'ఇంత దుర్మార్గంగా ఏ విభజన జరగలేదు'
చెన్నై: సమన్యాయం చేయని విభజన బిల్లును అడ్డుకోవాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితతో భేటీ అయ్యారు. సమన్యాయం కోసం మద్దతు ఇవ్వాలని బాబు ఈ సందర్భంగా జయలలితను కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న అహంకారంతో కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న విభజన బిల్లును అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ అపహాస్యం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేస్తున్నంత దుర్మార్గంగా ఏ రాష్ట్ర విభజన జరగలేదని చంద్రబాబు అన్నారు. పార్లమెంట్ చివరి సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం వెనుక రాజకీయ కుట్ర కన్పిస్తోందని ఆయన ఆరోపించారు. విభజన బిల్లును అడ్డుకోవాలంటూ చంద్రబాబు బుధవారం పలు పార్టీల నేతలను కలిసిన విషయం తెలిసిందే. కాగా ఇదే అంశంపై డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.