70 రోజులుగా సీమాంధ్ర రగులుతోంది: బాబు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 70 రోజులుగా సీమాంధ్ర రగులుతున్నా... రాష్ట్రాన్ని కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంగా చూస్తుందన్నారు. సీమాంధ్రలో పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సమస్యకు పరిష్కారం చూపకుండా మరింత జఠిలం చేస్తోందన్నారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అనైతికంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఓట్లు, సీట్ల కోసం ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల పట్ల ప్రజలకు నమ్మకం సడలిందని, ప్రజా ప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. చిన్న ఊరులో వచ్చిన సమస్య పరిష్కారానికి సైతం నియమ, నిబంధలను పాటిస్తారని.....ఇరుప్రాంతాల ఐకాస నేతలను పిలిచి చర్చలు జరపాలని తాము చెప్పామన్నారు.
సొంత పార్టీ నేతలను బలిపెట్టి రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం రోజే టీఆర్ఎస్ పార్టీ....కాంగ్రెస్లో విలీనం అవుతుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. అంతకు ముందు చంద్రబాబు రాజ్ఘాట్లో గాంధీజీకి నివాళులు అర్పించారు. మరికాసేపట్లో చంద్రబాబునాయుడు దీక్ష చేపట్టనున్నారు.