పోస్టాఫీసుల్లో ఆదివారమూ మార్పిడి..!
రాష్ట్రంలో పోస్టాఫీసులు ఆదివారం కూడా పని చేస్తాయి. ప్రధాన, సబ్ పోస్టాఫీసుల్లో కరెన్సీ మార్పిడి వెసులుబాటుతో పాటు డిపాజిట్లనూ స్వీకరించనున్నట్లు రాష్ట్ర తపాలా సేవల డైరెక్టర్ వెన్నం ఉపేందర్ వెల్లడించారు. రెండు రోజుల నుంచి పోస్టాఫీసులకు కరెన్సీ మార్పిడి తాకిడి అధికమైంది. కరెన్సీ మార్పిడి కోసం వస్తున్న ప్రజలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. రెండోరోజూ పోస్టాఫీసుల్లో కరెన్సీ మార్పిడి ఆలస్యంగా ప్రారంభమైంది.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకర్ల సాఫ్ట్‌వేర్ పోస్టాఫీసులకు కూడా రూ.10 వేల వరకు మాత్రమే డ్రా చేసేందుకు అనుమతించడం అధికారులను నివ్వెరపర్చింది. వెంటనే సాఫ్ట్‌వేర్ మార్పులు చేయడంతో డబ్బులను డ్రా చేసేందుకు అనుమతి లభించింది. ఈ కారణంగా బ్యాంకుల నుంచి పోస్టాఫీసులకు కొత్త కరెన్సీ చేరేసరికి 2 గంటల ఆలస్యం తప్పలేదు. అప్పటివరకు క్యూలో నిలబడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. మొదటిరోజు రూ.53 కోట్లు, రెండో రోజు రూ.100 కోట్లపైనే మార్పిడి జరిగినట్లు తెలుస్తోంది. వరుస సెలవుల దృష్ట్యా బ్యాంకుల నుంచి రెండు మూడు రోజులకు సరిపడా కరెన్సీ డ్రా చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.