న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డెలివరీ సర్వీసుల సామర్థ్యాన్ని పెంపొందించుకునే బాటలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, పోస్టల్ శాఖ(ఇండియా పోస్ట్) జతకట్టాయి. ఇందుకు అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్, ఇండియా పోస్ట్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దాంతో దేశవ్యాప్త లాజిస్టిక్స్ సర్వీసుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తాజాగా తెరతీశాయి.
సామర్థ్యాల పెంపు, పటిష్టంగా వనరుల వినియోగం, రవాణా నెట్‌వర్క్‌లను పంచుకోవడం తదితరాల కోసం పరస్పరం సహకరించుకోనున్నట్లు సంయుక్త ప్రకటనలో వివరించాయి. 1,65,000 పోస్టాఫీసుల నెట్‌వర్క్ కలిగిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఈకామర్స్‌ను విస్తరించేందుకు దోహదపడనున్నట్లు పోస్టల్ సెక్రటరీ వందితా కౌల్ పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ సర్వీసులను ఆధునీకరించడం, నూతన సాంకేతికతలను వినియోగించడం తదితర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అమెజాన్‌తో చేతులు కలిపినట్లు వివరించారు. నిజానికి 2013లోనే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దేశవ్యాప్త డెలివరీలకు అమెజాన్ ఇండియా పోస్ట్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక 2023లో సమీకృత విదేశీ లాజిస్టిక్స్ సొల్యూషన్ల కోసం రెండు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహాసంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల ఈకామర్స్ ఎగుమతులకు తెరతీశాయి.
ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో ‘సేవలు’ పేలవం
Comments
Please login to add a commentAdd a comment