సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె చేసిన ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్లకు, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం వేర్వేరుగా ఉత్తర్వులు (జీవో 114, 904) జారీ చేశారు. డిగ్రీ కాలేజీల్లో సిబ్బంది సమ్మె చేసిన 24 రోజులకు (సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 10 వరకు) బదులు సెలవు దినాల్లో పని చేసేందుకు ఒప్పందం చేసుకున్నందున సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో పని చేసే సిబ్బందికి కూడా ఈ ఉత్తర్వు వర్తిస్తుందన్నారు. సాంకేతిక విద్యా శాఖలో సమ్మె చేసిన 25 రోజులకు (సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 11 వరకు) కూడా వేతనాలు చెల్లించాలని ఆ శాఖ నిర్ణయించింది.