Post offices
-
అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎన్పీఎస్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్)ను అన్ని బ్యాంక్ శాఖలు, తపాలా కార్యాలయాల్లో (పోస్టాఫీసులు) అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. ప్రజలకు సులభంగా ఎన్పీఎస్ను అందుబాటులో ఉంచేందుకు, ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఎన్పీఎస్ పథకం పంపిణీ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లతో పీఎఫ్ఆర్డీఏ జట్టు కడుతోంది. దీంతో పల్లెలు, చిన్న పట్టణాల్లోని ప్రజలు సైతం ఈ పథకం ప్రయోజనాలను సులభంగా పొందడానికి వీలుంటుంది’’అని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ తెలిపారు. ప్రైవేటు రంగం నుంచి కార్పొరేట్, వ్యక్తిగత స్థాయిలో 13 లక్షల మందిని ఎన్పీఎస్ చందాదారులుగా చేర్చుకునే లక్ష్యంతో ఉన్నట్టు మహంతి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మందిని చేర్చుకున్నట్టు పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023 సెపె్టంబర్ 16 నాటికి ఎన్పీఎస్ చందారులు 1.36 కోట్లుగా ఉన్నారు. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులు 5 కోట్లుగా ఉన్నారు. ఎన్పీఎస్ కింద స్థిర పింఛను ఎందుకు నిర్ణయించలేదన్న ప్రశ్నకు మహంతి బదులిచ్చారు. ‘‘దీర్ఘకాలానికి పింఛను నిర్ణయించడం సాధ్యపడదు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, జీడీపీతో సమానంగా లేదంటే అంతకుమించి పింఛను నిధి ఉన్నా కానీ, ఈ విషయంలో సమస్య నెలకొంది’’అని వివరించారు. అయితే, ఎన్పీఎస్ నుంచి రాబడులు మెరుగ్గా ఉంటాయని చెబుతూ.. దీర్ఘకాలంలో మంచి నిధిని ఆశించొచ్చన్నారు. ఎన్పీఎస్ విక్రయంపై వచ్చే కమీషన్ చాలా తక్కువని, అందుకే ఏజెంట్లు దీని పట్ల ఆసక్తి చూపించడం లేదన్నారు. కానీ, ఎన్పీఎస్ను తక్కువ వ్యయంతో కూడిన ఉత్పత్తిగానే కొనసాగించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన పథకం నిర్వహణ ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంటాయన్నారు. -
పోస్టాఫీసుల నుంచే ఫారిన్‌కు పార్శిల్
సాక్షి, అమరావతి: విదేశాల్లో ఉన్న మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు పార్శిళ్లు పంపించడం మరింత సులభతరం కానుంది. మీ సమీపంలోని పోస్టాఫీసు నుంచే ఫారిన్‌కు పార్శిళ్లు పంపించవచ్చు. ఇందుకోసం దేశంలో భారీగా పోస్టాఫీసులకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖ అనుమతించింది. పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్విసులను కొన్నేళ్ల క్రితమే ప్రవేశపెట్టారు. కానీ, వాటిని అతి తక్కువ పోస్టాఫీసులకే పరిమితం చేశారు. దీంతో విదేశాలకు పార్శిళ్లు పంపించాలంటే దూరంగా ఉన్న పోస్టాఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. లేదా అధిక రుసుము చెల్లించి ప్రైవేట్ కొరియర్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యను గుర్తించి పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్విసులను దేశవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలని కేంద్ర ఎక్సైజ్–కస్టమ్స్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా కొత్తగా 715 పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్వీసులను అనుమతించింది. త్వరలోనే కొత్తగా అనుమతించిన పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 4 నుంచి 24కు పెంపు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 55 పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్వీసులకు అనుమతించారు. వాటిలో హెడ్ పోస్టాఫీసులు(హెచ్‌వో), సబ్ పోస్టాఫీసులు(ఎస్వో) కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు నాలుగు పోస్టాఫీసుల నుంచే విదేశాలకు పార్శిల్ సర్వీసులు అందిస్తున్నారు. కొత్తగా 24 పోస్టాఫీసుల నుంచి ఈ సేవలు అందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు తెలంగాణలో కేవలం ఒక్క పోస్టాఫీసు నుంచే విదేశాలకు పార్శిల్ చేసేందుకు అవకాశం ఉంది. తాజాగా 31 పోస్టాఫీసులకు అనుమతించారు. ఏపీలో కొత్తగా అనుమతించిన పోస్టాఫీసులు శ్రీకాకుళం హెచ్‌వో, విజయనగరం హెచ్‌వో, పార్వతీపురం హెచ్‌వో, అనకాపల్లి హెచ్‌వో, పాడేరు హెచ్‌వో, అమలాపురం హెచ్‌వో, కాకినాడ హెచ్‌వో, సామర్లకోట హెచ్‌వో, రాజమహేంద్రవరం హెచ్‌వో, తాడేపల్లిగూడెం హెచ్‌వో, మచిలీపట్నం హెచ్‌వో, విజయవాడ పాలిటెక్నిక్ ఎస్వో, గుంటూరు హెచ్‌వో, నరసరావుపేట హెచ్‌వో, బాపట్ల హెచ్‌వో, ఒంగోలు హెచ్‌వో, చిత్తూరు హెచ్‌వో, రాయచోటి హెచ్‌వో, కడప హెచ్‌వో, కర్నూలు హెచ్‌వో, నంద్యాల హెచ్‌వో, అనంతపురం హెచ్‌వో, ప్రశాంతినిలయం ఎస్వో, విజయవాడ బకింగ్‌హామ్‌పేట ఎస్వో. తెలంగాణలో కొత్తగా అనుమతించిన పోస్టాఫీసులు హైదరాబాద్ జీపీవో, భూపాలపల్లి ఎస్వో, జగిత్యాల హెచ్‌వో, జేఎన్టీయూ కూకట్పల్లి ఎస్వో, కొత్తగూడెం కోల్స్ హెచ్‌వో, మహబూబాబాద్ హెచ్‌వో, మహబూబ్‌నగర్ హెచ్‌వో, నిర్మల్ ఎల్ఎస్జీ ఎస్వో, వనస్థలిపురం ఎస్వో, వికారాబాద్ హెచ్‌వో, మంచిర్యాల హెచ్‌వో, మెదక్ హెచ్‌వో, ములుగు బి–క్లాస్ ఎస్వో, నాగర్‌కర్నూల్ ఎస్వో, నల్లగొండ హెచ్‌వో, నారాయణపేట ఎస్వో, భువనగిరి హెచ్‌వో, హన్మకొండ హెచ్‌వో, జనగాం హెచ్‌వో, కామారెడ్డి హెచ్‌వో, ఖమ్మం హెచ్‌వో, సిరిసిల్ల ఎస్వో, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎస్వో, సూర్యాపేట హెచ్‌వో, లక్ష్మీపూర్ ఎస్వో, వనపర్తి హెచ్‌వో, గద్వాల్ హెచ్‌వో, నిజామాబాద్ హెచ్‌వో, పెద్దపల్లి హెచ్‌వో, ఆర్సీ పురం హెచ్ఈ ఎస్వో, షాద్‌నగర్ ఎస్వో. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్‌తో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్‌డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో విడత సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ 19న ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఒక గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409 అని ఆర్బీఐ ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. పెట్టుబడి నాటికి ప్రకటించిన గ్రాము బంగారం విలువ ఆధారంగా వార్షికంగా 2.5 శాతం వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. గడువు తీరిన తర్వాత వచ్చే రాబడి, పెట్టుబడి మొత్తంపై పన్ను ఉండదు. ఒక ఇన్వెస్టర్ కనీసం ఒక గ్రాము నుంచి, గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్ పేమెంట్ చేసిన వారికి ఒక గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. -
పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త
పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) పొందడం సులభతరం కానుంది.నేటి నుంచి (సెప్టెంబరు 28 నుండి) పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో (POPSK) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు వారి ఇంటి అడ్రస్ ప్రకారం..స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఒక వ్యక్తి ఉద్యోగం, టెంపరరీ వీసా, పర్మినెంట్ రెసిడెన్షియల్ (పీఆర్) లేదా విదేశాలకు ఇమ్మిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా సర్టిఫికేట్ అవసరం. ఇంతకు ముందు, విదేశాల్లో నివసించే వారి విషయంలో ప్రభుత్వ పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ లేదా, ఇండియన్ ఎంబసీ/హైకమిషన్ కార్యాలయంలో ఆన్లైన్లో పీసీసీ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు, పాస్‌పోర్ట్ సంబంధిత సేవల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్రం అన్ని ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వద్ద పీసీసీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం..పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ధరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారి సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతకుముందు పీసీసీ అపాయింట్మెంట్ స్లాట్ల లభ్యతను కూడా మెరుగుపరుస్తామని ప్రకటన చేయగా.. తాజాగా పీసీసీపై ప్రకటన చేయడం పట్ల పాస్‌పోర్ట్ ధర ఖాస్తు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 428 పీసీసీ కేంద్రాలు పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖల చొరవతో పౌరులకు పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్ని అందనున్నాయి.కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 428 ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. -
మిరపకాయ టపా పేరిట పోస్టల్ కవర్ విడుదల
రాజవొమ్మంగి: విప్లవ వీరుడు, మన్యందొర అల్లూరి సీతారామరాజు ఉపయోగించిన ‘‘మిరపకాయ టపా’’ పేరిట తపాలా శాఖ శుక్రవారం రాజవొమ్మంగిలో తపాలా కవర్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ తరహా కార్యక్రమం ఆయన పాదముద్రలు పడిన ప్రాంతాలైన రంపచోడవరం, అడ్డతీగలలో పూర్తికాగా, ఇప్పుడు రాజవొమ్మంగి వంతు వచ్చింది. తాను వస్తున్నాను కాసుకోండి ఖబడ్దార్ (జాగ్రత్తపడు) అంటూ.. ప్రాణనష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు మిరపకాయ టపా పంపేవారట. అలా ఓ వైపు బ్రిటీష్ సేనలను జాగృతం చేస్తూనే, మరోవైపు ఉరుములేని మెరుపులా వచ్చి వాలిపోలియేవారని చెబుతారు. తాను ఎప్పుడు, ఎలా ఎక్కడకు వస్తున్నది, ఏం చేయబోతుంది, లేఖ రాసి బాణానికి గుచ్చి, దాంతో పాటే ఎర్ర మిరపకాయల గుత్తి కట్టి వదిలేవారట. ఆ విధంగా వచ్చిన రామబాణాన్ని చూసి ముష్కరులకు నిద్రపట్టేది కాదని, అప్పటి సాయుధ పోరులో అల్లూరి సీతారామరాజు చూపిన ప్రతిభా పాటవాలను నేటికీ గిరిజనులు కథలుగా చెప్పుకుంటారు. ఆ మహానుభావుని ఉద్యమాల పంథా నూరేళ్ల పండగను జరిపే బరువు బాధ్యతలను తపాలా శాఖ తన భజస్కంధాలపై వేసుకుంది. స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది అసువులుబాయగా, మన్యంలో గిరిజనుల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన అల్లూరికి పరిపరి విధాలుగా ఆ శాఖ నివాళులర్పిస్తోంది. ఈ కార్యక్రమంలో సాధారణ పోస్టుమన్ నుంచి పోస్ట్‌మన్ జనరల్ వరకు పాల్గొంటూ అల్లూరి స్ఫూర్తి నేటి తరం యువతకు ఎంతో అవసరం అని చాటి చెబుతోంది. హాజరు కానున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. మిరపకాయ టపా పేరిట రాజవొమ్మంగి జయలక్ష్మి థియేటర్లో నిర్వహించే అల్లూరి ఉద్యమ శతజయంతి వేడుకలకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్, అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు, పోస్ట్ మాస్టర్ జనరల్ (విశాఖపట్నం) ముత్యాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. (చదవండి: అటవీ వనం కన్నీరు..గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్న పచ్చదనం) -
పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్..! ఇంకా కొన్ని రోజులే ఛాన్స్..! లేకపోతే..!
పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్..! ఏప్రిల్ 1, 2022 నుంచి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్ ఖాతాలపై వడ్డీని నగదు రూపంలో చెల్లించడాన్ని నిలిపివేస్తాయని పోస్ట్ డిపార్ట్మెంట్ సర్క్యులర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. వీటికి అందించే వడ్డీలను ఖాతాదారుడి పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతాలో మాత్రమే వడ్డీ జమ చేయబడుతుందని పోస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఖాతాదారుడు పొదుపు ఖాతాను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ , టర్మ్ డిపాజిట్ ఖాతాల ఖాతాలతో లింక్ చేయలేకపోతే ఇబ్బందులు తలెత్తనున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు, వృత్తి వ్యాపారాలు చేసేవారు, చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పోస్టాఫీసులు అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వాటిలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ వంటి పథకాలు ఎక్కువగా ఆదరణను పొందాయి. ఈ పథకాల్లో సేవింగ్స్ చేయడం ద్వారా ఖాతాదారులు వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతారు. ఈ వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా కూడా చేసుకునే సదుపాయం ఉంది. అయితే, ఈ వడ్డీ ఆదాయాన్ని విత్ డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కు సంబంధించిన వడ్డీ ఆదాయాన్ని అనుసంధానిత పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంకు ఖాతాకు మాత్రమే జమ చేస్తామని పోస్టల్ శాఖ ప్రకటించింది. సదరు స్కీమ్‌కు సంబంధించిన వడ్డీ నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా, లేదా బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. మార్చి 31వ తేదీలోపు వారి ఖాతాలను పోస్టాఫీసు పొదుపు ఖాతా, బ్యాంక్ అకౌంట్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని పోస్టల్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ తేదీలోపు అనుసంధానించకపోతే వడ్డీ ఆదాయాన్ని సంబంధిత సండ్రీ అకౌంట్‌కు బదిలీ చేయనుంది. అయితే, ఏప్రిల్ 1 నుంచి సండ్రీ అకౌంట్ ద్వారా నగదు రూపంలో చెల్లింపులు ఉండవని, ఔట్ స్టాండింగ్ వడ్డీ ఆదాయాన్ని పోస్టాఫీసు పొదుపు ఖాతా, చెక్ ద్వారా మాత్రమే చెల్లిస్తామని పోస్టల్ శాఖ. స్పష్టం చేసింది. చదవండి: ఎన్ఎస్సీ, పీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్లలో వడ్డీరేట్లు.. పన్ను రాయితీలు ఇలా -
బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండానే పీఎం కిసాన్, రైతుబంధు డబ్బులు
సాక్షి, హైదరాబాద్: అటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇటు రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకం.. ఈ రెంటి లబ్ధిదారులు డబ్బుల కోసం బ్యాంకులకో, ఏటీఎం కేంద్రాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా తపాలా సిబ్బందే అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు డబ్బులు తీయడానికి దగ్గర్లోని పట్టణాలకు వెళ్లకుండా పోస్టాఫీసులు అందుబాటులోకి తెచ్చిన మైక్రో ఏటీఎంలతో డబ్బులు అందజేస్తున్నారు. లబ్ధిదారులు గ్రామంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌కార్డు చూపి బయోమెట్రిక్ విధానంలో సులభంగా డబ్బులు తీసుకోగలుగుతున్నారు. ఇందుకోసం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ పరిధిలోని 4,700 పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా 29,545 మందికి రూ.15.39 కోట్లను చెల్లించగా, ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద శనివారం నుంచి చెల్లింపులు ప్రారంభించారు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబరు, మొబైల్ నంబరు చెబితే అక్కడి సిబ్బంది వివరాలను బయోమెట్రిక్‌తో ఉండే మైక్రో ఏటీఎం యంత్రంలో నమోదు చేస్తారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని చెప్పి యంత్రంలోని బయోమెట్రిక్ స్క్రీన్‌పై వేలిముద్ర వేస్తే చాలు.. ఆ పథకాల తాలూకు డబ్బులు అందుతాయి. అయితే ఒకసారి గరిష్టంగా రూ.10 వేలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రక్రియకు రుసుము చెల్లించాల్సిన పని లేదు. (కొత్త ఏడాది ఊపుతో తెగ తాగేశారు.. రాష్ట్రంలో ఎన్ని కోట్ల మద్యం అమ్ముడైందో తెలుసా?) -
ప్రతి నెల రూ.1500 పొదుపు చేస్తే.. రూ.35 లక్షలు మీ సొంతం!
