ఇండియా పోస్ట్ లక్ష్యం... రెండేళ్లలో 2,800 ఏటీఎంలు
న్యూఢిల్లీ: రెండేళ్లలో దేశవ్యాప్తంగా 2,800 ఏటీఎంలు ... గ్రామాల్లోని తమ శాఖల్లో 1.30 లక్షల మైక్రో ఏటీఎంలు... వీటి ఏర్పాటుకు రూ.4,900 కోట్ల వ్యయం... ఇండియా పోస్ట్(తపాలా శాఖ) బృహత్ ప్రణాళిక ఇది. దీంతో దేశీయ బ్యాంకింగ్ రంగంలో పోటీ తీవ్రరూపం దాల్చే అవకాశముంది. బ్యాంకింగ్ లెసైన్సు కోసం ఇప్పటికే ఆర్‌బీఐకి దరఖాస్తు చేసిన ఇండియా పోస్ట్... ఏటీఎం సేవల కోసం బ్యాంకులు, వీసా, మాస్టర్‌కార్డ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియనూ ప్రారంభించింది. ఈ ప్రణాళిక సకాలంలో పూర్తయితే దేశంలోని ఇతర బ్యాంకుల కంటే మెరుగైన సేవలను అందించగలుగుతుంది. మారుమూల పల్లెలకూ బ్యాంకింగ్ సేవలందించాలన్న (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలోనూ ఇండియా పోస్ట్ ముందంజలో ఉంటుంది.
‘మాకు బ్యాంకింగ్ లెసైన్స్ వస్తుందా రాదా అనేది తర్వాతి సంగతి. విస్తరణ, ఆధునీకీకరణ చర్యలు మాత్రం కొనసాగుతాయి. 2015 నాటికి దేశీయ ప్రధాన కేంద్రాల్లో మాకు 2,800కు పైగా ఏటీఎంలు ఉంటాయి. అలాగే, 1.30 లక్షల గ్రామాల్లో హ్యాండ్ హెల్డ్ మైక్రో ఏటీఎంల ఏర్పాటుకు యత్నిస్తున్నాం...’ అని ఇండియా పోస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. మైక్రో ఏటీఎంల ఏర్పాటుకు ప్రతిపాదన విజ్ఞప్తి (ఆర్‌ఈపీ) టెండర్‌ను ఇండియాపోస్ట్ వచ్చే నెలలో ఆహ్వానించనుంది. రూ.4,900 కోట్ల విస్తరణ, ఆధునికీకరణ ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం ఇప్పటికే లభించింది. చెన్నైలోని మూడు కార్యాలయాల్లో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఇండియాపోస్ట్ గత వారంలో ప్రారంభించింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇతర కేంద్రాల్లోనూ ఈ తరహా సౌకర్యాలు కల్పించే యత్నాల్లో ఉంది. సంస్థకు 1.55 లక్షల పోస్టాఫీసులు ఉండగా వీటిలో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. తపాలా సేవలతో పాటు చిన్నతరహా పొదుపులు, తపాలా జీవిత బీమా, నగదు బదిలీలు, మ్యూచువల్ ఫండ్ల విక్రయం, విదేశీ మారకం, పింఛన్లు, ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపు వంటి కార్యకలాపాలను ఇండియాపోస్ట్ నిర్వహిస్తోంది.
నగదు చెల్లింపు సేవలు షురూ..
న్యూఢిల్లీ: వివిధ దేశాల నుంచి భారత్‌కు పంపే నగదును ఇక్కడ చెల్లించే సేవలను ఇండియా పోస్ట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఫ్రాన్స్, యూఏఈలలో ఈ సేవలు లభిస్తాయి. ఉక్రెయిన్, లావోస్, మారిషస్, శ్రీలంక, కాంబోడియా, తదితర దేశాల్లోనూ ఈ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఇండియా పోస్ట్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. యూనివర్సల్ పోస్ట్ యూనియన్ (యూపీయూ)కు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎస్) ప్లాట్‌ఫామ్‌పై తాజా సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. ఇక్కడ అందుకునే వారికి రూ.50 వేలలోపు మొత్తాన్ని పోస్టాఫీసు కౌంటర్లలో, అంతకుమించితే చెక్కుల రూపంలో చెల్లిస్తారు.