సాక్షి, మంచిర్యాల: తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్ష నాయకులతో కలిసి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో ప్రచారం అవుతున్న ఫోన్ నంబర్ తనది కాదే కాదని పేర్కొన్నారు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
'రైతులకు ఉచిత ఫాంలు, లోన్లు ఇస్తామని కొంతమంది నా దగ్గరకు వచ్చారు. రైతులకు లాభం చేకూరుస్తారని నమ్మి వారిని ప్రోత్సహించా. కానీ వారు నాకు తెలియకుండా లోన్లు ఇప్పిస్తామని చెప్పి 20-25 మంది రైతుల నుంచి సుమారు రూ.60-70 లక్షలు వసూలు చేశారు. డబ్బులు కట్టించుకొని మోసం చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం రైతులు నా దృష్టికి తీసుకువస్తే.. నేను వెంటనే పోలీసులకు చెప్పాను. వాళ్లు పిలిచి విచారిస్తే లోన్లు ఇప్పిస్తామని చెప్పినవారు భారీ మోసానికి పాల్పడినట్లు తెలిసింది. చాలా ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో వారు ఇలాగే మోసానికి పాల్పడినట్లు తేలింది.
వారిపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో తెలుసుకుని రైతులు ఇచ్చిన పిటిషన్ ప్రకారం చీటింగ్ కేసు పెట్టి నిందితులను జైలుకు పంపాం. అది దృష్టిలో పెట్టుకుని నన్ను ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో వారు బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో కన్పిస్తున్న నంబర్లు నావి కావు. కావాలనే నన్ను ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని ఇలా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నా.' అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కాగా.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధించారని ఓ మహిళ వీడియో విడుదల చేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తనతో వాట్సాప్ చాట్ చేశాడని ఆమె పేర్కొంది. ఆయన మోసాలను బట్టబయలు చేస్తానంది. బ్లాక్ మెయిల్ చేయడం లేదని చెప్పింది. ఎమ్మెల్యే ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అసలు వాస్తవాలేంటో తెలుస్తాయంది.
చదవండి: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి
Comments
Please login to add a commentAdd a comment