కిరణ్ రాజీనా? రాజీనామానా? | Will Kiran Kumar reddy resign or Compromise with Congress over State bifurcation | Sakshi
Sakshi News home page

కిరణ్ రాజీనా? రాజీనామానా?

Published Thu, Feb 13 2014 2:20 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్ రాజీనా? రాజీనామానా? - Sakshi

కిరణ్ రాజీనా? రాజీనామానా?


 ఊగిసలాటలో కిరణ్: సన్నిహితులు
 ఆయన తీరుపై సీనియర్ల పరోక్ష విమర్శలు
 ఆయన వెంట నలుగురు మంత్రుల కంటే ఉండరని అంచనాలు
 కిరణ్ కొత్త పార్టీపైనా వీడని సందేహాలు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారా? లేక కాంగ్రెస్ అధిష్టానంతో రాజీపడి మిన్నకుంటారా? అదీ కాకుంటే పార్టీ వ్యూహంలో భాగంగా ఈ రెండూ కలిసే జరుగుతాయా? కొద్ది రోజులుగా కిరణ్ తీరు అర్థం కాక ఆయన అనుచర నేతల్లో ఇలాంటి అనేక అంశాలపై తీవ్ర అయోమయం నెలకొంది. కిరణ్‌లో ఎంత ఊగిసలాట ధోరణి ఉందో, రాజీనామాపై ఆయన ఏం చేయనున్నారనే విషయంపైనా అంతే విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి! రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో పలురకాల చర్చ సాగుతోంది. ముందుగా ప్రకటించిన మేరకు... పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే రాజీనామాకు కిరణ్ సిద్ధంగా ఉన్నారని ఇప్పటిదాకా చెప్పిన ఆయన అనుకూల వర్గం ఇప్పుడలా గట్టిగా అనలేకపోతోంది. ఆయన రాజీనామా చేస్తారా, హైకమాండ్‌తో రాజీ పడతారా అన్న అనుమానాలు వారిలో తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఆరుగురు పార్టీ ఎంపీలపై హైకమాండ్ వేటు వేయడంతో రాజీనామా చేయడానికే కిరణ్ నిర్ణయించుకున్నారని కొందరు, పార్లమెంటులో బిల్లు పెట్టడంతో కాదని, అది ఆమోదం పొందుతుందా లేదా అన్నదాన్ని బట్టే రాజీనామా ఉంటుందని మరికొందరు అంటున్నారు.
 
 అనుచరుల్లోనూ అయోమయం: విభజనను అడ్డుకోవడానికి తన వద్ద బ్రహ్మాస్త్రముందన్న కిరణ్ చివ రకు మౌనం దాల్చడంతో ఆయన మనోగతమేమిటో అంతుచిక్కక అనుచర వర్గం కూడా అయోమయపడుతోంది. విభజన ప్రక్రియ చిట్టచివరి దశకు చేరుకుని, అంతా చేతులు దాటిపోతున్నా కిరణ్ మిన్నకుండటంతో ఇదంతా అధిష్టానం ఆడిస్తున్న డ్రామాలో భాగమేనన్న చర్చ కూడా పార్టీలో గట్టిగానే సాగుతోంది. విభజన కు వ్యతిరేకంగా పార్టీ నేతలు ఆందోళనలకు, రాజీనామాలకు దిగకుండా నివారించేందుకే కిరణ్ ఇంతకాలం వ్యూహాత్మకంగా ఈ డ్రామా నడిపించారని చర్చ సాగుతోంది. వారి రాజీనామాలతో ప్రభుత్వం కూలడం, రాజకీయ సంక్షోభం రావడం, విభజన నిర్ణయం అమలులో ఇబ్బందులు తదితరాలను పరిహరించేందుకే ఆయన అడుగడుగునా ‘బ్రహ్మాస్త్రం’ అంటూ ఊరిస్తూ వచ్చారని, బిల్లును అడ్డుకుని తీరతానంటూ భ్రమల్లో ఉంచారని నేతలు వాపోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. సీడబ్ల్యూసీ నిర్ణయమప్పుడే తామం తా రాజీనామా చేయకపోవడం చారిత్రక తప్పిదమని, ఇప్పుడు రాజీనామా చేసినా లాభముండదని ఆయనన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం రాజీనామా చేయబోరని స్పష్టం చేశారు. సీఎం రాజీనామా చేస్తారనుకోవడం లేదని మరో సీనియర్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా వ్యాఖ్యానించారు. సీఎం రాజీనామా చేయరని, చేసినా ఆయన వెంట వెళ్లేవారు నలుగురైదుగురికి మించబోరని మరో ముఖ్య నేత విశ్లేషించారు.

