నిత్యావసరాల ధరలు నియంత్రించండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి, ఇతర ఉన్నతాధికారులతో నిత్యావసర సరుకుల ధరలు, భారీ వర్షాలు, సీమాంధ్రలో సమ్మె తదితర అంశాలపై సమీక్షించారు. ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీమాంధ్రలో ఏపీఎన్‌జీవోలు, ఆర్టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో రవాణాపరంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన వాకబు చేశారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అత్యవసర రవాణాకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనెల 14వ తేదీన రాష్ట్ర సగటు వర్షపాతం మూడు మిల్లీమీటర్లు కాగా శుక్రవారం 20.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రికార్డయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 16వ తేదీ వరకూ 398.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 443.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం (11 శాతం అధికంగా) నమోదైందని వారు వివరించారు. నల్లగొండ జిల్లాలో ఈనెల 13 - 15 తేదీల్లో కురిసిన వర్షాలవల్ల 6,375 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.