Gram Suraksha Scheme: పెట్టుబడిదారులకు సురక్షితమైన, భరోసాతో కూడిన రాబడిని అందించే పెట్టుబడి పథకాలను ఎప్పటికప్పుడు ఇండియా పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. మార్కెట్ లింక్డ్ పథకాలతో పోలిస్తే పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి పథకాలు ఈక్విటీ పనితీరుపై ఆధారపడవు కాబట్టి పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం. కాబట్టి, సురక్షితమైన పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. అటువంటి పథకాలలో 'గ్రామ సురక్షా పథకం' ఒకటి. ఈ పథకం కింద పెట్టుబడిదారులు ప్రతి నెలా కేవలం రూ.1500 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయం తర్వాత రూ.35 లక్షల వరకు పొందవచ్చు. పైన పేర్కొన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేయడం ద్వారా పెట్టుబడిదారులు రూ.31 నుంచి 35 లక్షల ప్రయోజనం పొందవచ్చు. 9 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడు అయినా పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద హామీ ఇవ్వబడిన కనీస మొత్తం రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. పోస్టాఫీసు పథకం కింద ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ వార్షికంగా లేదా వార్షికంగా చెల్లించవచ్చు. పెట్టుబడిదారులు ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. (చదవండి: సన్నీ లియోనీ పేరుతో ఎన్ఎఫ్టీ.. ఇది మరో రికార్డు!) అంతేకాక, ఎంపిక చేసిన కాలపరిమితి కోసం స్కీంలో నిరంతరం పెట్టుబడి పెట్టిన తరువాత వారు పెట్టుబడులకు విరుద్ధంగా అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ పథకాన్ని మూడు సంవత్సరాలల తర్వాత కూడా సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు మీరు గ్రామ సురక్ష పథకాన్ని ముగించుకుంటే బోనస్ ప్రయోజనం లభించదు. ఒక వ్యక్తి పోస్టాఫీసు పథకంలో 19 ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన సురక్ష పాలసీని కొనుగోలు చేసినప్పుడు 55 సంవత్సరాల వరకు నెలవారీ ప్రీమియం రూ.1515, 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. 55 సంవత్సరాల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.31.60 లక్షలు రూ.58 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.34.60 లక్షలు ఉంటుంది. (చదవండి: సన్నీ లియోనీ పేరుతో ఎన్ఎఫ్టీ.. ఇది మరో రికార్డు!) -
మావోయిస్టు ఇలాఖాల్లో పోస్టాఫీసులు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తపాలా కార్యాలయాలు తెరవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సర్కిల్ పరిధిలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా 418 పోస్టాఫీసులు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి ప్రారంభం కావాలని కేంద్రం ఆదేశించింది. భద్రాద్రి–కొత్తగూడెం, వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో ప్రారంభం కానున్నాయి. అప్పట్లో నామమాత్రంగా గతంలో పోస్టాఫీసుల్లో టెలీఫోన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేది. దీంతో తమ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరుస్తున్నారన్న అనుమానంతో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు తపాలా కార్యాలయాలను, టెలిఫోన్‌కు సంబంధించిన పరికరాలను ధ్వంసం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంతకాలం తపాలా కార్యాలయాలు నామమాత్రంగా ఉండేవి. గత కొన్నేళ్లలో తపాలా కార్యాలయాల ద్వారా ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చారు. కానీ తపాలా కార్యాలయాలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజలు వీటికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు సాధారణ ప్రాంతాల్లో ఉన్నట్లే ఈ ప్రాంతాల్లో కూడా తపాలాకార్యాలయాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఆయా పథకాలు అందేలా చేయాలని కేంద్రం నిర్ణయించింది. జిల్లాల వారీగా తెరవనున్న కొత్త పోస్టాఫీసుల సంఖ్య ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం 154, వరంగల్ 71, భూపాలపల్లి 65, ఖమ్మం 58, పెద్దపల్లి 38, ఆసిఫాబాద్ 12, ఆదిలాబాద్ 12, మంచిర్యాల 9 పోస్టాఫీసుల ద్వారా ఎన్నో సేవలు రైలు బస్సు టిక్కెట్ల బుకింగ్, సిమ్‌కార్డు, డిష్ టీవీ రీచార్జి, పాస్‌పోర్టు సేవలు, ఆధార్‌కార్డులో వివరాల మార్పు ఇలా ఎన్నో సేవలు పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇక పింఛన్లు, రైతుబంధు, కేంద్ర పథకాల ద్వారా లబ్ధిదారులకు నగదు చెల్లింపు కూడా తపాలాకార్యాలయాల ద్వారా జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందికే హ్యాండ్‌హెల్డ్ యంత్రాలు కేటాయించి లబ్ధిదారుల వద్దకే వెళ్లి చెల్లించేపద్ధతి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకును కూడా తపాలాశాఖ ప్రారంభించటంతో బ్యాంకింగ్ సేవలు కూడా పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు ఈ సేవలు ఆయా ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. -
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
సీనియర్ సిటిజన్లకు శుభవార్త. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఎస్ఈఎస్ఎస్) ను విత్ డ్రా చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ ఇకపై పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనౌన్స్ చేసింది. సాధారణంగా పీపీఎఫ్, ఎస్ఈఎస్ఎస్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు నిర్వహించని అకౌంట్లు, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో అకౌంట్లను క్లోజ్ చేయాలంటే పోస్టాఫీసులకు రావాల్సి వచ్చేది. దీంతో 60ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు వయస్సు రిత్యా పోస్టాఫీస్‌లకు రావాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ఇండియన్ పోస్ట్ సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చింది. ఈ రెండు స్కీమ్ లలో నుంచి మనీ విత్ డ్రా, అకౌంట్లను క్లోజ్ చేయడం చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని, వారి బదులు కుటుంబ సభ్యులు ఉంటే సరిపోతుందని వెల్లడించింది. అకౌంట్లను క్లోజ్ చేయడంతో పాటు మనీ విత్ డ్రాల్ వారి కుటుంబ సభ్యులు చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబసభ్యులు విత్ డ్రా చేసిన నగదును చెక్కుద్వారా, అకౌంట్ హోల్డర్ భద్రత కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా, బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నట్లు తెలిపింది. పోస్టాఫీస్‌కు వెళ్లకుండా నగదుని ఎలా డ్రా చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ నుండి PPF లేదా SCSS నిధుల్ని సేకరించేలా కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చేందుకు ఈ రూల్స్ పాటించాల్సి ఉంది. ►వయస్సు రిత్యా తాము పోస్టాఫీస్‌కు వెళ్లలేకపోతున్నామని, తనకు బదులు మనీ విత్ డ్రాల్ చేసే హక్కు భార్య లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు హక్కు ఉందని నిర్ధారిస్తూ పోస్ట్ ఆఫీస్‌లో ఫారమ్ SB-12 పై సీనియర్ సిటిజన్ సంతకం చేయాల్సి ఉంటుంది. ►వీటితో పాటు అకౌంట్ హోల్డర్ అకౌంట్‌ను క్లోజ్ చేసేందుకు, పాక్షిక నగదు ఉపసంహరణ(partial withdrawal).SB-7ఫారమ్ పై,SB-7B form పై సంతకం చేయాల్సి ఉంటుంది. ►సీనియర్ సిటిజన్ ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు సీనియర్ సిటిజన్ కుటుంబ సభ్యుడి వివరాలను తెలుపుతూ అటాచ్ చేయాల్సి ఉంది. ►నిధులను ఉపసంహరించుకోవడానికి వ్యక్తి పాస్ బుక్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ►లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ముందు అకౌంట్ హోల్డర్ సంతకాల్ని పోస్టాఫీసులో సంబంధిత అధికారులు చెక్ చేస్తారు. అనంతరం నగదు విత్ డ్రా చేసేందుకు అనుమతిస్తారు. -
ఇక పోస్టాఫీసుల్లో న్యాయసేవల సమాచారం..
సాక్షి,విశాఖపట్నం : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు పోస్టాఫీసుల్లో న్యాయసేవలకు సంబంధించి ప్రజలకు సమాచారాన్ని అందించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అవదానం హరిహరనాథ శర్మ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పోస్టల్ సూపరింటెండెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సహాయం కోసం దరఖాస్తులను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు పోస్ట్మ్యాన్లకు న్యాయ సహాయం కోసం అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎన్.సోమశేఖరరావు, అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవీ బులికృష్ణ పాల్గొన్నారు. చదవండి: Andhra Pradesh: ఉపాధితో అభివృద్ధి -
తపాలా.. మారుతోందిలా
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు బట్వాడా, ఆర్థిక సేవలకే పరిమితమైన పోస్టాఫీసులు.. సేవా కేంద్రాలుగా మార్పు చెందుతున్నాయి. రైల్వే టికెట్లు, బస్ టికెట్లు, పాస్‌పోర్టు స్లాట్ బుకింగ్, పాన్‌కార్డ్ తదితర సేవలన్నీ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డా.అభినవ్ వాలియా ‘సాక్షి’కి తెలిపారు. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహకారంతో దాదాపు 60కి పైగా సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని పోస్టాఫీసుల ద్వారా 20 వరకు సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి మొబైల్, డీటీహెచ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, పాన్‌కార్డు, రైల్వే, బస్, విమాన టికెట్లు, పాస్‌పోర్ట్ కోసం స్లాట్ బుకింగ్, ఆర్టీఏ, నేషనల్ పెన్షన్ స్కీం, ఫాస్ట్ ట్యాగ్ తదితర సేవలన్నింటినీ పోస్టాఫీసుల ద్వారా అందిస్తామన్నారు. ఇందుకోసం తపాలా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని.. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీతో పాటు జిల్లా స్థాయిలో శిక్షణా కమిటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే 3,000 మంది ఆన్లైన్ సేవలపై శిక్షణ పూర్తి చేసుకున్నారని వివరించారు. ఇప్పటివరకు 11 వేలకు పైగా సేవలు.. రాష్ట్రంలో ఇప్పటికే 1,568 పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా మార్చినట్లు అభినవ్ వాలియా తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.1.26 కోట్ల విలువైన 11 వేలకు పైగా సేవలను అందించామని పేర్కొన్నారు. ప్రతి సేవకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ నెలలో మరో 500 పోస్టాఫీసుల్లో సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఉన్న 10,000కు పైగా పోస్టాఫీసులను సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐఆర్టీసీ ద్వారా రైల్వే టికెట్లు 50 చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ విధంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. -
పోస్టాఫీస్‌కు వెళ్తే పాస్‌పోర్ట్...
ఇంట్లో వంట గ్యాస్ అయిపోయిందా.. మొబైల్ ఫోన్, టీవీ డీటీహెచ్ రీచార్జ్ చేయాలా..రైలు, విమాన టికెట్లు కావాలా..ఆస్తి పన్ను చెల్లించాలా.. బీమా పాలసీ ప్రీమియం చెల్లించాలా.. మీకు పాస్‌పోర్టు కావాలా.. అయితే జస్ట్ పోస్టాఫీసుకు వెళ్లండి చాలు. పట్టణానికో, మీసేవా కేంద్రానికో వెళ్లాల్సిన పనిలేదు. మారుమూల గ్రామం అయినా సరే.. తపాలా కార్యాలయానికి వెళితే ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. సాక్షి, హైదరాబాద్: ఉత్తరాల బట్వాడా సేవలం దించిన పోస్టాఫీసులు ఇప్పుడు పౌరసేవా కేంద్రాలుగా మారిపోతున్నాయి. క్రమంగా ఉనికి కోల్పోతున్న పోస్టాఫీసులకు కొత్త ఉత్తేజం కల్పించే ఉద్దేశంతో పౌర సేవలందించే కేంద్రాలుగా వాటిని రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో నిత్యం ప్రజలకు అవసరమైన పలు సేవలను అందించేలా ఏర్పాటు చేసింది. ఈమేరకు తపాలా సిబ్బందికి శిక్షణను పూర్తి చేసి దశలవారీగా అన్ని పోస్టాఫీసుల్లో వాటిని అందుబాటులోకి తెచ్చింది. అన్ని పోస్టాఫీసుల్లో కామన్ సర్వీసెస్ సెంటర్ (సీఎస్సీ)లను ఏర్పాటు చేసింది. కొన్ని ఉచితం.. కొన్నింటికి రుసుం ఫోన్లు, డీటీహెచ్ రీచార్జ్, పన్నులు, బీమా ప్రీమి యం చెల్లింపు లాంటి సేవలకోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. ఇక పాన్‌కార్డు, పాస్‌పోర్టులాంటి సేవలకు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అవికూడా వినియోగదారులకు ఏమాత్రం భారం లేకుండా ఖరారు చేశారు. చిన్నచిన్న ఊళ్లలో ఉండేవారు ఆయా సేవలు పొందేందుకు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది ఖర్చు, ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఊర్లో ఉన్న పోస్టాఫీసుకు వెళ్తే ఆయా పనులు పూర్తవుతాయి. సమయం, దూరాభారం, వ్యయ ప్రయాసలు లేకుండానే సులభంగా పనులు అయ్యేలా వీటిని అందుబాటులోకి తెచ్చారు. గతేడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్, హన్మకొండ, జనగామ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి హెడ్ పోస్టాఫీసులలో ప్రారంభించారు. ఇవి విజయవంతం కావటంతో ఇప్పుడు హైదరాబాద్ మొదలు మారుమూల పల్లె వరకు ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో ప్రారంభించారు. ఆదర్శంగా తక్కళ్లపల్లి జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లి బ్రాంచి పోస్టాఫీసులో స్వల్ప సమయంలోనే ఈ కేటగిరీ కింద 127 మందికి సేవలందించినందుకుగాను పోస్ట్‌మాస్టర్ జ్ఞానేశ్వర్ జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచి పురస్కారం అందుకున్నారు. కేవలం మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో ఫోన్ రీచార్జ్ మొదలు పాస్‌పోర్టు వరకు పోస్టాఫీసు ద్వారా సేవలు అందించారు. గతంలో పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఆధార్ అనుసంధానం లాంటి పనులకు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు వారి ఊర్లలోనే పోస్టాఫీసుకు వెళ్తే సులభంగా పని అయిపోతోందని, ఇది గ్రామస్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని జ్ఞానేశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. ఇంట్లో కూర్చునే... మా ప్రాంతం నుంచి దుబాయికి వెళ్లేవారు ఎక్కువ. పాస్‌పోర్టు కోసం కోరుట్ల గానీ లేదా ఇతర పట్టణాలకు గాని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు తపాలా శాఖ ప్రారంభించిన కొత్త సేవల వల్ల మేం మా ఊళ్లోనే పాస్‌పోర్టు తీసుకోగలుగుతున్నాం. ఇటీవల నేను, నా ముగ్గురు మిత్రులు మా ఊరి పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసి పాసుపోర్టు పొందాం. ఇంట్లో కూర్చునే పాసుపోర్టు తెప్పించుకున్నట్టనిపించింది. ఖర్చు, కష్టం, సమయం ఆదా అయ్యాయి. – మహేందర్, తక్కళ్లపల్లి గ్రామం -
పోస్టాఫీసు ఖాతాదారులకు అలర్ట్!
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. నేడు రెండో రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక ఈ లాక్డౌన్ పది రోజుల పాటు (మే 21) వరకు కొనసాగుంది. ఈ లాక్డౌన్ కాలంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో వినియోగదారులకు అందించే సేవలకు సంబందించి తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసు కార్యాలయాల కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పని చేయనున్నట్లు తెలిపింది. చిన్న పోస్టాఫీసులు మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరాల డెలివరీ తదితర సేవలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళల్లో కూడా మార్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. అదే విధంగా అన్ని కోవిడ్ జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ 50 మంది సిబ్బందితో బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగానున్నాయి. చదవండి: అలర్ట్: గూగుల్ క్రోమ్ యాప్ తో జర జాగ్రత్త! -
పోస్టాఫీసుల్లోనూ స్టాంప్ పేపర్ల అమ్మకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. ప్రజలు మరింత సులభంగా స్టాంప్ పేపర్స్ పొందేందుకు వీలుగా పోస్టాఫీసుల్లో కూడా వీటిని విక్రయించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పోస్టల్ శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.10, రూ.20, రూ.50, రూ.100 డినామినేషన్ల స్టాంప్ పేపర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,952 మంది లైసెన్సు పొందిన స్టాంప్ వెండార్స్ ప్రజలకు వీటిని అమ్ముతున్నారు. కొన్నిసార్లు ఈ స్టాంప్ పేపర్స్‌కు కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా వీటికి డిమాండ్ పెంచి.. బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. దీనికితోడు స్టాంప్ వెండార్స్ అన్ని జిల్లాల్లో ఒకే సంఖ్యలో లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో స్టాంప్ పేపర్స్ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు సులభంగా స్టాంప్ పేపర్స్ పొందేందుకు పోస్టాఫీసులే సరైన మార్గమని రిజిస్ట్రేషన్ల శాఖ భావించి అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. తొలుత మండల స్థాయి పోస్టాఫీసుల్లో.. రాష్ట్రంలో ప్రస్తుతం మండల స్థాయిలో 1,568 పోస్టాఫీసులున్నాయి. ప్రతి మండలంలో 2 నుంచి 3 పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. ఇవికాకుండా గ్రామ స్థాయిలో 10 వేలకుపైగా పోస్టాఫీసులున్నాయి. ప్రస్తుతం మండల స్థాయి పోస్టాఫీసుల్లో స్టాంప్ పేపర్స్ అమ్మకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి దశలో 700 పోస్టాఫీసులకు రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంప్ పేపర్స్ విక్రయించే లైసెన్సులు మంజూరు చేసింది. రెండో దశలో మిగిలిన 868 పోస్టాఫీసులకు లైసెన్సులు ఇస్తారు. మూడో దశలో గ్రామస్థాయి పోస్టాఫీసుల్లో విక్రయానికి పెట్టనున్నారు. రూ.15 కోట్ల విలువైన స్టాంప్ పేపర్స్ ఒకటి, రెండు దశల్లో పోస్టాఫీసుల ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు. ఇక కొరత ఉండదు.. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్‌ను మరింత సులభంగా ప్రజలు తీసుకునేందుకు వీలుగా పోస్టాఫీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మొదట మండల స్థాయి పోస్టాఫీసుల్లో అమ్మకాలు ప్రారంభిస్తాం. ఆ తర్వాత వీలును బట్టి గ్రామ స్థాయి పోస్టాఫీసుల్లో అమ్మకాలు జరిపే అంశాన్ని పరిశీలిస్తాం. దీనివల్ల స్టాంప్ పేపర్ల కొరత ఉండదు. అమ్మకాలు సులభంగా మారి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. - ఎంవీ శేషగిరిబాబు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ -
రాజన్న, నర్సన్న ప్రసాదాలు పొందడం ఇక సులువే!
