హైదరాబాద్: టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని ఆయన చెప్పారు. తెలంగాణ టీడీపీ నాయకులు ఇప్పటికైనా చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకోవాలన్నారు. ఇటు తెలంగాణ ప్రజలు, అటు సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు విశ్వసనీయతలేని నాయకుడు అని కడియం శ్రీహరి విమర్శించారు.
కాగా, తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించిన నాటినుంచి సీమాంధ్ర ప్రాంతాలలో అందోళన వాతావారణం నెలకొంది. రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై నిర్ణయం వెలువబడిన నేపథ్యంలో దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణవాదులు చేసినా ఉద్యమాలతో కేంద్రం దిగివచ్చింది. దీంతో గత నెల జూలై 30న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అంతేకాకుండా హైదరాబాద్ ను పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే.