పార్సిల్ బిజినెస్పై ఇండియా పోస్ట్, రైల్వే దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని పార్సిల్ బిజినెస్‌లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇండియా పోస్ట్, రైల్వేలు సంయుక్తంగా ముందుకెళ్లనున్నాయి. ఇవి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై అధిక దృష్టి కేంద్రీకరించనున్నాయని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇటీవలే రైల్వే, ఇండియా పోస్ట్ మధ్య ఒక సంయుక్త సమావేశం జరిగిన విషయం విదితమే. ‘రైల్వేకు ట్రాన్స్‌పోర్ట్ ఉంది. ఇండియా పోస్ట్‌కి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది.
ఈ రెండు కలిసి ముందుకెళితే పార్సిల్ వ్యాపారంలో మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు’ అని మనోజ్ సిన్హా తెలిపారు. గ్రామీణ ప్రాంతాలోని పార్సిల్ బిజినెస్‌లో ఇండియా పోస్ట్‌కి కొద్దిగా, రైల్వేకి 3-4 శాతం వాటా ఉందన్నారు. పోస్టల్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ.. దీని బోర్డు ఏర్పాటు జరిగిందని, సీఈవో నియామకం కోసం వెతుకులాట ప్రారంభమైందని చెప్పారు. కాగా, పోస్టల్ విభాగం(డీవోపీ) 57 ఇంటిగ్రేటెడ్ పార్సిల్ బుకింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. డీవోపీ ఇప్పటికే రూ.101-రూ.151 ధర శ్రేణిలో గంగాజల్(గంగోత్రి, రిషికేశ్‌లోని నీరు) బాటిళ్లను విక్రయిస్తోంది.