'ఇదేదో ఆర్నెల్ల కిందే చేస్తే బాగుండేది'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ ముగింపు దశలో ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా విభజన ప్రక్రియపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన సోమవారం మీడియా చిట్చాట్లో వ్యాఖ్యానించారు. దీనివల్ల ఎలాంటి సమైక్య క్రెడిట్ రాదని బొత్స అన్నారు. ఈ రాజీనామా ఏదో ఆరు నెలల కిందే చేసి వుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సీడబ్ల్యూసీ, వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసి వుంటే ఏమైనా ప్రభావం ఉండేదన్నారు. ఎన్నికల్లో ముందుండి నడిపించే సీఎం ఇప్పుడు బాధ్యత విస్మరించటం సరికాదని బొత్స పేర్కొన్నారు. కిరణ్ కాంగ్రెస్ పార్టీని వీడరనుకుంటున్నానని ఆయన అన్నారు. కేబినెట్ సమావేశానికి తెలంగాణ మంత్రులు వచ్చి ఉంటే బాగుండేదని బొత్స అభిప్రాయపడ్డారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం రాజీనామా వార్తలు ఊపందుకున్నాయి.