సాక్షి, హైదరాబాద్/వేములవాడ: రాష్ట్రంలోని పది ప్రధాన దేవాలయాల ప్రసాదాలను నేరుగా ఇళ్లకే పంపే ప్రత్యేక సేవను దేవాదాయ శాఖ ప్రారంభించింది. ఇందుకు శనివారం తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి, కొండగట్టు ఆంజనేయ స్వామి, కొమురవెల్లి మల్లికార్జున స్వామి, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ, సికింద్రాబాద్ గణేశ్, బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రస్తుతం ఈ సేవలు ప్రారంభించారు. భక్తులు ఈ దేవాలయాల ప్రసాదాలు కావాలని స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో ఆయా ఆలయాల నుంచి ప్రసాదం వారి ఇంటికి తపాలా ద్వారా చేరుతుంది. అయితే, ఆయా దేవాలయాలకు ప్రత్యేక ప్రసాదాలుంటాయి. పులిహోర, దధ్యోదనం, లడ్డూ, రవ్వకేసరి లాంటివి. కానీ, ఇవి రెండుమూడు రోజుల పాటు నిల్వ ఉండే అవకాశం ఉండదు. దీనికోసం తపాలా ద్వారా డ్రైఫ్రూట్స్, రవ్వ పొడి ప్రసాదాలను మాత్రమే పంపనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.60 లక్షల తపాలా కార్యాలయాలలో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఆయా దేవాలయాల ఆర్జిత సేవలు నిర్వహించుకునే అవకాశాన్ని దేవాదాయ శాఖ గతంలోనే ప్రారంభించింది. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ నేరుగా తమ పేరుతో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం లేని వారు ఆన్లైన్లో గోత్రనామాలు, పూజ జరగాల్సిన తేదీని బుక్ చేసుకుంటే ఆ రోజు వారి పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఐటీ శాఖ రూపొందించిన టీ యాప్ ఫోలి యో ద్వారా 22 దేవాలయాల్లో ఈ సేవలు పొందే వీలుంది. తాజాగా పూజలతోపాటు ప్రసాదాలు కూడా పొందే వీలును తపాలాశాఖతో కలిసి ఏర్పా టు చేసింది. శనివారం అరణ్య భవన్‌లోని కార్యాలయంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్రకుమార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి, హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్‌రెడ్డి, హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎస్వీ రావు తదితరులు పాల్గొన్నారు. -
పోస్టాఫీసుల ద్వారా ఆర్థిక సాయం: మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 ఆర్థిక సాయం రెండో విడత పోస్టాఫీసుల ద్వారా సోమవారం నుంచి పంపిణీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో ఈ మేరకు సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘చాలామందికి రూ.1,500 సాయం గత వారమే బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలిన 5.38 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా సోమవారం నుంచి ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డబ్బులు డ్రా చేసుకునేందుకు అందరూ ఒకేసారి వెళ్లవద్దు. భౌతిక దూరాన్ని పాటించండి’ అని హరీశ్ ట్వీట్ చేశారు. -
బ్యాంక్ ఖాతా లేకుంటే ‘పోస్టల్’ నగదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాంకు ఖాతాలు లేని రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1,500 సాయాన్ని పోస్టాఫీస్‌ల ద్వారా అందించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు లేని 5,21,641 కుటుం బాలకు రూ.78,24,55,500ను అందించనుంది. ఈ మేరకు ఆ మొత్తాన్ని పోస్టు మాస్టర్ జనరల్, హైదరాబాద్ ఖాతాలో పౌర సరఫరాల శాఖ శనివారం జమ చేసింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు మొత్తం 87.54 లక్షలు ఉండగా, 79.57 లక్షల కుటుంబాలకు ఉచి తంగా 12 కిలోల చొప్పున 3.13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే పంపిణీ చేసింది. బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల కోసం ఒక్కో కుటుంబానికి రూ.1,500 చొప్పున 74 లక్షల కుటుంబాలకు రూ. 1,112 కోట్లు సైతం జమ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరికి సాంకేతిక సమస్యలతో జమ కాకపోగా, మరికొందరికి బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో జమకాలేదు. అయితే ఖాతాలు లేని వారికి పోస్టల్ సర్వీసుల ద్వారా సాయం అందించనుండటంతో సగం సమస్య తీరనుంది. మిగతా వారికి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటోంది. చదవండి: కరోనాతో కుదేల్..! మరో 3.12 లక్షల మందికి... ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో ఉన్న వలస కార్మికులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందిస్తోందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలి విడతలో 3.35 లక్షల మంది కార్మికులను గుర్తించి రూ.13 కోట్లు విలువ చేసే 4,028 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశామన్నారు. అలాగే రూ.500 చొప్పున రూ.17కోట్లు సాయమందించామన్నారు. రెండో విడతలో కొత్తగా 3.12 లక్షల మంది వలస కార్మికులను గుర్తించామని, వీరికి రూ.12 కోట్లు విలువ చేసే 3,746 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. వీరికి కూడా రూ.500 చొప్పున రూ.15.60 కోట్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 91శాతం మందికి బియ్యం పంపిణీ పూర్తయిందని, 15.63 లక్షల మంది రేషన్ పోర్టబులిటీని వినియోగించుకొని బియ్యం తీసుకున్నారని వెల్లడించారు. -
అందుబాటులోకి మరిన్ని పోస్టాఫీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసులు తెరుచుకుంటున్నాయి. మంగళవారం 633 డెలివరీ పోస్టాఫీసులు తెరుచుకోగా, బుధవారం నుంచి 4,967 బ్రాంచి తపాలా కార్యాలయాలు సేవలు ప్రారంభించబోతున్నాయి. డిపాజిట్స్, విత్‌డ్రాయల్స్ లాంటి సేవింగ్స్ బ్యాంక్ ఆపరేషన్స్ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు స్పీడ్‌పోస్టు, పార్శిల్ సర్వీసులు కూడా ప్రారంభమవుతాయి. లాక్డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు లేనందున స్పీడ్ పోస్టులాంటి సేవల్లో జాప్యం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలని తపాలా శాఖ పేర్కొంది. ఇప్పటికే లాక్డౌన్ సమయంలో 4,400 బ్యాగ్స్ పరిమాణంలో పోస్టల్ డెలివరీలు నిర్వహించగా, పదోతరగతి, ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 5,525 పరీక్ష పత్రాల పార్శిళ్లను తరలించినట్టు పేర్కొంది. 22 లక్షల మంది ఆసరా లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపునకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది. 33 జిల్లాలకు 20 మెయిల్ మోటారు వాహనాల ద్వారా అత్యవసర మందులు, వైద్య పరికరాలను పంపిణీ చేస్తున్నట్టు పేర్కొంది. వలస కార్మికులు వంటి వారికి అవసరమైన సరుకులను కూడా పంపిణీ చేసేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచామని పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. కూరగాయలకు సంబంధించి మొబైల్ మార్కెట్లుగా వాటిని వాడేందుకు కూడా వ్యవసాయ శాఖతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. -
బ్యాంకుల్లోనే ఆధార్ కేంద్రాలు: ఆర్బీఐ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రారంభించిన 13,000 ఆధార్ కేంద్రాలు యథాతథంగా కొనసాగుతాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈవో అజయ్ భూషణ్ తెలిపారు. ఈ కేంద్రాలపై సుప్రీంకోర్టు తన తీర్పులో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆన్లైన్లో ధ్రువీకరణ చేయాల్సిన అవసరం లేకుండా ఆఫ్‌లైన్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు ఆధార్‌ను గుర్తింపు పత్రంగా వాడుకోవచ్చని చెప్పారు. ఎవరైనా బ్యాంకు ఖాతా తెరిచేందుకు స్వచ్ఛందంగా ఆధార్‌ను సమర్పిస్తే అధికారులు అంగీకరిస్తారని వెల్లడించారు. -
ఇక పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు
సాక్షి, పెదవాల్తేరు(విశాఖతూర్పు) : పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గత నెల 15వ తేదీన సీతమ్మధార దరి పీఅండ్‌టీ కాలనీలో గల పోస్టాఫీసులో ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. దఫదఫాలుగా విశాఖ డివిజన్ పరిధిలోని 36 పోస్టాఫీసుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేవారు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. ఇక ఆధార్ కార్డులో పేర్లు, చిరునామా, వయసు తదితర వివరాల్లో సవరణలకు మాత్రం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు సాధారణ పోస్టు ద్వారా 15 రోజులలో ఇంటికొస్తుందని విశాఖ డివిజన్ తపాలాశాఖ సీనియర్ సూపరింటెండెంట్ హరిప్రసాద్‌శర్మ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఆధార్ నమోదు ఇలా... ఇప్పటివరకు ఎక్కడా ఆధార్ కార్డు లేనివారు తమకు సమీపంలో గల పోస్టాఫీసులో చిరునామా ధృవీకరణపత్రంతో వెళ్లాల్సి ఉంటుంది. గ్యాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, పాసుపోర్టు, డ్రైవింగ్లైసెన్సు, ఓటర్‌గుర్తింపు కార్డు, విద్యుత్‌బిల్లు, వంటి ఏదో ఒక ధృవీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు అక్కడే బయోమెట్రిక్ విధానంలో ఫొటో తీసి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు. ఇక సవరణల కోసం అవసరమైన ధృవీకరణపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నమోదు చేసే పోస్టాఫీసులివే... వెలంపేట, రైల్వేస్టేషన్ వద్ద గల ప్రధాన పోస్టాఫీసులు, అక్కయ్యపాలెం (శ్రీనగర్), ఆంధ్రా యూనివర్సిటీ, డాబాగార్డెన్స్, ద్వారకానగర్ (డైమండ్‌పార్కు), డెయిరీఫారం, హెచ్‌బీకాలనీ, మధురవాడ, మహారాణిపేట (కలెక్టరేట్), ఎంవీపీకాలనీ, సాలిగ్రామపురం, ద్వారకాబస్‌స్టేషన్, పోర్టు, బీహెచ్‌పీవీ, భీమునిపట్నం, చిట్టివలస, గాజువాక, గాంధీగ్రాం, గోపాలపట్నం, ఇండస్ట్రియల్ఎస్టేట్, కంచరపాలెం, మల్కాపురం, మర్రిపాలెం, ఎన్ఏడికొత్తరోడ్డు, పెదగంట్యాడ, సింహాచలం, ఉక్కునగరం, విశాఖ నేవల్‌బేస్, విశాఖస్టీల్‌ప్లాంట్, విశాలాక్షినగర్ ప్రాంతాలలోని పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు కేంద్రాలు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి. -
రిలయన్స్ బిగ్ టీవీ సరికొత్త ఆఫర్
న్యూఢిల్లీ : అనిల్ అంబానీకి చెందిన డీటీహెచ్ సర్వీసు ప్రొవైడర్ రిలయన్స్ బిగ్ టీవీ సరికొత్త ఆఫర్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. తొలుత 500 రూపాయల చెల్లించి తమ కొత్త హెచ్డీ హెచ్ఈవీసీ సెటాప్ బాక్స్‌లను ఉచితంగా పోస్టు ఆఫీసుల వద్ద పొందవచ్చని ప్రకటించింది. అనంతరం ఆ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేయనున్నట్టు తెలిపింది. 50 వేల పోస్టు ఆఫీసులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని ఈ సర్వీసులను అందజేస్తున్నామని రిలయన్స్ బిగ్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్తాన్, పంజాబ్, ఉత్తరఖాండ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం ప్రాంతాల పోస్టు ఆఫీసుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్ కింద ఏడాది పాటు ఉచితంగా ఛానల్స్‌ను ఆఫర్ చేయనుంది. దీనిలో హెచ్డీ ఛానల్స్ కూడా ఉండనున్నాయి. 500 ఎఫ్‌టీఏ(ఫ్రీ టూ ఎయిర్) ఛానల్స్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా ఐదేళ్ల పాటు అందించనుంది. జూన్ 15 నుంచి ఈ సెటాప్ బాక్స్‌లను కంపెనీ డెలివరీ చేయనుంది. ముందస్తు బుక్ చేసుకున్న కస్టమర్లు జూలై 30 లోపల ఈ సెటాప్ బాక్స్‌లను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది. పోస్టు ఆఫీసుల్లో వీటి బుకింగ్స్‌ను జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ‘తాజా ఆఫర్‌తో రిలయన్స్ బిగ్ టీవీ భారత్‌లో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ స్పేస్‌లో సంచలనం సృష్టించనుంది. దీంతో ప్రతి ఒక్క గృహంలో మా హెచ్డీ హెచ్ఈవీసీ సెటాప్ బాక్స్‌లు నిలుస్తాయి. ఉచితంగా, అత్యధిక క్వాలిటీలో ఎంటర్టైన్మెంట్ను మా సెటాప్ బాక్స్‌లు ఆఫర్ చేయనున్నాయి. ఆసక్తి గల విద్యార్థులకు ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను కూడా ఇవ్వనున్నాం. ఇండియన్ పోస్టు ఆఫీసుల్లో వీటిని బుక్ చేసుకోవచ్చు’ అని రిలయన్స్ బిగ్ టీవీ డైరెక్టర్ విజేంద్ర సింగ్ తెలిపారు. తాము ఆఫర్ చేసే హెచ్డీ హెచ్ఈవీసీ సెటాప్ బాక్స్‌లు షెడ్యూల్డ్ రికార్డింగ్, యూఎస్బీ పోర్ట్, హెచ్డీఎంఐ పోర్ట్, ఏకకాలంలో రికార్డు చేయడం, వీక్షించడం వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. పోస్టు ఆఫీసుల వద్ద బుక్ చేసుకునేటప్పుడు రూ.500 కట్టిన అనంతరం, వాటిని ఇంటి వద్ద డెలివరీ చేసిన తర్వాత మిగిలిన మొత్తం రూ.1500 ను చెల్లించాలి. ఆ అనంతరం ఈ మొత్తం అంతా కస్టమర్లకు రీఫండ్ అవుతుంది. లోయల్టీ బోనస్లుగా రీఛార్జ్‌ల రూపంలో తిరిగి కస్టమర్లు పొందనున్నారు. బుక్ చేసుకున్న 30 నుంచి 45 రోజుల్లో కంపెనీ వీటిని వినియోగదారులకు డెలివరీ చేయనుంది. -
తపాలా ఉద్యోగుల ప్రదర్శన, ధర్నా
బెల్లంపల్లి : వేతన సవరణ చేసి, దీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తపాలా శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె వారం రోజులకు చేరుకుంది. మంగళవారం పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన, సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక పాత బస్టాండ్ తపాల కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బజారుఏరియా, కాంటా చౌరస్తా, ఏఎంసీ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ వేతన సవరణ కోసం కమలేష్ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమ్మెబాట పట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె చేపడతామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారి కిషన్‌కు వినతి పత్రం అందజేశారు. నిరసనలో జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం, పోస్టుమ్యాన్, గ్రూప్ డీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు బాబురావు, మంచి ర్యాల జిల్లా కార్యదర్శి తాజొద్దీన్, ఆదిలాబాద్ డివి జన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చింత సంతోష్, మంచిర్యాల బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ రావు, రామారావు, నాగేశ్వర్రావు, విజయ్, నారాయణ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోస్టాఫీస్‌కు కరెంట్ కట్
గోదావరిఖనిటౌన్ (రామగుండం) : జిల్లాలోనే అత్యధిక ఆదాయం ఉన్న గోదావరిఖని ప్రధాన పోస్టాఫీస్‌లో రెండు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. కార్యాలయం నిర్వహిస్తున్న భవనం యజమాని రెండు రోజుల క్రితం కరెంట్ కట్ చేశాడు. అద్దె ఒప్పందం ముగిసి మూడేళ్లు గడిచినా భవనం ఖాళీ చేయకపోవడంతో యజమాని కరెంటు సరఫరా నిలిపేశాడు. దీంతో కార్యాలయంలో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారుల ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం లక్ష్మీనగర్‌లోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ఉంది. రెండు రోజులుగా ఇందులో సేవలు నిలిచిపోయాయి. 15 ఏళ్లుగా దస్తగిరి కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో నెలకు రూ.11 వేల అద్దెతో ప్రధాన పోస్టాఫీస్ నిర్వహిస్తున్నారు. భవనం యజమానికి పోస్టాఫీస్ మధ్య ఉన్న అద్దె ఒప్పందం మూడేళ్ల క్రితం ముగిసింది. దీంతో భవనం యజమాని ఫారుక్ ప్రత్యామ్నాయం చూసుకోవాలని మూడేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. అయితే స్థానికంగా వినియోగదారులకు అందుబాటులో మరో అద్దె భవనం దొరకకపోవడంతో ఖాళీ చేయలేదు. యజమాని సోమవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరెంట్ కట్ చేశాడు. దీంతో రెండు రోజులుగా ప్రధాన పోస్టాఫీసులో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక వందలాది మంది పోస్టాఫీస్‌కు వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారు. రోజుకు రూ.లక్షల్లో నష్టం... పోస్టాఫీస్ సేవలన్నీ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రోజు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల నష్టం వాటిల్లుతోంది. కార్యాలయంలో ముఖ్యమైన సేవలు, డిపాజిట్లు, వడ్డీ స్వీకరణ, స్పీడ్ పోస్ట్‌లు, ఇతర 18 రకాల సేవలు స్తంభించాయి. వందలాది మంది నిత్యం నిర్వహించే కార్యకలాపాలు స్పీడ్ పోస్ట్, ఉత్తరాల పంపిణీ, రిజిస్టర్ పోస్ట్‌లు, రైల్వేటికెట్ బుకింగ్, ఆధార్ నమోదు, డిపాజిట్లు, వడ్డీ వితరణ, ఆన్లైన్ పోస్ట్, వెస్ట్రన్ మనీ ట్రాన్స్ఫర్ తదితర సేవలకు అంతరాయం కలిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి.. పోస్టల్ నిబంధనల ప్రకారం భవనానికి రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు అద్దె చెల్లించాలని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఈ అద్దెకు స్థానికంగా మరొక భవనం దొరకక ఇదే భవనంలో ఉండాల్సి వస్తోందని పోస్ట్‌మాస్టర్ ఫజుర్ రహమాన్ తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న భవనాన్ని రూ.20 వేలలోపు అద్దెకు కేటాయించాలని అధికారులకు విన్నవించామని పేర్కొన్నారు. వారు స్పందించక పోవడంతో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, రామగుండం మేయర్, సింగరేణి జీఎంకు కూడా వినతిపత్రాలు అందించామని వివరించారు. ఎవరూ స్పందించడం లేదని చెప్పారు. అధిక ఆదాయం ఉన్న పోస్టాఫీస్.. జిల్లాలో అత్యధికంగా 10 వేలకు పైగా ఖాతాదారులు ఉన్న పోస్టాఫీస్ గోదావరిఖని బ్రాంచ్ మాత్రమే. ఇందులో నిత్యం లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. ఈ పోస్టీఫీస్‌లో ప్రస్తుతం సేవలు నిలిపోవడంతో లక్షల రూపాయల నష్టం కలుగుతోంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నష్టం కలుగకుండా చూడాలి నిత్యం చాలా రకాల సేవలు పోస్టాఫీస్‌లో జరుగుతాయి. ఆకస్మికంగా విద్యుత్ కట్ చేసి సేవలు నిలిపి వేస్తే ప్రజలతోపాటు సంస్థ నష్టపోతుంది. అధికారులు, పాలకులు స్పందించి వెంటనే కరెంట్ పునరుద్ధరించి నష్టం కలుగకుండా చూడాలి. పోస్టాఫీస్‌ను కూడా మరో భవనంలోకి మార్చేలా చొరవ తీసుకోవాలి. – ఫజుర్ రహమాన్, పోస్ట్‌మాస్టర్, గోదావరిఖని -
‘గురుకుల’ రాత పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 21 నుంచి జరగాల్సిన పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు మధ్యం తర ఉత్తర్వుల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల తేదీల వివరాలను తరువాత వెల్లడిస్తామని పేర్కొంది. -
పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు
కరీంనగర్, హైదరాబాద్ జూబ్లీ కార్యాలయాల్లో ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఆధార్–పాన్ కార్డుల అనుసం దానం ఇప్పుడు తప్పని సరైంది. రెండింటిపై ఉండే పేర్లలో స్వల్ప తేడాలుండటంతో ఇప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఆధార్‌కార్డుల్లో వివరాలు మార్చుకునే వెసులుబా టును పోస్టల్ శాఖ అందుబాటులోకి తెస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప టికే కరీంనగర్, హైదరాబాద్ పాతబస్తీలోని జూబ్లీ తపాలా కార్యాలయాల్లో ఆధార్ అప్‌గ్రెడేషన్ కేంద్రా లను ప్రారంభించింది. త్వరలో అన్ని హెడ్ పోస్టా ఫీసుల్లో, ఆ తర్వాత అన్ని తపాలా కార్యాల యాల్లో ప్రారంభించనుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ కూడా.. దేశవ్యాప్తంగా ఆధార్‌కార్డుల జారీ జరిగినా ఇప్ప టికీ ఆధార్‌కార్డు పొందని కుటుంబాలున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసినా వాటిని ఎత్తేసి, మీ–సేవా కార్యాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నట్లు ప్రకటిం చింది. కానీ చాలా సెంటర్లలో ఆధార్ కార్డుల ఎన్రోల్మెంట్ జరగట్లేదు. కొత్తగా ఆధార్ కార్డు పొందాలనుకునే వారికి పోస్టాఫీసులు ప్రత్యేక కేంద్రాలు ఏర్పా ట్లు చేస్తున్నాయి. యూ ఐడీఏఐ విభాగంతో తపాలా శాఖ ఒప్పం దం కుదుర్చు కుంది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టేందేం దుకు సిబ్బందిని ఎంపిక చేసేందుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. అందులో ఉత్తీర్ణులయ్యే తపాలా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు ఇస్తారు. జీవన్ ప్రమాణ్ అనే తపాలా పథకం కోసం ఇప్పటికే ప్రధాన పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ పరికరాలను సమకూర్చుకున్నారు. వాటినే ఆధార్ కార్డుల కోసం వినియోగించనున్నారు. -
ఆర్థిక శాఖలో ఏఎస్వో పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖలో ఖాళీగా ఉన్న 11 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్వో) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని టీఎస్పీఎస్సీకి సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇకపై పోస్టాఫీసుల్లో ఆధార్ కార్డు మార్పులు
అనంతపురం రూరల్ : ఆధార్డ్ కార్డులో పేరు, చిరునామా తదితర మార్పుల కోసం నిర్ధేశించన మీ సేవా కేంద్రాలకు సుదూర ప్రాంతాల నుంచి ఇక రావాల్సిన అవసరం ఉండదు. ఈ నెలాఖరులోపు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తపాల శాఖ చర్యలు చేపడుతోంది. చాలా మండల కేంద్రాల్లో ఆధార్ కార్డు చేర్పులు మార్పులు చేసుకునేందుకు అవకాశం లేదు. దీంతో నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రానికి వచ్చి మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జూలై 1న అన్ని పోస్టాఫీసుల్లో లాంఛనంగా ప్రారంభించేందుకు తపాల శాఖ శ్రీకారం చుట్టినట్లు తపాల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
మా ఊరి పోస్టాఫీసు
అక్షర తూణీరం అనేక కారణాల వల్ల ఊరి వారు, డిపార్టుమెంటు వారు మా ఇ.డి. బ్రాంచ్ ఆఫీస్ మా ఇంట్లోనే ఉండాలన్నారు. వారస త్వంగా ముద్రలు, మువ్వల బరిసె అక్కడే ఉండిపోయాయి. ... కాదు, మా ఇంటి పోస్టాఫీసు. అరమరికలు లేని అందరిది మా ఇల్లు. 1939 నవంబరులో అది మా ఇంటికి వచ్చింది. మా నాన్న నలభైమూడేళ్ల పాటు బ్రాంచి పోస్ట్ మాస్టరు ఉద్యోగాన్ని సేవాభావంతో నిర్వహించి పదవీ విరమణ చేశారు. అయినా అది మా ఇంటిని వదల్లేదు. ఆ కుర్చీ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కారణం దాన్ని నాన్న సేవా కేంద్రంగా నడి పారు. వేళలుండేవి కావు. కార్డు కొన్నవారికి ఆయనే ఓపిగ్గా రాసి పెట్టేవారు. పోస్టులో వచ్చిన కార్డులు కొన్నింటిని చదివి పెట్టే పని కూడా ఉండేది. మా ఊరికి నెలనెలా చాలా మనియార్డర్లు ఏపీఓ నించి వచ్చేవి. అంటే ఆర్మీ పోస్టాఫీసు. అనగా మా ఊళ్లో సైనికోద్యోగులు ఎక్కువమంది ఉండేవారు. ఒక్కోసారి ఆ మనియార్డర్లు వారం పదిరోజులు ఆలస్యమయ్యేవి. పాపం! రోజూ వాటిని అందుకోవల్సిన తల్లిదండ్రులు పోస్ట్ వేళకు ఆశగా మా ఇంటికి వచ్చేవారు. కొన్ని సార్లు నాన్న వాళ్లకి ముందుగానే ఆ యాభయ్యో వందో ఇచ్చేసేవారు. నే చెప్పినప్పుడు వచ్చి వేలిముద్ర వేసి వెళ్లండని చెప్పే వారు. ఆర్మీ జవాన్లు సెలవులకు వచ్చిన ప్పుడు తప్పకుండా వచ్చి అమ్మకీ నాన్నకీ కృతజ్ఞతలు చెప్పివెళ్లేవారు. రెండో ప్రపంచ యుద్ధం దాకా మా పోస్టా ఫీసుకి రంగూన్ మనియార్డర్లు కూడా వచ్చేవి. ఆ రోజుల్లో చాలా మంది మా ఊరి వారు బతుకు తెలివి కోసం రంగూన్ వెళ్లారు. వారంతా కష్టపడి సంపాయించి ఇంటికి డబ్బు పంపేవారు. కొందరు నాన్న పేరు మీదే పంపేవారు. ఎప్పుడో వచ్చినప్పుడు లెక్కలు చూసుకునేవారు. ఆ రోజుల్లో భయంకరమైన అవిద్య పల్లెల్ని ఏలుతోంది. రెవిన్యూ స్టాంప్‌ని ‘నోటుబిళ్ల’ అంటారు గ్రామాల్లో. ఆ రోజుల్లో ‘అణా బిళ్ల’ అనేవారు. రోజూ రాత్రి పూట నాన్న నోటు బిళ్లలు తప్పనిసరిగా తలకింద పెట్టుకు పడుకునేవారు. ఆలస్యమైతే అప్పిచ్చేవాడికి మనసు మారవచ్చు, ఎవరు ఎప్పుడొచ్చినా నోటు బిళ్లలు వెంటనే ఇవ్వండని చెప్పేవారు. తెల్ల కాగితం, కలం, కాటుక్కాయ సిద్ధంగా ఉండేవి. మాకు అక్షరాలు రాగానే ప్రామిసరీ నోటు రాయడం వంట పట్టించారు నాన్న. బ్రహ్మోపదేశం వేళ నాన్న చెప్పిన గాయత్రీ∙మంత్రం తడుముకుంటానేమోగాని ప్రొనోటు రాతలో కలం ఆగదు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఊరి వారు, డిపార్టుమెంటు వారు మా ఇ.డి. బ్రాంచ్ ఆఫీస్ మా ఇంట్లోనే ఉండాలన్నారు. వారసత్వంగా రకరకాల ముద్రలు, మువ్వల బరిసె అక్కడే ఉండిపోయాయి. కొంచెం చదువుకున్న మా వదినగారు పోస్టుమాస్టర్ అయింది. బ్రిటిష్ హయాంలో ఈ శాఖని ‘అంచెల్స్’ అనే వారు. తపాల్స్ అంచెలంచెలుగా నడిచేవి. ఆ తెలుగు మాటనే ‘అంచల్స్’ చేశారు. నా బాల్యం, నా యవ్వనం మా పోస్టాఫీసుతో ముడిపడి ఉన్నాయి. హైస్కూల్లో మని యార్డర్ ఫారమ్‌ని ఆశువుగా పూర్తి చేయడం నాకే వచ్చు. టపా కట్టడం వచ్చు. మా నాన్న తర్వాత అంత దీక్షతోనూ శ్రీమతి సావిత్రి అనే ఈ పోస్టు మాస్టర్ కూడా డ్యూటీ చేశారు. పిల్లలు, పిల్లల పిల్లలు నాలుగు తరాల వాళ్లం అరిచేతిలో నల్లటి తారు ముద్రలతో ఆడు కున్నాం. ఎన్నో పత్రికలు, ఎన్నో శుభవార్తలు అందుకున్నాం. గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ, అరవిందుని సావిత్రి, నెలనెలా వచ్చే ఎమ్మెస్కో సొంత గ్రంథాలయం పుస్తకాలు ఈ అంచెల్స్లోనే వచ్చాయి. సంజీవ్‌దేవ్, ఆరుద్ర, శేషేంద్ర, పురాణం, కరుణశ్రీ, నండూరిల ఉత్తరాల పలకరింతలు ఈ అంచెల్సే అందించాయి. ఎన్నో మధుర స్మృతులు మిగిల్చి డెబ్బయి ఆరేళ్ల తర్వాత రేపు 19న, ఈ వరహాపురం అగ్రహారం పోస్టాఫీసు వారసులు లేక మా ఇల్లు వదిలి వెళ్లిపోతోంది. దస్విదానియా! (వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు) -
పోస్టాఫీసులపై విజి‘లెన్స్'
సీబీఐ దాడులతో మేల్కొన్న తపాలా ఉన్నతాధికారులు ► 25 మంది సిబ్బంది బృందాలుగా విడిపోయి నగరంలో తనిఖీలు ► సోమవారం సాయంత్రానికి ప్రాథమిక నివేదిక సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత తపాలా కార్యాలయాల్లో భారీగా నల్లడబ్బు చేరటాన్ని గుర్తించిన సీబీఐ విస్తృతంగా తనిఖీలు చేసి అక్రమంగా డబ్బు మారుస్తున్న అధికారులు, సిబ్బంది గుట్టు విప్పుతుండ టంతో తపాలా ఉన్నతాధికారులు మేల్కొ న్నారు. పోస్టాఫీసు లావాదేవీల్లో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని నిర్ణయించారు. ఇందుకోసం విజిలెన్స విభాగాన్ని రంగంలోకి దింపారు. శనివారం నుంచి హైదరాబాద్ నగరంలో 25 మంది విజిలెన్స సభ్యులు బృందాలుగా విడిపోయి పోస్టాఫీసుల్లో తనిఖీ మొదలుపెట్టారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమ లావాదేవీల జాడ తెలిసినట్టు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన తపాలా కార్యాలయాలు, సబ్ పోస్టాఫీసుల్లో కూడా విచారణ జరపాలని నిర్ణయించారు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత... పాతనోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇవ్వటం, పొదుపు, రికరింగ్ ఖాతాల్లో భారీగా డిపాజిట్లు రావటాన్ని ప్రాతిపదికగా తీసుకుని వాటిల్లో తనిఖీలకు ఆదేశించారు. ప్రధాన కార్యాలయాల్లో ఉండే తపాలా అధికారులు, సిబ్బందిపై విచారణ ప్రారంభించారు. వీటికి సంబంధించి ప్రాథమిక నివేదిక సోమవారం సాయంత్రానికి అందించనున్నారు. వాటి ఆధారంగా అక్రమాలు జరిగిన తీరుపై అవగాహనకు వచ్చి పూర్తిస్థారుు విచారణ జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సీబీఐ దాడులు చేయని పోస్టాఫీసులను వారు తనిఖీ చేస్తున్నారు. దాడులతో అధికారుల్లో వణుకు మరోవైపు సీబీఐ దాడులతో అధికారుల్లో వణుకు మొదలైంది. గత నెల 24 వరకు జరిగిన పాతనోట్ల మార్పిడిలోనే భారీ అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తపాలా కార్యాలయాల్లో రూ.170 కోట్ల వరకు పాతనోట్లను మార్చారు. ఇందులో హైదరాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌లు ఉండే హైదరాబాద్‌సిటీ రీజియన్ పరిధిలోనే రూ.110 కోట్లు మార్పిడి జరిగినట్టు గుర్తిం చారు. కేంద్రప్రభుత్వం విధించిన నిబంధ నలు, పరిమితులను పట్టించుకోకుండా పాత నోట్లను కొందరు తపాలా అధికారులు, సిబ్బంది మార్చినట్టు తెలు స్తోంది. మరోవైపు గత నెల 9 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.650 కోట్ల వరకు డిపాజిట్లు వచ్చి పడ్డాయి. రద్దయిన నోట్లను డిపాజిట్ చేసిన కొందరు భారీ ఎత్తున చెల్లుబాటు నోట్లను పొందినట్టు సమాచారం. ఈ విషయంలో కూడా తపాలాశాఖ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఓ ఉన్నతాధికారి కొంతమంది తపాలా సిబ్బందిని అనుచరులుగా ఉపయోగించుకుని నగదు లావాదేవీలు జరిపారు. తాజాగా ఆయనపై సీబీఐ నిఘా ఉంచి దాడులు చేయటంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ అధికారి పరారీలో ఉన్నారు. -
పోస్టాఫీసుల్లో సీబీఐ మెరుపు దాడులు
-
పోస్టాఫీస్‌లలో సీబీఐ తనిఖీలు
-
పోస్టాఫీసుల్లో సీబీఐ మెరుపు దాడులు
హైదరాబాద్ : నగరంలోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులకు దిగారు. పెద్ద నోట్ల మార్పిడితో పోస్టాఫీసులలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో నారాయణగూడ పోస్టాఫీసులో రూ.40లక్షలు పట్టుబడ్డాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 8 నుంచి పోస్టాఫీసులలో జరిగిన లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లో భారీగా బ్లాక్‌మనీ డిపాజిట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం పది పోస్టాఫీసుల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ సోమవారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉందని భరోసా ఇచ్చిన ఆయన రాబోయే రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని అంచనా వేస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిస్థితిని తాము సమీక్షిస్తున్నామన్నారు. దేశ ప్రజలకు నగదును నేరుగా అందించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని, నగదును వేగంగా ఆందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని తపాల కార్యాలయాల్లోనూ నగదు డిపాజిట్ కు ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నోట్ల మార్పిడి, విత్ డ్రా పరిమితిని పెంచామన్నారు. బ్యాంకుల్లో వారానికి నగదు విత్ డ్రా పరిమితిని రూ.24 వేలకు పెంచామని, ఈ నగదును ఖాతాదారుడు ఒకేరోజైనా లేదా వారంలో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏటీఎంల వద్ద భద్రత పెంచేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.3లక్షల పోస్టాఫీసులను సిద్ధంగా ఉంచనున్నట్టు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమన్వయంతో ప్రత్యేక బృందాల ద్వారా నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పారు. ప్రజలకు సులువుగా నగదు చేర్చే విధానాలను అన్వేషిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో రూ. 500 నోట్ల పంపణీని నిన్ననే ప్రారంభించామని, త్వరలోనే (రేపు లేదా నేడు) రూ.2వేల నోట్లను ఏటీంలలో అందుబాటులోఉంచుతామని చెప్పారు. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెట్స్ విత్ డ్రా పరిమితి రూ. 50వేలకు, రోజువారి పరిమితి.2.5 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 18 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు. -
మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు
-
'చిల్లర' దేవోభవ!
బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు తెరిచిన కొద్ది గంటల్లోనే ఏటీఎంలు ఖాళీ సాక్షి, హైదరాబాద్: పాత నోట్ల రద్దు, కొత్త నోట్లు తీసుకునే ప్రక్రియ జనానికి నరకం చూపుతూనే ఉంది. అవసరాలకు డబ్బుల్లేక ప్రజలంతా అవస్థలు పడుతున్నారు. నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసుల కు వెళుతున్న వారు, డ్రా చేసుకొనేందుకు ఏటీ ఎంలకు వెళుతున్నవారికి గంటల కొద్దీ వేచి ఉండక తప్పడం లేదు. రోజులు గడుస్తున్న కొ ద్దీ చేతిలో ఉన్న డబ్బులూ అయిపోతుండడం తో నిత్యావసరలూ కొనుక్కోలేని పరిస్థితి. వైద్యం కోసం మందులూ కొనుగోలు చేయలేని దుస్థితి. కూలీలు, కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. డబ్బుల్లేక తిండికి తిప్పలు వచ్చిన దుస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ఏ మూలకు వెళ్లినా ప్రజల ‘నోటు’ కష్టాలు కళ్లకు కడుతున్నారుు. 3,4 గంటలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిలుచున్నా పెద్ద సంఖ్యలో జనం డబ్బు చేతికి అంద కుండానే వెనుదిరుగుతున్నారు. సికింద్రాబాద్, రాణిగంజ్, కోఠి, బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, ఈసీ ఐఎల్, ఉప్పల్సహా నగరంలోని అన్ని ప్రాంతా ల్లో జనాలు శనివారం ఉదయం 7 గంటల నుంచే బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద బారులు తీరారు. ఇవన్నీ పోలీసు బందో బస్తు నడుమ పనిచేశాయి. పలు చోట్ల తోపు లాటలు, గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకున్నారుు. బ్యాంకుల్లో రూ.2,000 కొత్త నోట్లను ఇచ్చినా.. వాటిని మార్చుకొనేందుకు ఎక్కడా చిల్లర దొరకడం లేదు. దీంతో మురి కివాడల్లో నివసించే ప్రజలు, అడ్డాకూలీలు, వేతన జీవులు, కార్మికులు ఇబ్బందులు పడు తున్నారు. ఇక బంగారం కొనుగోలుదారుల వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల నేప థ్యంలో... పాత బస్తీ ప్రాంతంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. రెయిలింగ్ కూలి గాయాలు పాత నోట్ల మార్పిడి, నగదు డ్రా చేసుకోవడం కోసం తిప్పలు పడుతున్న ప్రజలు చివరికి గాయాల పాలవుతున్నారు. తిండి తిప్పలు మా ని క్యూలలో నిలబడినవారు సృ్పహతప్పి పడిపోతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని జూపార్కు వద్ద ఉన్న చందులాల్ బారాదరి ఎస్బీఐ బ్రాంచి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు. చా లా సేపటి నుంచి వేచి ఉండడంతో ఓ యువకుడు సృ్పహ తప్పిపడిపోయాడు. అతడిని బయటికి తీసుకువస్తున్న క్రమంలో తోపులాట జరిగి.. బ్యాంకు బయట ఉన్న రేరుు లింగ్ కూలిపోరుుం ది. దీంతో విధు లు నిర్వహిస్తున్న బహదూర్‌పురా అద నపు ఇన్స్పెక్టర్ గురునా యుడు సహా పలువురు కిందపడి గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని, సృ్పహ తప్పిన యువకు డిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక సింగరేణి వాంబే గృహాలకు చెందిన రజని (50) సరస్వతి నగర్‌లోని ఎస్బీ హెచ్ వద్ద క్యూలైన్లో సృ్పహ తప్పి పడిపో యారు. అక్కడే విధుల్లో ఉన్న పో లీసులు ఆమెను గమనించి, ప్రథమ చికిత్స చేశారు. రెండు రోజుల్లో జీహెచ్ఎంసీకి రూ.67 కోట్లు పాతనోట్లతో పన్నులు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా పన్నులు వసూలవుతున్నారుు. దీంతో జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను రూపేణా శుక్రవారం రికార్డు స్థారుులో రూ.55 కోట్లు ఆదాయం రాగా, శనివారం రూ.12 కోట్లు వచ్చారుు. రెండు రోజుల్లోనే రూ.67 కోట్లు సమకూరారుు. శుక్రవారం ఒక్కరోజే 30 వేల మంది ఆస్తి పన్ను చెల్లించారు. వారిలో 21వేల మంది రూ.10 వేలలోపు పన్ను చెల్లించగా.. 6,854 మంది రూ.10వేల నుండి రూ.50వేల వరకు, 1,193 మంది రూ.లక్ష వరకు, 655 మంది రూ.2 లక్షల వరకు, 288 మంది రూ.5లక్షల వరకు పన్ను చెల్లించారు. పాత 500, 1000 రూపాయల నోట్లతో పన్నులు చెల్లించడానికి సోమవారం రాత్రి వరకు గడువున్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని అన్ని సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఆది, సోమవారాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయని వెల్లడించారు. అనాథ పిల్లలకు అన్నం ఎలా పెట్టాలి ‘పాత నోట్ల రద్దుతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాం. పిల్లలకు జ్వరాలు వస్తున్నారుు. ఆసుపత్రికి తీసుకెళ్దామంటే చేతిలో డబ్బుల్లేవు. రెండు రోజుల నుంచి బ్యాంకుకు వస్తున్నా.. నోట్ల మార్పిడి కుదరడం లేదు. కూరగాయలు కొనేందుకు కూడా ఇబ్బందిగా ఉంది. నోట్ల మార్పిడిలో అనాథాశ్రమాలు, సహాయ కేంద్రాలకు ప్రాధాన్యతనివ్వాలి. నేరుగా కొంచెం ఎక్కువ మొత్తంలో సొమ్ము తీసుకునే వెసులుబాటు కల్పించాలి..’’ - వనజ, ఆశ్రయ్ హోమ్, లాలాపేట్ పంట అమ్ముకోలేం.. నిల్వ చేసుకోలేం.. ‘నాకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేసిన. ఇందుకోసం ల క్షన్నర అప్పు చేసిన. 2 ఎకరా ల్లో పత్తి ఎదగలేదు. మిగిలిన మూడెకరాల్లో వచ్చిన పత్తిని అమ్ముదామనుకుంటే పాత నో ట్లు ఇస్తున్నరు. పత్తిని తీయకుండా ఉందామంటే మంచు పడి పాడైపోతది. తీసి ఇంట్లో ఉంచుదామంటే జాగా లేదు. ఇంకోదిక్కు అప్పుల మీద వడ్డీ పెరుగుతోంది. కొత్తనోట్లు ఎప్పుడు ఇస్తారో, పంట అమ్మేదెప్పుడో తెలియడం లేదు..’’ - బీమరాజుల రాజలింగు, రైతు, నెన్నెల, ఆదిలాబాద్ మందులు కొనేందుకు డబ్బుల్లేవు ‘పక్షవాతంతో బాధపడుతున్న మా నాన్నను ఆస్పత్రిలో చేర్పించాం. మందుల షాపుల్లో పాత నోట్లు తీసుకోలేదు. పాత నోట్లు మార్చుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు దగ్గరే పడిగాపులు కాయాల్సి వచ్చింది’’ - నస్రీన్, సికింద్రాబాద్ నోట్లు మార్చుకున్న జపాన్ యువతి జపాన్‌కు చెందిన ఓ యువతి శనివారం బౌద్ధనగర్ డివిజన్ వారాసిగూడ ఎస్బీఐలో తన వద్ద ఉన్న భారత పాత నోట్లను ఇచ్చి కొత్త నోట్లను తీసుకున్నారు. వెలవెలబోతున్న మార్కెట్లు నోట్ల తిప్పల కారణంగా పాతబస్తీలో అతిపెద్ద కూరగాయల మార్కెటైన మీరాలం మండిలో వినియోగదారుల రద్దీ బాగా తగ్గింది. దీంతో స్థానిక వ్యాపారులతో పాటు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. చిల్లర ఇచ్చే పరిస్థితి లేక కూరగాయల కొనుగోళ్లు తగ్గాయని.. దాంతో మిగిలిన వాటిని చెత్తకుప్పల్లో వేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పోస్టాఫీసుల్లో ఆదివారమూ మార్పిడి..!
రాష్ట్రంలో పోస్టాఫీసులు ఆదివారం కూడా పని చేస్తాయి. ప్రధాన, సబ్ పోస్టాఫీసుల్లో కరెన్సీ మార్పిడి వెసులుబాటుతో పాటు డిపాజిట్లనూ స్వీకరించనున్నట్లు రాష్ట్ర తపాలా సేవల డైరెక్టర్ వెన్నం ఉపేందర్ వెల్లడించారు. రెండు రోజుల నుంచి పోస్టాఫీసులకు కరెన్సీ మార్పిడి తాకిడి అధికమైంది. కరెన్సీ మార్పిడి కోసం వస్తున్న ప్రజలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. రెండోరోజూ పోస్టాఫీసుల్లో కరెన్సీ మార్పిడి ఆలస్యంగా ప్రారంభమైంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకర్ల సాఫ్ట్వేర్ పోస్టాఫీసులకు కూడా రూ.10 వేల వరకు మాత్రమే డ్రా చేసేందుకు అనుమతించడం అధికారులను నివ్వెరపర్చింది. వెంటనే సాఫ్ట్వేర్ మార్పులు చేయడంతో డబ్బులను డ్రా చేసేందుకు అనుమతి లభించింది. ఈ కారణంగా బ్యాంకుల నుంచి పోస్టాఫీసులకు కొత్త కరెన్సీ చేరేసరికి 2 గంటల ఆలస్యం తప్పలేదు. అప్పటివరకు క్యూలో నిలబడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. మొదటిరోజు రూ.53 కోట్లు, రెండో రోజు రూ.100 కోట్లపైనే మార్పిడి జరిగినట్లు తెలుస్తోంది. వరుస సెలవుల దృష్ట్యా బ్యాంకుల నుంచి రెండు మూడు రోజులకు సరిపడా కరెన్సీ డ్రా చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. -
డబ్బుల్లేవ్
సాక్షి, కడప: కరెన్సీ నోట్ల కోసం రెండో రోజు జనాలు బారులు తీరారు. పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో మిగిలిన నోట్లను మార్చుకునేందుకు ప్రజలు నానా యాతన పడుతున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. కొంతమంది గంతల తరబడి క్యూలో నిలబడలేకపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరుతున్న నేపథ్యంలో బ్యాంకర్లు కూడా ఒకటే కౌంటర్ కాకుండా రెండు, మూడు కౌంటర్లు పెడితే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. నల్లధనం మాటేమోగానీ సామాన్యులు మాత్రం ఉన్న ఒకటి, రెండు పెద్ద నోట్లను మార్చుకునేందుకు నరకం చూస్తున్నారు. కడపతోపాటు పలుచోట్ల పోస్టాఫీసుల్లో నగదు లేకపోవడంతో గంటల తరబడి నిలబడి వేచి ఉన్నా వారికి ప్రయోజనం లేకుండా పోయింది. అందునా ఉదయం నుంచి వచ్చి గంటల తరబడి ఉంటూ ఒక్కోసారి అక్కడికే తినుబండారాలు తీసుకుని తింటూ కాలం గడిపారు. ప్రొద్దుటూరు, రాయచోటి, జమ్మలముగు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరులలో నోట్ల మార్పుకు భారీ క్యూలు దర్శనమిచ్చారు. ప్రొద్దుటూరులో మధ్యాహ్నానికే ఖేల్ ఖతం.. ప్రొద్దుటూరు పట్టణంలో బ్యాంకు అధికారులు మధ్యాహ్నానికే చేతులు ఎత్తేశారు. ప్రధాన బ్యాంకుల్లో సైతం డబ్బులు అయిపోవడంతో నో మనీ బోర్డులు పెట్టారు. దీంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు మైదుకూరులో డిపాజిట్లకే పరిమితమైన బ్యాంకర్లు మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని బ్యాంకులు డిపాజిట్ చేయడానికే అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని బ్యాంకులు ఇదే తరహా పద్ధతిని అనుసరించడంతో నోట్ల మార్పునకు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక్క బి.మఠం మండలంలో గంట, రెండు గంటలు చొప్పున పంపిణీకి శ్రీకారం చుట్టిన తర్వాత కార్యక్రమాన్ని ముగించారు. మైదుకూరులోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్లు చేసకోవడంపైనే బ్యాంకర్లు శ్రద్ధ చూపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జమ్మలమడుగులో నోట్ల దొంగలు జమ్మలమడుగులో నోట్ల మార్పిడికోసం వస్తున్న ప్రజలను దొంగలు టార్గెట్ చేశారు. బ్యాంకుల వద్ద జనంలో కలిసిపోయిన కొంతమంది దొంగలు క్యూలైన్లలో వేచి ఉన్నట్లు నటిస్తూ ముందున్న వారి జేబుల్లోని నగదు నొక్కేస్తున్నారు. ఒకరిద్దరు కాకుండా కొంతమందితో కూడిన దొంగల ముఠా ప్రవేశించిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జమ్మలమడుగులో ఈ తరహా దోపిడీ చేస్తున్న సందర్భంలో క్యూలోనే అప్రమత్తమైన ప్రజలు ఒకరిని పట్టుకోగానే మిగిలిన వారు పారిపోయినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలియవచ్చింది. దొరికిన దొంగను పోలీసులకు అప్పగించిన నేపధ్యంలో పోలీసులు మరింత లోతుగా కూపీ లాగితే దొంగలకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
860 పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. గురువారం బ్యాంకుల నుంచి కొత్త కరెన్సీ చేరుకోవడంతో పోస్టాఫీసుల్లో మధ్యాహ్నం నుంచి మార్పిడికి అవకాశం కల్పించారు. హైదరాబాద్ జీపీవోతో పాటు ప్రధాన పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి కోసం ప్రత్యేకంగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. కొత్త కరెన్సీ అలస్యంగా రావడం, రూ.2,000 నోట్లను మాత్రమే జారీ చేయడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని సుమారు 860 పోస్టాఫీసుల్లో ఈ నెల 24 వరకు వరకు కరెన్సీ మార్పిడికి అవకాశం కల్పించినట్లు రాష్ట్ర తపాలా సేవల సంచాలకులు వెన్నం ఉపేందర్ తెలిపారు. మొత్తంమీద 35 హెడ్ పోస్టాఫీసులు, 825 సబ్ పోస్టాఫీసుల్లో పాత కరెన్సీ మార్పిడికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోస్టాఫీసుల్లో వినియోగదారులు నిర్ణీత నమూనా దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పాన్‌కార్డు, ప్రభుత్వరంగ సంస్థళు జారీ చేసిన ఐడీ కార్డుల్లో ఏదైనా ఒకదాని జిరాక్స్ జతచేసి, రోజుకు రూ.4 వేల వరకు పాత నోట్లు అందజేసి కొత్త కరెన్సీ డ్రా చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గల 5,832 పోస్టాఫీసుల్లో డిసెంబర్ 31 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. -
నోట్ల మార్పిడిపై చేతులెత్తేసిన పోస్టాఫీసులు !
