విభజన ఆగేది లేదు...కాంగ్రెస్ పని గోవిందా
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ఆగే సమస్యే లేదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయినా తాము చివరి వరకూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నామని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఇదే తమ చివరి ప్రయత్నమని జేసీ పేర్కొన్నారు. అన్ని తెలిసినా ....అయినను పోయిరావలె హస్తనకు అన్నట్లుగా ఉందన్నారు. తమ ప్రయత్నాలతో కాంగ్రెస్ పెద్దలకు జ్ఞానోదయం కలుగుతుందనే ఆశతో ఉన్నామన్నారు. విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెస్ పని గోవిందా అని జేసీ అన్నారు.
విభజనపై ఏర్పాటు అయిన కమిటీలు కాలయాపనకే అని జేసీ అన్నారు. ప్రజల ధనం వృధా తప్ప కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో పాటు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికల వల్ల ఒరిగింది ఏమీలేదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన అయితే ఆగిది లేదని...అయితే న్యాయపరంగా కానీ, లేక బీజేపీ వల్ల కానీ విభజన ఆగితే ఆగవచ్చని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ కన్నా బీజేపీ వైఖరి గుడ్డిలో మెల్లగా అని జేసీ పేర్కొన్నారు.