micro ATMs
-
బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండానే పీఎం కిసాన్, రైతుబంధు డబ్బులు
సాక్షి, హైదరాబాద్: అటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇటు రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకం.. ఈ రెంటి లబ్ధిదారులు డబ్బుల కోసం బ్యాంకులకో, ఏటీఎం కేంద్రాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా తపాలా సిబ్బందే అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు డబ్బులు తీయడానికి దగ్గర్లోని పట్టణాలకు వెళ్లకుండా పోస్టాఫీసులు అందుబాటులోకి తెచ్చిన మైక్రో ఏటీఎంలతో డబ్బులు అందజేస్తున్నారు. లబ్ధిదారులు గ్రామంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌కార్డు చూపి బయోమెట్రిక్ విధానంలో సులభంగా డబ్బులు తీసుకోగలుగుతున్నారు. ఇందుకోసం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ పరిధిలోని 4,700 పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా 29,545 మందికి రూ.15.39 కోట్లను చెల్లించగా, ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద శనివారం నుంచి చెల్లింపులు ప్రారంభించారు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబరు, మొబైల్ నంబరు చెబితే అక్కడి సిబ్బంది వివరాలను బయోమెట్రిక్‌తో ఉండే మైక్రో ఏటీఎం యంత్రంలో నమోదు చేస్తారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని చెప్పి యంత్రంలోని బయోమెట్రిక్ స్క్రీన్‌పై వేలిముద్ర వేస్తే చాలు.. ఆ పథకాల తాలూకు డబ్బులు అందుతాయి. అయితే ఒకసారి గరిష్టంగా రూ.10 వేలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రక్రియకు రుసుము చెల్లించాల్సిన పని లేదు. (కొత్త ఏడాది ఊపుతో తెగ తాగేశారు.. రాష్ట్రంలో ఎన్ని కోట్ల మద్యం అమ్ముడైందో తెలుసా?) -
రాపిపే నుంచి మైక్రో ఏటీఎం
సాక్షి, హైదరాబాద్ : క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్‌కు చెందిన అనుబంధ కంపెనీ రాపిపే మైక్రో ఏటీఎంలను ప్రవేశపెట్టింది. కస్టమర్లు రాపిపే సాథి కేంద్రాలకు వెళ్లి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకింగ్ సేవలూ పొందవచ్చు. చిన్న వర్తక కేంద్రాలను సాథి స్టోర్లుగా కంపెనీ మలుస్తోంది. దేశవ్యాప్తంగా 11 వేలపైచిలుకు ప్రాంతాల్లో 50,000లకుపైగా సాథి కేంద్రాలను రాపిపే నిర్వహిస్తోంది. సాథి కేంద్రాల నిర్వాహకులు బ్యాంకింగ్ బిజినెస్ కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల ఏటీఎంలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి 19 శాతమే. ఈ నేపథ్యంలో గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు చేరేందుకు మైక్రో ఏటీఎంలు చక్కని పరిష్కారమని కంపెనీ తెలిపింది. -
మైక్రో ఏటీఎంలు వచ్చేశాయ్
జంగారెడ్డిగూడెం : జిల్లాలో మైక్రో ఏటీఎంలు వచ్చేశాయి. కేవలం ఆధార్‌కార్డుతోనే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబర్ 8 ముందు వరకు ప్రజలు నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే ఏటీఎంలపై ఆధారపడే వారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తరువాత ఒక్కసారిగా నగదు కష్టాలు వెక్కిరించాయి. సుమారు అటూ, ఇటుగా నాలుగు నెలల పాటు ఏటీఎంలు పనిచేయలేదు. ఆ తరువాత ఒకొక్కటికిగా పనిచేయడం ప్రారంభించినా నగదు ఇబ్బందులు మాత్రం తీరలేదు. ఆ పరిస్థితి ఏడాది గడిచినా ఇప్పటికీ అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మైక్రో ఏటీఎంలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఏటీఎం కార్డుతోపాటు, ఆధార్‌కార్డు సహాయంతో నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ప్రజలు మెల్లమెల్లగా మైక్రో ఏటీఎంల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే జంగారెడ్డిగూడెం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం తదితర పట్టాణాల్లో మైక్రో ఏటీఎంలు అందుబాటులో కి వచ్చాయి. ఈ మైక్రో ఏటీఎంలలో కార్డు లేకపోయినా ఆధార్ నెంబరుతో నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డు దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఏ బ్యాంకు ఏటీఎం కార్డు ద్వారా అయినా ఈ మైక్రో ఏటీఎంల ద్వారా నగదు పొందవచ్చు. మైక్రో ఏటీఎంల సేవలు: ♦ ఆధార్‌కార్డు నంబరు అనుసంధానమైన ఏ బ్యాంకు అకౌంట్ నుంచైనా నగదును ఈ మైక్రో ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ ఏ బ్యాంకు ఏటీఎం కార్డు (డెబిట్ కార్డు) ద్వారానైనా నగదు డ్రా చేసుకోవచ్చు. ♦ ఐడీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించి కొత్త అకౌంట్‌ను ప్రారంభించుకోచ్చు. ♦ ఈ మైక్రో ఏటీఎం ద్వారా ఏ బ్యాంకు ఖాతాలోనైనా నగదు జమచేసుకోవచ్చు. అయితే దీనికి 1.5 శాతం సర్ఛార్జ్ పడుతుంది. ♦ ఆధార్ నంబరు ద్వారా ఏ బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ అయినా తెలుసుకోవచ్చు. ♦ బ్యాంకు సమయాలు, సెలవు రోజులతో సంబంధం లేకుండా సేవలు పొందవచ్చు. ♦ బ్యాంకు అకౌంట్ ఉన్న వ్యక్తి ఆధార్ నెంబరు తీసుకువెళితే మైక్రో ఏటీఎం ద్వారా ఆధార్‌నెంబరుతో, ఖాతాదారుడి వేలిముద్రతో నగదు డ్రా అవుతుంది. దీంతో ఎటువంటి మోసాలకు తావు ఉండదు. -
రేషన్ షాపులే మినీ బ్యాంకులు
► తెరపైకి రేషన్ షాపు బ్యాంకుల లావాదేవీలు ► డీలర్లకు మైక్రో ఏటీఎంలు అందించేందుకు సిద్ధం ► మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స డైరక్టర్ అశోక్ కుమార్ సింగ్ నుంచి ఆదేశాలు జారీ ► డీలర్లతో సమావేశమైన జేసీ, లీడ్‌బ్యాంక్ మేనేజర్, ఎన్ఐసీ అధికారులు విజయనగరం కంటోన్మెంట్: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజానీకం అతలాకుతలం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించనున్నది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స డెరైక్టర్ అశోక్ కుమార్ సింగ్ ఆదేశాలతో హుటాహుటిన డీలర్లతో జిల్లా అధికారులు సమావేశాన్ని నిర్వహించి బిజినెస్ కరస్పాండెంట్లుగా కొద్ది పాటి మొత్తాలకు పనిచేయాలని సూచనలు చేశారు. వీరి ద్వారా గ్రామాల్లో పరిమిత నగదు లావాదేవీలను నిర్వహింపజేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లతో మినీ కాన్ఫరెన్స హాలులో జారుుంట్ కలెక్టర్ శ్రీకేశ్ బి.లఠ్కర్, లీడ్ బ్యాంకు మేనేజర్ గురవయ్య, ఎన్ఐసీ అధికారులు బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుగత వెంకటేశ్వర రావు, జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రపు రామారావులతో బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండేందుకు ఎంత మంది రేషన్ డీలర్లు ఆసక్తిగా ఉన్నారో చర్చించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పరిమిత నగదు లావాదేవీలతో బ్యాంకింగ్ చేసేందుకు అర్హులైన డీలర్లు ముందుకు రావాలన్నారు. వీరికి రూ.ఐదారు వేల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ గురవయ్య మాట్లాడుతూ గ్రామాల్లోని రేషన్ షాపులే ఇక బ్యాంకు లావాదేవీలను పరిమితంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లు తమ పరిధిలో నెలలో కనీసం 20 రోజులు అందుబాటులో ఉండాలని, అదనపు వ్యాపార ప్రతినిధిగా పేరు నమోదు చేసుకోవాలని ఆయనతెలిపారు. ఆరుగురు సభ్యులతో కమిటీ.. డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించేందుకు జిల్లా స్థారుులో ఓ కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గానూ లీడ్ జిల్లా మేనేజర్ కన్వీనర్‌గానూ వ్యవహరిస్తారు. మరో నలుగురు అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. డీలర్లకు మైక్రో ఏటీఎంలు బిజినెస్ కరస్పాండెంట్లుగా లావాదేవీలు నిర్వహించేందుకు చేతిలో ఇమిడే మైక్రో ఏటీఎంలను రేషన్ డీలర్లకు అప్పగించేందుకు సిద్ధం చేశారు. వీటిని ఎన్ఐసీ, జేసీ, డీఎస్ఓ తదితర అధికారులతో కలసి సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఏఎస్ఓలు పి.నాగేశ్వరరావు, ఆర్.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మైక్రో ఏటీఎంలు అంటే ఏంటి?
-
మైక్రో ఏటీఎంలు అంటే ఏంటి?
త్వరలోనే భారీ సంఖ్యలో మైక్రో ఏటీఎంలను ప్రవేశపెడతామని, దానివల్ల డబ్బులు తీసుకోవడం సులభం అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అసలు ఈ మైక్రో ఏటీఎంలు అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఇన్నాళ్ల బట్టి డబ్బులు తీసుకోవాలంటే మనకు ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లు) మాత్రమే అలవాటు. నిజానికి మైక్రో ఏటీఎం అంటే.. కార్డు స్వైప్ చేసే పోర్టబుల్ యంత్రాలు. వీటికి జీపీఆర్ఎస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి.. డెబిట్ కార్డు స్వైప్ చేయగానే సంబంధిత బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. అందులో ఎంత బ్యాలెన్స్ ఉందో డిస్ప్లే అవుతుంది. అప్పుడు పరిమితిని బట్టి ఎంత మొత్తం విత్‌డ్రా చేయాలో అందులో ఎంటర్ చేసిన తర్వాత, అకౌంటు లోంచి ఆ మొత్తం తగ్గుతుంది. అప్పుడు ఆ పోర్టబుల్ యంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి.. ఆ మొత్తాన్ని తీసి ఇస్తాడన్న మాట. సాధారణంగా ఈ యంత్రాలను బిజినెస్ కరస్పాండెంట్లు (గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు ప్రతినిధులు) తీసుకెళ్తారు. బ్రాంచిల నుంచి దూరంగా ఉండే ప్రాంతాలకు చెందిన కస్టమర్లకు కూడా బ్యాంకు సేవలు అందేందుకు వీలుగా వీటిని తొలుత ప్రవేశపెట్టారు. ముందు ఇందులో డిపాజిట్ల స్వీకరణకు వీలు కల్పించారు. ఇప్పుడు అవసరాన్ని బట్టి పాతనోట్ల స్వీకరణ, కొత్త నోట్లు ఇవ్వడం లాంటి లావాదేవీలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక ఏటీఎంలో రోజుకు 80-100 వరకు లావాదేవీలు జరుగుతాయి. వాటి నిర్వహణకు నెలకు దాదాపు రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. అద్దె, టెలికం చార్జీలు, వార్షిక నిర్వహణ, విద్యుత్ ఖర్చులు, సెక్యూరిటీ గార్డు వేతనం అన్నీ ఇందులో ఉంటాయి. అదే మైక్రో ఏటీఎం అయితే యంత్రం ఖరీదు రూ. 20వేల లోపే ఉంటుంది. దాన్ని చేత్తో తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది కాబట్టి నిర్వహణ వ్యయం అంటూ ఏమీ ఉండదు. కేవలం చార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని జీఎస్ఎం సిమ్ కార్డుతో కూడా కనెక్ట్ చేసేందుకు వీలుంటుంది కాబట్టి, సిగ్నల్ వచ్చే ప్రతి ప్రాంతానికీ పంపొచ్చు. అయితే, ఇందులో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సంబంధిత బిజినెస్ కరస్పాండెంట్ (స్థానిక వ్యాపారులు, వేరే ఎవరైనా) వద్ద ఎంత మొత్తం ఉంటే అంతవరకు మాత్రమే ఇవ్వగలరు. ప్రస్తుతం బ్యాంకులలో కూడా కొంతమందికి ఇచ్చిన తర్వాత డబ్బులు అయిపోయాయన్న విషయం వినిపిస్తోంది. -
ఇండియా పోస్ట్ లక్ష్యం... రెండేళ్లలో 2,800 ఏటీఎంలు
న్యూఢిల్లీ: రెండేళ్లలో దేశవ్యాప్తంగా 2,800 ఏటీఎంలు ... గ్రామాల్లోని తమ శాఖల్లో 1.30 లక్షల మైక్రో ఏటీఎంలు... వీటి ఏర్పాటుకు రూ.4,900 కోట్ల వ్యయం... ఇండియా పోస్ట్(తపాలా శాఖ) బృహత్ ప్రణాళిక ఇది. దీంతో దేశీయ బ్యాంకింగ్ రంగంలో పోటీ తీవ్రరూపం దాల్చే అవకాశముంది. బ్యాంకింగ్ లెసైన్సు కోసం ఇప్పటికే ఆర్బీఐకి దరఖాస్తు చేసిన ఇండియా పోస్ట్... ఏటీఎం సేవల కోసం బ్యాంకులు, వీసా, మాస్టర్కార్డ్లతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియనూ ప్రారంభించింది. ఈ ప్రణాళిక సకాలంలో పూర్తయితే దేశంలోని ఇతర బ్యాంకుల కంటే మెరుగైన సేవలను అందించగలుగుతుంది. మారుమూల పల్లెలకూ బ్యాంకింగ్ సేవలందించాలన్న (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలోనూ ఇండియా పోస్ట్ ముందంజలో ఉంటుంది. ‘మాకు బ్యాంకింగ్ లెసైన్స్ వస్తుందా రాదా అనేది తర్వాతి సంగతి. విస్తరణ, ఆధునీకీకరణ చర్యలు మాత్రం కొనసాగుతాయి. 2015 నాటికి దేశీయ ప్రధాన కేంద్రాల్లో మాకు 2,800కు పైగా ఏటీఎంలు ఉంటాయి. అలాగే, 1.30 లక్షల గ్రామాల్లో హ్యాండ్ హెల్డ్ మైక్రో ఏటీఎంల ఏర్పాటుకు యత్నిస్తున్నాం...’ అని ఇండియా పోస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. మైక్రో ఏటీఎంల ఏర్పాటుకు ప్రతిపాదన విజ్ఞప్తి (ఆర్ఈపీ) టెండర్‌ను ఇండియాపోస్ట్ వచ్చే నెలలో ఆహ్వానించనుంది. రూ.4,900 కోట్ల విస్తరణ, ఆధునికీకరణ ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం ఇప్పటికే లభించింది. చెన్నైలోని మూడు కార్యాలయాల్లో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఇండియాపోస్ట్ గత వారంలో ప్రారంభించింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇతర కేంద్రాల్లోనూ ఈ తరహా సౌకర్యాలు కల్పించే యత్నాల్లో ఉంది. సంస్థకు 1.55 లక్షల పోస్టాఫీసులు ఉండగా వీటిలో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. తపాలా సేవలతో పాటు చిన్నతరహా పొదుపులు, తపాలా జీవిత బీమా, నగదు బదిలీలు, మ్యూచువల్ ఫండ్ల విక్రయం, విదేశీ మారకం, పింఛన్లు, ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపు వంటి కార్యకలాపాలను ఇండియాపోస్ట్ నిర్వహిస్తోంది. నగదు చెల్లింపు సేవలు షురూ.. న్యూఢిల్లీ: వివిధ దేశాల నుంచి భారత్‌కు పంపే నగదును ఇక్కడ చెల్లించే సేవలను ఇండియా పోస్ట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఫ్రాన్స్, యూఏఈలలో ఈ సేవలు లభిస్తాయి. ఉక్రెయిన్, లావోస్, మారిషస్, శ్రీలంక, కాంబోడియా, తదితర దేశాల్లోనూ ఈ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఇండియా పోస్ట్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. యూనివర్సల్ పోస్ట్ యూనియన్ (యూపీయూ)కు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ (ఐఎఫ్ఎస్) ప్లాట్‌ఫామ్‌పై తాజా సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. ఇక్కడ అందుకునే వారికి రూ.50 వేలలోపు మొత్తాన్ని పోస్టాఫీసు కౌంటర్లలో, అంతకుమించితే చెక్కుల రూపంలో చెల్లిస్తారు.