► ఆ మేరకు పోస్టాఫీసుల్లో వసతుల్లేవు ► పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు బుధవారం పనిచేయకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక గురువారం నుంచి పోస్టాఫీసుల్లో నగదును మార్పిడి చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్న ప్రజలకు పోస్టాఫీసులు పెడుతున్న నిబంధనలు మరింత ఇబ్బందిగా మారనున్నాయి. పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి చేసేందుకు... అవసరమైన సౌకర్యాలు లేవని భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ సర్కిల్ సెక్రటరీ ఎంఏ బేగ్ తేల్చి చెప్పారు. రూ.500, రూ.1,000 నోట్లను పోస్టాఫీస్‌లలో సేవింగ్స్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే వారు తప్పనిసరిగా అకౌంట్ ఉండాల్సిందేనన్నారు. నగరంలో 200 వరకు పోస్టాఫీస్‌లు ఉండగా అందులో 60 పెద్ద పోస్టాఫీసులలో మాత్రమే కౌంటింగ్ మిషన్లు, ఫేక్ కరెన్సీ డిటెక్టర్లు ఉన్నాయని మిగతా వాటిలో లేకపోవడంవల్ల పెద్ద నోట్ల మార్పిడి సవాల్‌గా మారే అవకాశం ఉందన్నారు. అన్ని పోస్టాఫీసుల్లో కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫేక్ కరెన్సీ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తేనే సమస్య తీరుతుందన్నారు. లేకపోతే పోస్టాఫీసుల్లో జనం బారులు తీరుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.4 వేల వరకు మాత్రమే మార్పిడి చేసుకునే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ మిషన్లు పెద్ద పోస్టాఫీసులు అయిన ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్; తిరుమలగిరి, ఎస్ఆర్నగర్, మలక్‌పేట్, ఆబిడ్స్ తదితర ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇక పోస్టాఫీసుల్లో ఖాతా తెరవాలంటే పాన్‌కార్డ్, ఆధార్ కార్డు, మూడు ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
పిన్నీస్ జిందాబాద్!
‘‘ఈ జిప్పులు వచ్చి పోస్టాఫీసుల పొట్టగొట్టాయిరా... జిప్పుల వల్ల మన పోస్టాఫీసులు క్రమంగా అంతరించిపోయాయి’’ అన్నాడు అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘పొంతన లేకుండా మాట్లాడకు. పోస్టాఫీసులు అంతరించిపోవడానికి కొత్తగా వచ్చిన కొరియర్ సర్వీసులు కారణం కదా. వాటికీ జిప్పులకూ లింకు పెడతావేమిట్రా నువ్వు?’’ అడిగాను. ‘‘కాదురా... నేను మాట్లాడేది మన సొంత పోస్టాఫీసుల గురించి’’ అన్నాడు వాడు. ‘‘నీకు మతి పోయింది. సొంత పోస్టాఫీసులు ఏమిట్రా... నీ ముఖం. అసలు పోస్టాఫీసులు సెంట్రల్ గవర్నమెంటు కిందికి వస్తాయి. ఒక తరం కింది వరకూ ఎందరికో అత్యద్భుతమైన జ్ఞాపకాలూ, అనుభూతులూ పంచిన వాటి గురించి అజ్ఞానంతో మాట్లాడకు’’ అని కోప్పడ్డాను నేను. ‘‘నీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో మన నిక్కర్లకు జిప్పులుండేవి కావు. అలా జిప్పులు కనిపెట్టని ఆ రోజుల్లో నిక్కరుకు మూడు గుండీలే ఉండేవి. ఉన్న మూడింట్లో ఒకటో రెండో కొన్నాళ్లకి తప్పక ఊడిపోయేవి. ఆ ఖాళీ భర్తీ చేయడానికి మా అమ్మ అక్కడ పిన్నీసు పెట్టేది. పిన్నీసు పెట్టుకోకపోతే అందరూ ‘పోస్టాఫీస్’ అనో ‘టప్పా ఖానా’ అనో వెక్కిరించేవాళ్లు. పిన్నీసు పెట్టే ముందు అది గుచ్చుకుంటుందేమో అని కడుపులో భయం. అబ్బ... నువ్వు ఎన్నైనా చెప్పురా జిప్పుల ఆవిర్భావ కాలానికి ముందు పిన్నీసులదే స్వర్ణ యుగంరా. జిప్పులు వచ్చాయి. అటు పిన్నీసులూ... ఇటు పోస్టాఫీసులూ... ఇలా రెండూ అంతరించిపోయాయి. అప్పటి చిన్నారుల మాన సంరక్షణ విషయంలోనే కాదురా... పిన్నీసులు కొంత భాషా సేవ కూడా చేశాయి’’ అన్నాడు వాడు. ‘‘పిన్నీసులు చేసిన భాషా సేవ ఏమిట్రా’’ అయోమయంగా అడిగా. ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలి అని సామెత. అప్పట్లో పొలాల గట్ల మీద నడిచే రోజుల్లో ముళ్లు గుచ్చుకోవడం చాలా మామూలు విషయం. దాన్ని పిన్నీసులతో నేర్పుగా తీయడమూ అంతే మామూలు. ఇప్పటి పిల్లలకు ముల్లు గుచ్చుకోవడం అంతగా తెలియదు... ముల్లును ముల్లుతోనే తియ్యాలనీ... ఇందుకోసం పిన్నీసు ముల్లును వాడాలన్న విషయమూ తెలియదు. ఇలా పిన్నీసు వాడటం తగ్గింది. వాటిని ఉపయోగించే నేర్పూ తగ్గింది. షాపుల్లో అవి కనిపించడం కూడ తగ్గింది. అలాగే ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెత వాడకమూ తగ్గిందిగదరా. అయినా సరే ఒక ఆశా కిరణం ఏమిటంటే... కలిసి ఉంటామని చెప్పడానికి పాశ్చాత్య దేశాల్లో పిన్నీసే సంకేతమట’’ అన్నాడు వాడు.‘‘అదేమిటి పాశ్చాత్య దేశాలు కలిసి ఉంటామని చెప్పడానికి సింబాలిగ్గా పిన్నీసు వాడతాయా?’’ అడిగా. ‘‘అవును బ్రెక్సిట్ సమావేశం తర్వాత అందరూ వేరుపడదాం నిశ్చయించుకున్నారు కదా... ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వద్దనుకున్న వారు ఏ చిరుగూ లేకపోయినా షర్టుకు స్టైలిష్‌గా పిన్నీసును పెట్టుకుంటున్నారట. రేసిజానికి వ్యతిరేకంగా పిన్నీసు ఒక ప్రతీక అట తెల్సా. అంత గొప్పదిరా పిన్నీసు. పాశ్చాత్యులు అలా దాన్ని పట్టుకుంటుంటే... మనం దాన్ని ఎప్పుడో వదిలేశాం. అందుకే నాకు గుండెల్లో ముల్లు గుచ్చినంత బాధగా ఉందిరా. పైగా డార్విన్గారు చెప్పిన పరిణామ సిద్ధాంతంలోని అంశాలు పిన్నీసు విషయంలోనూ నిజం కావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా’’ అన్నాడు వాడు. ‘‘ఏమిటీ... పరిణామ సిద్ధాంతంలో డార్విన్ పిన్నీసు గురించి మాట్లాడాడా?’’ అడిగాను నేను ఎంతో ఆశ్చర్యపడిపోతూ. ‘‘అంటే నేరుగా చెప్పలేదు. కానీ ఆయన పరిణామక్రమం గురించి చెప్పింది పిన్నీసుకూ అప్లై అవుతుంది’’ ‘‘అదెలా?’’ ‘‘దేన్నైతే ఎక్కువగా వాడతామో అది జిరాఫీ మెడలాగా మరింతగా అభివృద్ధి చెందుతుంది. దేన్ని వాడమో అది అంతరించిపోతుంటుంది అన్నాడు కదరా. అలా చూస్తే ఆ సిద్ధాంతం పిన్నీసుకు కూడా వర్తిస్తుంది కదా. ఇలా చూస్తే పిన్నీసు గురించి పరోక్షంగా డార్విన్గారు చెప్పినట్టే కదరా. ఇప్పుడు ఆలోచించు... పిన్నీసు అన్నది ఒక ఇంజనీరింగ్ అద్భుతమే అయినా... ఇటు జీవులకు సంబంధించిన బయాలజీలోని జీవపరిణామ సిద్ధాంతమూ దానికి వర్తిండచం ఒక అద్భుతం కాదంటావా? ఒకనాడు వారూ వీరు కాకుండా అందరి షర్టూ నిక్కరుకైనా ఉండిన అంతటి పిన్నీసు ఇలా తన ప్రాభవం కోల్పోవడం నాకు దుఃఖం తెప్పిస్తోందిరా’’ అన్నాడు వాడు. వాడి ధోరణిలో ఏదైనా చెప్పిగానీ వాడిని ఊరడించలేమని అనిపించింది. అందుకే వాడితో ఒక మాట చెప్పా. ‘‘ఒరేయ్... ఒక పిన్నుకు గుండు ఉంటే దాన్ని గుండుపిన్ను లేదా గుండు సూది అంటారు. అలాగే పిన్నీసుకు ఉండే సూదికి చివరన గుండుకు బదులుగా మంచి తలకట్టు ఉంది. మనుషుల్లో జుట్టు పట్ల ఇష్టం ఉన్నంత కాలం పిన్నీసు కూడా ఆదరణ కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు బాధపడకు’’ అన్నాను. ‘‘నీ మాటను తథాస్తు దేవతలూ వినాలి రా. నువ్వన్నట్టే జరగాలి రా’’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు వాడు. - యాసీన్ -
జై కిసాన్... జై పోస్ట్‌మాన్!
ఆదర్శం అక్టోబర్ 10 ఇండియన్ నేషనల్ పోస్టల్ డే ‘పోస్ట్..’ అనే పిలుపు ఎంత తీయటిదో ఈ తరానికి అంతగా తెలియకపోవచ్చుగానీ... కొన్ని సంవత్సరాల వెనక్కి వెళితే... ఆ పిలుపులోని మాధుర్యం కళ్ల ముందు కదలాడుతుంది. ‘అబ్బాయికి ఉద్యోగం వచ్చింది’ ‘పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి అమ్మాయి నచ్చింది’ ‘మిత్రమా... ఉభయ కుశలోపరి’ ‘తాతయ్య ఆరోగ్యం బాగలేదు. వెంటనే బయలుదేరి రాగలవు’ ఆనందం. ఆత్మీయం. క్షేమ సమాచారం... ఒక్కటా... రెండా... ‘పోస్ట్’ అనే పిలువులో ఎన్నో ఎదురుచూపులు. ఆ ఎదురుచూపుల కాలానికి ఇప్పుడు కాలం చెల్లవచ్చుగాక... కానీ ‘పోస్ట్’ అనే పిలుపుకు మాత్రం కాలం చెల్లలేదు. పోస్ట్ ఆఫీసులకు కాలం చెల్లలేదు. అవి కాలంతో పాటు మారుతూ... ప్రజలకు చేరుతున్నాయి అని చెప్పడానికి నిదర్శనం... ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ వ్యవసాయ భూముల భూసారాన్ని పరీక్షించడానికి ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. పూణే ప్రాంతీయ తపాలాశాఖ ఆధ్వర్యంలోని ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ కృషి విజ్ఞాన్ కేంద్ర (కేవీకే)తో కలిసి పనిచేస్తుంది. బారామతి కేంద్రంగా పనిచేస్తున్న ‘కేవీకే’ జిల్లా స్థాయి ఫార్మ్ సైన్స్ సెంటర్. రైతులు తమ పొలాల్లోని మట్టి నమూనాలను స్థానిక పోస్ట్ ఆఫీసుల్లో ఇస్తారు. వీటిని పోస్ట్ ఆఫీసులు పరీక్ష కోసం కేవీకే సెంటర్లకు పంపుతాయి. పరీక్షల తరువాత... ఆ సెంటర్ నుంచి ఒక రిపోర్ట్ అందుతుంది. అందులో అవసరమైన సలహాలు కూడా అందుతాయి. ‘‘భారతీయ తపాలశాఖ ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతుల దూతగా వ్యవహరించే విలువైన అవకాశం ఏర్పడుతుంది’’ అంటున్నారు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎఫ్.బి.సయ్యద్. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు మట్టి నాణ్యత పరీక్షల గురించి అంతగా అవగాహన లేదు. ఉన్నా... పరీక్షల విధివిధానాల గురించి తెలియదు. ఈ నేపథ్యంలో... ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’ ఎంతోమంది రైతులకు మేలు చేస్తోంది. ‘‘ఉత్తరం కొనడానికో, మనీ ఆర్డర్ చేయడానికో ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులకు తరచుగా వెళ్లేవాళ్లం. ఈ మధ్య కాలంలో అసలు వెళ్లడమే తక్కువైంది. ఇప్పుడు... కిసాన్ విజ్ఞాన్ దూత్ వల్ల... బాగా తెలిసిన ఇంటికి మళ్లీ వెళ్లినట్లు అనిపించింది’’ అంటున్నాడు కేసరి అనే గ్రామీణ రైతు. ఇది ఒక్క రైతు అభిప్రాయం మాత్రమే కాదు. ఎంతోమంది రైతుల భావోద్వేగ సంబరం. పూణే శాఖ పరిధిలో మొత్తం రెండు వేలకు పైగా గ్రామీణ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి... కేవలం పోస్ట్ ఆఫీసులు మాత్రమే కాదు... రైతుల ఆత్మీయ నేస్తాలు. ‘‘భూసార పరీక్షల గురించి తక్కువమంది రైతులకు మాత్రమే తెలుసు. దీనికి తోడు సమాచార కొరత. ఇప్పుడు మాత్రం భూసార పరీక్షల గురించి శాస్త్రీయ అవగాహనను పెంచుకుంటున్నారు’’ అంటున్నాడు భూసార పరీక్షల్లో స్పెషలిస్ట్‌గా పేరున్న వివేక్ భోటి. ప్రస్తుతానికైతే... భూసార పరీక్షల రిపోర్ట్ రైతుల చేతికి అందడానికి ఎనిమిది రోజుల సమయం పడుతోంది. ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతోంది. రైతులు ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి కారణమవుతున్న అవగాహన లేమి ‘కిసాన్ విజ్ఞాన్ దూత్’తో తగ్గిపోతుంది. సరికొత్త సమాచారం చేరువవుతుంది. ‘గత కాలం మేలు’ అంటారు. పోస్ట్ ఆఫీసులు అంటే ‘గత కాల జ్ఞాపకాలే’ అనుకుంటున్న కాలంలో... ప్రజల మేలు కోరి... మరింత శక్తిమంతం అవుతోంది భారతీయ తపాలాశాఖ. అడుగో పోస్ట్‌మాన్! వీధి వీధినంతా మేల్కొలుపుతున్నాయి వీధి వీధినంతా కలయ చూస్తున్నాయి అడుగో పోస్ట్‌మాన్! * * అందరికీ నువ్వు ఆత్మబంధువువి అందరికి నువ్వు వార్తనందిస్తావు కాని నీ కథనం మాత్రం నీటిలోనే మథనం అవుతుంటుంది. ఇన్ని ఇళ్ళు తిరిగినా... నీ గుండె బరువు దించుకోవడానికి ఒక్క గడప లేదు. ఇన్ని కళ్ళు పిలిచినా... ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు. ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్లిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు. - తిలక్ (తపాలా బంట్రోతు కవిత నుంచి) -
పోస్టాఫీస్‌లకు వాట్సప్ నంబర్లు
మంగపేట(వరంగల్) : దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 55వేల పోస్టాఫీస్‌లకు వాట్సస్ నంబర్లు కేటాయించనున్నట్లు పోస్టల్ శాఖ కేంద్ర కార్యదర్శి బీ.వీ.సుధాకర్ తెలిపారు. వరంగల్ జిల్లా మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సం దర్శించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రతీ పోస్టాపీస్‌కు వాట్సప్ అకౌంట్‌తో కూడిన ఫోన్లు అందిస్తామని తెలిపారు. తద్వారా ఆయా పోస్టాఫీస్‌ల పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడం ప్రజలకు సులువవుతుందని అన్నారు. అలాగే, 19న ఇండియా పోస్టల్ హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సుధాకర్ తెలిపారు. ఈమేరకు ప్రజలు పోస్టల్ సమస్యలపై 1924కు ఫిర్యాదు చేస్తే వెంటనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో హన్మకొండ, వరంగల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు సత్యనారాయణ, సాయిద్ నాయక్, సీపీఎంజి కర్ణల్ ఎలీసా, స్థానిక బ్రాంచి పోస్టు మాస్టర్లు శ్రీనివాస్, రమేష్, ఎస్సై మహేందర్ పాల్గొన్నారు. తొలుత పోస్టల్ శాఖ కేంద్ర కార్యదర్శి బీ.వీ.సుధాకర్‌కు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు కైకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖరశర్మ, పవన్ ఆచార్యులు స్వాగతం పలికి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించారు. -
'రికరింగ్'తో రిలీఫ్!
కొందరు రికరింగ్ డిపాజిట్ అనొచ్చు. మరికొందరు ఆర్డీ అనొచ్చు. ఎలా పిలిచినా... పొదుపు చేసేవారి జీవితంలో ఇది ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతూనే ఉంటుంది. కాకపోతే ఈ సులువైన పొదుపు సాధనంలో ఉన్న ప్రయోజనాలు చాలామందికి తెలియవనే చెప్పాలి. వాటి పై అవగాహనే ఈ కథనం... నిజానికి ఆర్డీ అనేది ఈజీగా ఎంచుకునే పొదుపు సాధనం. నిర్దిష్ట కాలానికి, నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా మదుపు చేసే సౌలభ్యం ఈ డిపాజిట్లో ఉంది. రెండేళ్లో, నాలుగేళ్లో... ఎంతో కొంత కాలాన్ని ముందే నిర్ణయించుకుని, అప్పటిదాకా నెలనెలా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేస్తే... ముందే నిర్ణయించిన రేటు మేరకు వడ్డీ అందుతుంది. ఉదాహరణకు నెలకు రూ.1,000 చొప్పున 24 నెలలు పొదుపుచేద్దామనుకుంటే బ్యాంకులో ఆర్డీ ఖాతా తెరవొచ్చు. ఎంచుకునే కాలాన్ని బట్టి వడ్డీరేటు దాదాపు 7.5 శాతం వరకూ ఉంది. ⇒ స్వల్ప మొత్తాల పొదుపునకు మెరుగైన సాధనం ⇒ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఈజీగా తెరవొచ్చు ⇒ ఆన్‌లైన్‌లోనూ సొంతగా తెరుచుకునే వీలు ⇒ నిర్దిష్ట వ్యవధికి వడ్డీ గ్యారంటీ; నష్టభయం ఉండదు ⇒ స్వల్పకాలిక లక్ష్యాలకు ఆర్డీ మేలంటున్న నిపుణులు స్వల్పకాలిక లక్ష్యాలంటే...? కొత్తింటి కొనుగోలుకు కొంత డౌన్‌పేమెంట్ కావాలి. ఉంటున్న ఇంటికి మరమ్మతులు, అదనపు హంగులు కావాలంటే... రెండు మూడేళ్ల వ్యవధిలో ఇంట్లో వారికి పెళ్లి చేయాల్సి రావటం. సెలవుల్లో కుటుంబంతో కలసి విహార యాత్రకు వెళ్లటం ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, మోటార్‌సైకిల్, కారు లేదా ఫ్రిజ్, టీవీ, వాషింగ్‌మెషీన్ల వంటి వైట్ గూడ్స్ కొనుగోలు స్వల్పకాలిక లక్ష్యాలకు ఉత్తమం... ఆర్డీ చాలా సురక్షితం. తప్పనిసరిగా రాబడులొస్తాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి సహజంగా విశ్లేషకులు చెప్పేదేంటంటే... 8 నుంచి 9 సంవత్సరాల్లో అవి మంచి ఫలితాలిస్తాయని. స్వల్పకాలంలో అయితే నష్టాలు రావొచ్చని హెచ్చరిస్తుంటారు. తప్పుడు షేర్లలో పెట్టుబడులు పెడితే లాభం కాదుకదా... అసలుకే ఎసరు రావొచ్చు. ఆర్డీతో అలాంటిదేమీ ఉండదు. మార్కెట్ రేటు రిటర్న్ గ్యారంటీ. దీన్నిబట్టి చూస్తే ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి సంబంధించిన స్వల్పకాలిక లక్ష్యాలకు రికరింగ్ డిపాజిట్ ఉత్తమం. నిజానికి మనం దీర్ఘకాలిక పెట్టుబడుల గురించే ఆలోచిస్తుంటాం తప్ప... స్వల్పకాలం అవసరాలను గుర్తించం. స్వల్ప మొత్తం... తేలిగ్గా పరి ష్కారం అయిపోతుం దిలే అనుకుంటాం. కానీ అక్కడే ఇబ్బంది పడతాం. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాల పెట్టుబడులకు సైతం అమాంతంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎలా బాగుంటుంది.... ఉదాహరణకు మీరు వచ్చే 18 నెలల్లో మూడు లక్ష్యాలు పెట్టుకున్నారు. అందులో రూ.20,000 ఫోన్, పాపకు రూ.30,000 చిన్న ఆభరణం. అబ్బాయి ఉన్నత విద్యకు తొలి విడత ఫీజు రూ. 25,000. వీటిని తేలిగ్గా చేరుకోడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలానికి తగిన నెలవారీ చెల్లింపులతో మూడు ఆర్డీలను తెరిస్తే చాలు. అనుకున్నది సాధించొచ్చు. ఇంకో విషయమేంటంటే... ఆర్డీలు తెరిచాక తప్పనిసరిగా డబ్బు చెల్లించాలి కనుక... సహజంగానే మీరు పొదుపరులుగా మారిపోతారు. దుబారా తగ్గించుకుంటారు. ఖర్చులపై ఆచితూచి తీసుకునే నిర్ణయాలు... దీర్ఘకాలంలో చక్కని ఫలితాలనిస్తాయి. అకౌంట్ తెరవడమూ కష్టం కాదు... బ్యాంక్‌కు వెళ్లి... అకౌంట్ కాగితాలు తీసుకుని... పూర్తిచేయాల్సిన అవసరమేదీ ఇప్పుడు లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేజీకి వెళ్లి... క్షణాల్లో అకౌంట్‌ను స్వయంగా తెరవొచ్చు. నెలవారీ ఎంత చెల్లించాలనుకుంటున్నారు? కాల వ్యవధి ఎంత? ఏ తేదీన మీ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు? ఇలాంటివన్నీ ఆన్లైన్ అప్లికేషన్లోనే పూర్తిచేసేయొచ్చు. మరో విషయమేంటంటే... మీరు ఆర్డీలను ప్రత్యక్షంగా బ్యాంక్ అకౌంట్‌కే లింక్ చేసుకుంటే... నెలనెలా మీరు నగదు బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిగ్గా మీ ఖాతా నుంచి డబ్బులు ఆర్డీకి జమ అయిపోతాయి. వడ్డీపై పన్ను చెల్లించాల్సిందే... వడ్డీపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. ఇపుడు లేదు. ఆర్డీ మొత్తానికి మాత్రం పన్ను మినహాయింపు ఉంటుంది. కొంత వడ్డీ కోతతో ఎప్పుడైనా మీ ఆర్డీని బ్రేక్ చేసుకునే వీలుంది. కొన్ని బ్యాంకుల్లో నెలవారీ డిపాజిట్ మొత్తాన్ని కొంత పెంచుకోవచ్చు కూడా. కాకపోతే తగ్గించడానికి వీలుపడదు. ఆర్డీ వడ్డీని చక్రగతిన మూడు నెలలకోసారి లెక్కిస్తారు. ఆర్డీలో నామినేషన్ సౌలభ్యం ఉంది. దీన్లో జమయిన మొత్తంపై 80 నుంచి 90 శాతం వరకూ రుణం కూడా తీసుకోవచ్చు. పోస్టాఫీసుల విషయంలో ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి అకౌంట్‌ను మార్చుకోవచ్చు. ఇద్దరు పెద్దలు కలసి జాయింట్ అకౌంట్‌నూ తెరవొచ్చు. నెలలో నిర్దిష్ట కాలంలో డిపాజిట్ చెల్లించకపోతే రూ.5కు ఐదు పైసల జరిమానా ఉంటుంది. నాలుగు రెగ్యులర్ డిఫాల్ట్స్కు అనుమతి ఉంది. అలా జరిగితే రెండునెలల్లో డిపాజిట్‌ను పునరుద్ధరించుకోవచ్చు. లేదంటే తదుపరి డిపాజిట్ చెల్లించడానికి కుదరదు. కనీసం ఆరు విడతల డిపాజిట్లు ముందే కట్టేస్తే... రాయితీ లభిస్తుండడం మరో విశేషం. డిపాజిట్‌కు ఒకవేళ మీరు చెక్ ఇస్తే... ఆ మొత్తం ప్రభుత్వ ఖాతాలో పడిన తర్వాతే మీరు చెల్లింపులు జరిపినట్లుగా భావిస్తారు. డిపాజిట్-కాలం.. కనీసం ఎంత? రికరింగ్ డిపాజిట్లో నెలకు డిపాజిట్ చేయాల్సిన కనీస మొత్తం... కాల వ్యవధి బ్యాంకును బట్టి మారుతుంటాయి. ఎస్బీఐ, పీఎన్బీ, ఆంధ్రాబ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీసం రూ.100 తోనే ఆర్డీ ప్రారంభించవచ్చు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి ప్రైవేటు బ్యాంకుల్లో ఈ మొత్తం కనీసం రూ.500 లేదా రూ.1,000గా ఉంది. పోస్టాఫీసులో కనిష్టంగా రూ.10. గరిష్ట పరిమితి ఎక్కడా లేదు. ఇక కాల వ్యవధి ఆరు నెలల నుంచి పదేళ్ల వరకూ ఉంది. -
త్వరలో పోస్టాఫీసు బ్యాంకులు
న్యూఢిల్లీ: ఇకపై పోస్టాఫీసులు బ్యాంకులుగా మారనున్నాయి. 2017 మార్చి నాటికల్లా ఈప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖమంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం 1.54 లక్షల మంది పోస్టల్ అధికారులు ఉన్నారని, ఈ నెట్ వర్క్ ప్రపంచంలోనే అతి పెద్దదని వీటిని బ్యాంకులుగా మారిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే పెద్ద బ్యాంకింగ్ రంగం అవుతుందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది 650 పోస్టాఫీసులను బ్యాంకులుగా మార్చి 5000 ఏటీఎంలను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక మూడేళ్లకు పూర్తవ్వాల్సి ఉన్నా, వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రధాన మంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. ఇందుకోసం తొలివిడతగా రూ.400 కోట్లను కేటాయించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో1.39 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో23,000 వేల పోస్టాఫీసులు సేవలందిస్తున్నాయి. -
లైఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే ఇకపై ‘ఆసరా’!
♦ మూడు నెలలకోమారు తప్పనిసరి చేస్తూ సర్కారు నిర్ణయం ♦ 4,500 మీ సేవాకేంద్రాలకు బయోమెట్రిక్ విధానానికి అనుమతి ♦ మే 1నుంచి 20లోగా ఇవ్వకుంటే జూన్ నెలలో పెన్షన్ రానట్లే ♦ తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపు సాక్షి, హైదరాబాద్: ఆసరా పెన్షనర్లు పింఛన్ పొందాలంటే తాము బతికి ఉన్నట్లుగా ధ్రువీకరణను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.85 లక్షలమంది పెన్షనర్ల లో సుమారు 10 లక్షల మందికి పెన్షన్ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. దీంతో సరైన సమాచారం లేక మరణించిన పెన్షనర్ల ఖాతాలకు కూడా పింఛన్ సొమ్ము వెళుతున్నట్లు పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్‌ను తీసుకుంటున్నవారు ఇకపై ప్రతి మూడు నెలలకోమారు తాము బతికే ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మే నెల 1నుంచి 20వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పిం చిన పెన్షనర్లకే జూన్‌లో పింఛన్ అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తొలిదశలో ఈ విధానాన్ని పట్టణ ప్రాంతాల్లోని సుమారు 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టాఫీసులు, పంచాయతీ కార్యాల యాల నుంచి పెన్షన్ పొందుతున్నవారికి కూడా త్వరలోనే పెన్షన్‌ను బ్యాంకు ఖాతాల ద్వారా అం దించే ఏర్పాటు చేస్తామని, అప్పట్నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పెన్షనర్లకు కూడా లైఫ్ సర్టిఫికెట్ నిబంధనను వర్తింపజేస్తామని చెబుతున్నారు. 4,500 మీసేవా కేంద్రాలకు అథెంటికేషన్ ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు మూడు నెలలకోమారు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేం దుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 మీసేవాకేంద్రాలకు బయోమెట్రిక్, ఐరిస్ అథెం టికేషన్ సదుపాయాన్ని కల్పించింది. లబ్ధిదారులు మీసేవా కేంద్రానికి వెళ్లి ఐరిస్ ద్వారా కనుపాపలను సరిపోల్చడంతోగానీ, వికలాంగులు(అంధులు) బయోమెట్రిక్(వేలిముద్ర) ద్వారాగానీ తమ ధ్రువీకరణను సమర్పించాలి. ధ్రువీ కరణ కోసం మీసేవ కేంద్రానికి లబ్ధిదారులు ఆధార్ గానీ, పెన్షన్ ఐడీ నెంబరునుగానీ వెంట తీసికెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తికాగానే మీసేవా సిబ్బంది లబ్ధిదారుకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి నట్లుగా రశీదు అందజేస్తారు. దీనికిగాను 20 రూపాయలు చెల్లించాలి. ఇలా ఏడాదికి రూ.80 మీసేవా కేంద్రానికి సమర్పించుకోవాల్సిందే. పెన్షనర్లకు ఇది ఇబ్బందికరం.. ఆసరా పింఛన్‌దారులు మీ సేవాకేంద్రాలకు వెళ్లి లైఫ్ సర్టిపికెట్లు సమర్పించడం ఇబ్బం దికరమే. అంధులైన పెన్షనర్లకు ఐరిస్‌తో ధ్రువీకరణ, చాలామంది(లెప్రసీ వంటి) వికలాంగులు, వృద్ధులకు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను సరిపోల్చడం వీలుకాదు. పింఛ న్ సొమ్ము నుంచి ప్రతిసారి రూ.20 మీసేవాకేంద్రానికి ఇవ్వడం ఇబ్బందికరమే. దానిని ప్రభుత్వమే భరించాలి. - కొల్లి నాగేశ్వరరావు, వికలాంగుల హక్కుల సంఘం నేత -
పోస్టాఫీసులు ఇక.. సేవామాల్స్
అన్ని సేవలూ ఒకే గొడుగు కింద ఉంటే అందరికీ ప్రయోజనమే. అన్ని రకాల గృహవినియోగ వస్తువులను అందిస్తున్న సూపర్బజార్ల మాదిరిగానే భవిష్యత్తులో పోస్టాఫీసులు అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే సేవామాల్స్గా మారనున్నాయి. ప్రైవేట్ రంగం నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేలా పోస్టాఫీసులను విస్తృతపరిచేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రైవేట్ రంగం కంటే తక్కువ ఫీజలకే నమ్మకంగా సేవలు అందించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలో మూడు ప్రధాన పోస్టాఫీసులు, 65 సబ్ పోస్టాఫీసులు, 424 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ శాఖ సేవలపై రాష్ర్టప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతోంది. ప్రజలకు పలు సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఉత్తరాల బట్వాడాయే ప్రధాన బాధ్యతగా పని చేస్తున్న పోస్టాఫీసుల్లో ప్రస్తుతం లభిస్తున్న పరిమిత బ్యాంకు తరహా సేవలతోపాటు పింఛన్లు, వేతనాల పంపిణీ వంటి సేవలు కూడా ప్రారంభమయ్యాయి. వీటిని మరింత విస్తరించే దిశగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పోస్టల్ శాఖ కీలక సమావేశంలో ఉన్నతాధికారులు చర్చించారు. సంప్రదాయ విధులనే కొనసాగిస్తే ప్రజలకు దూరమై, ఇబ్బందులు తప్పవన్న భావనతో ఉన్న సిబ్బందితోనే ఇంకా ఎటువంటి సేవలు అవసరం, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి అంశాల్లో ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అందుబాటులోకి రానున్న సేవలు ప్రస్తుతం అందిస్తున్న సేవలకు అదనంగా పరిశీలన, కార్యాచరణ దశలో ఉన్న సేవల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ కొరియర్ సంస్థల పోటీ తట్టుకునేందుకు స్పీడ్ కొరియర్ సేవలకు పోస్టాఫీసులు సిద్ధమవుతున్నాయి. భవిష్యత్తులో పాస్‌పోర్ట్ దరఖాస్తుల విక్రయం, స్వీకరణ బాధ్యత చేపట్టవచ్చు. సొంత ఫొటోలతో స్టాంపులు వేయించుకునే మై స్టాంప్ సౌకర్యాన్ని విస్తృతపరచనున్నారు. ప్రస్తుతం మీ-సేవ కేంద్రాలు అందిస్తున్న అన్ని రకాల సేవలను భవిష్యత్తులో పోస్టాఫీసుల్లోనే జరపాలనే ప్రతిపాదన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంది. కొన్ని మీ సేవ సెంటర్లలో ఆర్థిక లావాదేవీల విషయంలో అక్రమాలు జరుగుతుండడంతో అధికారులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. వినియోగదారుడు పంపిన ఉత్తరం, పార్శిల్, కొరియర్ ఎక్కడ ఉందీ ఇట్టే తెలుసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. జీపీఎస్ ద్వారా వాటి ఉనికిని కనుగొని వినియోగదారుడికి అవసరమైన సమయాల్లో ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారం అందిస్తారు. పోస్టు బాక్సులో నిర్ణీత సమయాల్లో పోస్ట్‌మన్ ఉత్తరాలు తీస్తున్నాడో లేదో తెలుసుకునేందుకు వాటిని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. తద్వారా వినియోగదారుడికి మెరుగైన సేవలందించే అవకాశం ఉంది. గతంలో పోస్టాఫీసుల్లో బీఎస్ఎన్ఎల్ రీచార్జింగ్ కార్డులు విక్రయించేవారు. భవిష్యత్తులో అన్ని మొబైల్ నెట్‌వర్క్‌ల కార్డులూ విక్రయించే అవకాశం ఉంది. రిజిస్టర్డ్ పోస్టు సర్వీసుల్ని ప్రజలకు దగ్గరగా చేసేందుకు రుసుములను తగ్గించే అవకాశం ఉంది. ఆధార్, పాన్ కార్డ్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఓటు కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, సీ బుక్, రేషన్‌కార్డుల జారీ, తప్పుల సవరణలు తదితర సేవలు కూడా పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు బ్యాంకుల్లో జరుగుతున్న స్వల్ప, దీర్ఘకాలిక, గృహ, వ్యక్తిగత, వాహన రుణాల మంజూరు ప్రక్రియను పోస్టాఫీసుల ద్వారా కూడా చేయిస్తారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) లావాదేవీలను మరింత పెంచనున్నారు. పోస్టల్ సేవలపై నమ్మకం గతంలో పలు లావాదేవీలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసులనే ప్రజలు నమ్ముతున్నారు. పోస్టల్ సేవలను ప్రజలకు దగ్గర చేసేందుకు కేంద్రం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని సేవలు లభ్యమయ్యే అవకాశం ఉంది. సేవల పెంపునకు సంబంధించి ఇటీవల మా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. -జె.ప్రసాదబాబు, తపాలా శాఖ సూపరింటెండెంట్, శ్రీకాకుళం -
ఈ చెల్లింపులెలా..?
ఉపాధి హామీ వేతనాలు, పింఛన్ల బట్వాడా బాధ్యత చేపట్టిన పోస్టాఫీసులు కొత్త సమస్య ఎదుర్కొంటున్నాయి. వీటిలో చాలా నిధులు సకాలంలో పంపిణీ కాకుండా నిలిచిపోతున్నాయి. ఆధార్ సమస్యలు, చిన్న చిన్న పొరపాట్లు, లోపాలు, ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు ఉండటం వంటి కారణాలతో చెల్లింపులు నిలిచిపోయి కోట్లాది రూపాయలు మూలుగుతున్నాయి. వీటిని సకాలంలో చెల్లించలేకపోతే తపాలా శాఖ ప్రభుత్వానికి డెమరేజి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కమీషన్ మాటేమో గానీ ఈ భారం ఎక్కువయ్యే ప్రమాదముందని పోస్టల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లా పరిధిలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.12 కోట్లు పోస్టాఫీసుల్లో మూలుగుతున్నాయి. వీటి చెల్లింపులు సత్వరమే పూర్తి చేయాలని పోస్టల్ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి మరికొంత గడువు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసేవారికి పోస్టాఫీసుల ద్వారా వేతనాలు చెల్లించాలని అక్టోబర్ 2, 2012న ఆదేశాలు జారీ అయ్యాయి. ఏజెన్సీలు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మోసాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మున్సిపాలిటీల పరిధిలోని ఫించన్లనూ పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయాలని ఇటీవలే ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని మూడు ప్రధాన పోస్టల్ కార్యాలయాలు, 65 సబ్ పోస్టాఫీసులు, 424 బ్రాంచ్ పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. వీటి కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.400 కోట్లను పోస్టాఫీసులకు అందజేస్తోంది. కూలి రేటు, పని దినాల ఆధారంగాా వేతనదారులకు ఎంత చెల్లించాలన్నది ఎంపీడీవోలు నిర్థారించి జిల్లా యంత్రాంగంతోపాటు స్థానిక పోస్టాఫీసులకు జాబితాలు పంపిస్తారు. వేతనదారులు తమ పాస్‌బుక్కులు, పే స్లిప్‌లు చూపిస్తే పోస్టాఫీసుల్లో వారికి వేతనాలు చెల్లిస్తారు. పోస్టాఫీసుల్లో జరిగే లావాదేవీలకు పూర్తి బాధ్యత ఉంటుండడంతోపాటు లబ్ధిదారులు తన సొమ్మును పోస్టల్ ఆర్డీ, ఎఫ్‌డీలకూ, ఎస్బీ ఖాతాల్లోనూ జమ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నష్ట భయం ఉపాధి హామీ పనులకు సంబంధించి 2012 నుంచి వేతనాల రూపంలో సుమారు రూ.354 కోట్లు ప్రభుత్వం నుంచి పోస్టాఫీసులకు అందాయి. వాటిలో ఇప్పటివరకు సుమారు రూ. 342.31 కోట్ల చెల్లింపులే జరిగాయి. అదే విధంగా పింఛన్లకు సంబంధించి ఇప్పటివరకు సుమారు రూ.29 కోట్లు విడుదల కాగా.. సకాలంలో చెల్లింపులు జరగక రూ.3 కోట్లు వెనక్కు వెళ్లిపోయాయి. వాస్తవానికి ప్రభుత్వం నుంచి సొమ్ము విడుదలైన నాలుగు రోజుల్లోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అలా జరగకపోతే ప్రభుత్వానికి పోస్టల్ శాఖ డెమరేజీ(నష్ట పరిహారం) చెల్లించాల్సి ఉంటుంది. కాగా పోస్టాఫీసుల ద్వారా జరిగే ప్రతి చెల్లింపునకూ ప్రభుత్వం 2 శాతం కమీషన్ ఇస్తుంది. అందులో ఏపీ ఆన్లైన్ నిర్వహణకు కొంత మొత్తం పోతుంది. ఫించన్ల పంపిణీకి గాను పోస్టల్ శాఖకు ఒక శాతం కమీషన్ లభిస్తుంది. ఇందులో 25 శాతం ఏపీ ఆన్‌లైన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. కారణాలేమిటంటే.. పోస్టాఫీసుల్లో సొమ్ము ఉన్నా వేతనదారులు, లబ్ధిదారులు తీసుకోలేకపోవడానికి పలు కారణాలను అధికారులు గుర్తించారు. ఆధార్ కార్డు లేకపోవడం, ఉన్న వాటిని తొలగించడం, ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులుండటం, బినామీలు తేలడం, కార్డు ఉన్నా తప్పులు కనిపించడం, సమయానికి స్వగ్రామాల్లో ఉండకపోవడం, స్వల్పకాలిక పనుల కోసం గ్రామాలు వదిలిపోవడం తదితర కారణాలు చెల్లింపులకు అవరోధంగా పరిణమిస్తున్నాయి. ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోపు చెల్లింపులు జరగాల్సి ఉన్నప్పటికీ ఈ నెల ప్రభుత్వం మరో రెండు రోజుల గడువిచ్చింది. నెలకు 2,69,260 మందికి చెల్లింపులు జరుగుతున్నాయి. ఫించన్ల పంపిణీలో 95శాతం పైగా చెల్లింపులు జరుగుతున్నాయి. -
97 పోస్టాఫీసుల్లో ఈ -దర్శనం టికెట్లు
-
తపాలా సేవలు విస్తృతం
సాక్షి, విజయవాడ బ్యూరో: పోస్టాఫీసుల ద్వారా అందించే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.సుధాకరరావు చెప్పారు. శుక్రవారం విజయవాడ రీజియన్ పరిధిలోని ఆరు జిల్లాల పోస్టల్ ఉద్యోగులతో సమావేశం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. లబ్ధిదారులంతా ఒకే రోజు పోస్టాఫీసులకు రాకుండా సీరియల్ నంబర్ల వారీగా విభజించి ఒక్కో పోస్టాఫీసులో 750 మందికి ఒక బయోమెట్రిక్ మిషన్ అందుబాటులో ఉంచుతామన్నారు. ఇంకా ఆయన చెప్పినవి ఇలా... ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 95 హెడ్‌పోస్టాఫీసుల్లోనూ రోజుకు 5 వేల టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయాలు. ఈ నెల 5 నుంచి దీన్ని ప్రారంభం. ళీ వరల్డ్ నెట్వర్క్ ఎక్స్‌ప్రెస్ పోస్టు కింద 188 దేశాలకు పార్సిళ్లు పంపుకునే అవకాశం . ళీ ఆశీర్వచనం సేవల పరిధిలోకి శ్రీకూర్మం, అరసవిల్లి ఆలయాల ప్రసాదం పంపిణీ. ళీ ఏపీ, తెలంగాణల్లో ‘నగదు రహిత సేవలు’ ఇందుకు 63 పోస్టాఫీసులను తొలి దశలో ఎంపిక . -
పోస్టాఫీసుల్లో ఇక నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో నవంబర్ తొలివారం నుంచి నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లనూ అందుబాటులో ఉంచనున్నట్లు తపాలా శాఖ చీఫ్‌పోస్టుమాస్టర్ జనరల్ (సీపీఎంజీ) బి.వి సుధాకర్ వెల్లడించారు. తపాలా వారోత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్ర డాక్‌సదన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తపాలా శాఖకు మధ్య అవగాహన కుదరడంతో 856 పోస్టాఫీసుల ద్వారా నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు లభిస్తాయన్నారు. త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సుదర్శన దర్శనం, స్పెషల్ దర్శనం టికెట్ల జారీ సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు టీటీడీతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఆర్టీసీ డిపోల్లేని ప్రాంతాల్లో ‘ఆన్లైన్’ అనుసంధానంతో రిజర్వేషన్ టికెట్లు జారీ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 ప్రధాన పోస్టాఫీసులను కంప్యూటరీకరించి కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకొచ్చామని, ఇప్పటికే 18 పోస్టాఫీసుల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయన్నారు. మరో 79 ఆఫీసు ల్లో డిసెంబర్‌కు అందుబాటులోకి వస్తాయ న్నారు. కోర్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే 29 ఏటీఏంల ఏర్పాటుకు సివిల్, ఎలక్ట్రానిక్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన 66 ఏటీఎంల పనులను డిసెంబర్ ఆఖరుకు పూర్తి చేస్తామ న్నారు. ఈ ఏడు 13 కొత్త పోస్టాఫీసులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని ఐదింటిని ప్రారంభించామని సీపీఎంజీ తెలిపారు. -
‘తుగ్లక్’ విధానం
అద్దంకి: సమాజంలో ఆదరణ కోల్పోయిన వారికి ఆసరా కల్పించాల్సిన కనీస ధర్మం ప్రభుత్వాలకుంది. కానీ పేదలంటే పాలకులకు లెక్కలేదు. వారి జీవితాలంటే గౌరవం లేదు. కాస్తో కూస్తో కాళ్లమీద నిలబడేందుకు ఉపయోగపడే సామాజిక పింఛన్ల వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఎన్నో వాగ్దానాలు చేసింది. అవి ఎలాగున్నా.. కనీసం ముందునుంచి వస్తున్న పద్ధతులను కూడా గాడిలో పెట్టలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు చేరే పింఛన్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారితే.. మళ్లీ దానిలో వేలు పెట్టి కలగాపులగం చేస్తోంది. గజిబిజీ.. పింఛన్ల పంపిణీలో గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విధానాలు మార్చడంతో లబ్ధిదారులు ముప్పతిప్పలు పడ్డారు. మొదట్లో పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో పంపిణీ జరిగేది. జనం దానికి అలవాటు పడేసమయానికి మళ్లీ మార్చి ఐకేపీ ఆధ్వర్యంలోని మండల సమాఖ్యలకు అప్పగించారు. వెంటనే ఫినో కంపెనీ ఏజెంట్లు లబ్ధిదారుల వద్దకు వెళ్లి నగదు అందించేవారు. దీనిని మళ్లీ మార్చి పోస్టాఫీసులకు బదలాయించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ విధానంలో మార్పు వచ్చింది. గ్రామాల్లోని పింఛనుదారుల ఖాతాలను పోస్టాఫీసుల్లోనే ఉంచుతూ.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులు మాత్రం ఐసీఐసీఐ బ్యాంకుల్లో తీసుకోవాలంటూ నిబంధనలు మార్చారు. దీంతో ఏం చేయాలో తెలియని పింఛనుదారులు మళ్లీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలు ఎలా అందించాలో తెలియక కనపడినవారందరినీ అడుగుతున్నారు. ఓ ప్రహసనం పింఛను పొందాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. ప్రభుత్వం తరఫున పింఛను కార్డులుంటేనే సరిపోదు. వివిధ సంస్థలకు పింఛను వ్యవహారాన్ని బదలాయించినప్పుడల్లా లబ్ధిదారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. ప్రతి సారీ వేలిముద్రలు ఇవ్వాలి. అలాగే రేషన్‌కార్డు, ఆధార్ కార్డు ఫొటోస్టాట్ కాపీలు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఆయా సంస్థలకు అందజేయాలి. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా బోలెడంత శ్రమ పడాలి. ఇచ్చే *200 కోసం పడరాని పాట్లు పడితే కానీ సకాలంలో అందవు. లబ్ధిదారునిగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నా.. ప్రతి సారీ వివరాలు కావాలంటూ వేధించడంతో వికలాంగు లు, వృద్ధులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సీన్లోకి ఐసీఐసీఐ ప్రతినిధులు నూతన విధానం అమల్లోకి రావడంతో పింఛన్ల పంపిణీ ప్రక్రియను నగర పంచాయతీ నుంచి ఐసీఐసీఐ బ్యాంకుకు అప్పగించారంటూ.. బ్యాంకు రిసోర్స్ పర్సన్లు అద్దంకి పట్టణంలో బుధవారం దండోరా వేయించారు. పింఛనుదారులను నగరపంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. యంత్రం సాయంతో వేలిముద్రలు తీసుకోవడం.. ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలను సేకరించడం మొదలు పెట్టారు. తప్పని పడిగాపులు అద్దంకి పట్టణంలోని 20 వార్డులుండగా.. 2,463 మంది వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్ దారులున్నారు. వీరికి నెలకు * 7,74,900 నగదు చెల్లిస్తున్నారు. అయితే రీ ఎంట్రీ అని చెప్పగానే వీరంతా ఒక్కసారిగా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కానీ సిబ్బంది ఇద్దరే వివరాలు తీసుకోవడానికి రావడంతో వేలిముద్రలు సేకరించడంలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో పింఛనుదారులంతా ఎండలో గంటల తరబడి వేచి చూశారు. వీరికి కనీస వసతులు కల్పించలేదు. నీడలేదు.. మంచినీరు అందించలేదు.. కనీసం క్యూలైన్లు కూడా పాటించలేదు. ఈ దెబ్బకు తొక్కిసలాట జరిగింది. కొంతమంది కింద పడిపోయారు. భరించలేని వారు ఇళ్లకు వెళ్లిపోయారు. ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు ఉషారాణి, శిరీష మాట్లాడుతూ తమ సంస్థ పింఛనుదారుల వివరాలు రీ ఎంట్రీ చేయమని కోరినట్లు తెలిపారు. అందుకే అందరినీ పిలిపించామన్నారు.