగా కాలం వెళ్లబుచ్చి ఇప్పుడు కాంగ్రెస్‌పై బురదచల్లడం సరికాదన్నారు. పార్టీలోని సీనియర్ నేతలతో సహ ప్రతీ కార్యకర్త కాంగ్రెస్‌లోనే కొనసాగుతారన్నారు.పార్టీని వీడివెళ్లే ఆలోచనలను ఎవరూ పెట్టుకోరాదని చెప్పారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ సోనియాగాంధీపై, కాంగ్రెస్ పార్టీపై వస్తున్న విమర్శలను ఖండించారు. పెద్దవారిని విమర్శించడం ద్వారా తామూ పెద్దవారమనిపించుకోవచ్చనే జేసీ దివాకర్‌రెడ్డి అధినేత్రి సోనియాగాంధీపై విమర్శలు చేస్తున్నారని పార్టీలో ఎదిగి, అనేక పదవులు కూడా అనుభవించి ఇప్పుడిలా పార్టీ నేతనే విమర్శించడం పెద్దరికమనిపించుకోదని హితవు పలికారు. సోనియాపై వ్యక్తిగత విమర్శలకు దిగడం రాజకీయంగా దిగజారుడుతనమేనన్నారు. అధికారం కోసం సోనియా గాంధీ ఏనాడూ పాకులాడలేదని, కాంగ్రెస్ శ్రేణులన్నీ ఆమె నాయకత్వాన్ని కోరుకోవడం వల్లనే పార్టీ పగ్గాలు చేపట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని జేసీ మరిచిపోకూడదన్నారు. అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ప్రపంచంలోనే అగ్రశ్రేణి నేతగా సోనియా ఎదిగారని చెప్పారు. అలాంటి నాయకురాలిపై జేసీ విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మేయడమే అవుతుందన్నారు.
కాపుల్ని బీసీల్లో చేర్చాలని సోనియాకు వినతి
కాపులను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ సోనియాకు వినతిపత్రాన్ని సమర్పించినట్టు కన్నా తెలిపారు. శనివారం ఉదయం 10-జన్‌పథ్‌లో సోనియాతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీ జాబితాల్లో చేర్చాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉందనే విషయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ విన్నపంపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. ఇప్పటి వరకు కాపుల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని, ఈ విషయంలోనూ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రపతి పాలనపై మాట్లాడారా అని ప్రశ్నించగా రాజకీయాల గురించి మాట్లాడలేదని కన్నా సమాధానమిచ్చారు.