రాష్ట్రం అధికారాలను కేంద్రమెలా లాక్కుంటుంది?
చంద్రబాబు ధ్వజం
రాష్ట్ర హక్కులను హరించేలా విభజన బిల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలన్నీ అధికారాల కోసం పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్ విభజన పేరుతో ఉన్న అధికారాలను కేంద్రం ఎలా లాక్కుంటుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అధికారాలు లేని సీఎం పదవి ఎందుకు? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన శనివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013లో ప్రస్తావించిన అంశాలపై మరో ఐదు రోజుల పాటు విలేకరులతో మాట్లాడతానన్నారు.
‘‘రాష్ట్ర హక్కులను హరించేలా ఉన్న బిల్లుకు సంబంధించిన సమాచారాన్ని అన్ని పార్టీలకు పంపుతాం. త్వరలో ప్రధాని, రాష్ర్టపతికి కూడా విభజన జరుగుతున్న తీరుపై లేఖలు రాస్తా. బిల్లులో ప్రస్తావించిన ఒక్కో అంశాన్ని అర్థం చేసుకోవాలంటే 35 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న నాకే 3-4 గంటల సమయం పడుతుంది. అలాంటిది మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న వారు వెంటనే అభిప్రాయాలు ఎలా చెప్తారు?’’ అని ప్రశ్నించారు. బిల్లు అధ్యయనం చేసేందుకు సమయం కావాలని ఒక మంత్రి అడిగినప్పుడు.. మేం నిర్ణయించాం, ఇంకా మీరు అధ్యయనం చేసేదేముందని చిదంబరం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడాన్ని తప్పుబట్టారు. ఈ బిల్లువల్ల రాష్ట్రంలో ఒక కాలువ, ఒక ఎత్తిపోతల పథకాన్ని మంజూరుచేసే అధికారం కూడా సీఎంకు లేకుండా పోతోందని, అలాంటప్పుడు ఆ పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంతని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం జేఏసీ స్థాపించి పోరాడతామనే వారితో తాము కలవబోమన్నారు. సీఎంకు తెలిసే రాష్ర్టం నుంచి విభజనకు సంబంధించిన సమాచారమంతా కేంద్రానికి చేరిందన్నారు. కేంద్రం ఏపీ విషయంలో రెండు కోతులు, పిల్లి కథ మాదిరిగా వ్యవహరిస్తోందన్నారు.
ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్తను అందిస్తున్నాం. సాక్షిని అనుమతించి ఉంటే బాబును ఈ కింది ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టేది.
1. కొద్ది రోజుల కిందట కొబ్బరికాయ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిన, అలా విభజన చేయాలన్న మీరు తాజాగా రెండు కోతులు, పిల్లి కథను ప్రస్తావిస్తున్నారు. ఇంతకు రాష్ర్ట విభజన విషయంలో మీ వైఖరి ఏమిటి?
2. రాష్ర్ట విభజనకు సంబంధించిన సమగ్ర సమాచారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలిసే జరిగిందంటున్నారు. అలాంటి ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి మీరు మద్దతు ఇచ్చి ఉంటే అసలు ఈ ప్రభుత్వమే ఉండేది కాదుకదా? ఎందుకు కాంగ్రెస్‌కు మద్దతునిచ్చినట్టు?
3. అధికారాలు లేని సీఎం పదవి ఎందుకని అడుగుతున్నారు... అధికారాలతో కూడిన పదవి ఇస్తే చాలు రాష్ట్రం ఏమైనా కానివ్వమనా మీ ఉద్దేశం?