‘శైలజానాథ్, పితాని సత్యనారాయణ, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు మాత్రమే ఆయన వెంట వెళ్లొచ్చు’ అంటూ జిల్లాలవారీగా విశ్లేషించి మరీ చెప్పారు. ఎమ్మెల్యేల్లో 10 మందికి మించి సీఎం వెంట వెళ్లరన్నారు. రాజీనామా చేయాలా, కొత్త పార్టీ పెట్టాలా, జనం ఆదరిస్తారా, రాజకీయంగా నిలదొక్కుకుంటామా అంటూ అనుమానాలతో కిరణ్ సతమతమవుతున్నారని, అది చూసి ఆయన అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. పార్టీ నడిపేందుకు ఆర్థిక దన్నుగా ఎవరుంటారు, దీనిపై అధిష్టానం కచ్చితమైన భరోసా ఇస్తుందా అనేవన్నీ స్పష్టం కాకుండా కిరణ్ ముందుకెళ్లబోరని కొందరంటున్నారు. కిరణ్ రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటు రెండూ అధిష్టానం ఆదేశిస్తేనే తేలతాయని పీసీసీ ముఖ్య నేత ఒకరు బుధవారం అసెంబ్లీ లాబీల్లో అన్నారు. ‘తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు రాదు. వచ్చినా ఆమోదం పొందదు. 2014 ఎన్నికల దాకా కిరణే సీఎంగా ఉంటారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.
 
 తీవ్ర చర్యలు..పితాని: సమైక్యమన్నందుకు ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను కాంగ్రెస్ నుంచి బహిష్కరించడం కిరణ్‌ను తీవ్రంగా కలచివేసిందని పితాని అన్నారు. రాజీనామా వంటి తీవ్ర నిర్ణయాలు తప్పకుండా ఉంటాయని చెప్పారు. రాజీనామాతో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక వేదికపైనా ఆలోచనలు సాగుతున్నాయని శైలజానాథ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహముందని, ఆ పార్టీ తరఫున పోటీ చేయొద్దని తమకు నేరుగానే చెబుతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. సీఎం రాజీనామా సందిగ్థంలో ఉందన్నారు. కిరణ్ మాత్రం తన వైఖరిపై పార్టీ నేతల ముందు గానీ, తనను కలిసిన మీడియాతో కానీ పెదవి విప్పలేదు. బుధవారం అసెంబ్లీకి వచ్చి కూడా సభ వైపు తొంగి చూడలేదు. తన  చాంబర్లోనే కూర్చొని వరుసపెట్టి ఫైళ్లపై సంతకాలు చేయడంలో నిమగ్నమయ్యారు. తన వద్దకు క్యూ కట్టిన ఎమ్మెల్యేలతో కూడా సంతకాలు చేస్తూనే క్లుప్తంగా మాట్లాడారు. చివర్లో బయటకు వెళ్తున్నప్పుడు మీడియా కదిలించినా, ‘‘రేపు కదా ఆఖరు. చిట్‌చాట్ (మాటామంతి) రేపు చేద్దాం. నేడు చిట్టీలు (పత్రాలపై సంతకాలు) రేపు చిట్‌చాట్ ’’ అంటూ వెళ్లిపోయారు.
 
 పేరు ‘జై సమైక్యాంధ్రప్రదేశ్’, గుర్తు ‘చెప్పు’!
 
 కొత్త పార్టీకి కిరణ్ ఏర్పాట్లు పూర్తిచేశారని, పార్టీ పేరు కూడా ఇప్పటికే రిజిస్టరైందని ఆయన సన్నిహిత ఎమ్మెల్సీ ఒకరు చెప్పారు. దాని పేరు ‘జై సమైక్యాంధ్రప్రదేశ్ పార్టీ’ అని, గుర్తు ‘చెప్పు’ అని వివరించారు. ఈ గుర్తును గట్టి ప్రయత్నం చేసి మరీ సాధించారని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన వారిని చెప్పుదెబ్బ కొట్టాలంటూ పిలుపునిచ్చేందుకు దాన్ని ఎంచుకున్నారని తెలిపారు. కొత్త పార్టీ గురించి తమకిదివరకే సమాచారముందని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రి ఒకరన్నారు. అయితే సీఎం రాజీనామా చేస్తారని తాను భావించడం లేదన్నారు. ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ పెట్టినా దాన్ని జనం విశ్వసించే పరిస్థితి ఉండ బోదన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement