నా పట్టు... ఉడుం పట్టు
తనది ఉడుం పట్టు అని... కాంగ్రెస్ అవినీతిని వదిలిపెట్టేది లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. 65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... రానున్న ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తాయని చెప్పారు. దేశాన్ని అవినీతి కాంగ్రెస్ పట్టి పీడిస్తుందని, ఆ పార్టీని ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నీతిని బతికించుకోవాలని, ధర్మాన్ని కాపాడుకోవాలని ఆ బాధ్యత దేశంలో అందరిపై ఉందని గుర్తు చేశారు.
దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తమ పార్టీని అదరించాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. నీతివంతమైన పాలన అందించే శక్తి ఒక్క తమపార్టీకే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి పత్రిక, రేడియో, టీవీ అన్ని ప్రజలే అని చంద్రబాబు పేర్కొన్నారు. మంచి నీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు.
అయితే మద్యం కావాలని ఎవరైన సెల్ ద్వారా చిన్న ఎస్ఎంఎస్ ఇస్తే చాలు క్షణాల్లో వస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా అందరికి మంచినీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ చేస్తున్న విభజన వాదం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందన్నారు.