ఆదిలాబాద్ జిల్లా అల్లంపల్లి గ్రామంలో డబ్బులు అందజేస్తున్న బ్రాంచి పోస్ట్‌మాస్టర్
సాక్షి, హైదరాబాద్: అటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇటు రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకం.. ఈ రెంటి లబ్ధిదారులు డబ్బుల కోసం బ్యాంకులకో, ఏటీఎం కేంద్రాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా తపాలా సిబ్బందే అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు డబ్బులు తీయడానికి దగ్గర్లోని పట్టణాలకు వెళ్లకుండా పోస్టాఫీసులు అందుబాటులోకి తెచ్చిన మైక్రో ఏటీఎంలతో డబ్బులు అందజేస్తున్నారు. లబ్ధిదారులు గ్రామంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌కార్డు చూపి బయోమెట్రిక్ విధానంలో సులభంగా డబ్బులు తీసుకోగలుగుతున్నారు.
ఇందుకోసం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ పరిధిలోని 4,700 పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా 29,545 మందికి రూ.15.39 కోట్లను చెల్లించగా, ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద శనివారం నుంచి చెల్లింపులు ప్రారంభించారు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబరు, మొబైల్ నంబరు చెబితే అక్కడి సిబ్బంది వివరాలను బయోమెట్రిక్‌తో ఉండే మైక్రో ఏటీఎం యంత్రంలో నమోదు చేస్తారు.
రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని చెప్పి యంత్రంలోని బయోమెట్రిక్ స్క్రీన్‌పై వేలిముద్ర వేస్తే చాలు.. ఆ పథకాల తాలూకు డబ్బులు అందుతాయి. అయితే ఒకసారి గరిష్టంగా రూ.10 వేలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రక్రియకు రుసుము చెల్లించాల్సిన పని లేదు.
(కొత్త ఏడాది ఊపుతో తెగ తాగేశారు.. రాష్ట్రంలో ఎన్ని కోట్ల మద్యం అమ్ముడైందో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment