బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం వెంటనే పదవి నుంచి తప్పించాలని సీపీఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణ సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అంశంపై వైఖరి వెల్లడించకముందు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పిన కిరణ్ తీరా ఇప్పుడు ప్లేటు మార్చి సమైక్య నినాదం వినిపించడం సిగ్గు చేటన్నారు. సమైక్యవాద ముసుగులో సీమాంధ్ర ప్రజలను కూడా సీఎం మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
సీఎంకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా స్వచ్ఛందంగా సీఎం పదవికి రాజీనామా చేయడమో, కాంగ్రెస్ నుంచి వైదొలగడమో చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడని దుయ్యబట్టారు. సీమాంధ్రకు రూ.5 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మిన్నకుండి పోవడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అదే ధోరణిని ప్రదర్శిస్తోందని అన్నారు. అసెంబ్లీ నడవకుండా సీమాంధ్ర నేతలు కుట్రలు చేశారని విమర్శించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పి.శేషగిరిరావు, సహాయ కార్యదర్శులు మంతెన మల్లేశ్, తాళ్లపల్లి మల్లయ్య, నాయకులు పుల్లూరి మల్లయ్య పాల్గొన్నారు.
అధికారుల మూలంగానే నీటి చౌర్యం
మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారుల బాధ్యతారాహిత్యం మూలంగానే బెల్లంపల్లికి వచ్చే గోదావరి జలాలు చౌర్యానికి గురవుతున్నాయని గుండా మల్లేశ్ పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి మున్సిపాలిటీలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సంబంధించి బెల్లంపల్లికి గోదావరి జలాలు సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఇంటెక్‌వెల్ నిర్మించినట్లు తెలిపారు. కొంతమంది ఒత్తిళ్ల మేరకు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు బెల్లంపల్లికి వచ్చే గోదావరి జలాలను అక్రమంగా మంచిర్యాలకు సరఫరా చేయడానికి అంగీకరించారని ఆరోపించారు. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఇంటెక్‌వెల్‌ను పరిశీలిస్తామన్నారు. కాసిపేట ప్రజలకు గోదావరి జలాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ.21 కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నెన్నెల మండలం మత్తడివాగుకు రూ.11 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు.
తెలంగాణపై చర్చ జరుగకుండా సీఎం కుట్ర : ఎమ్మెల్యే వేణుగోపాలాచారి
భైంసా : అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై చర్చ జరుగకుండా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కుట్ర పన్నారని ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి ఆరోపించారు. ఆదివారం భైంసా పట్టణంలోని కేఎస్ గార్డెన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీఎంకు తెలంగాణ ఏర్పాటు విషయం మింగుడు పడడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాల్సింది పోయి ఇష్టారీతిన వ్యవహారిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కేంద్రం తక్షణమే తెలంగాణ ఏర్పాటు చేసి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
సీఎంను పదవి నుంచి తప్పించాలి
Published Mon, Dec 23 2013 2:57 AM | Last Updated on Mon, Aug 13 2018 4:01 PM
Advertisement