స్థలం పరిశీలించిన అనిల్ అంబానీ
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్‌లో రిలయన్స్ సోలార్ పవర్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రిలయన్స్ పవర్ అధినేత అనిల్ అంబానీ శనివారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలోని సీతంపాలెం గ్రామంలో స్థలం పరిశీలించారు. ఆయనకు జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు.
సెజ్‌లో ఏపీఐఐసీ భూములను పరిశీలించి తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు ఆయన బయలుదేరారు. అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ సంస్థ ముందుకురావడంతో దానికి పోటీగా పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కొత్తగా రిలయన్స్ న్యూ ఎనర్జీస్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసు్తన్నట్లు సమాచారం.
అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలోని సీతంపాలెం గ్రామంలో రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సోలార్ పవర్ సెల్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు స్థలం పరిశీలించినట్లు తెలిసింది. అనిల్ అంబానీ పర్యటనపై అధికారికంగా ముందస్తు సమాచారం లేదని, ఆయన విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్‌కు వస్తున్నారని తెలిసిన వెంటనే జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఏపీఐఐసీ అధికారులు వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు.
ఎన్‌టీపీసీ గ్రీన్ హైడోజన్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నేపథ్యంలో...
అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామ సమీపంలో సుమారు 1,600 ఎకరాల విస్తీర్ణంలో రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు.
ఈ నేపథ్యంలో ఇక్కడ అనిల్ అంబానీ కూడా సోలార్ పవర్ సెల్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఆయన ఎటువంటి హడావుడి లేకుండా అచ్యుతాపురం సెజ్‌లో స్థలం పరిశీలించి వెళ్లినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment