భైంసా బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన టెంటు కింద కూర్చున్న రైతులు (ఫైల్)
భైంసా(ముథోల్): బ్యాంకర్లు తలుచుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవని రైతుబంధు చెక్కుల పంపిణీతో వెల్లడైంది. వారం పాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులందరికీ గ్రామాల్లో పంపిణీ బృందాలు చెక్కులు అందించారు. అన్నదాతలు వీటిని నేరుగా తీసుకువచ్చి జిల్లాలోని ఆయా బ్యాంకుల్లో అందజేయగా.. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నగదు వారికి చేతికి అందించారు అధికారులు. దీంతో జిల్లా రైతులంతా బ్యాంకర్ల సేవకు మురిసిపోయారు. తొలిసారిగా రైతులను బ్యాంకర్లు గౌరవించడం, వారిని ఆహ్వానించడం, బ్యాంకుల ఎదుట టెంట్లు ఏర్పాటు చేసి కుర్చీలు వేసి చల్లని నీరందించి చేతికి నగదు అందించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
పంట రుణాలకు సైతం
జిల్లాలో సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య ఎప్పుడూ దాదాపు ఒక్కటే.. బ్యాంకులు కూడా అవే. అయితే ఈ రైతులే పంటరుణం కోసం బ్యాంకులకు వెళితే అక్కడి సిబ్బంది ఇచ్చే మర్యాదలు వారు అందించే సేవలు పూర్తి విరుద్ధం. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన రైతుబంధు పథకంలో జిల్లా రైతులకు బ్యాంకుల నుంచి మర్యాద దక్కింది. గతంలో పాసుపుస్తకాలను, ఇతర ప్రతులను తీసుకువెళ్లి పంట రుణాల కోసం వెళితే నానా ఇబ్బందులు పడేవారు. బ్యాంకు అధికారులను ఏడు, ఎనిమిది సార్లు కలిస్తేగాని రుణాలు ఇచ్చేవారు కాదు. నెల రోజులు తిరిగితే గాని ఈ పని అయ్యేది కాదు. మధ్యవర్తుల ప్రమేయంతో వెళ్లే రైతుల పని మాత్రం త్వరగానే పూర్తయ్యేది.
మధ్యవర్తులకే ప్రాధాన్యం...
నిర్మల్, ఖానాపూర్, కడెం, నర్సాపూర్, సారంగాపూర్, దిలావర్‌పూర్, కుంటాల, కల్లూరు, భైంసా, కుభీర్, తానూరు, లోకేశ్వరం, దేగాం, అబ్దుల్లాపూర్, వానల్‌పాడ్, బాసర, మామడ, లక్ష్మణచాంద ఇలా ఏ ప్రాంతంలోని బ్యాంకుకు వెళ్లినా అక్కడ బ్యాంకర్లు మధ్యవర్తులకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారనే ఆరోపణలున్నాయి. బ్యాంకర్ల సహకారంతో పంటరుణాల రెన్యువల్ పేరిట మధ్యవర్తులు అమాయక రైతులను దోచుకుంటున్నారు.
రుణాలు రెన్యువల్ చేయాలంటే తీసుకున్న మొత్తాన్ని కట్టాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. దీంతో ఏటా తాము తీసుకున్న డబ్బును రెన్యువల్ చేసేందుకు మధ్య దళారుల వద్ద రెండు రోజులకు రూ.50వేలకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అధికంగా కలిపి ఇస్తున్నారు. ఈ విధానం ఏటా జరుగుతూనే ఉంది. ఈ తతంగం బ్యాంకర్ల సహకారంతోనే ముందుకు సాగుతోంది. రైతులు తీసుకున్న రుణాలకు కేవలం వడ్డీ మాత్రమే తీసుకుంటే రైతులు మధ్య దళారులను కలవాల్సిన అవసరం ఉండదు. వడ్డీ తీసుకుని అసలు మళ్లీ క్రాప్‌లోన్ కింద జమ చేస్తే రైతులకు ఇబ్బందులు తలెత్తవు.
దృష్టిసారిస్తే వారం రోజుల్లోనే..
ప్రభుత్వ యంత్రాంగం పాలకులు దృష్టి సారిస్తే వారం రోజుల్లోనే పంటరుణాల ఇబ్బందులను పరిష్కరించవచ్చు. రైతుబందు చెక్కుల పంపిణీలో అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంటరుణాల కోసం కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇలాంటి నిర్ణయాలనే తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
మర్యాదలు బాగున్నాయి
ఇప్పుడు బ్యాంకర్లు బాగా నే మర్యాదలు ఇస్తున్నా రు. రైతులకు ఎప్పుడూ ఇలాంటి మర్యాదలే ఇవ్వాలి. బ్యాంకుకు వెళ్లిన వారందరికీ సేవలు అందిస్తున్నారు. వెంటనే నీడపట్టున కుర్చీలో కూర్చోవాలని సూచిస్తున్నారు. క్రాప్‌లోన్‌లు ఇచ్చే సమయంలోనూ జిల్లా రైతులకు ఇలాంటి సహాయ సహకారాలే అందించాలని వేడుకుంటున్నాం. బ్యాంకర్లు తలుచుకుంటే సాధ్యపడనిది ఏది ఉండదు. – సాయినాథ్, రైతు మహాగాం
రుణాలపై దృష్టి సారించాలి
పంటరుణాలు ఇప్పించే విషయంలోనూ ఇలాగే బ్యాంకర్లు మర్యాదలు ఇవ్వాలి. అధికారుల బృందం అంతా బ్యాంకు వద్దే ఉంచాలి. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు బ్యాంకు వద్ద ఉంటే సమస్యలు తీరుతాయి. స్థానికంగా ఉన్న చోటే రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందుతాయి. ఫలితంగా రుణాలు కూడా సకాలంలోనే దొరికే అవకాశం ఉంటుంది. రైతుబంధు చెక్కులకు నగదు ఇచ్చినట్లే క్రాప్‌లోన్‌లకు సైతం వెంటనే నగదు అందించాలి. బ్యాంకర్లు రైతులందరికీ ఇలాగే మర్యాదలు అందించాలని కోరుకుంటున్నాం. – రాజ్యం, రైతు కిర్గుల్(బి)
Comments
Please login to add a commentAdd a comment