అన్నీ పచ్చి అబద్ధాలే: కేసీఆర్ | KCR says, kiran kumar reddy's mental condition not well | Sakshi
Sakshi News home page

అన్నీ పచ్చి అబద్ధాలే: కేసీఆర్

Published Sat, Aug 10 2013 2:29 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

అన్నీ పచ్చి అబద్ధాలే: కేసీఆర్ - Sakshi

అన్నీ పచ్చి అబద్ధాలే: కేసీఆర్

 కిరణ్‌కుమార్‌రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదు  
 ముఖ్యమంత్రిపై కేసీఆర్ ధ్వజం

 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజన విషయంలో పూర్తిగా అసత్యాలు, పసలేని, పనికిరాని మాటలు మాట్లాడారని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. ఒక ప్రాంతానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉండే హక్కు లేదన్నారు. ఇక్కడే పుట్టామని, ఇక్కడే పెరిగామని చెప్పుకుంటున్న సీఎంను హైదరాబాద్ నుండి ఎవరూ వెళ్లమనడం లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆయన ఇక్కడే ఉండి కర్రీ పాయింట్, ఇడ్లీ సెంటర్ పెట్టుకోవచ్చునని ఎద్దేవా చేశారు. కొత్త రాష్ట్రంలో రాజధాని ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం అంటే, తెలంగాణ మానవత్వంతో ఒప్పుకుంటోందని చెప్పారు. సీఎం ప్రస్తావించిన అంశాల కు సంబంధించిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
 ‘హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలంటూ అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. మరి మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు అంబేద్కర్ చెప్పిన మాటలు సీమాంధ్రులకు వర్తించవా? ముంబైలో ఎన్ని రోజులున్నా గుజరాత్ వాళ్లు కిరాయిదారులే అని అంబేద్కర్ చెప్పిన మాటలు ఎందుకు మర్చిపోయారు? ఉద్యమాలతో రాష్ట్రం ఏర్పాటు కాదంటున్న ముఖ్యమంత్రికి పొట్టిశ్రీరాములు చేసిన పోరాటం, త్యాగం ఎందుకు గుర్తుకు రావట్లేదు? పొట్టి శ్రీరాములు పోరాడకుంటే ఆంధ్రావాళ్లంతా ఇంకా తమిళనాడులోనే ఉండేవారు.
 
 యూపీఏ ప్రభుత్వం ఒప్పుకోలేదని, ప్రధాని మన్మోహన్‌సింగ్ భాగస్వామి కాలేదని కిరణ్ సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. 2009 డిసెంబర్‌లో కేంద్రం చేసిన ప్రకటన, అంతకుముందు టీఆర్‌ఎస్‌తో పొత్తు సంగతి గుర్తులేదా? శ్రీకృష్ణ కమిటీ 23 జిల్లాలు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విడిపోతే ఆంధ్రాకు నష్టం వస్తదని చెప్తాడు తప్ప కలిసి ఉంటే తెలంగాణకు వచ్చే లాభం ఏమిటో ఎందుకు చెప్పలేదు. సమైక్య రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లనే 57 ఏళ్లుగా ఏటా వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా 14 టీఎంసీలతో చిన్న చిన్న కుంటల్లాంటి రిజర్వాయర్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామంటే ఎలా నమ్ముతాం.
 
 నదీ జలాల పంపిణీ పెద్ద సమస్య కాదు
 ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు దేశంలో అంతర్భాగమే. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైతే మిగిలిన 28 రాష్ట్రాలకు ఏ నియమాలు వర్తిస్తాయో తెలంగాణకూ అవే వర్తిస్తాయి. జల పంపిణీలు ఎలా ఉన్నాయో తెలంగాణకు అలాగే పంపిణీ అవుతాయి. రోజూ కొట్లాడే పాకిస్థాన్‌తో 5 నదులను పంచుకుంటున్నాం. చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌తోనూ 5 నదులు పంచుకుంటున్నాం. రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకం సాధ్యం కాదా? 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన జీఓ 36 ద్వారా 24 వేల మంది తెలంగాణేతర ఉద్యోగులు, 610 జీఓ ద్వారా 58,956 మంది తెలంగాణేతర ఉద్యోగులు ఉన్నట్టుగా వెల్లడైంది. సకల జనుల సమ్మె సమయంలోనూ 83 శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారని చెప్పడాన్ని బట్టే వారు ఎక్కడివారో స్పష్టమై పోతోంది.
 
 ఉద్యోగుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. హైదరాబాద్‌లో 50 వేలమంది సీమాంధ్ర లాయర్లు ఉన్నట్టు చెప్పడం కూడా పచ్చి అబద్ధం. రాష్ట్రం మొత్తం మీద అడ్వొకేట్ల సంఖ్య 75 వేలు. వీరిలో 40 వేల మంది సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో 10-15 వేల మంది మాత్రమే అడ్వొకేట్లు ఉంటే సీమాంధ్రవారు కేవలం 3-4 వేల మంది ఉంటారు. నిజాం హయాంలోనే 1919లో తెలంగాణలో ఆరుగురు జడ్జీలతో హైకోర్టు ఏర్పాటైంది. ఆంధ్రా రాష్ట్రానికి 1954లో హైకోర్టు ఏర్పాటైంది. సీఎం స్థాయిలో ఇంత పచ్చి అబద్ధాలు దారుణంగా మాట్లాడుతుంటే ఆయన దగ్గర పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు.
 
 తెలంగాణలో అంధకారం పెద్ద జోక్
 తెలంగాణకు విద్యుత్ లేక అంధకారం ఏర్పడుతుందని కిరణ్ అనడం పెద్ద జోక్. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొద్దికాలం విద్యుత్‌కు ఇబ్బంది ఉన్నా ఐదేండ్లలోపే విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది. తెలంగాణకు 4,825 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యముంది. ఆదిలాబాద్, భూపాలపల్లి విద్యుత్ కేంద్రాలు ప్రారంభమైతే లోటు చాలా తక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు బొగ్గు పంపకుండా కేంద్రాన్ని కోరతాం. సింగరేణి ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుని పారిశ్రామిక అభివృద్ధికి కూడా బాటలు వేసుకుంటాం.
 
 ఆంధ్రా ప్రాంతానికి 7,400 మెగావాట్లు అవసరముంటే 10,609 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. అక్కడినుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా కొంతకాలం కరెంటును కొంటాం. అసలు బొగ్గు ఉన్న ప్రదేశాల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు పెట్టకుండా రాయలసీమలోనో, విజయవాడలోనో ఎలా పెడతారు? విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో స్నేహపూర్వకంగా ఉండరా? ఇదేనా తెలుగుజాతి ప్రేమ? హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయింది. ఏమైనా సమస్యలుంటే చెప్పుకోవడానికి ఆంటోనీ కమిటీ ఉంది. వైషమ్యాలు, విద్వేషాలు లేకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటే ఇరు ప్రాంతాల వారికి మంచిది.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement