
ప్రజల వద్ద 6,970 కోట్ల విలువైన నోట్లు
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లు 98 శాతం బ్యాంకుల్లోకి తిరిగొచ్చినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే, ఇప్పటికీ రూ.6,970 కోట్ల విలువ చేసే నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నట్టు తెలిపింది. రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్‌బీఐ 2023 మే 19న ప్రకటించడం గమనార్హం. ‘‘అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉండగా, 2024 అక్టోబర్ 31 నాటికి రూ.6,970 కోట్లకు తగ్గాయి.
అంటే 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లతో 98.04% వెనక్కి వచ్చాయి’’అని ఆర్‌బీఐ తెలిపింది. అన్ని బ్యాంకు శాఖల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్‌కు, మార్పిడికి ఆర్‌బీఐ అవకాశం కల్పించడం తెలిసిందే. 2023 అక్టోబర్ 7 వరకు ఇందుకు అనుమతించింది. ఆర్‌బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసులలో రూ.2,000 నోట్ల మార్పిడి సదుపాయం ఇప్పటికీ కొనసాగుతోంది. తమ బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు రూ.2,000 నోట్లను ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుకు ఇండియా పోస్ట్ ద్వారా పంపుకునేందుకు వీలుంది. హైదరాబాద్ ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసులోనూ ఈ సదుపాయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment