కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు, మంత్రి ఆతిషి ఆందోళన
కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీలో ఉద్రిక్తత.. అదుపులోకి మంత్రులు, కార్యకర్తలు
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రులు బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆప్, బీజేపీ ప్రధాన కార్యాలయాలు ఉన్న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ సమీప ఐటీఓ ఇంటర్‌సెక్షన్ కూడలి వద్దకు ఆప్ నేతలు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో చేరుకుని మోదీ సర్కార్ వ్యతిరేక నినాదాలు చేశారు.
‘అరవింద్ మీరు సంఘర్షణను కొనసాగించండి. మేం మీకు తోడుగా ఉంటాం’ అని నినదించారు. ట్రాఫిక్ స్తంభించడంతో ధర్నాకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంచేశారు. అక్కడే ఆందోళనకు దిగిన ఢిల్లీ రాష్ట్ర మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో వేరే చోట్లకు తరలించారు. దీంతో తమ నేతలను విడుదలచేయాలంటూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలుచేశారు.
పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్‌జోత్ సింగ్ బైన్స్ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించారు. ఐటీవో స్టేషన్‌ను సాయంత్రందాకా ఢిల్లీ మెట్రో రైల్ మూసేసింది. ఈడీ ప్రధాన కార్యాలయం, బీజేపీ ఆఫీస్‌ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. ‘‘తప్పుడు కేసులతో నిన్న సీఎంను అరెస్ట్‌చేశారు. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే’’ అంటూ మంత్రులు ఆతిశీ, సౌరభ్ మండిపడ్డారు.
కస్టడీలో కేజ్రీవాల్‌కు రక్షణేది: ఆతిషి
ధర్నాకు ముందు మంత్రి ఆతిషి పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎం హోదాలో కేజ్రీవాల్ చుట్టూ నిరంతరం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం ఆయనకు అంతటి భద్రత కల్పిస్తోందా? ఆయన భద్రతకు జవాబుదారీ ఎవరు? ఈడీ ఆఫీస్ లాకప్‌లోకి ఎవరెవరు వస్తున్నారు? అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లపై కేంద్రం ప్రకటన చేయాలి’ అని ఆతిషి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment