కౌటాల మండలం మొగడ్‌దగడ్ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మహిళ
బెల్లంపల్లి : భూరికార్డుల ప్రక్షాళన సర్వే, రైతుబంధు చెక్కుల పంపిణీ హత్యలకు పురిగొల్పుతున్నాయి. రక్త సంబంధీకులు, బంధువుల మధ్య వైరుధ్యాన్ని పెంచుతున్నాయి. భవిష్యత్‌లో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ఉండాలనే సంకల్పంతో ప్రారంభించిన భూ ప్రక్షాళన సర్వే కొనసాగుతున్న క్రమంలోనే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.
ఆస్తి కోసం అయిన వారు అని చూడకుండా ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. భూ వివాదాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. పలువురిపై దాడులు జరిగాయి. రోజు ఏదో ఓ చోట ఈ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
భూ వివాదాలు లేకుండా..
నిజాంకాలంలో చేసిన భూముల సర్వే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు సిద్ధపడింది. దశాబ్దాల నుంచి అపరిష్కృతంగా, వివాదాలతో ఉన్న భూముల రికార్డులను సరి చేసి, భవిష్యత్‌లో ఎలాంటి గొడవలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం భూ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఈ సర్వే 2017 సెప్టెంబర్ 15 నుంచి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామాల వారీగా ముందస్తుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారంగా భూ సర్వేకు శ్రీకారం చుట్టారు.
తొలి దఫా సర్వే చేసిన భూములను పార్ట్-ఏ కింద గుర్తించగా, వివాదాలు, తగాదాలు, సర్వే నంబర్ల తారుమారు, ప్రభుత్వ ,అటవీ భూములు, పంపకాలు జరగని, ఇతరాత్ర కారణాలు కలిగిన భూములను పార్ట్-బీ కింద పరిగణించారు. ప్రస్తుతం పార్ట్-ఏ పరిధిలో ఉన్న భూముల సర్వేను పూర్తి చేశారు. పార్ట్-బీ పరిధిలో చేర్చిన భూముల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. అధికారికంగా ఆన్‌లైన్‌లో మాత్రం వివరాలు నమోదు చేయడం లేదు. వీఆర్వోలు మాత్రం వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.
భూ సర్వేతో...
భూ ప్రక్షాళన సర్వేతో గ్రామాల్లో స్థబ్దతగా ఉన్న భూ వివాదాలు క్రమంగా మొదలయ్యాయి. పాలి పంపకాలు, భూమి అమ్మకం, కొనుగోళ్లతో తలెత్తిన తగాదాలు, విరాసత్ తదితర రకాల భూ సమస్యలు బహిర్గతం అయ్యి గొడవలకు ప్రేరేపించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున ఆర్థిక వితరణ ప్రకటించింది. పార్ట్-ఏ కొంద భూ సర్వే పూర్తి చేసిన భూములకు పంట పెట్టుబడిని చెక్కుల రూపంలో అందజేసింది.
గత మే 10 నుంచి 18 వరకు గ్రామగ్రామాన చెక్కుల పంపిణీ నిర్వహించారు. దీంతో భూ వివాదాలు, పగలు మరింత రెట్టింపయ్యాయి. భూమి, పంట పెట్టుబడి దక్కడం లేదనే కసితో మరణాయుధాలతో దాడులు చేసి, రక్తం కళ్ల జూస్తున్నారు. హత్యా,హత్యాయత్నాలకు సిద్ధపడుతున్న ఘటనలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్నాయి. భూమి కోసం ఎంతకైనా తెగిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పార్ట్-బీ సర్వే ఆరంభమయ్యాక మరిన్నీ హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. అసలైన భూమి చిక్కు ముడులన్నీ కూడా పార్ట్-బీలోనే ఉండటం గమనార్హం.
తలనొప్పిగా మారిన భూ తగాదాలు
గ్రామాల్లో చోటు చేసుకుంటున్న భూ తగాదాలు పోలీసులకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఏ చిన్న భూ సమస్య ఏర్పడిన ఘర్షణ పడి పోలీసుస్టేషన్‌కు వెళ్తున్నారు. ఒకరిపై ఒకరు కేసు పెడుతున్నారు. క్షణికావేశంలో ఏకంగా హత్య చేస్తున్నారు. హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.
భూ వివాదాలు సివిల్ మ్యాటర్‌గా పరిగణించి పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పంపిస్తుండగా చిలికిచిలికి గాలివానగా మారి ఘర్షణ పడుతుండటంతో క్రిమినల్ కేసులుగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఇతర కేసులు తగ్గుముఖం పట్టగా భూముల కోసం పొట్లాడుకుంటున్న కేసులు అధికంగా ఠాణాలకు వస్తున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఈతీరు పోలీసులకు సంకటంగా మారింది.
ఇటీవల జరిగిన ఘటనలు
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిపై అన్న బాపురెడ్డి ఈనెల 13న భూ వివాదంతో వేట కత్తితో పట్టపగలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తృటిలో తమ్ముడు లక్ష్మారెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
కుమురం భీం జిల్లా కౌటాల మండలం మొగడ్‌దగడ్ గ్రామంలో భూ వివాదంతో ఈనెల 15న మెస్రం వచలాబాయి, మెస్రం కమలాబాయి అనే ఇద్దరు మహిళలను వరుసకు కొడుకైన మెస్రం నానాజీ గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపాడు.
రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాంబయ్య అతని కుటుంబ సభ్యులు తమ భూమి అక్రమంగా రెవెన్యూ అధికారులు మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ ఈ నెల 22న తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
కాగజ్‌నగర్ మండలం బోడేపల్లి గ్రామంలో భూ తగాదాలతో బోర్లకుంట లక్ష్మి అనే మహిళపై రక్త సంబంధికుడైన బోర్లకుంట పోచయ్య గొడ్డలితో ఈ నెల 23న దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.రెబ్బెన మండలం ధర్మారం గ్రామంలో ఈనెల 27న నాయిని లచ్చయ్యను అతని అన్న నాయిని వెంకటేశ్ గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment