
నోట్ల మార్పిడిపై చేతులెత్తేసిన పోస్టాఫీసులు !
► ఆ మేరకు పోస్టాఫీసుల్లో వసతుల్లేవు
► పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు బుధవారం పనిచేయకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక గురువారం నుంచి పోస్టాఫీసుల్లో నగదును మార్పిడి చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్న ప్రజలకు పోస్టాఫీసులు పెడుతున్న నిబంధనలు మరింత ఇబ్బందిగా మారనున్నాయి. పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి చేసేందుకు... అవసరమైన సౌకర్యాలు లేవని భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ సర్కిల్ సెక్రటరీ ఎంఏ బేగ్ తేల్చి చెప్పారు.
రూ.500, రూ.1,000 నోట్లను పోస్టాఫీస్‌లలో సేవింగ్స్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే వారు తప్పనిసరిగా అకౌంట్ ఉండాల్సిందేనన్నారు. నగరంలో 200 వరకు పోస్టాఫీస్‌లు ఉండగా అందులో 60 పెద్ద పోస్టాఫీసులలో మాత్రమే కౌంటింగ్ మిషన్లు, ఫేక్ కరెన్సీ డిటెక్టర్లు ఉన్నాయని మిగతా వాటిలో లేకపోవడంవల్ల పెద్ద నోట్ల మార్పిడి సవాల్‌గా మారే అవకాశం ఉందన్నారు. అన్ని పోస్టాఫీసుల్లో కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫేక్ కరెన్సీ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తేనే సమస్య తీరుతుందన్నారు. లేకపోతే పోస్టాఫీసుల్లో జనం బారులు తీరుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రూ.4 వేల వరకు మాత్రమే మార్పిడి చేసుకునే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ మిషన్లు పెద్ద పోస్టాఫీసులు అయిన ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్; తిరుమలగిరి, ఎస్‌ఆర్‌నగర్, మలక్‌పేట్, ఆబిడ్స్ తదితర ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇక పోస్టాఫీసుల్లో ఖాతా తెరవాలంటే పాన్‌కార్డ్, ఆధార్ కార్డు, మూడు ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.