సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం, కేంద్రం చర్యలతో రాష్ట్రంలో ఏర్పడ్డ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయిస్తోంది. సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనలు, ఉద్యమాలు, వాటి తీవ్రతను ప్రత్యేక దూతల ద్వారా అంచనా వేయిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తిరునావుక్కరసు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నేతలతో చర్చించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో ఆయన భేటీ అయ్యారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో మంత్రులు తోట నరసింహం, పార్థసారథి, బాలరాజు తదితరులు తిరునావుక్కరసుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తెలంగాణపై హడావుడిగా ఏకపక్ష ప్రకటన చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు.
ఉద్యమం వెనుక రాజకీయశక్తులు ఉన్నట్లుగా తాము భావించడంలేదని, ప్రజల నుంచి అప్పటికప్పుడు స్వచ్ఛందంగా ఈ నిర్ణయంపై అసంతృప్తి పెల్లుబుకుతోందని చెప్పారు. పైగా దాదాపు 60 ఏళ్లపాటు రాష్ట్రానికి రాజధానిగా ఉన్నందున హైదరాబాద్‌తో సీమాంధ్రలోని ప్రతి ఒక్క కుటుంబానికి భావోద్వేగ అనుబంధం ఏర్పడి ఉందని, రాష్ట్ర విభజనను వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. దీనిపై మూడు ప్రాంతాల్లో తలెత్తే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికొక శాశ్వత పరిష్కారాన్ని చూపాల్సి ఉంటుందని వివరించారు. అయితే దీనిపై పార్టీ, కేంద్రప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర ్చలు చేసిందని, రాష్ట్రంలోని దాదాపు అన్ని పక్షాల నేతలు అంగీకరించినందునే నిర్ణయం తీసుకుందని తిరునావుక్కరసు చెప్పారు. సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఏకగ్రీవంగా విభజన నిర్ణయానికి ఆమోదముద్ర వేసి ప్రకటించిన తరుణంలో వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదన్నదే అధిష్టానం అభిప్రాయమని తిరునావుక్కరసు స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ ఏర్పాటు చేసిన ఏకే అంటోనీ కమిటీ ముందు వినిపించాలని సూచించారు. ఇదేసమయంలో టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలతో హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భద్రతపై సందేహాలు ఏర్పడుతున్నాయని, ఏమాత్రం అవకాశమున్నా నిర్ణయంపై పునఃపరిశీలించాలని నేతలు కోరారు. ప్రభుత్వం తన కార్యక్రమాలను ముమ్మరం చేసి, ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి దూసుకుపోతోందని, ప్రజల నుంచి కూడా ఆదరణ లభిస్తోందని, ఇందుకు ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు అత్యధిక సంఖ్యలో గెలవడమే రుజువని మంత్రి బాలరాజు తిరునావుక్కరసుకు వివరించారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాలు విద్య, వైద్యం తదితర అంశాల్లో బాగా వెనుకబడి ఉన్నాయని, విభజనతో మరింత అధ్వానమవుతాయని తెలిపారు.
నేను సమైక్యవాదినే : బాలరాజు
తాను సమైక్యవాదినేనని, అయితే పార్టీ కార్యకర్తగా అన్ని ప్రాంతాలకు సరైన న్యాయం జరిగేలా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని నమ్ముతున్నానని మంత్రి బాలరాజు పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో చేసిన తీర్మానాన్ని మన్నించి కేంద్రం, పార్టీ అధిష్టానం పునఃపరిశీలించాలని కోరామన్నారు. తెలంగాణకు అనుకూలమని ఇతర పార్టీలు లేఖలు ఇచ్చి, ఇప్పుడు కేంద్రంపై, కాంగ్రెస్‌పై నిందలు మోపడం సరికాద న్నారు. టీడీపీ నేత చంద్రబాబు తెలంగాణకు ఓకే అని చెప్పి పార్లమెంటులో ఎంపీలతో ఆందోళనలు చేయించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఏదైనా నిర్ణయం తీసుకోమని చెప్పి కాంగ్రెస్‌ను నిందించడం దారుణమన్నారు.
‘సమైక్య’ ఆందోళనలపై అధిష్టానం ఆరా
Published Wed, Aug 7 2013 5:41 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
Advertisement
Advertisement