కూరగాయలు, ఇతర వంట సామాగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇంటి భోజనం ఖర్చులు అధికమైనట్లు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈసారి అదే నెలలో భోజనం ఖర్చులు పెరిగాయని తెలిపింది. అందుకు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమాటా వంటి కూరగాయల ధరలు పెరగడం కారణమని క్రిసిల్ ‘రోటి రైస్ రేట్’ నివేదికలో పేర్కొంది.
నివేదికలోని వివరాల ప్రకారం..గతేడాది సెప్టెంబరులో శాకాహార భోజనం తయారీ ఖర్చు రూ.28.10గా ఉండేది. అది ఈ ఏడాది అదే నెలలో 11% పెరిగి రూ.31.30కు చేరింది. శాకాహార భోజనం ఖర్చులో 37% వాటా ఉన్న కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణం. ఏడాదిక్రితంతో పోలిస్తే ఉల్లిపాయల ధర 53%, బంగాళాదుంపలు 50%, టమాటా ధర 18% పెరిగాయి. ఉల్లి, బంగాళాదుంపల సరఫరా తగ్గడం వల్ల వీటి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో టమాటా అధికంగా పండిస్తారు. కానీ ఈసారి అధిక వర్షాల కారణంగా పంట తీవ్రంగా దెబ్బతింది. దాంతో ధరలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో పప్పుల ధరలు కూడా 14% పెరిగాయి. అయితే వంట గ్యాస్ ఖర్చులు 11% తగ్గాయి. మాంసాహార భోజనం తయారీ ఖర్చు 2% తగ్గి రూ.59.30కు పరిమితమైంది. మాంసాహార భోజనం ఖర్చులో 50% వాటా ఉండే బ్రాయిలర్ చికెన్ ధర 14% తగ్గడం ఇందుకు దోహదం చేసింది. అయితే ఆగస్టుతో పోలిస్తే మాంసాహార భోజనం ధర సెప్టెంబర్‌లో పెద్దగా ప్రభావం చెందలేదు.
ఇదీ చదవండి: ఇండియా పోస్ట్, అమెజాన్ జత
ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతులివ్వడంతో ధరలు దిగిరావడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొందరు వ్యాపారులు అక్రమ నిల్వలు పెంచుకుంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని చెప్పారు. ఫలితంగా ఉల్లి ధరలు అధికమవుతున్నాయని తెలిపారు. ఇటీవల వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా వంట నూనెల ధరలు పెరిగాయి. చాలా కంపెనీలు అప్పటికే తక్కువ ధరకు దిగుమతి చేసుకున్నాయి. దానిపై అధిక ధర వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కొన్ని సంస్థలు వాటిని బేఖాతరు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ వర్గాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment