సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న, అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్న రుణమాఫీకి అర్హులైన రైతుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఆగస్టు నెలాఖరు వరకు అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉండగా, ఇప్పుడిప్పుడే ఆ ప్రక్రియ తుదిదశకు చేరుకుంటోంది. ఆగస్టు 31లోగా ఈ జాబితాను పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.
ఈ మేరకు అర్హులైన జాబితాను రూపొందించేందుకు ఆగస్టు మూడో వారంలో మండల స్థాయి బ్యాంకర్ల సంయుక్త కమిటీలను నియమించారు. ఆయా మండలాల తహశీల్దార్లు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో ఆ మండలంలో ఉన్న బ్యాంకుల మేనేజర్లు, ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, ఆడిటర్లు తదితరులు సభ్యులుగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కమిటీ సమావేశాలు నిర్వహించి పంట రుణాలు పొందిన రైతుల వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 3.15 లక్షల మంది రైతులు రూ.1,514.35 కోట్ల మేరకు పంట రుణాలు పొందినట్లు ఈ కమిటీలు నిర్ధారించాయి.
అర్హులైన రైతుల ఎంపికకు..
పంట రుణాలు పొందిన 3.15 లక్షల మంది రైతుల్లో అర్హులైన వారి ఎంపిక కోసం తుది కసరత్తు ప్రారంభించినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ జి.ఉదయ్ రంజన్ శర్మ ‘సాక్షి’ ప్రతినిధితో తెలిపారు. ఒక్కో రైతు రెండు మూడు బ్యాంకుల్లో పంట రుణాలు పొందారు. అలాగే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సభ్యు ల పేర్లతో రుణాలు ఉన్నాయి. కొందరు రైతులు రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ ఇచ్చిన హా మీ మేరకు ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఈ 3.15 లక్షల మంది రైతుల్లో ఇలాంటి రైతులను గుర్తించేందుకు ఆనాగ్జర్-డిని తయారు చేస్తున్నామ ని, అనంతరం అర్హులైన రైతుల జాబితా తెలుస్తుందని లీడ్‌బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. రుణమాఫీకి అర్హులైన రైతులెవరో తేలాకే తిరిగి కొత్త రుణాలు మంజూరు ప్రక్రియ ప్రారంభించాలని బ్యాంకర్లు భావిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2,228.60 కోట్ల మేరకు పంట రుణాలు మంజూరు చేయాలని జిల్లా బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఖరీఫ్ కాలం దగ్గర పడుతున్నప్పటికీ కనీసం రూ.92 కోట్లు కూడా పంట రుణాలు ఇవ్వలేదు.
రీషెడ్యూల్‌పైనా స్పష్టత కరువు
రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌తోపాటు మెదక్, రంగారెడ్డి జిల్లా పరిధిలో వంద మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్ చేసేందుకు ఆర్బీఐ అనుమతించింది. ఈ వంద మండలాల్లో ఆదిలాబాద్ ఎన్ని మండలాలు ఈ రీషెడ్యూల్‌కు అనుమతి లభించిందనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. ఈ విషయంలో తమకెలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి అందలేదని అధికారులు పేర్కొంటున్నారు.
పంట రుణాలు రూ.1,514.35 కోట్లు
Published Wed, Sep 3 2014 1:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement