సీమాంధ్ర ఉద్యోగుల ఢిల్లీ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ఏపీఎన్‌జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 25న ఢిల్లీ యాత్రకు సమాయత్తమవుతున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లటానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవటానికి సహకారం కోరటం ఈ యాత్ర లక్ష్యంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే అనర్థాలను వివరించటంతో పాటు శ్రీకృష్ణ కమిటీ నివేదిక మీద పార్లమెంటులో చర్చించాలని అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేయనున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఆంటోనీ కమిటీతోనూ భేటీ కావాలని నిర్ణయించింది.
అయితే ఈ భేటీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నారు. ఢిల్లీ వెళ్లే బృందంలో అన్ని ప్రధాన సంఘాల నాయకులకు ప్రతినిధి బృందంలో చోటు కల్పించనున్నారు. ఉద్యోగుల రక్తదానం : రాష్ట్రం సమైక్యంగానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు గురువారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరంలోని ఎంజేఎం ఆస్పత్రి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఉద్యోగ ఫోరం అధ్యక్షుడు యూ మురళీకృష్ణ, కార్యదర్శి కేవీ కృష్ణయ్యలు తెలిపారు.
కొత్త రిజిస్ట్రేషన్ విధానం వాయిదా వేయాలని సీఎంకు వినతి
ఎక్కడ నుంచి అయినా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకొనే విధానం అమలును వాయిదా వేయాలని ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సీమాంధ్ర ఉద్యోగుల ప్రతినిధి బృందం గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. నూతన విధానాన్ని ఈ నెల 25 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. సీమాంధ్రలో ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున అమలును వాయిదా వేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారని భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.
రెండు దరఖాస్తుల్నీ పరిశీలిస్తున్నాం: డీసీపీ కమలాసన్‌రెడ్డి
ఎల్బీ స్టేడియంలో సభ, చలో ఎల్బీ స్టేడియం కార్యక్రమాలకు సంబంధించి ఏపీ ఎన్జీవోలు, ఓయూ జాక్ నుంచి గురువారం అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని మధ్యమండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు ముందు నుంచే అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని, వీటితో పాటు నగరంలో శాంతి భద్రతల అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే వీటికి అనుమతించడంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
7న హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తాం
వచ్చే నెల 7న హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని సీమాంధ్ర ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. సభకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీఎన్‌జీవో ప్రతినిధి బృందం గురువారం డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసింది. పోలీసులు వినాయక మండపాల బందోబస్తులో నిమగ్నమై ఉంటారని, అందువల్ల సెప్టెంబర్ 7న సభకు అనుమతి ఇవ్వటం సాధ్యం కాదని, అయినా ఉన్నతాధికారులకు నివేదించామని డీసీపీ చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వస్తే వెంటనే సమాచారం అందిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు.