india post
-
రూ.2,000 నోట్లు 98 శాతం వెనక్కి
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లు 98 శాతం బ్యాంకుల్లోకి తిరిగొచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఇప్పటికీ రూ.6,970 కోట్ల విలువ చేసే నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నట్టు తెలిపింది. రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న ప్రకటించడం గమనార్హం. ‘‘అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉండగా, 2024 అక్టోబర్ 31 నాటికి రూ.6,970 కోట్లకు తగ్గాయి. అంటే 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లతో 98.04% వెనక్కి వచ్చాయి’’అని ఆర్బీఐ తెలిపింది. అన్ని బ్యాంకు శాఖల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్‌కు, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించడం తెలిసిందే. 2023 అక్టోబర్ 7 వరకు ఇందుకు అనుమతించింది. ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసులలో రూ.2,000 నోట్ల మార్పిడి సదుపాయం ఇప్పటికీ కొనసాగుతోంది. తమ బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు రూ.2,000 నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుకు ఇండియా పోస్ట్ ద్వారా పంపుకునేందుకు వీలుంది. హైదరాబాద్ ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులోనూ ఈ సదుపాయం ఉంది. -
ఇండియా పోస్ట్, అమెజాన్ జత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డెలివరీ సర్వీసుల సామర్థ్యాన్ని పెంపొందించుకునే బాటలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, పోస్టల్ శాఖ(ఇండియా పోస్ట్) జతకట్టాయి. ఇందుకు అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్, ఇండియా పోస్ట్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దాంతో దేశవ్యాప్త లాజిస్టిక్స్ సర్వీసుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తాజాగా తెరతీశాయి.సామర్థ్యాల పెంపు, పటిష్టంగా వనరుల వినియోగం, రవాణా నెట్‌వర్క్‌లను పంచుకోవడం తదితరాల కోసం పరస్పరం సహకరించుకోనున్నట్లు సంయుక్త ప్రకటనలో వివరించాయి. 1,65,000 పోస్టాఫీసుల నెట్వర్క్ కలిగిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఈకామర్స్‌ను విస్తరించేందుకు దోహదపడనున్నట్లు పోస్టల్ సెక్రటరీ వందితా కౌల్ పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ సర్వీసులను ఆధునీకరించడం, నూతన సాంకేతికతలను వినియోగించడం తదితర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అమెజాన్‌తో చేతులు కలిపినట్లు వివరించారు. నిజానికి 2013లోనే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దేశవ్యాప్త డెలివరీలకు అమెజాన్ ఇండియా పోస్ట్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక 2023లో సమీకృత విదేశీ లాజిస్టిక్స్ సొల్యూషన్ల కోసం రెండు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహాసంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఈకామర్స్ ఎగుమతులకు తెరతీశాయి.ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో ‘సేవలు’ పేలవం -
'తపాల శాఖ' ద్వారా.. ఇక విదేశాలకు పార్సిళ్లు..!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రధాన తపాల కార్యాలయం నుంచి డాక్ నిర్యాత్ కేంద్ర సర్వీస్ ద్వారా తక్కువ ఖర్చుతో విదేశాలకు సులభంగా పార్సల్స్ పంపే సేవలు ప్రారంభించినట్లు ఆదిలాబాద్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సుజిత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉట్నూర్ పరిధిలోని బ్రాంచి పోస్ట్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. విదేశాలకు పార్సల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ప్రధాన తపాల కార్యాలయంలో సైతం విదేశాలకు పార్సెల్ సర్వీస్ కరపత్రాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు సమీప పోస్టు ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం తిరుపతి, రమేశ్, బీపీఎంలు చంద్రశేఖర్, ప్రవీన్, గోకు ల్, విజయ్, సాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇండియా పోస్ట్‌తో అమెజాన్ జట్టు: వారి కోసమే
న్యూఢిల్లీ: చిన్న సంస్థలకు (ఎస్ఎంఈ) ఎగుమతులను సులభతరం చేసే దిశగా ఇండియా పోస్ట్‌తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. సంభవ్ సమ్మిట్ 2023 సందర్భంగా కంపెనీ ఈ విషయం తెలిపింది. ఇదీ చదవండి: పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు అలాగే అమెజాన్, ఇండియా పోస్ట్ మధ్య దశాబ్ద కాలపు భాగస్వామ్యానికి గుర్తుగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్మారక స్టాంపును ఆవిష్కరించినట్లు వివరించింది. తమ విక్రేతలకు తోడ్పాటు అందించేందుకు సహ్–ఏఐ పేరిట కృత్రిమ మేథ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టినట్లు అమెజాన్ తెలిపింది. (సిమ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, టెల్కోలకు తప్పదు భారీ మూల్యం) -
RPO Hyderabad: పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీకి కొత్త విధానం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాలకు వెళ్లేవారికి అవసరమయ్యే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)ల జారీకి హైదరాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల ద్వారా వీటిని జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో పీసీసీల కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉండేది. అయితే పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో కొత్త పాస్‌పోర్టులు, పాత పాస్‌పోర్టుల రెన్యువల్ల కోసం క్యూ కట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా ఈ కేంద్రాల్లో రద్దీ కారణంగా పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సౌదీ, కువైట్ దేశాలలో ఉపాధి, ఇతర దేశాల్లో చదువు కోసం వెళ్లేవారికి పీసీసీలు తప్పనిసరి కావడంతో ఆన్లైన్లో స్లాట్‌ను బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్తున్నారు. పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా పీసీసీలు పొందాలనుకుంటే స్లాట్ బుకింగ్‌కు నెలకు మించి ఎక్కువ సమయం పడుతోంది. పీసీసీలు సకాలంలో పొందని వారికి వీసాల గడువు ముగిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీల జారీని వేగవంతం చేయడానికి ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేసేలా రీజనల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య చొరవ తీసుకున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో రెండు వారాల పాటు ‘వాక్ ఇన్ పీసీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.సిబ్బందికి వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉన్నాయి. పీసీసీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో శనివారం కూడా పని చేయాల్సి వచ్చింది. తక్కువ సిబ్బంది ఉండడంతో పని భారం ఎక్కువైంది. దీంతో పీసీసీల కోసం శనివారం ప్రత్యేక కౌంటర్లను నిర్వహించడం రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తపాలా కార్యాలయాల్లో స్లాట్లు.. పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పని చేస్తున్న ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, భువనగిరిల తపాలా కార్యాలయాల ద్వారా పీసీసీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు స్లాట్లను కేటాయించారు. ఒక్కో పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ద్వారా రోజుకు 10 నుంచి 15 పీసీసీల జారీకి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తపాలా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా గతంలో కొత్త పాస్‌పోర్టులను మాత్రమే జారీ చేసేవారు. తాజాగా పీసీసీలకు అనుమతి ఇచ్చారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో పీసీసీల కోసం రద్దీని తగ్గించడానికి రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. (క్లిక్: ‘మూన్ లైటింగ్’ వివాదం: ఐటీ ఆఫీసులకు పాత కళ..) -
ఇండియా పోస్ట్ భారీ విస్తరణ
న్యూఢిల్లీ: ఇంటి వద్దకే సేవలను అందించడం లక్ష్యంగా ఇండియా పోస్ట్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 10,000 శాఖలను తెరవనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు అనుమతి లభించిందని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ సెక్రటరీ అమన్ శర్మ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నూతన శాఖలను తెరువనున్నట్టు చెప్పారు. వీటి చేరికతో మొత్తం శాఖల సంఖ్య సుమారు 1.7 లక్షలకు చేరుతుందని వెల్లడించారు. ‘పోస్టల్ శాఖను విస్తరించాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. అయిదు కిలోమీటర్ల పరిధిలోనే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు చేరువలో ఉండాలన్నది భావన. పోస్టాఫీసుల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.5,200 కోట్లు సమకూర్చింది. డ్రోన్ల ద్వారా డెలివరీలను ఇటీవల గుజరాత్లో విజయవంతంగా నిర్వహించాం. 2012లో ప్రారంభించిన ఐటీ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. సాంకేతికత ఆధారంగా పోస్టల్, ఇతర ప్రభుత్వ సేవలు త్వరలో ఇంటి వద్దకే అందనున్నాయి. ప్రజలు పోస్టాఫీసులకు రావాల్సిన అవసరం ఉండదు. మహమ్మారి కాలంలో ఆధార్ సహిత చెల్లింపుల వ్యవస్థ ఆధారంగా రూ.20,000 కోట్ల పైచిలుకు నగదును ప్రజల ఇంటి వద్దకే చేర్చాం’ అని వివరించారు. -
PIN:భారత దేశం.. ఇవాళ మరో మైలురాయి కూడా!
స్పెషల్: స్వతంత్ర భారతావని 75 ఏళ్ల వసంతం పూర్తి చేసుకుంది. దేశం మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇవాళ మన దేశం మరో మైలురాయిని దాటిందన్న విషయం మీకు తెలుసా?.. అదీ తపాలా వ్యవస్థ ద్వారా!. పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్(PIN)కు సరిగ్గా ఇవాళ్టికి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. లెటర్లు, కొరియర్లు, ఇతర పోస్టల్ ఐటెమ్స్ పంపడానికి ఈ నెంబర్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే కదా. ఈ పిన్ను 1972, ఆగస్టు 15న మొదలుపెట్టారు. ఇంతకీ ఇది ఎలా పుట్టింది? ఇది రావడానికి ఎవరి కృషి దాగుంది? తదితర విషయాలు చూద్దాం. Postal Identification Number నే ఏరియా కోడ్ లేదంటే జిప్ కోడ్ అని కూడా పిలుస్తారు. ఈ నెంబర్ వల్లే పోస్టల్ డిపార్ట్మెంట్కు, పోస్ట్‌మ్యాన్‌కు ఉత్తరాలు సరఫరా చేయడం సులభం అవుతోంది. ► పిన్ కోసం కృషి చేసిన వ్యక్తి.. శ్రీరామ్ భికాజి వెలెంకర్. ఫాదర్ ఆఫ్ పిన్‌గా ఈయనకు పేరు ముద్రపడిపోయింది. మహారాష్ట్రకు చెందిన ఈయన కేంద్ర సమాచార శాఖలో అదనపు కార్యదర్శిగా, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్బోర్డులో సీనియర్ సభ్యుడిగా కొనసాగారు. సంస్కృత కవి అయిన వెలెంకర్కు 1996లో రాష్ట్రపతి అవార్డు దక్కింది. 1999లో ఆయన కన్నుమూశారు. ► భారతదేశం అంతటా అనేక స్థలాల పేర్లను నకిలీ చేయడం వలన పిన్ కోడ్ అవసరం ఏర్పడింది. ప్రజలు వివిధ భాషలలో చిరునామాలను కూడా వ్రాసేవారు, ఇది చిరునామాలను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. అందుకే కోడ్ సిస్టమ్ వల్ల.. పోస్ట్‌మెన్ చిరునామాను సరైన వ్యక్తులకు అందించడంలో సహాయపడింది. ► ఆరు నెంబర్ల పిన్ కోడ్‌లో.. ఫస్ట్ డిజిట్ జోన్‌ను సూచిస్తుంది. ► రెండవది.. సబ్ జోన్‌ను సూచిస్తుంది. ► మూడవది.. జిల్లాను అదీ సదరు జోన్ పరిధిలోనే ఉందని తెలియజేస్తుంది. ► చివరి మూడు డిజిట్స్ మాత్రం.. సంబంధిత పోస్టాఫీస్‌ను తెలియజేస్తుంది. ► పోస్టల్ రీజియన్ కార్యాలయం.. ప్రధాన పోస్టాఫీస్‌కు ప్రధాన కేంద్రం లాంటిది. ► భారతదేశంలో ఎనిమిది ప్రాంతీయ మండలాలు, ఒక ఫంక్షనల్ జోన్ (భారత సైన్యం కోసం) సహా తొమ్మిది పోస్టల్ జోన్లు ఉన్నాయి. ► ఇండియా పోస్ట్ ప్రకారం.. దేశం మొత్తం 23 పోస్టల్ సర్కిల్స్‌గా విభజించబడి ఉంది. ప్రతీ సర్కిల్‌కు హెడ్‌గా చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఉంటాడు. ► PIN prefix లిస్ట్‌లో.. 50 అనే సంఖ్య టీజీ అనేది తెలంగాణను, 51-53 మధ్య ఏపీని సూచిస్తుంది. ► డెలివరీ కార్యాలయం జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO), ప్రధాన కార్యాలయం (HO) లేదా సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే సబ్-ఆఫీస్ (SO) కావచ్చు. ► సాధారణంగా చాలామంది ఆశువుగా పిన్ నెంబర్ అనేస్తుంటారు. కానీ, పోస్టల్ విషయంలో పిన్ నెంబర్ అని రాయకూడదు.. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ లేందటే పిన్ అని మాత్రమే రాయాలి. ఇదీ చదవండి: ‘ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి’ -
Postal Department: పదో తరగతి అర్హతతో 38926 ఉద్యోగాలు
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ►మొత్తం పోస్టుల సంఖ్య: 38926 ►తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ–1226,ఆంధ్రప్రదేశ్–1716.»పోస్టుల వివరాలు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం),డాక్ సేవక్. ►అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ►వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు ►టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్సీఏ) ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి. ►బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. ఏబీపీఎం/డాక్సేవక్ పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.10000 చెల్లిస్తారు. ఎంపిక విధానం ►పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది. ►దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ►దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022 ►దరఖాస్తులకు చివరి తేది: 05.06.2022 ►వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in -
ప్రతి నెల రూ.1500 పొదుపు చేస్తే.. రూ.35 లక్షలు మీ సొంతం!
Gram Suraksha Scheme: పెట్టుబడిదారులకు సురక్షితమైన, భరోసాతో కూడిన రాబడిని అందించే పెట్టుబడి పథకాలను ఎప్పటికప్పుడు ఇండియా పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. మార్కెట్ లింక్డ్ పథకాలతో పోలిస్తే పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి పథకాలు ఈక్విటీ పనితీరుపై ఆధారపడవు కాబట్టి పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం. కాబట్టి, సురక్షితమైన పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. అటువంటి పథకాలలో 'గ్రామ సురక్షా పథకం' ఒకటి. ఈ పథకం కింద పెట్టుబడిదారులు ప్రతి నెలా కేవలం రూ.1500 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయం తర్వాత రూ.35 లక్షల వరకు పొందవచ్చు. పైన పేర్కొన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేయడం ద్వారా పెట్టుబడిదారులు రూ.31 నుంచి 35 లక్షల ప్రయోజనం పొందవచ్చు. 9 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడు అయినా పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద హామీ ఇవ్వబడిన కనీస మొత్తం రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. పోస్టాఫీసు పథకం కింద ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ వార్షికంగా లేదా వార్షికంగా చెల్లించవచ్చు. పెట్టుబడిదారులు ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. (చదవండి: సన్నీ లియోనీ పేరుతో ఎన్ఎఫ్టీ.. ఇది మరో రికార్డు!) అంతేకాక, ఎంపిక చేసిన కాలపరిమితి కోసం స్కీంలో నిరంతరం పెట్టుబడి పెట్టిన తరువాత వారు పెట్టుబడులకు విరుద్ధంగా అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ పథకాన్ని మూడు సంవత్సరాలల తర్వాత కూడా సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు మీరు గ్రామ సురక్ష పథకాన్ని ముగించుకుంటే బోనస్ ప్రయోజనం లభించదు. ఒక వ్యక్తి పోస్టాఫీసు పథకంలో 19 ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన సురక్ష పాలసీని కొనుగోలు చేసినప్పుడు 55 సంవత్సరాల వరకు నెలవారీ ప్రీమియం రూ.1515, 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. 55 సంవత్సరాల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.31.60 లక్షలు రూ.58 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.34.60 లక్షలు ఉంటుంది. (చదవండి: సన్నీ లియోనీ పేరుతో ఎన్ఎఫ్టీ.. ఇది మరో రికార్డు!) -
పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త!
ఇండియా పోస్ట్ తన పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త అందించింది. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది. ఇండియా పోస్ట్ తీసుకోచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవ శాఖలో ఒక రోజులో రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకుముందు విత్ డ్రా లిమిట్ రూ.5,000గా ఉండేది. ఇండియా పోస్ట్ తన కొత్త మార్గదర్శకాలలో పేర్కొన్న ప్రకారం ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం) ఒక రోజులో ఒక ఖాతాలో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ గా స్వీకరించరాదని పేర్కొంది. అంటే ఒక ఖాతా ద్వారా రూ.50,000 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు ఒక రోజులో చేయలేము. పీపీఎఫ్, కెవిపీ, ఎన్ఎస్ సీ కొత్త రూల్స్ ఇండియా పోస్ట్ యొక్క కొత్త నిబంధనల ప్రకారం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్ సీఎస్ఎస్), మంత్లీ ఇన్ కమ్ స్కీం (ఎంఐఎస్), కిసాన్ వికాస్ పాత్రా(కెవిపి), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్ సీ) స్కీంల కోసం డిపాజిట్ లేదా విత్ డ్రా చెక్కులు ద్వారా చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం: కనీస బ్యాలెన్స్ పోస్టాఫీసు పొదుపు పథకంపై 4% వడ్డీ లభిస్తుంది. తపాలా కార్యాలయ పొదుపు పథకం ఖాతాలో కనీసం రూ.500 బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. అయితే కనీస బ్యాలెన్స్ రూ.500 కంటే తక్కువగా ఉంటే ఖాతా నిర్వహణ చార్జీల కింద జరిమానాగా రూ.100 వసూలు చేస్తారు. పోస్టాఫీసు పొదుపు పథకాలు: వడ్డీ రేటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా: 4% ఏడాది వరకు టీడీ ఖాతా: 5.5% 2 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 5.5% 5 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 6.7% 5 ఏళ్ల ఆర్ డి: 5.8% సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం: 7.4% పీపీఎఫ్ పొదుపు పథకం: 7.1% కిసాన్ వికాస్ పాత్ర: 6.9% సుకన్య సమృద్ధి ఖాతాదారులకు: 7.6% -
పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి గుడ్‌న్యూస్!
విదేశాలకు వెళ్లాలని అనుకునే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్టు కలిగి ఉండటం తప్పనిసరి అనే విషయం తెలిసిందే. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్టు సేవలను అందిస్తూ వచ్చింది. అయితే, కొత్తగా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేంద్రం శుభవార్త తెలిపింది. ఇండియా పోస్ట్ ఇప్పుడు భారతదేశంలోని వివిధ తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాన్ని అందిస్తోంది. ఇక నుంచి పాస్‌పోర్టు దరఖాస్తు కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసు కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ సీ) కౌంటర్లను సందర్శించాల్సి ఉంటుంది అని పేర్కొంది. పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయం గురించి ఇండియా పోస్ట్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. "ఇప్పుడు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ఎస్ కౌంటర్ వద్ద పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడం సులభం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సమీప పోస్టాఫీసును సందర్శించండి" అని ట్వీట్ లో పేర్కొంది. పాస్‌పోర్టు కోసం ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకున్న, దరఖాస్తు చేసిన పాస్‌పోర్టు దరఖాస్తుదారులు ఇప్పుడు దరఖాస్తు ప్రింట్ రసీదు, ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు సేవా కేంద్రం లేదా పాస్‌పోర్టు సౌకర్యం గల సమీప పోస్టాఫీసుకు వెళ్ళవచ్చు. Now it’s easy to register and apply for a passport at your nearest post office CSC counter. To know more, visit the nearest post office. #AapkaDostIndiaPost — India Post (@IndiaPostOffice) July 24, 2021 ఇటీవలే ఇండియా పోస్ట్ పెన్షనర్లు, ఇతర సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను కూడా ప్రారంభించింది. ఇంకా, ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం డోర్ స్టెప్ సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది. -
వృద్ధులకు, పింఛనుదారులకు గుడ్ న్యూస్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా వృద్దులు, పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు అని ప్రకటించింది. తాజా నిర్ణయంతో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ భారీ ఉపశమనం లభించింది. సాంకేతికపరిజ్ఞానం లేని వృద్దులు తమ లైఫ్ సర్టిఫికేట్ పొందడం కోసం వారు బ్యాంకులను సందర్శించాల్సి వచ్చేది. అక్కడ వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లయింది. "ఇకపై వృద్ధులు సులభంగా జీవన ప్రమాణ సేవలను పొందవచ్చు. సమీప పోస్టాఫీసులో ఉండే సీఎస్సీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి" అని పోస్టల్ విభాగం ట్వీట్ చేసింది. తాజా నిర్ణయం వల్ల కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యుటీలు) 60 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ది జీవన్ ప్రమాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందడానికి పెన్షన్ తీసుకునే వ్యక్తి ప్రభుత్వం చేత గుర్తించబడిన ఏజెన్సీ ముందు హాజరు కావాలి లేదా పింఛనుదారుడు ఇంతకు ముందు పనిచేసిన అథారిటీ ద్వారా జారీ చేయబడ్డ లైఫ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. తర్వాత దానిని ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడుఆ వారు లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి సమీప పోస్టాఫీసు కేంద్రాన్ని సందర్శించవచ్చు. అలాగే, మీ దగ్గరలో గనుక జీవన్ ప్రమాన్ కేంద్రాలు ఉంటే దాని ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ కేంద్రాలలో వారు మీ ఆధార్ బయో మెట్రిక్ తీసుకుంటారు. वरिष्ठ नागरिक अब सरलता से नज़दीकी डाकघर के सीएससी काउंटर पर जीवन प्रमाण सेवाओं का लाभ उठा सकते हैं। #AapkaDostIndiaPost Senior citizens can now easily avail the benefit of Jeevan Praman services at the nearest post office CSC counter.#AapkaDostIndiaPost pic.twitter.com/tKrzifc6yc — India Post (@IndiaPostOffice) July 15, 2021 -
పన్ను చెల్లింపుదారులకు పోస్ట్ ఆఫీస్ గుడ్‌న్యూస్!
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు పోస్ట్ ఆఫీస్ శుభవార్త తెలిపింది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి వేతన తరగతి ప్రజలు ఇకపై చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు సమీపంలోని పోస్టాఫీసు కామన్ సర్వీసెస్ సెంటర్స్(సీఎస్ సీ) కౌంటర్ లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను పొందవచ్చు అని ఇండియా పోస్ట్ తెలిపింది. "ఇప్పుడు మీ ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. మీరు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ సీ కౌంటర్ వద్ద ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను సులభంగా పొందవచ్చు#AapkaDostIndiaPost" అని ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది. పోస్ట్ ఆఫీస్ సీఎస్ సీ కౌంటర్ వద్ద ప్రజలు పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలతో పాటు ఇతర ప్రభుత్వ సమాచారం యాక్సెస్ చేసుకోవచ్చు అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ తెలిపింది. ప్రభుత్వం అందించే అన్ని ఈ-సేవలను, పౌరులు వారి స్థానిక తపాలా కార్యాలయాలలో పొందవచ్చు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద అందించే సేవలను వేగంగా స్వీకరించడానికి, పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుంది అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ పేర్కొంది. ఇంతకు ముందు జూన్ 7న ఆదాయపు పన్ను శాఖ తన కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.inను ప్రారంభించింది. अब आयकर रिटर्न जमा करने के लिए दूर जाने की ज़रूरत नहीं है। आप अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर आसानी से आयकर रिटर्न सेवाओं का लाभ उठा सकते हैं।#AapkaDostIndiaPost pic.twitter.com/afb1sc7GNs — India Post (@IndiaPostOffice) July 14, 2021 -
లాక్డౌన్.. స్ఫూర్తిని వీడని పోస్టల్ శాఖ
న్యూఢిల్లీ : ఓవైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా భారత తపాలా శాఖ పూర్తి స్థాయిలో సేవలను అందిస్తోంది. క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తూ స్ఫూర్తి కొనసాగిస్తుంది. ప్రస్తుత తరుణంలో తపాలా సేవలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రజలకు ఇంటి వద్దే బ్యాంక్‌లో ఉన్న డబ్బును ఉపసంహరించుకునే సౌలభ్యం, గ్రామీణ డాక్ సేవలతో సహా వివిధ విధులను పోస్టల్ ఉద్యోగులు నిర్వర్తిస్తున్నారు. వీటికి తోడు అవసరమైన చోట్ల మెడిసిన్, ఆహార పొట్లాలు, అవసరమైన సరుకులు కూడా సరఫరా చేస్తున్నారు. కష్టకాలంలో పేదలకు చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అందజేసిన సబ్సిడీలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మరోవైపు కరోనా వేళ సేవలు అందిస్తున్న తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధులను నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈ వైరస్ బారిన పడి మరణిస్తే రూ.పది లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్లో ఏప్రిల్ 25వరకు పోస్టల్ శాఖ అందజేసిన సేవలు.. రూ. 452 కోట్లు విలువచేసే 23 లక్షలకు పైగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలు రూ. 700 కోట్లు విలువచేసే 74.6 లక్షల డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ) పేమెంట్స్ అందజేత రూ. 33,000 కోట్లు విలువచేసే 2.3 కోట్ల పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ లావాదేవీలు, రూ. 2,600 కోట్లు విలువచేసే ఒక కోటి ఐపీపీబీ(ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) లావాదేవీలు 42.5 లక్షల లేఖలు, రూ. 355 కోట్లు విలువచేసే 31.5 లక్షల మనీ ఆర్డర్స్ వినియోగదారులకు అందజేత -
బీమా రంగంలోకి ఇండియాపోస్ట్..
న్యూఢిల్లీ: ప్రత్యేకంగా బీమా సర్వీసుల వ్యాపార విభాగం ఏర్పాటుపై ఇండియా పోస్ట్ దృష్టి సారించింది. దీనికి సంబంధించి తగు సలహాలు ఇచ్చేందుకు కన్సల్టెంట్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఎంపిౖMðన కన్సల్టెంటు.. వ్యూహాత్మక వ్యాపార విభాగంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) ఏర్పాటు, ప్రభావాలు, పోస్టల్ విభాగం పరిధిలోనే ప్రభుత్వ రంగ çస్వతంత్ర సంస్థగా మార్చడం తదితర అంశాలను అధ్యయనం చేసి, ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రీ–బిడ్ సమావేశం సెప్టెంబర్ 18న జరిగినట్లు వివరించాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ, డెలాయిట్ ఇండియా వంటి పేరొందిన కన్సల్టెన్సీ సంస్థలు దీనికి హాజరైనట్లు పేర్కొన్నాయి. రెండేళ్ల కాలంలో పోస్టల్ విభాగం ప్రత్యేక బీమా సంస్థ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం పోస్టల్ విభాగం.. ప్రభుత్వ, సెమీ – గవర్నమెంట్ ఉద్యోగులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) కింద జీవిత బీమా పథకాలు అందిస్తోంది. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు, మహిళలకు బీమా కవరేజీ అందించే ఉద్దేశంతో 1995 మార్చిలో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్పీఎల్ఐ) పథకాలను కూడా ప్రవేశపెట్టింది. 2017 మార్చి 31నాటికి మొత్తం 46.8 లక్షల పీఎల్ఐ, 1.46 కోట్ల ఆర్పీఎల్ఐ పాలసీలు ఉన్నాయి. పోస్టల్ విభాగం ఇటీవలే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ను కూడా ప్రారంభించింది. బజాజ్ అలయంజ్ పాలసీలను విక్రయించేందుకు అయిదేళ్ల పాటు కార్పొరేట్ ఏజంటుగా వ్యవహరించే ఒప్పందాన్ని ఇటీవలే కుదుర్చుకుంది. -
పార్సిల్ బిజినెస్‌పై ఇండియా పోస్ట్, రైల్వే దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని పార్సిల్ బిజినెస్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇండియా పోస్ట్, రైల్వేలు సంయుక్తంగా ముందుకెళ్లనున్నాయి. ఇవి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై అధిక దృష్టి కేంద్రీకరించనున్నాయని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇటీవలే రైల్వే, ఇండియా పోస్ట్ మధ్య ఒక సంయుక్త సమావేశం జరిగిన విషయం విదితమే. ‘రైల్వేకు ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇండియా పోస్ట్‌కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ రెండు కలిసి ముందుకెళితే పార్సిల్ వ్యాపారంలో మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు’ అని మనోజ్ సిన్హా తెలిపారు. గ్రామీణ ప్రాంతాలోని పార్సిల్ బిజినెస్‌లో ఇండియా పోస్ట్‌కి కొద్దిగా, రైల్వేకి 3-4 శాతం వాటా ఉందన్నారు. పోస్టల్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ.. దీని బోర్డు ఏర్పాటు జరిగిందని, సీఈవో నియామకం కోసం వెతుకులాట ప్రారంభమైందని చెప్పారు. కాగా, పోస్టల్ విభాగం(డీవోపీ) 57 ఇంటిగ్రేటెడ్ పార్సిల్ బుకింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. డీవోపీ ఇప్పటికే రూ.101-రూ.151 ధర శ్రేణిలో గంగాజల్(గంగోత్రి, రిషికేశ్‌లోని నీరు) బాటిళ్లను విక్రయిస్తోంది. -
రాఖీకి పోస్టల్ శాఖ అరుదైన కానుక
ముంబై: ముంబై పోస్టల్ శాఖ రక్షా బంధన్ సందర్భంగా అన్నచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు సంతోషపడే నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండురోజులు రావడంతో రాఖీ పౌర్ణమిరోజు సోదరసోదరీమణుల ఆనందాన్ని ఇనుమడింప చేసే లక్ష్యంతో అరుదైన నిర్ణయం తీసుకుంది. ఎక్కడో దూరాన ఉన్న అక్కాచెల్లెళ్లు పంపించే రాఖీలను సకాలంలో డెలివరీ చేయాలనే యోచనతో ఆగస్ట్14 ఆదివారం ముంబై పోస్టల్ డిపార్ట్ మెంట్ పనిచేయాలని నిర్ణయించుకుంది. శనివారం సెమీ క్లోజ్డ్ , ఆదివారం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సం సెలవు లు రావడంతో పోస్ట్ ద్వారా వచ్చిన రాఖీలు ప్రతి వినియోగదారునికి బట్వాడా చేయడం కోసం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం ముంబై నగరం, థానే / నవీ ముంబై, పాల్ఘర్ , రైగాడ్ జిల్లాలలో ప్రధాన పోస్ట్ కార్యాలయం ఆదివారం నాడు ప్రత్యేకంగా పనిచేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఇ- కామర్స్ వ్యాపారంలో గణనీయమైన వృద్ధి ఉందనీ, అందుకే సాధారణ వాటితో పాటూ, ప్రత్యేకంగా వచ్చిన రాఖీ కానుకలను కూడా రాఖీ రోజు పంపిణీ చేయడానికి వీలుగా చర్యలు తీసుకున్నామని అసిస్టెంట్ డైరెక్టర్ వీవీ నాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముంబై పోస్టల్ ప్రాంతం అంతటా ముంబై నగరం, పొరుగున ఉన్న థానే, పాల్ఘర్ , రైగాడ్ జిల్లాల అంతటా బలమైన నెట్ వర్క్ ఉందని..దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తమ ఈ నిర్ణయం లక్షల వినియోగదారులకు సరైన సమయానికి అందించడానికి మార్గం సుగమం చేసిందని ఆయన తెలిపారు. రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి గా పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకుసూచికగా రాఖీలు కట్టుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే మొదట్లో ఉత్తర, పశ్చిమ భారతదేశాలకే పరిమితమైన ఈ సాంప్రదాయం ఇపుడు సర్వత్రా వ్యాపించిన సంగతి తెలిసిందే. -
పోస్టల్ చెల్లింపు బ్యాంక్‌కు పీఐబీ ఆమోదం
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న రూ.800 కోట్ల చెల్లింపు బ్యాంక్ ప్రతిపాదనకు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(పీఐబీ) ఆమోదం తెలిపింది. తుది ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను నెల రోజుల్లోపల కేబినెట్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయని పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలోని పీఐబీ ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడి ప్రతిపాదనల వ్యవహారాలను చూస్తుంది. గత నెల 19న జరిగిన పీఐబీ సమావేశంలో ఇండియా పోస్ట్ రూ.800 కోట్ల చెల్లింపు బ్యాంక్ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఆ ఉన్నతాధికారి చెప్పారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి ఒక కన్సల్టెంట్‌ను నియమించే ప్రక్రియ తుదిదశలో ఉందని పేర్కొన్నారు. కన్సల్టెంట్ కోసం ఆరు సంస్థలను షార్ట్ లిస్ట్ చేయగా, వాటిల్లో మూడు సంస్థలు మాత్రమే బిడ్లను సమర్పించాయని వివరించారు. బ్యాంక్ సేవలు అందని గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలు లక్ష్యంగా ద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించనున్నది. సాధారణ డిపాజిట్, మనీ రెమిటెన్సెస్ల సేవలు అందించనున్నది. ఈ బ్యాంక్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రయోగాత్మకంగా కార్యకలాపాలు నిర్వహించనున్నది. మార్చి నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. ఇప్పటికే కొన్ని ఆర్థిక సేవలందిస్తున్న పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా 1.55 లక్షల బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఈ కామర్స్ అవకాశాలపై పోస్టల్ శాఖ కన్ను
న్యూఢిల్లీ: ఈ కామర్స్ అవకాశాలపై దృష్టిపెట్టాల్సిందిగా తపాలా శాఖ అధికారులను టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. చేనేత కార్మికులు, హస్త కళాకారులు, మహిళలు తయారు చేసే ఉత్పత్తులను వారి ఇంటివద్ద నుంచి సేకరించి కావలసిన వారి ఇంటివద్దకు చేర్చేలా తపాలా శాఖ పనిచేయాలని ఆయన కోరారు. కాగాపార్శిళ్ల రవాణాకు రోడ్డు రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ కామర్స్ వ్యాపార అవకాశాలను అందిపుచ్చేకునే ప్రయత్నాలను చేస్తున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా కొత్త టెక్నాలజీతో ఉపగ్రహాల సాయంతో పార్శిళ్లను ట్రాక్ చేసే మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా పార్శిళ్ల స్టేటస్‌ను వినియోగదారులకు తెలియజేసే ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నామని వివరించారు. ఇప్పటికే అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. -
పూర్తి స్థాయి బ్యాంక్ హోదానే కోరుతున్న ఇండియా పోస్ట్!
ముంబై: ఇండియా పోస్ట్ పూర్తిస్థాయి బ్యాంక్ (యూనివర్సల్ బ్యాంక్) హోదానే కోరుకుంటోందని మహారాష్ట్ర సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ప్రదీప్ కుమార్ బిషోయ్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇండియా పోస్ట్ పూర్తిస్థాయి బ్యాంక్ హోదానే కోరుకుంటున్నప్పటికీ, తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ అంశం మాజీ క్యాబినెట్ సెక్రటరీ టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ పరిశీలనలో ఉందని సైతం ఆయన అన్నారు. ఇండియా పోస్ట్‌కు కేవలం పేమెంట్ బ్యాంక్ హోదా ఇచ్చే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో బిషోయ్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. -
పేమెంట్ బ్యాంక్‌గా ఇండియా పోస్ట్!
ముంబై: పేమెంట్ బ్యాంక్‌గా ఇండియా పోస్ట్ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శి (సేవలు) జీఎస్ సంధూ సోమవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సంకేతాన్ని ఇచ్చారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- రికరింగ్, ఫిక్స్డ్ డిపాజిట్ల సేకరణ, ఇందుకు సంబంధించి చెల్లింపుల (ఒన్ సైడ్ బ్యాంకింగ్) విభాగంలో పోస్టల్ శాఖకు అపార అనుభవం ఉంది. రుణ పంపిణీకి సంబంధించిన విభాగంలో ఈ సంస్థ పనిచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో పేమెంట్ బ్యాంక్‌గా ఇండియా పోస్ట్ మంచి పనితీరును కనబర్చే అవకాశం ఉందని మంత్రిత్వశాఖ భావిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో నెట్వర్క్ కలిగి ఉండడం కూడా ఈ విషయంలో ఇండియా పోస్ట్‌కు కలిసి వచ్చే అంశం. పేమెంట్ బ్యాంక్‌గా ఇండియా పోస్ట్ మంచి సేవలు అందిస్తుందన్న అభిప్రాయాన్ని సంధు వ్యక్తం చేశారు. సంధు వెల్లడించిన అభిప్రాయం ప్రకారం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, ఇండియా పోస్ట్- పూర్తి స్థాయి యూనివర్సల్ బ్యాంక్‌కన్నా పేమెంట్ బ్యాంక్‌గా కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోస్టల్ శాఖకు దేశ వ్యాప్తంగా 1.35 లక్షల పోస్టల్ కార్యాలయాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించడానికి పోస్టల్ శాఖ ప్రయత్నం చేసింది. యూనివర్సల్ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసింది. అయితే గత యేడాది ఏప్రిల్ కొత్త బ్యాంకులకు లెసైన్స్ మంజూరు చేసిన సమయంలో ఇండియా పోస్ట్ దరఖాస్తు విషయంపై నిర్ణయం తీసుకునే అంశాన్ని ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ వదిలివేసింది. -
సామాన్యుడి సేవలో పోస్టల్
న్యూఢిల్లీ: సామాన్యుల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలను చేపడుతోందని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. నగరంలోని రెండు ప్రాంతాల్లో పోస్టల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారుల కోసం ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం) సేవలను పోస్టల్ శాఖ శనివారం ప్రారంభించింది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) ప్రాజెక్టులో భాగంగా 2015 మార్చి వరకు దేశవ్యాప్తంగా 2,800 ఏటీఎంలను ప్రారంభించనున్నారు. దేశంలో ఉన్న మొత్తం 1.6 లక్షల పోస్టాఫీస్‌ల ఆధునికీకరణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ మంత్రి క పిల్ సిబాల్ తెలిపారు. ఆయన ఐటీవో పోస్టాఫీస్ వద్ద ఏటీఎంను శనివారం ప్రారంభించారు. మరో ఏటీఎం కాశ్మీరీ గేట్ పోస్టాఫీస్ వద్ద ప్రారంభమైంది. ‘ఇది చాలా దూర ప్రయాణం. అయితే ప్రయాణం ప్రారంభించాం. 2015 మార్చివరకు దేశవ్యాప్తంగా 2,800 ఏటీఎంలను ఏర్పాటుచేయాలని నిర్ణయించాం..’ అని సిబాల్ వివరించా రు. ‘కొందరు సామాన్యుల గురించి మాట్లాడతారు అంతే.. మేం నిశ్శబ్దంగా సామాన్యుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం.. ఈ ఏటీఎంలు సామాన్యుల కోసమే.. వారికి నా అభినందనలు..’ అని సిబాల్ వ్యాఖ్యానించారు.‘ఈ ఏటీఎంలు మొ దటి 6-8 నెలల వరకు కేవలం పోస్టాఫీస్ వినియోగదారులకు మాత్రమే సేవలందిస్తా యి. తర్వాత వీటిని ఇతర బ్యాంకుల ఏటీఎంలకు అనుసంబంధానం చేస్తాం..దీనిద్వారా ఏ బ్యాంక్ వినియోగదారుడైన వీటినుంచి డబ్బులు తీసుకోవచ్చు..అలాగే పోస్టాఫీస్ వినియోగదారులు కూడా ఏ బ్యాంక్ ఏటీఎంనుంచైనా డబ్బులు తీసుకోగలిగే సౌలభ్యం ఏర్పడుతుంది..’ అని ఢిల్లీ సర్కిల్ ప్రధా న పోస్ట్ మాస్టర్ జనరల్ వసుమిత్రా తెలిపారు. ఈ నెలాఖరువరకు ఢిల్లీలో మరో 86 ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నామన్నారు. 2015 మార్చి కల్లా 600 ఏటీఎంలు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయని వివరిం చారు. ‘ఇండియా పోస్ట్ దేశంలోని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, ఆంధ్రప్రదేశ్ వంటి ఏడు రాష్ట్రాల్లో ఉన్న 64 లక్షల పొదుపుఖాతాలను ఈ సీబీఎస్‌తో అనుసంధానం చేసింది. దీనికి తోడు ఇండియా పోస్ట్ కూడా బ్యాం కింగ్ లెసైన్సు కోసం దరఖాస్తు చేసుకుంద’ని సిబాల్ వివరించారు. -
ఇక పోస్టల్ ఏటీఎంలు:తపాలా శాఖ
ముంబై: పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి శుభవార్త. ఇకపై పోస్టాఫీసుల్లో కూడా ఏటీఎంలు రాబోతున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా దేశవ్యాప్తంగా మూడు వేల ఏటీఎంలు, లక్షా 35 వేల మైక్రో ఏటీఎంలు నెలకొల్పాలని తపాలా శాఖ యోచిస్తోందని ఆ శాఖ కార్యదర్శి పద్మినీ గోపీనాథ్ వెల్లడించారు. ఫిబ్రవరి 5న న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో ఒక్కో ఏటీఎం ప్రారంభిస్తున్నామని, క్రమంగా వాటిని దేశమంతా విస్తరిస్తామని ఆమె ఆదివారం ఇక్కడ విలేకరులతో చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందించడానికి సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌తో భారత తపాలా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మైక్రో ఏటీఎంలు చేతిలో ఇమిడిపోయే పరికరం. దీనిని పోస్టాఫీసు స్థాయిలో ఉపయోగించవచ్చు. ఇక ఏటీఎంలు వాణిజ్య బ్యాంకుల ఏటీఎంల మాదిరిగానే పనిచేస్తాయి. -
ఇండియా పోస్ట్ లక్ష్యం... రెండేళ్లలో 2,800 ఏటీఎంలు
న్యూఢిల్లీ: రెండేళ్లలో దేశవ్యాప్తంగా 2,800 ఏటీఎంలు ... గ్రామాల్లోని తమ శాఖల్లో 1.30 లక్షల మైక్రో ఏటీఎంలు... వీటి ఏర్పాటుకు రూ.4,900 కోట్ల వ్యయం... ఇండియా పోస్ట్(తపాలా శాఖ) బృహత్ ప్రణాళిక ఇది. దీంతో దేశీయ బ్యాంకింగ్ రంగంలో పోటీ తీవ్రరూపం దాల్చే అవకాశముంది. బ్యాంకింగ్ లెసైన్సు కోసం ఇప్పటికే ఆర్బీఐకి దరఖాస్తు చేసిన ఇండియా పోస్ట్... ఏటీఎం సేవల కోసం బ్యాంకులు, వీసా, మాస్టర్కార్డ్లతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియనూ ప్రారంభించింది. ఈ ప్రణాళిక సకాలంలో పూర్తయితే దేశంలోని ఇతర బ్యాంకుల కంటే మెరుగైన సేవలను అందించగలుగుతుంది. మారుమూల పల్లెలకూ బ్యాంకింగ్ సేవలందించాలన్న (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలోనూ ఇండియా పోస్ట్ ముందంజలో ఉంటుంది. ‘మాకు బ్యాంకింగ్ లెసైన్స్ వస్తుందా రాదా అనేది తర్వాతి సంగతి. విస్తరణ, ఆధునీకీకరణ చర్యలు మాత్రం కొనసాగుతాయి. 2015 నాటికి దేశీయ ప్రధాన కేంద్రాల్లో మాకు 2,800కు పైగా ఏటీఎంలు ఉంటాయి. అలాగే, 1.30 లక్షల గ్రామాల్లో హ్యాండ్ హెల్డ్ మైక్రో ఏటీఎంల ఏర్పాటుకు యత్నిస్తున్నాం...’ అని ఇండియా పోస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. మైక్రో ఏటీఎంల ఏర్పాటుకు ప్రతిపాదన విజ్ఞప్తి (ఆర్ఈపీ) టెండర్‌ను ఇండియాపోస్ట్ వచ్చే నెలలో ఆహ్వానించనుంది. రూ.4,900 కోట్ల విస్తరణ, ఆధునికీకరణ ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం ఇప్పటికే లభించింది. చెన్నైలోని మూడు కార్యాలయాల్లో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఇండియాపోస్ట్ గత వారంలో ప్రారంభించింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇతర కేంద్రాల్లోనూ ఈ తరహా సౌకర్యాలు కల్పించే యత్నాల్లో ఉంది. సంస్థకు 1.55 లక్షల పోస్టాఫీసులు ఉండగా వీటిలో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. తపాలా సేవలతో పాటు చిన్నతరహా పొదుపులు, తపాలా జీవిత బీమా, నగదు బదిలీలు, మ్యూచువల్ ఫండ్ల విక్రయం, విదేశీ మారకం, పింఛన్లు, ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపు వంటి కార్యకలాపాలను ఇండియాపోస్ట్ నిర్వహిస్తోంది. నగదు చెల్లింపు సేవలు షురూ.. న్యూఢిల్లీ: వివిధ దేశాల నుంచి భారత్‌కు పంపే నగదును ఇక్కడ చెల్లించే సేవలను ఇండియా పోస్ట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఫ్రాన్స్, యూఏఈలలో ఈ సేవలు లభిస్తాయి. ఉక్రెయిన్, లావోస్, మారిషస్, శ్రీలంక, కాంబోడియా, తదితర దేశాల్లోనూ ఈ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఇండియా పోస్ట్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. యూనివర్సల్ పోస్ట్ యూనియన్ (యూపీయూ)కు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ (ఐఎఫ్ఎస్) ప్లాట్‌ఫామ్‌పై తాజా సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. ఇక్కడ అందుకునే వారికి రూ.50 వేలలోపు మొత్తాన్ని పోస్టాఫీసు కౌంటర్లలో, అంతకుమించితే చెక్కుల రూపంలో చెల్లిస్తారు.