హైకోర్టుకు సాధారణ పరిపాలన శాఖ అభ్యర్థన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు చేసిన 38 రోజుల సమ్మె కాలాన్ని ఆర్జిత సెలవులు (ఈఎల్స్)గా పరిగణించేందుకు అనుమతి ఇవ్వాలని సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే సిన్హా బుధవారం మిస్సెలనీయస్ పిటిషన్ (ఎంపీ) దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఒకటీ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2011లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ‘నో వర్క్ నో పే’ అంటూ జీవో నం.177 జారీ చేసిందని సిన్హా ఈ ఎంపీలో ప్రస్తావించారు.
అయితే తరువాత సమ్మె కాలానికి వేతనం ఇవ్వాలన్న తెలంగాణ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం దాన్ని సవరిస్తూ జీవో నం. 1,617ను జారీ చేసిందని తెలిపారు. దాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన గొల్ల యాదయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... జీవో 1,617ను కొట్టివేసిందని ప్రస్తావించారు. జీవో 177 అమల్లోనే ఉంటుందని ఆ సందర్భంగా కోర్టు స్పష్టం చేసిందని నివేదించారు. అయితే తెలంగాణ ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె కాలాన్ని ఈఎల్స్‌గా పరిగణించేందుకు అనుమతి కోరగా... హైకోర్టు అనుమతించిందని వివరించారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగులు చేసిన సమ్మె కాలాన్నీ ఆవిధంగానే పరిగణించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సిన్హా అభ్యర్థించారు.
‘సమ్మె’ కాలాన్ని ఈఎల్స్‌గా లెక్కిస్తాం
Published Thu, Nov 28 2013 1:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement