న్యూఢిల్లీ : అనిల్ అంబానీకి చెందిన డీటీహెచ్ సర్వీసు ప్రొవైడర్ రిలయన్స్ బిగ్ టీవీ సరికొత్త ఆఫర్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. తొలుత 500 రూపాయల చెల్లించి తమ కొత్త హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెటాప్ బాక్స్‌లను ఉచితంగా పోస్టు ఆఫీసుల వద్ద పొందవచ్చని ప్రకటించింది. అనంతరం ఆ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేయనున్నట్టు తెలిపింది. 50 వేల పోస్టు ఆఫీసులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని ఈ సర్వీసులను అందజేస్తున్నామని రిలయన్స్ బిగ్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్తాన్, పంజాబ్, ఉత్తరఖాండ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం ప్రాంతాల పోస్టు ఆఫీసుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఈ ఆఫర్ కింద ఏడాది పాటు ఉచితంగా ఛానల్స్‌ను ఆఫర్ చేయనుంది. దీనిలో హెచ్‌డీ ఛానల్స్ కూడా ఉండనున్నాయి. 500 ఎఫ్‌టీఏ(ఫ్రీ టూ ఎయిర్) ఛానల్స్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా ఐదేళ్ల పాటు అందించనుంది. జూన్ 15 నుంచి ఈ సెటాప్ బాక్స్‌లను కంపెనీ డెలివరీ చేయనుంది. ముందస్తు బుక్ చేసుకున్న కస్టమర్లు జూలై 30 లోపల ఈ సెటాప్ బాక్స్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంది. పోస్టు ఆఫీసుల్లో వీటి బుకింగ్స్‌ను జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
‘తాజా ఆఫర్‌తో రిలయన్స్ బిగ్ టీవీ భారత్‌లో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్‌లో సంచలనం సృష్టించనుంది. దీంతో ప్రతి ఒక్క గృహంలో మా హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెటాప్ బాక్స్‌లు నిలుస్తాయి. ఉచితంగా, అత్యధిక క్వాలిటీలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను మా సెటాప్ బాక్స్‌లు ఆఫర్ చేయనున్నాయి. ఆసక్తి గల విద్యార్థులకు ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను కూడా ఇవ్వనున్నాం. ఇండియన్ పోస్టు ఆఫీసుల్లో వీటిని బుక్ చేసుకోవచ్చు’ అని రిలయన్స్ బిగ్ టీవీ డైరెక్టర్ విజేంద్ర సింగ్ తెలిపారు. తాము ఆఫర్ చేసే హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెటాప్ బాక్స్‌లు షెడ్యూల్డ్ రికార్డింగ్, యూఎస్‌బీ పోర్ట్, హెచ్‌డీఎంఐ పోర్ట్, ఏకకాలంలో రికార్డు చేయడం, వీక్షించడం వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. పోస్టు ఆఫీసుల వద్ద బుక్ చేసుకునేటప్పుడు రూ.500 కట్టిన అనంతరం, వాటిని ఇంటి వద్ద డెలివరీ చేసిన తర్వాత మిగిలిన మొత్తం రూ.1500 ను చెల్లించాలి. ఆ అనంతరం ఈ మొత్తం అంతా కస్టమర్లకు రీఫండ్ అవుతుంది. లోయల్టీ బోనస్‌లుగా రీఛార్జ్‌ల రూపంలో తిరిగి కస్టమర్లు పొందనున్నారు. బుక్ చేసుకున్న 30 నుంచి 45 రోజుల్లో కంపెనీ వీటిని వినియోగదారులకు డెలివరీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment